అనంతపురం

లక్ష్యం ఘనం .. అమలు శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 15 : జిల్లాలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ కార్పొరేషన్‌ల పనితీరు 3లక్ష్యం ఘనం-అమలు శూన్యం2 అన్న చందంగా తయారయ్యిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులకు, ఔత్సాహికులకు రాయితీ పై రుణాలను మంజూరు చేస్తారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసిన దాఖలాలు కనపడడం లేదు. గడచిన కొన్ని రోజుల క్రితం లబ్దిదారుల ఎంపిక కోసం క్రెడిట్ క్యాంపులు అంటూ హడావుడి చేసినా బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించడంతోపరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. జిల్లాలోని అన్ని కార్పొరేషన్ లూ లబ్దిదారులకు అందించాల్సిన రుణాల కోసం లక్ష్యాలను ఘనంగానే నిర్ణయించినా లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరులోతీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అర్హులైన వారికి రాయితీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటుండడంతో అటు బ్యాంకులు, ఇటు ఆయా కార్పొరేషన్ ల వద్ద తిష్టవేసిన మధ్యవర్తుల పుణ్యమా అని ఆశావహులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలోని బిసి కార్పొరేషన్ 63 మండలాల్లో 50 శాతం రాయితీపై మార్జిన్ మనీ పథకం, 12 మునిసిపాలిటీలలో50 శాతం రాయితీతోబిసి అభ్యుదయ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇలా మార్జిన్ మనీ పథకం కింద 5174 యూనిట్లు, బిసి అభ్యుదయ యోజన పథకం కింద 527 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. వీటితోపాటు జిల్లాలో ఉన్న రజక, నారుూ బ్రాహ్మణ, వడ్డెర, బోయ, ఉప్పర, బలిజ, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర సంఘాల గ్రూపులకు సైతం రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇలా పై సహకార సంఘాలకు సంబంధించిన 772 గ్రూపులకు సంబంధించి 11,580 మంది సభ్యులకు లబ్ది చేకూరేలా రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇలా ఒక్క బిసి కార్పొరేషన్ ద్వారానే వ్యక్తిగత, సహకార సంఘాల గ్రూపులకు సంబంధించి 6473 యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కాపుకార్పొరేషన్ ద్వారా 2462 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2325 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 371 యూనిట్లు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 2893 యూనిట్లు, క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా వంద యూనిట్లు మొత్తం గా 14,624 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆయా కార్పొరేషన్ లకు సంబంధించి అర్హులైన నిరుద్యోగులు, ఆశావహుల కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలోదరఖాస్తుల వద్దకు వచ్చేటప్పటికి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఇందులోఇప్పటివరకూ బిసి కార్పొరేషన్ కు 3282 దరఖాస్తులు, కాపుకార్పొరేషన్‌కు 30 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్‌కు 1026 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్ కు 263 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్ కు 1010 దరఖాస్తులు, క్రిస్టియన్ కార్పొరేషన్‌కు 26 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లా లోని ఆయా మండలాల నుంచి దరఖాస్తులు ఎంపిడివోల వద్దనుంచి బ్యాంకర్లు, ఆయా కార్పొరేషన్ ల వద్దకు చేరుకోవాలంటే ఐదువేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఐదువేల రూపాయలను మధ్యవర్తులకు ఇచ్చిన వారి దరఖాస్తులను మండలాల నుంచి ఆయా కార్పొరేషన్ లకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అక్కడి నుంచి బ్యాంకర్లు, ఆయా కార్పొరేషన్ లలోసైతం మధ్యవర్తుల ప్రమేయం బాగా ఉందని ప్రతి దగ్గరా వీరు ప్రత్యక్షం అవుతూ అందిన కాడికి దండుకుంటున్నారని ఆశావహులు వాపోతున్నారు. ఇలా ఆయా కార్పొరేషన్ లు లక్ష్యాన్ని ఘనంగా నిర్ణయించినా క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి బ్యాంకర్ల తాత్సారం, మధ్యవర్తుల ప్రమేయంతోరాయితీ సొమ్ము మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్నీటి సంద్రంగా
కాళసముద్రం..

కదిరి, ఫిబ్రవరి 15: కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రం గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కన్నీటి సముద్రంగా మారింది. గంగమ్మ జాతరను ఉత్సాహంగా జరుపుకుంటున్న గ్రామస్తులకు తీరని దుఖాన్ని మిగిల్చింది. లారీ రూపంలో నల్గురి ప్రాణాలు బలికొని, నాలుగు కుటుంబాల్లో విషాదం నింపగా గ్రామమంతా శోకసంద్రంగా మారిపోయింది.
ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. కదిరి-అనంతపురం జాతీయ రహదారిలోని కాళసముద్రం గ్రామం వద్ద రోడ్డు పక్కన వున్న గంగమ్మకు మంగళవారం జాతర నిర్వహించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జాతరకు వచ్చే భక్తులకు భోజన వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. గుడి వద్దే అందుకు సంబంధించి కాయగూరలు, యర్రగడ్డలు తరగడం, బియ్యం కడగం వంటి పనులు చేయడంలో పలువురు మహిళలు నిమగ్నమై వుండగా మరో పాతిక మంది వరకు ఆలయం గదిలో వుండి ఏర్పాట్లకు సంబంధించి చర్చించుకోవడం జరుగుతోంది. ఇందులో కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆలయం బయట వంట పనిలో నిమగ్నమైన మహిళలపై క్షణాల్లో దూసుకెళ్లింది. జరిగిన సంఘటనను అర్థం చేసుకొనే లోపు ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ముగ్గురు క్షతగాత్రులుగా మిగిలిపోయారు. అంతా రెండు, మూడు నిమిషాల్లో జరిగిన సంఘటన నుంచి ప్రత్యక్ష సాక్షులు తేరుకొనే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతి చెందిన వారిలో గంగాభవాని, పి.లక్ష్మిదేవి, గంగులమ్మ ఉన్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడపడం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. సంఘటన అనంతరం లారీ పక్కనే గల వ్యవసాయ పొలంకు ఆనుకొని వున్న గంతలో నిలిచిపోయింది. డ్రైవరు అతి కష్టం మీద లారీ నుంచి కిందికి దిగి(మద్యం మత్తులో వున్న కారణంగా) కదిరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

స్వయం ఉపాధి కోసం..
దరఖాస్తు చేసుకున్న జాబితా ఇవ్వండి

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఫిబ్రవరి 15 : జిల్లాలోని బిసి, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్‌లకు సంబంధించి స్వయం ఉపాధికై దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల జాబితాలను ఈనెల 17వ తేదీలోపుసంబంధిత అధికారులకు పంపించాలని ఎంపిడివోలు, మునిసిపల్ కమిషనర్‌లను జెసి-1 బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం సాయంత్రం జడ్‌పి సమావేశ మందిరంలోరాయితీ లింకేజి పథకాలు, జన్మభూమి-మా ఊరు పిటిషన్స్, హౌసింగ్ తదితర అంశాలపై జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ తోకలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమిలోవచ్చిన ఫిర్యాదులను రేపటిలోగా(మంగళవారం) జీరో చేయాలన్నారు. రాయితీ లింకేజి పథకాలకు సంబంధించి లబ్దిదారుల దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపాలన్నారు. లబ్దిదారుల దరఖాస్తులు రాగానే ఆలస్యం కాకుండా వాటిని పరిశీలించి లబ్దిదారులకు సాయం అందించాలని బ్యాంకర్లను ఆదేశించాలని ఎల్‌డియం జయశంకర్‌ను ఆదేశించారు. సాంకేతిక కారణాలు చూపి జిల్లా ప్రగతికి అవరోధం కల్పించవద్దన్నారు. అన్నింటినీ అధిగమించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకుని రావాలన్నారు. జిల్లాలోని ఆయా మునిసిపాలిటీలలోనిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం తదితర నిత్యావసర వస్తువుల పంపిణీని ఈ నెల 17వ తేదీ వరకూ పంపిణీ చేస్తామన్నారు. ఈపాస్ ద్వారా సరుకులను పంపిణీ చేస్తామని, 15వ తేదీ లోపు గడువు పూర్తయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. సంబంధిత తహసీల్దార్లు, డీలర్లు ఈ విషయాన్ని గమనించి ప్రజలకు దండోరా ద్వారా ఈ విషయాన్ని తెలపాలన్నారు. అందరికీ ఇళ్ల పథకం కింద లబ్దిదారులను వెంటనే గుర్తించానలి జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఆదేశించారు. పెండింగులో2186 ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. స్ట్రీట్ వెండర్లుకు గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోసంక్షేమ శాఖాధికారులు నాగముని, జమీర్ అహమ్మద్, రామూనాయక్, జడ్‌పి సిఈఓ రామచంద్ర, మెప్మా పిడి మల్లీశ్వరి, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కొండమీద వెంకటరమణస్వామి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 15: ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే శ్రీ కొండమీద వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ అష్టమి సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీవారిని సతీ సమేతంగా ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఉత్సవమూర్తులను మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి, కొండమీదరాయుని ఆలయంలో వుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దేవరకొండపైకి గ్రామ పురవీధులగుండా ఉరేగింపుతో స్వామివారిని తీసుకొనిపోయారు. అనంతరం స్వామివారికి మాఘశుద్ధ నవమి మంగళశారం ఉదయం పుణ్యహవాచనం, అంకురార్పణలు నిర్వహించి నవరాత్రుల బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, గ్రామ సర్పంచ్ సాకె.రమాదేవి ఆమె భర్త సాకె.నారాయణస్వామి, అమ్మవారి పుట్టినింటి వారైన పద్మశాలులు పొడరాళ్ళ రవీంద్ర, ఎ.అశోక్‌కుమార్ పాల్గొని పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు, విఆర్‌ఓలు పెద్దన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.

రేషన్ కార్డుకై తహశీల్దార్ కార్యాలయం చుట్టూ
వికలాంగురాలి ప్రదక్షిణ

తాడిపత్రి, ఫిబ్రవరి 15: తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం పాక్కుంటు వెళ్తున్న వికలాంగురాలిని చూస్తున్న వారంతా అయ్యో పాపమంటు జాలి వ్యక్తం చేస్తుంటే, రెండు కాళ్లు లే ని వికలాంగురాలికి రేషన్ కార్డు మంజూరు చేయడంలో రెవిన్యూ అధికారులు కరుణ చూపకపోవడం చూపరులని కలచివేసింది. రేషన్ కార్డు కోసం వికలాంగురాలు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రెండు ఏళ్లుగా పాక్కుంటూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువైనాడని వికలాంగురాలు వాపోయింది . వివరాల్లోకి వెళితే స్థానిక శ్రీనివాసపురంలోని 16/345-9 డోర్ నెంబర్‌లో గల ఇంటిలో పోతురాజు శివకుమారి, 5 సంవత్సరాల కుమారుడు లోకేష్‌తో జీవిస్తుంది. పోలియో వ్యాధితో పుట్టుకతోనే శివకుమారికి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. కర్నూలు నగరంలో వరద వచ్చినప్పుడు తాడిపత్రికి వలస వచ్చామని, తన భర్త వదిలి వేసాడని, తన తల్లి కూలి పనులకు వెళ్లి తమను పోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. గత రెండు ఏళ్లుగా రేషన్ కార్డు కో సం జన్మభూమి సభల్లో ను, తహశీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డేలలో పలుమార్లు అర్జీలు సమర్పించానని తనకు ఇంతవరకు రేషన్ కార్డు మంజూరు కాలేదని తెలిపింది. రేషన్ కార్డు లేకపోవడంతో అంగవైకల్య ధృవీకరణ పత్రం ఇంతవరకు పొందలేకపోయానని తెలిపింది. రెవిన్యూ అధికారులు రేషన్ కార్డు మంజూరు చేస్తే దానితో అంగవైకల్య సర్ట్ఫికెట్ తీసుకొని వికలాంగుల పింఛన్ పొందవచ్చుననే ఆశతో తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని తెలిపింది. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు స్పందించి శివకుమారికి రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.

వేసవిలో కోతలు లేకుండా చూడండి

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఫిబ్రవరి 15 : జిల్లాలోరాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలోఅంతరాయం, కోతలు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఎపి ఎస్‌పిడిసియల్ సిఎండి హెచ్‌వై దొర జిల్లా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతోసోమవారం ఎస్‌ఈ కార్యాలయంలోసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవితోపాటు విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కోతలు లేకుండా చూడాలన్నారు. ఇందుకుగానూ ముందస్తు ప్రణాళికను రూపొందించాలన్నారు. దీంతోపాటు కాలిపోయిన లేదా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ లను వినియోగదారుల వాహనాల్లో తరలించినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇందుకుగానూ జిపియస్ కలిగిన సంస్థ వాహనాల్లోనే వీటిని తరలించాలన్నారు. దీనిపై సంస్థకు చెందిన సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయని అలాకాకుండా సిబ్బంది చూసుకోవాలన్నారు. దీంతోపాటు జిల్లాలోబిపియల్ కుటుంబాలకు దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతియోజన పథకం కింద రూ.125 కి తప్పనిసరిగా మీటరును ఏర్పాటు చేయాలని లేకపోతే సంబంధిత అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.దీంతోపాటు పెద్ద ఎత్తున జరుగుతున్న విద్యుత్ చౌర్యం కాకుండా చూడాలని ప్రజలు అందరూ పొదుపుపాటించేలా అవగాహన తీసుకుని రావాలన్నారు.వీటితోపాటు ఎపి ఎస్‌పిడిసియల్ రూపొందించిన యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా ఉన్న మొండి బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోడిస్కమ్ డైరెక్టరు పుల్లారెడ్డి, సిఈ వీరయ్య, ఎస్‌ఈ ప్రసాదరెడ్డి, డిఈ లు, ఎడిఈ లు, ఎవోలు, ఎఈ లు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సేకరణ : ఎమ్మెల్యే

ధర్మవరం, ఫిబ్రవరి 15: జిల్లాలో భారీ పరిశ్రమల ఏర్పాటులో భాగంగా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో సైతం కొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ సమస్య పరిష్కారంతోపాటు ఉపాధి కల్పన కల్పించాలని, తాము రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు. సోమవారం యర్రగుంట్లలోని వ్యక్తిగత కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కోసం రాప్తాడులో 1600 ఎకరాలు, ధర్మవరంలో 2400 ఎకరాల భూ సేకరణ చేసి ఎపిఐ ఎసికి స్వాధీనం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పలు సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారాలపై మండల స్థాయి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపిపి వేణుగోపాల్‌రెడ్డి, జెడ్‌పిటిసి రామాంజనేయులు, నాయకులు కాటమయ్య, మల్లికార్జున, శ్రీనివాసులు, ఓబులేసు, నారాయణస్వామి, ఇనయతుల్లా, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంత్‌సేవాలాల్ మహారాజ్ ప్రవచనాల ప్రచారంతోనే
బంజరాల అభివృద్ధి

గుత్తి, ఫిబ్రవరి 15: సమాజంలో అసమానతలను తొలగించేందుకు సంత్‌సేవాలాల్ మహారాజ్ ప్రబోధాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారానే బంజరాలు సామాజికంగా గుర్తింపు, చైతన్యాభివృద్ధిని సాధించగలరని వక్తలు పేర్కొన్నారు. సోమవారం సేవాఘడ్‌లో జరిగిన సంత్‌సేవాలాల్ మహారాజ్ 277 జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు బంజరాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సంత్‌సేవాలాల్ మహారాజ్ బంజరా సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను రూపుమాపేందుకు శక్తివంచన లేకుండ కృషి చేశాడన్నారు. అసమానతలు లేని సమాజాన్ని స్తాపించేందుకు బంజరాలు ప్రతి ఒక్కరు సంత్ సేవాలాల్‌మహారాజ్ ప్రబోధాలను ప్రజలలోకి తీసుకెళ్లడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బంజరాలు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం వుందన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక బోగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ, నైవేధ్యం సమర్పించారు. అందులో భాగంగానే సంత్‌సేవాలాల్ చిత్రపటాన్ని తోలోరామ్ గుర్రంపై దేవాలయం వద్ద నుండి జగదాంబ మాత ఆలయం వరకు ఊరేగించారు. అక్కడి నుండి 101 మంది కన్యకలు పవిత్ర కళశాలతో చిత్రపటాన్ని తిరిగి ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ జాతీయ నాయకులు, రిటైర్డ్ ఐజి జగన్నాథరావు మాట్లాడుతూ బంజరాలు సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను జాతీయ స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం వుందని రిటైర్డ్ ఎస్పీ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో బంజరాల ఐక్యతకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం నందు ట్రస్ట్‌బోర్డు కమిటి సభ్యులు కేశవనాయక్, శేఖర్‌నాయక్, రాష్ట్ర నాయకులు అశ్వర్థనాయక్, రామచంద్రనాయక్, గిరిజన క్రాంతిదళ్ సభ్యు లు మహేష్‌నాయక్, గిరిజన విద్యార్థి సమైక్య నాయకులు ఒడిశ్యా శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పరిహారం పంపిణీ చేయాలంటూ రోడ్డుపై ధర్నా

నంబులపూలకుంట, ఫిబ్రవరి 15: సౌర విద్యుత్ కేంద్రంకు భూములిచ్చిన రైతులకు అందించాల్సిన పరిహారం వెంటనే పంపిణీ చేయాలంటూ సోమవారం మండలంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు సాగు రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులు పరిహారం కోసం రోడ్డెక్కిన సమయంలో ప్రతిసారి వారం, పది రోజుల్లోగా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మండలస్థాయి అధికారులు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారని సాగు రైతులు పేర్కొన్నారు. సాగుదారుల జాబితాలో పేర్లు వెల్లడించి నాలుగు నెలలకు పైగా కావస్తోందని, రైతులకు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని చెప్పి నెలలు గడుస్తోందన్నారు. రైతులు సాగు చేసుకునే భూములలో సౌర విద్యుత్ కేంద్రం పనులు వేగంగా జరుగుతున్నా రైతుల గోడును కలెక్టర్ పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని సిపిఐ నాయకులు దుయ్యబట్టారు. మండల తహశీల్దార్ వచ్చి రైతుల సమస్యపై మాట్లాడాలని సాగు రైతులు తెలిపారు. రాస్తారోకో చేస్తున్న సాగుదారులతో తహశీల్దార్ మోహన్‌దాస్ మాట్లాడుతూ రాస్తారోకో చేస్తున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని వివరించారు. సౌర విద్యుత్ కేంద్రంకు భూములిచ్చిన రైతుల పరిహారం విషయంపై తమ స్థాయిలో ఏమీ లేదని, జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడుకోవాలని సాగు రైతులకు తెలిపారు. సాగు రైతులు స్వచ్చంధంగా ధర్నా విరమించి కలెక్టర్ ముందు ధర్నా చేసేందుకు సమాయత్తం అయ్యేందుకు ప్రతి పల్లె నుంచి సాగు రైతులు తరలివెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అమీర్‌బాషా, సిపిఐ డివిజన్ రైతు సంఘం నాయకులు సూర్యనారాయణరెడ్డి, సింగిల్‌విండో పరపతి సంఘం అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, వైకాపా నాయకులు రఘునాథ్, షామీర్‌బాషా, ఫకృద్దీన్, సిపిఎం నాయకులు, కాంగ్రెస్ నాయకుడు పాలగిరి వౌళాసాబ్, రైతులు సుబ్బారెడ్డి, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.