కర్నూల్

మహిళలకు మూడోవంతు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 26:జనసేన పార్టీలోని అన్ని విభాగాల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పిస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. నగర శివారులోని యుబీఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం వీర మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చట్టసభలో లేను కాబట్టి పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల్లో మండల స్థాయి నుంచే మహిళలకు మూడో వంతు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కమిటీలు వేసేటప్పుడు మొదటి స్థానం ఆడపడుచులకే ఇస్తామన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే నోరుమూసుకుని ఉండాలన్న, పెద్దగా అరవాలన్న విధానాలు మారాలన్నారు. జనసేనపార్టీ ఆడపడుచుల పట్ల విజ్ఞతతో వ్యవహరిస్తూ, బాధ్యతగా ఉంటుందన్నారు. అవసరమైనప్పుడు ఝాన్సీలక్ష్మీభాయిలా యుద్ధం చేసి, మీ మాన ప్రాణాలు కాపాడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందన్నారు. చిన్నారులపై ఆకృత్యాలు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు క్రిమినల్స్‌ను వెనకేసుకు వస్తే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని, అలాంటి వారికి న్యాయం జరిగే స్థాయి, చట్టాలు రావాలంటే ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకొచ్చి, పసిబిడ్డల మీద ఆకృత్యాలకు పాల్పడే వారిని శిరచ్ఛేదనం చేయాలన్నారు. అర్ధరాత్రి ఓ స్ర్తి బయట తిరగటం ఏమో కానీ పగటిపూట బయటికి వెళ్లిన మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వచ్చే విధంగా చూసే బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రేఖను వీర మహిళా విభాగానికి చైర్మన్‌గా పెట్టడానికి కారణం, జిల్లా నుంచి ఒక బలమైన నాయకుడు సైతం పార్టీలోకి రావడానికి ఆలోచిస్తున్న సమయంలో సమాజం పట్ల బాధ్యతతో ఓ మహిళ కర్నూలు జిల్లా నుంచి ముందుకొచ్చిందన్నారు. యువత, ఆడపడుచుల్లో ఇంత తెగువ ఉంటే నాయకులు మాత్రం సమకాలీన రాజకీయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. భవిష్యత్ గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదని, కేవలం గుర్తింపు కోసం అయితే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇళ్ల నుంచి ఆడపడుచులు రోడ్డు మీదకి వెళ్లినప్పుడు వారి మాన ప్రాణాలకే రక్షణ లేనప్పుడు ఎలాంటి పరిస్థితులుంటాయో చిన్నప్పుడు మా అక్క విషయంలో చూశానన్నారు. పెద్దాయ్యాక ఇలాంటి ఆకృత్యాలకు అడుకట్ట వేయాలనుకున్నానని, మహిళలకు గౌరవం ఇవ్వని పక్షంలో పార్టీలో ఉన్న ఏ స్థాయి నాయకుడినైనా తీసివేసేందుకు సిద్ధమన్నారు. పార్టీలో ఓ స్థానం పోయినా పర్యాలేదు కానీ మహిళల మానప్రాణాల రక్షణ బాధ్యత మాత్రం తీసుకుంటానని వివరించారు. మహిళలకు భవిష్యత్, చదువుతో పాటు సమాజ నిర్మాణంలో చోటు ఉండాలన్నారు. అందుకే నావంతుగా కృషి చేస్తున్నాని, పురుషులకు కులం, మతం ప్రాంతం అనే భేదాభిప్రాయాలుంటాయని, మహిళలకు అలాంటివి ఉండవన్నారు. ఈజిప్టులో ఉన్న మహిళకు కష్టం వస్తే ఆళ్లగడ్డలో ఉన్న ఆడపడుచుకు ఆ బాధ తెలుస్తుందని, ప్రసవ వేదన నుంచి అన్ని రకాల బాధలను సమానంగా చూడగలిగే శక్తి మహిళలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జనసేన రాజకీయ పార్టీ కాదు, ఒక సామాజిక ఉద్యమమని, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమ న్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఎక్కడో పాకిస్థాన్‌లో యుద్ధం జరిగిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ముస్లింలు మేము భారత పౌరులమని నిరూపించుకోవాలా, వారిలోని దేశభక్తిని నిరూపించుకోవాలా, ఇలాంటి చర్యలు నాకు నచ్చవన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, సినిమా థియేటర్‌లో జనగణమణ పాడితే దేశభక్తి అనడం నచ్చదని, సినిమాకు వెళ్లేది వినోదం కోసమని, దేశభక్తిని చూడటానికి కాదన్నారు. దేశ భక్తిని చూపాలంటే యుద్ధ రంగానికి వెళ్తామని, నా దృష్టిలో ఆడపడుచులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం, లంచగొండితనం లేని సమాజ స్థాపన, దోపిడీ చేయనితనం ఇవన్నీ దేశభక్తితో సమానమని, రూ. కోట్లు దోచేసి జాతీయ జెండాకు సలాం చేస్తే అది దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దోపిడీలు, ఫ్యాక్షనిజాన్ని అరికట్టి, రౌడీయిజాన్ని అణచివేసి, ఆడపడుచులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. ఈ దేశంలో నివసించే హక్కు అందరికీ ఉంటుందని, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.