'క్లాప్' కొట్టు గురూ!

కళ-కలకల ( లోకాభిరామమ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఐ సీ వారు ఏడెనిమిది సంవత్సరాల కింద ఒక కాలెండర్ ఇచ్చినరు. అది బాగ పెద్ద సయిజులో ఉన్నది. అందులో జామినీరాయ్, రవి వర్మ మరెందరో మహామహుల కళాఖండాలు ఉన్నయి. అన్నట్లు ఆ మధ్యన ఒకానొక పేరు పొందిన పత్రిక వారు జామినీ రాయ్ బొమ్మను, అంటే ఆయన వేసిన, రాసిన బొమ్మను అట్ట మీదనో, ఆ లోపలనో అచ్చు వేసినరు. అంతటి గొప్ప పత్రిక వారు అమాంతం పప్పులో కాలేసి ఆయన పేరు జెమినీ రాయ్ అని రాసినరు. జామిని అంటే యామిని అంటే రాత్రి. జెమిని అంటే జెమినె్త అంటే మిథునం అంటే జంట. అది సరేగాని, కాలెండరులో ఆరే కాగితాలున్నయి. కాగితం మిగిలించాలని ఒక్కొక్క పేజీ వెనుక మరొక బొమ్మ, నెల తేదీలు కూడ వేసినరు. నాకేమో ఆ కళాఖండాలను ఫ్రేములో పెట్టి, అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలని, ఇంట్లోకి వచ్చిన వాండ్లకు ఎప్పటికి ఒకటే బొమ్మగాక, రిలీఫ్‌గా వేరువేరు బొమ్మలు కనిపించాలని కోరిక. బొమ్మల్లో రిలీఫ్ అన్నది విడిగా చెప్పుకోదగిన ప్రత్యేక అంశము. ఇక్కడ నేను రాసినది బోర్‌డమ్ నుంచి రిలీఫ్. మా ఇంట్లోకి కాలు పెట్టంగనే గోడ మీద యశోద, కృష్ణుల చిత్తరువు కనిపిస్తుంది. నాకెందుకో ఆ బొమ్మలు తల్లీబిడ్డల మధ్యన ఉండవలసిన అనురాగం కనిపించదు. ఫొటో కొరకు పోజు పెట్టినట్లు తోస్తుంది నాకు వాళ్ల తీరు. ఆ బొమ్మను అదే పనిగా స్టడీ చేస్తే ఏం కనిపించినయనే సంగతి చెప్పను. నన్ను పిచ్చివాడంటరు.
నేను పిచ్చివాడిని, వాన్ని, వాణ్ని కాదని, నేనే అనుకోవడము లేదు. కానీ ఆ మాట ఎవరో అంటే బాగుండదు గద! నేనూ ఎల్‌ఐసీ కాలెండర్ రెండు కాపీలు సంపాయించిన. ఎందుకో అర్థమయ్యే ఉంటుంది. నాకు పనె్నండు బొమ్మలు కావాలె. అవన్ని ఒక్క సైజులో లేవు. ఇంతకు ఏమయిందని ఎవరన్న ప్రశ్న అడిగితే, నా సోది ఆగుతుంది. ఆ అవకాశము లేదాయె! బొమ్మలు మనమే మార్చగలిగేట్టు ఒక ఫ్రేము సంపాయించాలె. మెటల్ ఫ్రేం కొరకు వెతికితే దొరకలేదు. కర్ర ముక్కల ఫ్రేము పాడవుతుందని భయము. కాపు రాజయ్యగారు తమ చేతులతో యిచ్చిన బొమ్మలను అట్ల ఒక ఫ్రేములో పెట్టి మారుస్తున్న. ఎవరన్న గమనించినరా అన్నది మాత్రము అనుమానమే.
ఇనే్నండ్ల నుంచి ఆ రెండు కాలెండర్లను కాపాడుతున్న అనే అనుకుంటున్న. వాటితోబాటు ఒక మందుల కంపెనీ వారు ఇచ్చిన మరొక పెయింటింగుల కాలెండర్ కూడ దాచినట్లు గుర్తున్నది. నాకు ఇప్పుడు ఫ్రేము చేసి ఇచ్చే మనిషి దొరికనడు. సంతోషంగ ఇంటికి వచ్చి చూస్తే, ఆ కాలెండర్‌లు ఎక్కడున్నయన్నది గుర్తుకు రాలేదు. వారం నుంచి ఇల్లంత వెతుకుతున్న. అవి మాత్రము దొరుకుతులేవు! ఆ కాలెండర్ గురించి నేను ఎవరిని అడగాలె? ఎవరు మాత్రము పాత కాలెండర్లు ఇంత కాలము దాచుకుంటరు? మొత్తానికి నా ఆశలు, కోరికలు ఈ రకంగ అంతముతుయన్న నిరాశ మొదలయే చోటికి నా పరిస్థితి చేరింది!
ఒకప్పుడు ఒక ప్రదర్శనలో రాజా రవివర్మ వేసిన భారతం సీరీస్ చిత్రాల సెట్ కొన్నాము. అవును. కొన్నది నేను ఒక్కడిని, ఒక్కన్ని, ఒక్కణ్ని అయి ఉంటే, అయ్యుంటే అవి నా దగ్గరే, దగ్గరనే, వద్దనే ఉండేవి. వాటిని గురించి రాసే పరిస్థితి, అవసరము వచ్చేది కాదు. నా గోలకన్నా ముందు, ఆ బొమ్మలలోని ప్రత్యేకత చెప్పాలె. రవివర్మ భారతములోని పాత్రలను చిత్రించిన తీరు పూర్తి వేరుగ ఉంటుంది. అన్న ఎన్ టీ ఆర్ బ్రాండు సినిమాలలో వలె అంతంత కిరీటాలు, దండలు, పూసలు ఏవి ఇక్కడ కనిపించవు. కౌరవులు, పాండవులు, కొనకు (అనగా చివరకు, తుదకు, కడపటకు) కుష్ణ అనగా క్రిష్ణ, కిష్ణ, కృష్ణ పరమాత్మ గూడ పొడుగాటి అంగీలు, అనగా చొక్కాలు, అనగా షర్టులు, లేదా జుబ్బాలు వేసుకుని ఉంటారు. నెత్తికి, అనగా తలకు పాగాలు మాత్రమే ఉంటయి. సుబ్బరామరెడ్డి గారు ఖర్చు పెడితే, జీవీ అయ్యర్ అనే ఆయన తీసిన భగవద్గీత అనే బొమ్మ, అనగా చిత్రము, అనగా సినేమా, అనే మూవీలో ఇటువంటి ఆహార్యము, అనగా పోషాకు, అనగా దుస్తులలు, అలంకరించి వాడుకున్నారు. అయితే, నాకు ఫ్రేము చేయించడము చేతగాదని, నా మిత్రుడు వాటిని వెంట తీసుకుపోయినడు. ఫ్రేము చేయించిన అనే చెప్పినడు. ఇంటికి తీసుకపోయి గోడలకు వేలాడదీసి ఉంటే బాగుండును. వాటిని మంచములో ఏర్పాటు చేసిన పెట్టెలో దాచినడు. ఆ తరువాత ఆ మిత్రుడు వికలాంగుడయి ఆ మంచములోనే స్థిరమయినడు. మరో లోకానికి వెళ్లిపోయినడు. నేను మొగమాటము లేకుండ, పెయింటింగుల గురించి అడిగిన. ఆయన ఉన్నప్పుడు, పోయిన తరువాత అడిగిన. అవి మాత్రము నా చేతికి రాలేదు! మళ్లీ నిరాశ!
నా దగ్గర మంచి కళాధారిత చిత్రాలు ఉన్నాయి. వాటిని మారుస్తూ బాగనే కొంతకాలము ఆనందించిన. కానీ. యింట్లో దేవుని బొమ్మలు ఎక్కువయినయి. కళాదృష్టి అన్నది కలకాలము ఒక తీరుగ నిలబడదు. చదువుకునే కాలములో నేను తయారుచేసి గదిలో ప్రదర్శించిన కొలజ్‌లను గురించి జరిగిన చర్చలు ఇంకా గుర్తున్నయి. నా గది ఒకోసారి కళా ప్రదర్శన వలె కనిపించేది. అందరు వచ్చి చూస్తుండిరి గూడ. ఈ సందర్భముగ ఒక కార్టూను గుర్తుకు వస్తుంది. భార్యాభర్తలు ‘మన కళాతృష్ణ మరీ ఎక్కువయినట్లుంది’ అనుకుంటు ఉంటరు. ఈ ఇల్లు కళా ప్రదర్శనవలె గాక ఒక అంగడి వలె ఉంటుంది. ఆ పరిస్థితి ప్రస్తుతము లేదు.
పనె్నండు బొమ్మల కాలెండరుల కొరకు వెతుకుతూ ఉండగా, వాగ్లేకీ దునియా అయింది. అదేమో తెలియని వారికి వివరం చెప్పాలె గద! దూద అనే దూరదర్శన్‌లో ఒక సీరియల్ అది. చాలా బాగుండేది. ఒక ఎపిసోడ్‌లో ఇట్లనే ఆ భార్యాభర్తలు, వారి పిల్లలు ఒక అలారం గడియారం (దీని వివరం చెప్పను. లేకుంటే ఇది అరేబియన్ రాత్రులు కథ అవుతుంది. ఆ వివరం అంతకన్నా చెప్పను) కొరకు వెతకాలని మొదలుపెట్టి పాత సామానులన్ని బయటపెడతరు. ఎపిసోడ్ ముగుస్తుంది. గడియారం దొరికిందా లేదా చెప్పను. నేను మరి ఇల్లంత తిరగబెడితే, వాడకుండ దాచేసిన పాత కొత్త కళాఖండాలు బయటపడినయి. వాటిలో ఒకానొక ‘్భగవద్గీత’ హస్తశిల్ప చిత్ర, నా తలకాయ చిత్తరువు ఉన్నది. అది నాకు ఎక్కడో దూరాభారం చోట యిచ్చినరు. దీన్ని వీడు ఎట్ల ఇంటికి చేరుస్తడు అని వారు, అనగా ఇచ్చినవారు ఆలోచించలేదు. ఇంతకు నాకు ఈ భగవద్గీత దృశ్యము పట్ల ఆసక్తి ఉందని, ఉంటుందని ఎందుకు అనుకున్నది అన్నది కనీసము నాకు అంతుచిక్కని ప్రశ్న! ఆ బొమ్మను ఇంటికి చేర్చేలోపల, దానికి చుట్టున రక్షణ పొర వంటి, పారదర్శక ప్లాస్టిక్ పగిలిపోయింది. ఎట్లాగూ పనె్నండు బొమ్మల విషయంలో మనసు వికలమయి ఉంటిని గనుక, దానికి మరమ్మతు చేసేందుకు, చేసేటందుకు, చేయుటకు, చేయడానికి పూని, పారదర్శక ప్లాస్టిక్ కాగితము పొర కొని తెచ్చిన. స్టిక్కర్ టేప్ ఇంట్లోనే ఉన్నది. మొత్తానికి భగవద్గీత గోడకు ఎక్కింది. దాన్ని పరిశీలిస్తుంటే, నాకు అనుమానాలు, గుర్రాల గురించి, రెండే చక్రాలున్న రథం బ్యాలెన్స్ గురించి, వెనుక దిక్కుపడిన అర్జునుని బాణాల గురించీ. ఆ సంగతి పోనీయండి. ఇంతకూ నా పనె్నండు బొమ్మల ఎల్ ఐ సీ కాలెండర్లు దొరికేనా!
*

కె.బి. గోపాలం