సబ్ ఫీచర్

భాష పట్ల మమకారం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గిపోయి క్రమంగా ఇంగ్లీషుకు ఆదరణ పెరిగిపోతోందని జనం అనుకుంటున్న రోజులు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడ తెలుగు మాధ్యమం చదువులు మానివేసి ఆంగ్ల మాధ్యమంలో చదవటానికి ఆసక్తి చూపుతున్నందున ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనల మధ్య ఈ భాషాదోషాల సొద ఎందుకనుకోవచ్చు. కాని ప్రాభవం ఉన్నన్నినాళ్ళు భాషని రక్షించుకోటానికి, వ్యావహారం లోనైనా తప్పులు మాట్లాడకుండా ఉండటానికి ఆమాత్రం జాగరూకత అవసరం. ఇవాల్టి ఈ తెలుగు భాష ఎంతగా కలుషితమైనదంటే పద స్వరూపమే తెలియనంతటి దుస్థితి. ఏది తెలుగు పదమో, ఏది సంస్కృతమో, ఏది తత్సమమో, ఏది తద్భవమో, ఏది అన్యదేశ్యమో తెలియని దీనస్థితి. అంతగా పరభాషా పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి. అది వేరే సంగతి.
విద్యార్థులు పాఠశాల స్థాయిలో కాని డిగ్రీ స్థాయిలో కాని దోషాలు లేకుండా పట్టుమని పది వాక్యాలు వ్రాయలేకుండా ఉన్నారన్నది వాస్తవం. వత్తులైతే మరీను. దేనిక్రింద వత్తు ఉండాలో దేనిక్రింద అక్కరలేదో తెలియని పరిస్థితి. ‘విద్యార్థి’అని వ్రాయటానికి బదులు ‘విద్యార్ధి’అని ‘సమైక్య’ అని వ్రాయటానికి బదులు ‘సమైఖ్య’అని వ్రాస్తున్నారు. ‘వ్రాయటం’అనే పదం కూడా ‘రాయ టం’అనే వ్రాస్తున్నారు. వ్యావహారిక భాషోద్యమ పుణ్యమా అని! ఉపాధ్యాయ వర్గం కూడా భావం అర్థమైతే చాల్లే అని సర్దుకోవటం కనిపిస్తోంది. వ్యావహారిక భాషాప్రాభవం నిండా కలిగి ఉన్న పత్రికలని చదువుతున్న వాళ్ళు ఆ తప్పుల్ని ఒప్పులుగా భావించి మళ్ళీమళ్ళీ ప్రయోగిస్తున్నారంటే పరిస్థితి ఎంతగా చెయ్యిదాటిపోయందో అర్ధం చేసుకోవచ్చు. ఒక పదంయొక్క వృద్ధి రూపంలో ‘త’అనే వర్ణం చివరన చేరదు. ఉదాహరణకు ‘రమణీయం’అనే పదం ‘రామణీయకం’ అవుతుంది. ‘రామణీయకత’ కాదు. అలాగే ‘ప్రధానము’ అనే పదం ‘ప్రాధాన్యము’ అవుతుంది. ‘ప్రాధాన్యత’అని కాదు. సమైక్యత, నైతికత అనే పదాలు దోషాలు. సమైక్యము, నైతికము అని వృద్ధిరూపంలో ఉండాలి. ఈ దోషాలు చాలామంది చేస్తున్నారు. పత్రికలలో కూడా ప్రాధాన్యత, నైతికత వంటి పదాలు విరివిగా వాడటం కనిపిస్తుంది.
ఇక అర సున్నల సంగతి పూర్తిగా వదలివేశాము. వాస్తవానికి ఒక పదంలో అరసున్న ఉంచితే ఒక అర్థం తీసివేస్తే వేరొక అర్థం రావటం ఉంది. ఉదాహరణకు ‘కలుగు’అనే పదానికి కలిగిన, ఉన్న అని అర్థం. అదే కలుఁగు అని అర సున్నతో ఉంటే కన్నము, రంధ్రము, బొరియ అని అర్థం. అలాగే చేఁత, చేత లాంటివి కొన్ని పదాలు కనిపిస్తాయి. ఆ తేడాని ఇప్పుడెవ్వరు పట్టించుకోవటం లేదు. అలాగే దంత్యపు గుర్తులు పూర్తిగా వదలివేశాము. చాపలు, చేపలు అనే పదాల ఉచ్ఛారణలో కూడా తేడా తెలియటల్లేదు. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అది చాలక ఈమధ్య ఎన్‌సిఇఆర్‌టివారు వయోజనులకోసం తయారుచేసిన ‘చార్టులో’ (అక్షరమాల చార్టు) మరి కొన్ని అక్షరాలను తొలగించి ప్రచురించారని తెలుస్తోంది. కొన్ని ధ్వనులు పలకటానికి ఇప్పుడున్న అక్షరాలు చాలటం లేదు. తాటాకు, తాటియాకు, తాటేకు అని ఏదో ఒక రూపం వ్రాయవలసి వస్తోంది. పొట్టలో చుక్క సంగతి ఇందుకు భిన్నం కాదు. అర్థము=శబ్దార్థము (పొట్టలో చుక్క ఉన్నది) అర్ధము= సగము (పొట్టలో చుక్కలేదు) ఈ తేడాని గమనించకుండా రెంటికీ ఒకటే వాడటం పరిపాటి. సాధారణంగా ఉచ్ఛారణ దోషాలు వ్రాతలో చోటుచేసుకుంటాయి. శ,ష,స,లు మూడింటికి అంతరం లేకుండా పలకటం వ్రాయటం, ళ,ణలను ల,నగా పలకటం వ్రాయటం వాడుకలో ఉంటున్నాయ్. ఇప్పుడు ఈ దోషాలన్ని పిల్లలేకాదు పెద్దలు కూడా చేస్తున్నవే. వివిధ ప్రకటనల గోడ పత్రికలపై కనిపిస్తున్నవే.కాబట్టి వీటిమీద కాస్తంత మనసు పెడితే ఈ దోషాలనుండి తప్పించుకోవచ్చు. ఇదేమి మనకు అసాధ్యమైన సమస్యకాదు. కావలసినదల్లా కాస్త శ్రద్ధ, పట్టుదల, భాషమీద మమకారం- అంతే!

- నూతలపాటి వెంకటరత్న శర్మ