లోకాభిరామం

ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానలు వస్తాయనుకున్నప్పుడు రావు. రావేమో అనుకున్నప్పుడు వచ్చి ముంచుతాయి. 2016 అనే ఈ సంవత్సరంలో ఏప్రిల్‌లో ఎండలు మండిపోయాయి. మామూలు ఫొటో ఇంత బాగుంటే ఎక్సరే ఫొటో మరెంత బాగుంటుందో అన్నట్టు మే, జూన్‌లలో ఎండలు ఎలాగుంటాయని ఆలోచించి అందరమూ భయపడ్డాము. కానీ అనుకోకుండా మేలో వానలు వచ్చాయి. అడపాదడపా వచ్చిన వానలతో ఎండల తాపం తగ్గింది. ఇంతకూ ఎండలు మండడం, ఆ తరువాత జూన్‌లో మొదలయి వానలు కురవడం ఒక్క మన దేశంలోనేనని, ప్రపంచంలో మరెక్కడ ఈ పద్ధతి ఉండదని ఎంతమందికి అర్థమయింది. సైన్స్ రాతలు మొదలుపెట్టిన తొలి రోజుల్లో నేనొక పత్రికలో రుతుపవనాలను గురించి వ్యాసం రాశాను. అది ఆదివారం అనుబంధంలో అచ్చయింది. దానికి ఒక ప్రసిద్ధ కవి సంపాదకుడుగా ఉండేవారు. ఆయన సోమవారం ఆఫీసుకు రాగానే సంబంధిత సబ్ ఎడిటర్‌ను పిలిచారట. ‘ఈ వ్యాసం రాసిన మనిషి ఎవరయ్యా? నేను వెంటనే చూడాలి, పోదాం పద!’ అన్నారట. సబ్ ఎడిటర్ వినయంగా ‘అయ్యా మీరు బయలుదేరి వెళ్లవలసినంత పెద్దమనిషి ఏమీ కాదతను. నేను పిలుస్తాను. సాయంత్రం వస్తాడు లెండి’ అన్నాడట. ఆ సబ్ ఎడిటర్ నాకు మిత్రుడు. అతను కబురు పెట్టాడు. నేను వెళ్లాను. నన్ను చూడగానే ఆ పెద్దాయన లేచి నిలబడ్డారు. ‘బాబు, పెద్దవాడిని అయిపోయాను. అయినా సరే ఈ వానలు ఎలా వస్తాయన్న వైనం ఇన్నాళ్లు నాకు తెలియదు. నీవు అరటిపండు ఒలచి పెట్టినంత వివరంగా రాశావు. నీకు ధన్యవాదాలు చెప్పాలి అనిపించింది’ అన్నారు కూడా. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అర్థమయిన చోటికి వానల సంగతి రాశాను అంతే. అది ఆ పెద్దాయనకు అంతగా ఆనందం కలిగించడం నాలో మరింత రాయాలన్న కోరికను మాత్రం పెంచింది. అలుపు ఎరుగకుండా ఇవాళటి వరకు రాస్తూనే ఉన్నాను. అర్థమయింది అనుకున్న సైన్స్‌ను గురించి ఎక్కువగా రాస్తున్నట్టున్నాను.
‘తుల్య నిందా స్తుతిర్మౌనేః’ అని ఒక మాట ఉన్నది. వౌనంగా ఉండేవారికి, అంటే మునులకు పొగడినా, తెగడినా ఒకే రకంగా ఉంటుందట. కనీసం ఉండాలట. పొగడుతుంటే తెలిసిపోతుంది. కొన్నిచోట్ల అందంగా తిడితే అర్థంకాదు. అందుకే రెండుచోట్లా నోరు మూసుకుని ఉండడం చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతి గురించి సంస్కృతంలో ఒక గొప్ప పుస్తకంలో రాస్తారని నాకు తెలియదు. అది నేను కాదు గదా మా తాతగారు పుట్టకముందే రాశారు. ఆ సంగతి అంతకన్నా తెలియదు. ఎవరన్నా ‘శెభాష్’ అంటే వెర్రిముఖం వేయడం చిన్నప్పట్నుంచి అలవాటు. భుజాలు పొంగడం, ఏనుగు ఎక్కడం, కొండను ఎక్కడం లాంటివన్నీ తరువాత తెలిశాయి. అయినా తప్పించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాను.
మా ఊళ్లో మా వాళ్లవి రెండే ఇళ్లు. మాది ఇవతలి ఇళ్లు అయితే, తాతగారి వాళ్లది అవతలి ఇళ్లు. ఈ తాతగారు తాతగారే గానీ మా స్వంత తాతగారు కాదు. ఆయన మంచి పండితులు. కానీ వ్యవసాయం తో బతుకు తున్నారు. తాను చదువుకున్న విషయాలను మరొక నలుగురికి చెప్పాలని ఆయన తపన పడేవాడని నాకు తరువాత అర్థమయింది. సాయంత్రం బడి నుంచి వచ్చిన తరువాత తినగలిగిందేదో తిని ఇక ఆడడానికి పిల్లల కొరకు అవతలి ఇంట్లోకి పోవడం అలవాటు. తాతగారు నన్ను ప్రేమగా పిలిచేవారు. ‘గోపన్నా! పిల్లలందరికీ నేను చెప్పే సంగతులు అర్థంకావురా! నీవు కూచో, నీకు చెపుతాను!’ అని ఆయన శ్లోకాలు, పద్యాలు చదివి వ్యాఖ్యానం వినిపిస్తూ ఉంటే నాకు చాలా బాగుండేది. తాతగారు చదివిన వసుచరిత్ర పద్యాలు నా చెవుల్లో ఇవాళటికి ప్రతిధ్వనిస్తుంటాయి. తాతగారికి చెప్పాలని కోరిక, నాకు వినాలని కోరిక ఉందో లేదో అప్పట్లో అర్థం కాలేదు గానీ అర్థం లేని ఆటకన్నా ఆయన ముందు కూచోవడం బాగుండేది. తాతగారు నాకు పాఠంలాగ చెపుతూ ఉంటే అది నాకు ఆయన ఇస్తున్న కితాబు అని అర్థంకాలేదు. కితాబు అని మామూలుగా అంటే పుస్తకం అని అర్థం. ఆ ‘క’ అక్షరాన్ని కొంచెం గరుకుగా పలికితే వచ్చే కితాబు అన్న మాటకు పొగడ్త లేదా మన్నన అని అర్థం. ఎంతమందికి తెలుసు.
పల్లె బడిలో నాకు పొగడ్తలు అలవాటయిపోయినయి. పద్యాల పోటీలో ప్రత్యర్థి పది చదివితే నేను ఆపకుండా శతకం మొత్తం చదవడం గుర్తుంది. బహుమానం తీసుకోవడమూ గుర్తుంది. అయితే అది పల్లె. ‘వృక్షములు లేని దేశమున ఆముదపు చెట్టు మహావృక్షము’ కనుక పల్లెలో నేనే గొప్పవాడిని. ఇక పాలమూరు బడిలో సంఖ్య పెరిగింది అంతేకానీ సంగతి పెరగలేదని కొంతకాలానికి అర్థమయింది. ఎనిమిదవ తరగతిలో ఉండగా జిల్లా స్థాయి పోటీలో పై తరగతుల వారితో కూడా పోటీ పడి ఉపన్యాసాలలోను, వ్యాస రచనలోను మొదటి బహుమతులు అందుకున్నాను. ఆ తతంగం మరొక బడిలో జరిగింది. మరుసటి నాడు ఉదయం ఆ ‘సనదు’లతో బాటు బడికి వెళ్లాను. సనదులంటే సర్ట్ఫికేట్‌లు లేదా ప్రమాణ పత్రాలు. ప్రార్థన ముగిసిన తరువాత ప్రధానోపాధ్యాయులు అప్పరుసు శ్యామసుందరరావుగారు నన్ను వేదిక మీదికి పిలిచారు. బడిలో వాళ్లందరూ అక్కడ ఉండగా నా గురించి గొప్పగా మాట్లాడారు. నా సంతోషమల్లా నాన్న కూడా అక్కడ ఉన్నాడని. మళ్లీ ఆయన సర్ట్ఫికేట్‌లను నాకు అందిస్తుంటే నేను ఏడ్చానట. ఆ సంగతి నాన్న చెప్పాడు. ఏడుపు ఎందుకు? నాకు ఇవాళటి వరకు అర్థం కాలేదు. వాటిని ఆనంద భాష్పాలు అంటారా? అంతకన్నా అర్థంకాలేదు.
శ్యామ సుందరరావు గారు ఎంఎల్‌సిగా పని చేశారు. నాకు ఆయనకు వయసు పెరిగిన తరువాత కలిశారు. ఒక సభలో ఆయన వేదిక మీద ఉన్నారు. నేను ప్రేక్షకులలో ఎక్కడో కూచుని ఉన్నాను. రావుగారు మైకు అందుకుని ‘గోపాలంగారు వేదిక మీదకు రావాలి’ అని గట్టిగా పిలిచినప్పుడు మాత్రం నాకు మళ్లీ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఈసారి ఆయన వాత్సల్యం కారణం.
ఎం.ఎస్‌సి పరీక్ష రాస్తున్నప్పుడు ఒక్క పేపర్‌లో 120 పేజీలు రాసినట్టున్నాను. రాశాను. ఆ రోజున నాగేశ్వరరావుగారు అనే ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. అందరికీ ఇచ్చిన మొదటి ఆన్సర్ బుక్‌ల నంబర్‌లు నమోదు చేయడం ఆయన ముగించే లోపలే నేను అడిషనల్ కొరకు లేచి నిలబడ్డాను. ఆ తరువాత తీసుకున్న పదకొండు అడిషనల్స్‌కి నేను లేవవలసిన అవసరం రాలేదు. ఆయన ముందే కాగితాలను బల్లమీద పెట్టసాగారు. వాటన్నింటినీ కుట్టి ఇచ్చిన తరువాత వీపులో తట్టి ‘గ్రంథం రాశారు’ అన్నారు. ఆయన మెప్పికోలు నాకు గోల్డ్‌మెడల్ ఇప్పించింది.
తెలిసీ తెలియక రకరకాల రంగాలలో రకరకాల పనులు చేశాను. జగమెరిగిన శతవర్ష సుందరుడు బాలాంత్రపు రజనీకాంతరావుగారు రవీంద్రభారతిలో ఒక కార్యక్రమం తరువాత ఎవరినో వెతుకుతూ అటుఇటూ తిరుగుతున్నారు. సంగతి తెలుసుకుందామని నేను ముందుకు వెళ్లాను. ఆయన నన్ను గట్టిగా కౌగిలించుకుని అన్న మెప్పికోలు మాటలు నాకు గుర్తు లేవు. ఆ సంతోషం మాత్రం కలకాలం గుర్తుంటుంది. భుజాలు పొంగినయా, ఏనుగు ఎక్కానా? కొండ ఎక్కానా? లేదుగాక లేదు. ఆ భావమే దగ్గరకు రాలేదు.
అన్నిటికన్నా నాకు గుర్తిండిపోయే సంఘటన ఒకటి ఉంది. బోన్‌గీర్ అనే భువనగిరి డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశాను. రెండు బ్యాచ్‌ల వాళ్లకు పాఠాలు చెప్పాను. చివరికి మరొకచోట జంటనగరాలలో ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి వచ్చేసే రోజు. విద్యార్థులు వీడ్కోలు సభ అన్నారు. ఎందుకాగోల అని నేను అడిగాను. వాళ్లు పట్టువదలలేదు. ప్రిన్సిపల్‌గా తాత్కాలికంగా పని చేస్తున్న శ్రీనివాస్‌గారు కూడా సమావేశానికి వచ్చినట్టు గుర్తు. పిల్లలు ఒకరి తరువాత ఒకరు నన్ను పొగడ్తల వెల్లువలో ముంచెత్తారు. వాళ్లలో కొందరు మాట్లాడలేక కంటతడి పెట్టడం కూడా గుర్తుంది. శ్రీనివాస్‌గారు ‘మీరు ఇంత పాపులర్ అని నాకు తెలియదు. సైన్స్ చెపుతారుగానీ మిగతా విభాగాల విద్యార్థులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారని నాకు అర్థమయింది’ లాంటి మాటలేవో అన్నారు. అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటివేపు నడక సాగించాను. కొంతదూరం తరువాత చూస్తే మొత్తం కాలేజి నా వెంట నడుస్తున్నది. అందరూ నా ఇంటి దాకా వచ్చారు. అక్కడ మళ్లీ ఒక్కొక్కరూ వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారు. నా గుండె బరువెక్కింది. వీళ్లందురూ చూపిన ఆదరణ ఒక ఎత్తయితే, నా దగ్గర పని చేసిన శ్యాంసుందర్ ఆ తరువాత వచ్చి నా తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు.
మెప్పికోళ్లు తలకు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ తీరు కొనసాగించమని మన బాధ్యతను అవి గుర్తుచేస్తున్నాయి అనుకోవాలేమో!

chitram...
బాలాంత్రపు రజనీకాంతరావు

కె.బి. గోపాలం