లోకాభిరామం

సత్యం - అసత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి సంక్రాంతి పండుగకు నల్లగొండలో ఉన్నాను. అప్పటికి నేను రేడియోలో పని చేస్తున్నాను. ఆ సంవత్సరం పండుగ ఈనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలామందికి వచ్చింది. ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు. కానీ సంప్రదాయ పనులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు. రేడియో అన్నది ప్రభుత్వం వారి బాకా కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ ఫలానా నాడు అని వివరాలను ప్రకటించాను. వ్యక్తిగతంగా మాత్రం పాత పద్ధతులను పాటిస్తున్నాను కనుక పండుగ నేను ప్రభుత్వం చెప్పిన నాడు చేసుకోవడం లేదు. పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేది. ఆమె ఆదరాబాదరాగా వచ్చింది. మా ఆవిడను నిలదీసి పండుగ ఇవ్వాలంట కదా, రేడియోలో చెబుతున్నారు, అని అడుగుతున్నది. నేను ఆమెను పిలిచాను. అమ్మా, ఎవరు చెబుతున్నారు అని అడిగాను. ఒక క్షణం ఆలోచించి ఆమె, అయ్యో అది మీ గొంతు అన్నది. తరువాత వాళ్లు పండుగ ఏనాడు చేసుకున్నారో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో సత్యాలు అలా ఉంటాయి.
రచయితగా కొనసాగుతున్నాను. కథలు కాక సత్యాలు రాస్తున్నాను అనుకుంటున్నాను. కనుక ఏ రెండు అక్షరం ముక్కలు కాగితం మీద పెట్టినా వాటిలోని సత్యాసత్యాలను గురించి గట్టిగా ఆలోచించాలి అన్న ఒక పద్ధతి మెదడులో గట్టిగా పాతుకుపోయింది. ఏదో రాస్తాము. సందర్భానికి తగినట్టుగా బహుశా రాసి ఉంటాము. కొంతకాలం తరువాత ఆ పరిస్థితులు మారుతాయి. అప్పుడు మనం రాసిన సంగతులు సత్యం కాకుండా పోతాయి. ఎవరో వచ్చి అప్పటి రాతల గురించి అడుగుతారు. చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.
సత్యాలు లక్షల కొద్దీ ఒకచోట చేర్చినా వాటివల్ల ఏ ప్రయోజనం ఉండదు అని ఎక్కడో రాసి ఉండటం చదివాను. ఇంగ్లీషులో ట్రీవియా అని ఒక మాట ఉంది. అవి సత్యాలే. కానీ ఎవరికి పనికి వస్తాయో తెలియదు. వాటిని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉందా లేదా కూడా తెలియదు. అయినా అవి సత్యాలు. బహుశా సరదాగా ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం దీనికి విపరీతమైన పద్ధతిలో జరుగుతున్నది.
పొద్దునే్న వార్తాపత్రిక వస్తుంది. అందులో రకరకాల సంగతులు రాసి ఉంటాయి. ఆ వార్తాపత్రిక కలకాలం ఉండిపోతుంది. కానీ అందులో రాసిన సంగతులు కొన్ని సత్యాలు కావు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక ప్రమాదం జరుగుతుంది. అందులో హతులైన వారి సంఖ్యను ఏ రెండు పత్రికలూ సమానంగా చూపించవు. ఆ తేడా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. ఎవరికి అనుకూలంగా ఉండే విషయం, అందుబాటులో ఉండే విషయాన్ని వారు చెబుతారు అని నా అనుమానం. రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని అందరూ చూస్తారు. మరునాడు దాన్ని గురించి పేపర్లో వస్తుంది. అక్కడ జరిగింది ఒకటైతే, దాన్ని గురించి రాసిన తీరు మరొకటిగా ఉంటుంది. పరిస్థితి అలాగ ఉందని ముందుకు వచ్చి ప్రశ్నించే వారు ఉండరు. నేను ఒక బిల్డింగ్‌లో, నా ఇంట్లోనే ఉన్నాను. ఆ బిల్డింగ్‌లో కింద ఖాళీగా ఉండవలసిన ప్రాంతాన్ని యజమాని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. మునిసిపాలిటీ వాళ్లు వచ్చారు. గోడలో 4 ఇటుకలు పడగొట్టారు. ఆలోగా యజమాని వచ్చి వారి పద్ధతిని మార్చే ప్రయత్నం ఏదో చేసినట్టు ఉన్నాడు. గోడ సలక్షణంగా అలాగే ఉండిపోయింది. మరురోజు పత్రికలో కింద సెల్లార్ పూర్తిగా పడగొట్టినట్టు వార్త వచ్చింది. గోడలు పడగొట్టే బాధ్యతగల మున్సిపాలిటీ వారు అటువంటి వార్తలు పత్రికకు అందజేశారు. వారు సత్యాసత్యాలను తెలుసుకోకుండా ప్రచురించారు. నేను ప్రయత్నించి ఆ పత్రికకు ఫోన్ చేశాను. అక్కడి వారు నన్ను దుర్భాషలాడారు కానీ, అసలు విషయం వినడానికి కూడా ప్రయత్నించలేదు. పత్రిక శాశ్వతంగా నిలబడి పోతుంది. అందులోని అబద్ధం శాశ్వతంగా నిలబడిపోతుంది. కూలినట్టు రాసిన ఆ గోడ కూడా శాశ్వతంగా నిలబడి ఉంది. ఇది ఈనాటి సత్యం.
సత్యం వెనుక ఒక తత్త్వం ఉంటుంది. పత్రికలో వచ్చింది తెలుసా? అనే మాట నేను చాలాసార్లు విన్నాను. అంటే పత్రికల్లో వచ్చేవి అన్నీ సత్యాలు కావు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని కదా అర్థం! ఇక విషయానికి వస్తే, అవి పత్రికలకన్నా వేరుగా ఉంటాయి అని నేను అనుకోను. చాలా విషయాలు ఇట్లాగే అరకొరగా పుస్తకాలలోకి చేరుకుంటాయి. అవి శాశ్వతంగా నిలబడతాయి. తర్వాతి ప్రపంచాన్ని మోసపుచ్చుతాయి. జరిగిన విషయాలను జరగనట్టు, జరగని విషయాలను జరిగినట్టు చరిత్ర చెబుతూ ఉంటుంది. కనుక చరిత్రను నమ్మడానికి లేదు. చరిత్ర అన్నది నిజంగా సత్యం అయితే ప్రపంచం ఇలాగే ఉండేది కాదు. చరిథ్ర ఎవరు చెప్పారు? ఏ ప్రయోజనం కొరకు చెప్పారు అన్న దాన్నిబట్టి అందులోని సత్యాసత్యాల నిగ్గు తేలవలసి ఉంటుంది. బ్రిటిష్ వారు భారతదేశపు చరిత్రను తమకు అనుకూలంగా రాసుకున్నారు అన్న వాదం బలంగా ఉంది. అసలు చరిత్రను గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరికీ ఉన్నట్టు కనిపించదు. కనుక ఎవరు చెప్పినది అయినా మొత్తానికి ఒక చరిత్ర చెలామణి అవుతూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల వారు భారతదేశపు చరిత్రను విస్తృతంగా రాయించి పుస్తకాలుగా వేశారు. వాటన్నిటినీ కాకున్నా కొన్నిటిని చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలను గురించి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, అర్థంకాదు. చరిత్రలో మధ్యన ఖాళీలు కనిపిస్తాయి. వాటికి కారణం మాత్రం ఎవరూ చెప్పరు. వెండీ డోనిగర్ అనే ఆవిడ భారతదేవపు గతం గురించి ఒక పుస్తకం రాసింది. అది నాకు చాలా పక్షపాత దృష్టితో రాసినట్టు కనిపించింది. అట్లా రాయవలసిన అవసరం ఏమిటో తెలియదు. అలాగే ఇర్ఫాన్ హబీబ్, రొమిల్లా థాపర్, మరొక ప్రసిద్ధ బెంగాలీ చరిత్రకారుడు మొదలైన వారి పుస్తకాలన్నీ అవి ఇంకొక ధోరణిలో ఉంటాయి. అన్నీ చదువుతూ ఉంటే అసలు సంగతి ఏమిటి అన్న అనుమానం మొదలవుతుంది.
కొన్ని సత్యాలు, అసత్యాలుగా రుజువయ్యే వరకు మాత్రమే నిలబడి ఉంటాయి అన్న పద్ధతి ఒకటి ఉంది. సైన్స్‌లో ముఖ్యంగా శాశ్వత సత్యాలు ఉండవు అంటారు. సైన్స్ అంటే సత్యాల పరంపర అని కూడా వాళ్లే అంటారు. సూచించిన పదధతులలో మాత్రమే, ఈ విషయాలు సత్యాలు అన్న ఒక రైడర్ ప్రతి సత్యం మీద ఉంటుంది. నీరు నూరు డిగ్రీల వద్ద మరుగుతుంది, అన్నది ఒక సత్యం. కానీ ఆ స్థలంలో వాతావరణ వత్తిడి ఎంత ఉంది అన్న దాన్నిబట్టి ఈ సత్యం మారుతూ ఉంటుంది. అంటే అది శాశ్వత సత్యం కాదు. మరొక విధంగా రుజువయ్యే వరకు మాత్రమే సత్యాలు అనేవి మరికొన్ని ఉన్నాయి. ఐన్‌స్టైన్ ఓ సిద్ధాంతం చేశాడు. అందరూ అవును అంటూ ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి మరొక పరిశోధకుడు వచ్చి, ఆయన చెప్పింది నిజం కాదు తెలుసా అంటాడు. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. చరిత్ర విషయంలో కూడా ఇటువంటి పద్ధతిని పాటించవచ్చు అంటే కొంచెం చిక్కులు వస్తాయి. కొన్ని సంగతులు అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఎవరూ ముందుకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పడానికి సిద్ధం కారు. అందుకు సామాజిక కారణాలు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఆ విషయం గురించి సత్యాన్ని నిరూపించవలసిన అవసరం కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు. అందరికీ తెలిసిన ఆ సత్యం అలాగే బయటపడకుండా నిలబడిపోతుంది.
వ్యక్తిగతమైన అంశాలలో ఇటువంటి పరిస్థితి మరీ ఎక్కువగా వస్తుంది. నా విషయంలోనే నాకు కొన్ని సంగతులు తెలుసు. నేను వాటిని ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. చెప్పనందుకు ఎవరికీ అపకారం కూడా జరగదు. కనుక నేను వాటిని బయటకు చెప్పను. ఒకవేళ చెబితే అది కొంతమందికి ఆసక్తికరంగా ఉండవచ్చు. మరి కొంతమందికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయినా నేను కొన్ని సంగతులు బయటపెట్టను. ఆ సత్యం నాలోనే మిగిలిపోతుంది. నాకు చాలా రోజులుగా కథలు నవలలలో ఎదురైన కొన్ని సంగతులను గురించి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. బుచ్చిబాబుగారి చివరకు మిగిలేదిలో దయానిధికి, కోమలికి మధ్యన శరీర పరంగా ఎటువంటి సంబంధం లేదు. మానసికంగా ఏమి ఉందో ఎవరికీ అర్థం కాదు. అమృతంతో ఏం జరిగింది అన్నది బయటపడదు. ఇదే రకంగా ప్రపంచ విఖ్యాత రచయిత ఆల్బర్ట్ కామూ నవలలో కూడా చిత్రమైన పరిస్థితులు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నాయకుడు అమాయకుడు అని పాఠకునికి తెలుసు. కథలోని వారికి మాత్రం తెలియదు. కనుక కథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అందరూ అతడిని అసహ్యించుకుంటారు. మనకు అసలు సత్యం తెలుసు గనుక, ఆ అసహ్యించుకునే వారి మీద కోపం పుడుతుంది. రచనకు రూపం పోయడంలో ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఉండదు అనిపిస్తుంది. ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలను. కనుకనే నాకు సత్యం గురించి గట్టి ఆలోచనలు పుడుతుంటాయి.
తెలుగు సినిమాలలో, బహుశా ఇతర భాషలలో కూడా, ఒక వ్యక్తి ఒక సత్యం చెప్పనందుకు మొత్తం సినిమా నడుస్తుంది. అవి నేను బెనారస్‌లో చదువుకుంటున్న రోజులు, అంటూ ముఖం మీద రింగులు చూపించి అసలు సత్యం బయట పెడతారు. అప్పుడు కథ ముగుస్తుంది. సత్యాలు నిజంగా ఉంటాయా అన్న అనుమానం నాకు కలుగుతుంది. పదుగురాడుమాట పాటియై ధర చెల్లు అని ఒక మాట ఉంది. అందరూ కలిసి అదే పనిగా ఒక సత్యాన్ని లేదా అసత్యాన్ని బలంగా నమ్మి ప్రచారం చేయడం మొదలుపెడతారు. అప్పుడు సత్యంగా మిగిలిపోతుంది. కలియుగమున శక్తి మొత్తము సంఘములోనే ఉన్నది అని అర్థం వచ్చే ఆర్యోక్తి ఒకటి మనకు ఉండనే ఉంది. అంటే ఈ సంఘం అనే విషయాన్ని సత్యంగా ముందుకు తీసుకుపో దలుస్తుందో దాన్ని మాత్రమే సత్యంగా గ్రహించవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఉన్నాడు అన్నారా ఇటువంటి సత్యానికి మొదటి ఉదాహరణ అని నా అభిప్రాయం. దేవుడు అంటే దేవులాట అనే పని చేయడం. అంతే వెతకడం. దేవుడు అంటే వెతకడం అని అర్థం. ఇక్కడ మార్గమే గమ్యం. ఆ దేవులాట ముగిసి దేవుడు దొరికితే ఆ తర్వాత ఏం చేయాలి? అది సమస్య! కనుక కలకాలం దేవులాట సాగాలి.
ఒకరికి సత్యంగా తోచింది మరొకరికి అసత్యంగా తోచే అవకాశం ఉంటుంది. ఇద్దరు వాదించుకుంటున్నారు. మూడవ మనిషి వచ్చాడు. మీ మధ్యన మూడు సత్యాలు ఉన్నాయి. మీరిద్దరూ ఎవరికి వారు నమ్ముతున్నవి అయితే మీరు కలిసి చేరవలసిన అసలు సత్యం మూడవది అన్నాడు ఆ మూడో మనిషి. అతనికి కూడా 3 సత్యాలలో ఏదీ తెలియదు. వీళ్లు తమతమ రెండు సత్యాలను చెప్పినప్పటికీ అతని బుద్ధి ప్రకారం వాటిలో ఒకదానిని ఎంచుకోగలదేమో కానీ, అసలైన మూడవ సత్యం ఉంది అని అన్నప్పటికీ దాన్ని అతను చూడగలుగుతాడా? అన్నది అసలు ప్రశ్న. అన్ని విషయాలు, అన్ని సత్యాలు నూటికి నూరుపాళ్లు సత్యం కావడానికి వీలు లేదు. కొన్ని మాత్రమే పూర్తి సత్యాలు కలుగుతాయి. మరికొన్ని పాక్షి సత్యాలుగా ఉంటాయి. కల్తీ కలిసినప్పుడు ఒక సత్యం, సత్యంగా నిలబడడం కష్టమవుతుంది.
అందరికీ అనుకూలంగా వినిపించని ఒక విషయం చెబుతాను. ఈ మధ్యనే యూరోపు దేశాల నుంచి వచ్చిన ఒక అపరాధ పరిశోధక నవల చదివాను. మొదటి నుంచి నాకు మెదడులో ఈ విషయం గురించి ఆలోచన ఉన్నా దాన్ని మరీ ముందుకు తీసుకుపోలేదు. విషయం చెప్పిన తరువాత మీకే అర్థం అవుతుంది. ఒక వ్యక్తికి తల్లి ఎవరు అన్న సంగతి నూటికి నూరు శాతం నిజంగా తెలిసి ఉంటుంది. అందులో ఏ మాత్రం తేడా రావడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తికి తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సాంఘిక మర్యాద ప్రకారం అంగీకరించవలసినదే. కానీ ఆ తల్లి నోరు విప్పి చెప్పే దాకా అసలు విషయం బయటకు రాదు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ల అందరినీ నేను అనుమానించడం లేదు. కానీ చాలామంది ఈ రకమైన పరిస్థితులకు గురి అయినట్లు నాకు గట్టి అనుమానం. వ్యవస్థలో ఎంతటి గట్టిదనం ఉన్నప్పటికీ మనుషుల మెదడులో మాత్రం అది ప్రతిబింబించదు. ఆడ మగ ఆనాటి నుండి ఈనాటి వరకు తమ ఇష్ట ప్రకారం లైంగిక జీవితాలు గడుపుతున్నారు. సమాజంలోని సమస్యలకు సగం వరకు లైంగిక సంబంధాలే కారణం అని మానసిక శాస్తవ్రేత్తలు కూడా ఒప్పుకున్నారు. పురాణ కాలం నుంచి మొదలు ఇవాళటి వరకు ఇటువంటి పరిస్థితులను గురించి మనకు కావలసిన అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సినిమాల గురించి నేను చేసిన ప్రసక్తి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక భాగంగా నిలబడుతుంది. సత్యం అన్నది సంపూర్ణ సత్యమా, సాపేక్ష సత్యమా, అన్న ప్రశ్న వచ్చిన తరువాత అది సత్యమే కాదు.

-కె.బి.గోపాలం