కర్నూల్

నేడు కోట్ల.. 9న గౌరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 1 : కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కుటుంబం శనివారం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. కోడుమూరులో 3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న చంద్రబాబు ఆ కార్యక్రమానికి ముందే కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పనున్నారు. కోట్ల సూర్యతో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కుమారుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి, సోదరుడు కోట్ల గిరిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జడ్పీ మాజీ చైర్మన్ వెంకటస్వామి, డీసీసీ మాజీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి సహా భారీ సంఖ్యలో కోట్ల సన్నిహితులు, అనుచరులు టీడీపీలో చేరనున్నారు. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మొత్తం మారుతున్నాయి. ప్రధానంగా కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లేనని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. కాగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డి కుటుంబం కూడా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. గౌరు దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి పార్టీలో చేరడానికి సమ్మతి తెలపడంతో గౌరు దంపతుల్లో ఒకరు పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమైంది. వారు ఈ నెల 9వ తేదీ అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. గౌరు దంపతుల చేరికతో పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత వైఎస్ కుటుంబంతో అనుబంధాన్ని తెంచుకుని పార్టీ మారుతున్న గౌరు చరితా వెంకటరెడ్డి కారణంగా వైసీపీకి నష్టం తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. కోట్ల, గౌరు కుటుంబాలు పార్టీలో చేరుతుండటంతో జిల్లాలో వైసీపీ నామమాత్రంగా మిగిలిపోతుందని వారు ధీమాతో ఉన్నారు.
ఇంకా ఆలోచనలోనే ఐజయ్య..
వైసీపీ తరఫున నందికొట్కూరు శాసనసభ్యుడిగా ఉన్న ఐజయ్య తన నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. రానున్న ఎన్నికల్లో ఆయనకు వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం లేదని దాదాపు తేలిపోయింది. దాంతో ఆయన పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన మాత్రం ఇంత వరకూ తన మనసులో మాటను వెల్లడించలేదు. టికెట్ రాకపోయినా పార్టీలో కొనసాగుతారా పార్టీ మారుతారా అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకుంటే టీడీపీలో చేరతారని నందికొట్కూరులో చర్చించుకుంటున్నారు. అయితే ఆయన ఇంత వరకూ ఒక నిర్ణయానికి రాలేదని తుది నిర్ణయం తీసుకున్నాక స్వయంగా ఆయనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను టీడీపీలో చేర్చేందుకు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయిష్టంతోనే పార్టీ వీడుతున్నాం!
* 9న టీడీపీలో చేరిక
* పాణ్యం నుంచి చరిత పోటీ
* వైసీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 1 : వైఎస్ కుటుంబంతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డి కుటుంబానికి ఉన్న 25 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధంతో ఆయన మరణానంతరం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీలో చేరిన గౌరు కుటుంబం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే ఈ నెల 9వ తేదీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు సీనియర్ వైసీపీ గౌరు వెంకటరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే అభిమానంతో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వెంటే నడిచాం. ఆయన మరణానంతరం జగన్‌తో కలిసి నడిచాం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ తమను కూడా వారితో కలిసి రమ్మన్నా వెళ్లలేదు. జగన్‌ను నమ్మి ఆయనతోనే ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ తమకంటే వేరొకరికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో తమతో పాటు తమను నమ్ముకున్న కార్యకర్తల భవిష్యత్తు కోసం తాము వైసీపీని వీడి టీడీపీలో చేరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పార్టీ కోసం తాము అధికారానికి దూరంగా ఉన్నామని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో జగన్‌పై విమర్శలు చేయాలని భావించడం లేదని వెంకటరెడ్డి తెలిపారు. ఆయన తమను ఎందుకు కాదనుకున్నారో తెలియదని తమను వదులుకోవడం వల్ల నష్టం జరిగాక ఆయనకే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం టీడీపీ అభ్యర్థిగా మరోమారు తన భార్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. తాను ఎన్నికల బరిలో ఉండాలని అనుకోవడం లేదన్నారు. చరితకు ఎమ్మెల్యేగా పని చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి చేస్తున్న కృషి తమను ఆ పార్టీ వైపు వెళ్లేలా చేసిందని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో మళ్లీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేఈకి కోట్ల ఫోన్!
* కోడుమూరు సభకు రావాలని ఆహ్వానం
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, మార్చి 1 : చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చాలా కాలం తర్వాత శుక్రవారం పరస్పరం మాట్లాడుకున్నారు. కోట్ల టీడీపీలో చేరుతున్న కారణంగా ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా ఇద్దరూ కలిసి పార్టీని గెలిపించాలని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సూచనను వారిద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కోట్ల కుటుంబం పార్టీలో చేరడం, 3 ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం ఉండటంతో సీఎంత్రి చంద్రబాబు శనివారం కోడుమూరుకు వస్తున్నారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య తాను పార్టీలో చేరుతున్నందున కోడుమూరు సభకు రావాలని కేఈకి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన కేఈ కృష్ణమూర్తి పార్టీలో చేరుతున్నందున అభినందనలు తెలిపినట్లు సమాచారం. కోడుమూరు సభకు వస్తానని కోట్లకు కేఈ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత రాజకీయాలను పక్కన పెట్టి సమష్టిగా కృషి చేస్తే కర్నూలు లోక్‌సభ పరిధిలోని లోక్‌సభ, అన్ని శాసన సభా స్థానాలను కైవసం చేసుకుంటామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సాంకేతికత సాయంతో
సైబర్ నేరాలకు అడ్డుకట్ట
* రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డీజీపీ ఠాకూర్
కర్నూలు, మార్చి 1:సాంకేతికత సాయంతో సైబర్ నేరాలతో పాటు ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సూచించారు. నగరంలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్‌ను శుక్రవారం డీజీపీ ప్రారంభించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు పోలీసు శాఖకు పెద్ద సవాల్‌గా మారనున్నాయన్నారు. సోషల్ మీడియా, బ్యాంక్ అక్రమాలు, క్రెడిట్ కార్డ్సు, ఫేస్‌బుక్, తదితర రకాల సైబర్ నేరాల బారిన పడి ప్రజలు మోసపోతున్నారన్నారు. అంతకుమునుపు డెకాయిటి, బాబరి, ఫ్యాక్షనిజం ఉండేవన్నారు. ఇప్పుడు సైబర్ నేరాలు ఏటేటా పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు చాలా సజావుగా, ఇంటెలిజెంట్‌గా సైబర్ నేరాలు చేస్తున్నారన్నారు. ఫారిన్ నేషనల్ వారు, నైజీరియన్స్ ఏపీలో ఫారిన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి క్లోనింగ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో సైబర్ క్రైమ్ ఎనాలసిస్ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లందరికీ సైబర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇప్పించడానికి ప్రణాళిక రచించామన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 1500 మంది పోలీసులకు బేసిక్ శిక్షణ ఇచ్చామన్నారు. అవసరమైతే ఫారిన్ దేశాలకు పంపించి శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హెడ్‌క్వార్టర్ విజయవాడ టెక్ టవర్‌లో ఎనాలసిస్ అండ్ ట్రైనింగ్ సెంటర్, డీటీసీ అనంతపురంలో కూడా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎనాలసిస్ కోసం విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, తిరుపతిలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 4 చోట్ల సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ప్రారంభించామన్నారు. సైబర్ నేరాలు జరిగినప్పడు ఈ ల్యాబ్ వారు ఆయా పరిధుల్లో దర్యాప్తులు చేస్తారన్నారు. ఆయా సిబ్బందికి కిట్లు కూడా అందజేస్తామన్నారు. అమరావతిలో కూడా సైబర్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ల్యాబ్‌ను నిర్మిస్తామన్నారు. నేరాలను నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసు దర్యాప్తును సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ పోలీసులకు అప్పగిస్తామన్నారు. శాస్ర్తియంగా సాక్ష్యాధారాలను సేకరిస్తామన్నారు. కర్నూలుతో పాటు కడప జిల్లాకు చెందిన సైబర్ నేరాలు ఈ ల్యాబ్ పరిధిలోకి వస్తాయన్నారు. ఈ జిల్లాలకు సంబంధించిన సైబర్ నేరాల కేసుల డేటాను విశే్లషించి రిపోర్టులు ఇస్తారన్నారు.
నేడు సీఎం చంద్రబాబు రాక
* కోడుమూరులో ఏర్పాట్లు..
* సభా స్థలిని పరిశీలించిన కోట్ల సూర్య
కోడుమూరు, మార్చి 1:సీఎం చంద్రబాబు ఈ నెల 2వ తేదీ కోడుమూరుకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైతాంగం సంక్షేమం కోసం ఏర్పాటు చేయనున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్ల మేరకు దాదాపు రూ. 7వేల కోట్ల వ్యయంతో గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ డైవర్షన్ స్కీం, ఎల్‌ఎల్‌సీ పైపులైన్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు మంజూరు చేయడంతో పాటు ఆర్థికపరమైన అనుమతులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. కోడుమూరులో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం పక్కన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పైలాన్‌లను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు. కోట్లతో పాటు ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోట్ల అభిమానులు అంతా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు సీఎం చంద్రబాబు సభా వేదికకు చేరుకుంటారు. బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అహోబిలం చేరిన
పార్వేట ఉత్సవ పల్లకి
* ఉత్సవమూర్తులకు వైభవంగా తిరుమంజనం
ఆళ్లగడ్డ, మార్చి 1: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు దీరిన ఉత్సవ పల్లకి శుక్రవారం తెల్లవారుజామున అహోబిల క్షేత్రం చేరుకుంది. పల్లకి చేరుకోగానే ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, ఈఓ కామేశ్వరమ్మ, అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా పల్లకి ఆలయం చేరుకుంది. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను ఆలయంలో కొలువుంచి వేద మంత్రాల నడుమ 108 కళశాలతో ఉత్సవమూర్తులను అభిషేకించి స్వామివారి ఎదుట సుదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన ప్రారంభమైన పారువేట ఉత్సవాలకు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరదస్వామిలు మూడు మండలాల్లో 45 రోజుల పాటు 33 గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లోని తెలుపుల వద్ద ఆశీనులై భక్తుల నుండి పూజలందుకొని ఈ నెలలో జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులను స్వయంగా ఆహ్వానించి తిరిగి శనివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్నారన్నారు. పారువేట ఉత్సవాల్లో గ్రామాలు పర్యటించిన స్వామి వారు సేద తీరేందుకు అభిషేకం చేశామన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తి శ్రీ జ్వాలానరసింహస్వామి ఎగువ అహోబిలం చేరుకున్నారు.
బోయిలకు వస్త్రాలు అందజేత
శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాల సందర్భంగా 45 రోజుల పాటు పల్లకిని తమ భుజస్కందాలపై మోసిన బోయిలకు ఆళ్లగడ్డ విద్యుత్ ఏఈ రవికాంత్‌చౌదరి వస్త్రాను అందజేశారు. జీపీఏ సంపత్, ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ చేతుల మీదుగా 90 మంది బోయిలకు వస్త్రాలను అందజేశారు.
ఏపీకి జనసేన మిత్రపక్షాలే
ప్రత్యామ్నాయం
* సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
డోన్, మార్చి 1:రాష్ట్రానికి జనసేన మిత్ర పక్షాలే ప్రత్యామ్నాయమని, రాష్ట్రంలో జనసేన పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి సీపీఐ, సీపీఎం, జనసేన మిత్రపక్షాల తరఫున పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పట్టణంలోని నక్కి రామన్న భవన్‌లో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మిత్రపక్షాలతో కలిసి జనసేన పోటీ చేస్తుందన్నారు. జిల్లాలో కర్నూలు పార్లమెంటుతో పాటు డోన్, పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో పర్యటించే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. విశాఖ రైల్వే జోన్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఆదాయ వనరులను పక్క రాష్ట్రాలకు మళ్లించి పేరు మాత్రం పెడితే సరిపోదని, ఇది ఎన్నికల స్టంటేనని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కేంద్రీయ విద్య, వైద్య సంస్థల ఏర్పాటు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కరువు కోరల్లో చిక్కుకుని రైతులు తల్లడిల్లిపోతున్నా పట్టించుకునే దిక్కు లేదన్నారు. పంట నష్ట పరిహారంతో పాటు ఇన్సూరెన్స్, రుణమాఫీ నిధులు వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులైన కోట్ల, కేఈ కుటుంబాలు ఒకే రాజకీయ పార్టీలో చేరి రాజకీయాన్ని అపహస్యం చేశాయని విమర్శించారు. వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణం తాటిచెట్టెక్కి గడ్డి కోసిన చందంగా వుందని ఎద్దేవా చేశారు.
చట్టసభల్లో రాజ్యాధికారం కల్పించాలి
* ఏఐబీఎఫ్ జాతీయ అధ్యక్షుడు యామిజాల రాంజీ
కర్నూలు సిటీ, మార్చి 1:రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల జనాభా కలిగిన బ్రాహ్మణులకు చట్టసభల్లో రాజ్యాధికారం కల్పించాలని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య(ఏఐబీఎఫ్) జాతీ య అధ్యక్షుడు యామిజాల రాంజీ డిమాండ్ చేశారు. స్థానిక దేవీ ఫంక్షన్ హాలులో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 20మంది ఎమ్మెల్యే లు, 9మంది ఎంపీలు ఉండే బ్రాహ్మణ జాతి నేడు ఒకరిద్దరితో కళావిహీనం గా, జాతి గొంతు ఎలుగెత్తి చాటలేక కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. బ్రాహ్మణుల్లో వివిధ శాఖా భేదాలు, వర్గ విభేదాలు ఉండడం వల్ల చట్టసభల్లో జాతి గొంతు వినిపించే అవకాశం లేకుండా పోయిందన్నారు. బ్రాహ్మణ జాతి పురోభివృద్ధి, ఔన్న త్యం మాత్రమే లక్ష్యంగా రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిసి త్వరలో ఏఐబీఎఫ్ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆధ్యాత్మికత, సమాజపరంగా, రాజకీయ కోణాల దృష్ట్యా బ్రాహ్మణ జాతికి వివిధ పార్టీల ఆసరా కోరడానికి జేఏసీ తోడ్పడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి కూడా కృషి చేస్తుందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసే పార్టీలకే ఏఐబీఎఫ్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ పార్టీలు బ్రాహ్మణ అభ్యర్థులను గుర్తించి ఎన్నికల్లో నిలబడితే వారి విజయానికి జేఏసీ కృషి చేస్తుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షం గా బ్రాహ్మణుల రాజ్యాధికారం కోసం కలిసి నడవటానికి ముందడుగు వేస్తుందన్నారు.
యువత దేశానికి మార్గ నిర్ధేశకులు
* 18 ఏళ్లు నిండిన వారు ఓటరు నమోదు చేసుకోవాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, మార్చి 1:యువతే దేశానికి మార్గ నిర్ధేశకులని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం స్వీప్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు వున్న ప్రతి వ్యక్తి తమ ఓటును వినియోగించుకోవడమే కాక, ఓటును వినియోగించుకునేలా ఇతర ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచంలో ఇంతటి స్థాయిలో విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మరే దేశంలోనూ లేదన్నారు. కులం, మతం, రంగులకు అతీతంగా 18ఏళ్లు నిండిని ప్రతి భారతీయుడికి మన రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రతి ఓటు అత్యంత విలువైందన్నారు. ఒక్క ఓటు తేడాతో సీఎం అభ్యర్థి ఓడిన దాఖలాలు ఉన్నాయని, అందుకే ఓటు విలువ గురించి చాటి చెప్పాలన్నారు. ఇక మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వెంటనే 1950కు కాల్ చేయాలని, కర్నూలు జిల్లా వాసులైతే 08518-1950 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్స్‌లను కలిపి ఈవీఎంలు అంటారని కలెక్టర్ విశదీకరించారు. ఓటరు తాను ఓటు వేసిన వ్యక్తికే ఆ ఓటు పడిందో లేదో పరిశీలించుకోవడానికి భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈ సారి వీవీ ప్యాట్స్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈవీఎంలు పారదర్శకంగా పని చేస్తాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. ఈవీఎంలను ఉపయోగించి ఓటు ఎలా వేయాలి, ఓటరు తాను వేసిన ఓటును వీవీ ప్యాట్ ద్వారా ఎలా తెలుసుకోవాలి, కౌంటింగ్ ఎలా చేస్తారన్న విషయాలను విద్యార్థులతో ప్రాక్టికల్‌గా చేయించారు.
ఉర్దూ యూనివర్శిటీ
సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ, మార్చి 1:నగరంలోని డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్శిటీ యూజీ, పీజీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం వీసీ ఆచార్య ముజఫర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో జరిగిన పరీక్షల్లో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 151 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 147 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. యూనివర్శిటీ ఫలితాల్లో 97శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. మొదటి సెమిస్టర్‌లో 70మందికి గానూ 66మంది(94.3శాతం), మూడవ సెమిస్టర్‌లో 56మందికి 56 మంది ఉతీర్తర్ణులై 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రణాళికాబద్దంగా చదివితే ఖచ్చితంగా ఉత్తీర్ణులవుతారన్నారు.

అభినందన్ విడుదలపై సంబరాలు
బేతంచెర్ల, మార్చి 1:్భరత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ విడుదల చేయడంతో శుక్రవారం పట్టణంలో సంబరాలు అంబరాన్ని అం టాయి. పుల్వామా ఘటనకు దీటుగా భారత వైమానిక దళం బుద్ధి చెబితే దానిని భరించలేని పాకిస్తాన్ భారత్‌పై దాడికి పాల్పడే ప్రయత్నానికి చెక్ పెట్టిన వింగ్ కమాండర్ అభినందన్ పొరపాటున పాక్‌కు చిక్కాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత దౌత్యనీతికి తోకముడిచిన పాక్ అభినందన్‌ను వదిలిపెట్టిందన్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురుచూసిన యువత బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంది. ఇందులో భాగంగా రుద్రవరం యువకులు, బేతంచెర్ల జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, పట్టణ యువకులు ర్యాలీ చేపట్టి భారత్ మాతకు జై.. జై జవాన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ భారత్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అలాగే భారతీయుని ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ యావత్ భారతావనికి స్ఫూరి అని కొనియాడుతూ సెల్యూట్ చేశారు.
బనగానపల్లెలో..
బనగానపల్లె : కమాండర్ అభినందన్ మన దేశానికి తిరిగివచ్చిన శుభ సందర్భంగా శుక్రవారం పట్టణంలో పట్టణ మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి మాజీ సైనికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ శత్రుదేశమైన పాకిస్తాన్ దొంగదారిన ఉగ్రవాదులను భారత్‌పైకి పంపిందని, దీంతో పాక్ సైన్యానికి, ఉగ్రమూకకు భారత్ దీటైన జవాబిచ్చిందని అభినందించారు. పాకిస్తాన్ కాశ్మీర్ యువకులను రెచ్చగొడుతూ భారత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తోందన్నారు. అందులో భాగంగా గత నెలలో ఉగ్రమూకలతో దాడి చేయించి సుమారు 44 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించడం, ఈ పరంపరలో మన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైనికుల చేతికి చిక్కడం జరిగిందని, వారు అభినందన్‌ను చిత్రహింసలకు గురిచేసినా మాతృ దేశానికి అన్యాయం చేయనని చెప్పడం భారత సైన్యానికి గర్వకారణం అన్నారు.