క్రీడాభూమి

లోథా సిఫారసులు సాధ్యమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: లోధా కమిటీ ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో చేసిన సూచనలను అమలు చేసే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్న నేపథ్యంలో, భారత క్రికెట్ ప్రక్షాళనపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ముకుల్ ముద్గల్ రెండు దశల్లో విచారణ పూర్తిచేసి, సమర్పించిన నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లో దోషులను ఖాయం చేసింది. అయితే, వారికి విధించే శిక్షను ఖరారు చేసే బాధ్యతను విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అంతేగాక, బిసిసిఐ పాలనా వ్యవహారాలను పారదర్శకంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా కమిటీని కోరింది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం విచారణను పూర్తి చేసిన లోధా కమిటీ ఇటీవలే సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు దానిని ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయాలని బిసిసిఐకి సూచించింది. అయితే, లోధా కమిటీ సిఫార్సులను ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయడం సాధ్యం కాదని శశాంకర్ మనోహర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిసిసిఐ కోర్టుకు స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సులపై కూలంకషంగా చర్చించిన తర్వాత, వాటి అమలులో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ పిటిషన్‌ను దాఖలు చేయాలని తీర్మానించింది. వచ్చేనెల 3వ తేదీకి కేసును సుప్రీం కోర్టు వాయిదా వేసిన కారణంగా, ఈలోపే కౌంటర్‌ను దాఖలు చేయాలని బోర్డు కార్యవర్గం నిర్ణయించింది.
ఇరకాటంలో బోర్డు
అత్యధిక ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐని 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుతో ఇరకాటంలో పడింది. ఈకేసు విచారణ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మాదిరి కొనసాగింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వంలోని కమిటీ రెండు విడతలుగా విచారించి సుప్రీం కోర్టుకు వేరువేరుగా నివేదికలను సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను దోషులుగా తేల్చింది. అంతేగాక, స్పాట్ ఫిక్సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించిన చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. దోషులను గుర్తించినప్పటికీ, వారికి శిక్షను ఖరారు చేసే బాధ్యతను తాము తీసుకోవడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. శిక్షలను ఖరారు చేసేందుకు లోధా నాయకత్వంలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీకి అప్పగించింది. బిసిసిఐ పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను కూడా అప్పగించింది. కేసును విచారించి, పలువురి అభిప్రాయాలు తీసుకొని, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత గురునాథ్ మెయప్పన్, రాజ్ కుంద్రాలపై లోధా కమిటీ జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రెండు సంవత్సరాలు ఐపిఎల్‌లో ఆడకుండా నిషేధించింది. అనంతరం బిసిసిఐలో అనుసరించాల్సిన విధివిధానాలపై దృష్టి సారించింది. అంతేగాక, బోర్డు అధికారులతో 38 పర్యాయాలు సమావేశమైంది. బోర్డుపై ఉన్న ఆరోపణలు, విమర్శలను విశే్లషించి సిద్ధం చేసిన 159 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. పలు విప్లవాత్మక నిర్ణయాలను ఈ కమిటీ సిఫార్సు చేసింది.
కీలక సూచనలు
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం నుంచి బిసిసిఐలో రాజకీయ నాయకుల జోక్యాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడం వరకూ ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేసింది. మంత్రలు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని సూచించింది. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలని తేల్చిచెప్పింది. ఈ పోస్టుల్లో సేవలు అందించేవారు భారతీయులై ఉండాలని, వారి వయసు 70 సంవత్సరాలకు దాటరాదని, దివాలాదారుడై ఉండకూడదని, మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని స్పష్టం చేసింది. ఇలాంటి నియమాలను పాటించినప్పుడే బిసిసిఐ పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడింది.
కార్యవర్గ సభ్యులకు సీలింగ్
కార్యవర్గ సభ్యులకు సీలింగ్‌ను కూడా లోధా కమిటీ ప్రతిపాదించింది. ఒక వ్యక్తి బిసిసిఐ పాలక మండలికి గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని, అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండకూడదని నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చని, అయితే, అధ్యక్షుడు రెండుసార్లు, మిగతా కార్యవర్గ సభ్యులు వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే అధికంగా పదవిలో కొనసాగేందుకు వీలులేదని వివరించింది. అయితే, లోధా కమిటీ చేసిన ఈ సూచనను బోర్డు కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఆచరణకు అసాధ్యమైన అంశమని భావిస్తున్నది.
బిసిసిఐ పాలక మండలి తొమ్మిది మందితో ఏర్పాటు కావాలని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో సూచించింది. వీరిలో ఐదుగురిని బోర్డు సర్వసభ్య సమావేశం ఎన్నుకుంటుంది. ఇద్దరు క్రికెటర్ల ప్రతినిధులు ఉండాలి. ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలి. బోర్డు రోజువారీ వ్యవహారాలను పరిశీలించే బాధ్యతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)కు అప్పగించాలి. అతనికి ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ సహాయసహకారాలు అందించాలి. అయితే, ఇన్నాళ్లూ రాజకీయ నాయకులు, వాపారవేత్తలే బోర్డుపై పెత్తనం చెలాయిస్తుండగా, హఠాత్తుగా తొమ్మిది మందితో కార్యవర్గమంటూ లోధా కమిటీ కొత్త విధివిధానాలను తెరపైకి తీసుకురావడం పాలక మండలిలోని అత్యధిక శాతం మందికి నచ్చడం లేదు. ఇది కూడా ఆచరణ సాధ్యంకాని సిఫార్సేనని వారు అంటున్నారు. సుప్రీం కోర్టుకు సమర్పించే పిటిషన్‌లో దీనిని కూడా ప్రస్తావించనున్నారు.
బిసిసిఐ నిర్మాణం, నియమ నిబంధనలకు సంబంధించి కూడా లోధా కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలను చేసింది. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విధమైన అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంఘం మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు ఉండడాన్ని కూడా లోధా కమిటీ తప్పుపట్టింది. ప్రస్తుత నిబంధనలను అనుసరించి బిసిసిఐ అధ్యక్షుడు మూడు ఓట్లు వేసే అవకాశం ఉంది. తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి ఓటు ఉంటుంది. ఏదైనా అంశంపై ఓట్లు సమానంగా పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఎందుకని లోధా కమిటీ ప్రశ్నించింది. సంబంధిత క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే సరిపోతుందని అభిప్రాయపడింది. అయితే, ఈ సిఫార్సును అమలు చేస్తే, తమ ఆధికారాలకు కత్తెరపడుతుందని, చివరికి తామంతా నామమాత్రంగా మిగిలిపోతామని కార్యవర్గ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.