లోకాభిరామం

సాదత్ హసన్ మంటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్ హసన్ మంటో ఉర్దూలో పెద్దఎత్తున కథలు రాసిన మహా రచయిత. మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు తెలుగులో వందకు పైన వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది. ఆ కథలు మంటోలాగే మనుషుల మధ్యన ఉండి కూడా మనుషులకు దూరమయినట్టు భావన కలిగింది. మంటో భారతీయుడు. స్వాతంత్య్రం తరువాత అప్పటి దారుణ పరిస్థితులను గురించి, దేశం విడిపోవడం గురించి, మరీ బట్టబయలుగా కథలు రాసి సంచలనం సృష్టించాడు. కోర్టులపాలయ్యాడు. చివరికి దేశాన్ని వదిలి పాకిస్తాన్ పారిపోయాడు.
మంటో మన దేశంలో ఉండకపోవడం ఒక రకంగా మనకు నష్టం. పేరులో మాత్రమే అతని మతం కనిపిస్తుంది. అతని అభిమతం మాత్రం పూర్తిగా వేరు. సంస్కృతి అంతకన్నా వేరు. అది అతని రచనల్లో కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇక్కడ కొట్టవచ్చినట్టు అన్న మాట అక్షరాలా నిజం. ఉన్న కొద్దిపాటి ఉర్దూ పరిచయంతో మంటో కథల పరిచయం కూడా కలిగింది. ‘ఖోలో’ లాంటి కథలు ముఖంలో పిడిగుద్దు గుద్దినట్టు వచ్చి తగిలాయి. అందరిలాగే ‘టోబా టేక్‌సింగ్’ నాకు కూడా కలకాలం గుర్తుంటాడు. మంటో కథలు అన్నీ ఇంత మొరటుగాను, ఇంత మొనగలిగినవిగాను ఉండవు. కొన్ని మెత్తగానే చెప్పవలసిన సంగతులను తలకెక్కిస్తాయి. ఈ రచయిత కథలు తెలుగులో వచ్చి ఉంటే, వాటి గురించి చర్చ జరగకపోవడం మాత్రం గొప్ప అన్యాయం. సమాజంలో ఉన్న కుళ్లు గురించి తెలియకుండానే బతుకులు సాగుతాయి. గతంలో, ప్రస్తుతం ఉన్న కుళ్లును ఏ రకంగా ఎత్తిచూపినా, దాని గురించి చర్చ మొదలుకావాలి. చాలామంది రచయితల బాధ ఇదే. ఎత్తిచూపని సమస్యలు చివరకు అన్ని రకాలా తెరమరుగవుతాయి. అది జరగకూడదనే రచయితలందరూ గొంతెత్తి ఘోషించారు. గోల చేశారు. బాధలను గమనించిన ఈ రచయితలు వాటిని మనసులో దాచుకోకుండా అందరికీ పంచి ఇచ్చారు. మంచి మాత్రమే పంచడం ఒక పద్ధతి అయితే, చెడును ఎత్తిచూపి మంచి దారులు ఉండాలని సూచించడం మరో ఎత్తు. పూలు, వెనె్నలను గురించి పాటలు రాసుకుంటే అభ్యంతరం లేదు. కానీ, చీకటి గురించి చెప్పి చిరు దీపం అందించిన రచయితలను మనం మరింత ఎక్కువగా గుర్తుంచుకోవాలి.
సాదత్ హసన్ మంటోను పాకిస్తానీ రచయిత అంటున్నారు. అతను రాసిన ఉర్దూ ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న ఉర్దూ ఒకటి కాదు. కానీ, మంటో కాలంలో ఆ యాస భాష మన దగ్గర కూడా మాట్లాడుకున్నదే! చివరకు అప్పటి సినిమాల్లోనూ ఆ భాష ఉండేది. మంటో కథలను నాటకాలుగా మలిచి నసీరుద్దీన్ షా లాంటి వాళ్లు ప్రదర్శిస్తున్నారు. అసలు కథలను చదివినా, ఆ భాషను విన్నా, అది మన హిందూస్థానీకి చాలా దగ్గరగా ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది. అక్కడక్కడ మాత్రం మన సమాసాల వంటి కొన్ని మాటలు అందంగానే ఎదురవుతుంటాయి. అవి బహుశా ఈ కాలం అనువాదకులకు సులభంగా లొంగవు. మంటో భారతీయ రచయిత. భారతీయ సమస్యలను ఎత్తి భారతీయ పాఠకుల కొరకు భారతీయ భాషలోనే రాశాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. చెప్పవలసిన అవసరం ఉంది కూడా! మంటో కథలు మరిన్ని రావాలి. సంకలనాలు రావాలి. వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి.
మంటో మన దేశం వదిలి వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. అలాగని ఆ మహా రచయితను మనం వదిలివేసుకోవడానికి లేదు. పారిపోయే నాటికి మంటోకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అతను ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఉండేవాడు. దేశం విడిపోయిన తరువాత మాహీమ్, భెండీ బజార్లలో జరిగిన ఘాతుకాలను గురించి అతను కథలలో రాశాడు. నిజానికి ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఇంకా ఇక్కడే మిగిలిన వాళ్ల గురించి ఆలోచనలు మొదలవుతాయి.
మంటో ఎక్కువగా చదువుకున్న వాడు కాదు. అసలు అతనికి చదువు మీద పెద్ద పట్టింపు లేదు. కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది. తండ్రి గతించిన తరువాత మంటో పత్రికా రంగంలో పని వెతుకుతూ బొంబాయి చేరుకున్నాడు. పత్రిక ఆఫీసుల్లోనే పడుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలలో కొంచెం పని దొరికింది. అయితే, సినిమాల్లో అతని రచనలు పేరు సంపాదించలేదు. నిలదొక్కుకోవడానికి చోటు అసలే దొరకలేదు. అతను రాసిన సినిమాలన్నీ భయంకరంగా కుప్పకూలాయి! విచిత్రంగా మహానటుడు అశోక్‌కుమార్ లాంటి వారు మాత్రం అభిమానులుగా మిగిలిపోయారు. మంటో అప్పట్లో నిజంగా కుర్రవాడు. అయినా, బాబూరావ్ పటేల్ లాంటి పాత్రికేయులు అతడిని అభిమానించారు. అతని కథలను మెచ్చుకున్నారు. భారతదేశపు వౌపాసా అన్నారు.
అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులు మంటోకు మంచి కథా వస్తువులను అందించాయి. ఆ కథలలో భారతీయత నిండుగా కనిపించింది. కానీ, ఎంచుకున్న విషయాలు, వాటిని చెప్పిన తీరు మాత్రం కొంత కలకలానికి దారి తీశాయి. అతని కథలు అద్భుత మయినవి. కానీ, అంతే అసాధారణమయినవి.
పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయింది. చాలామంది ఇక్కడ కొనసాగలేక పాకిస్తాన్‌కు పారిపోయారు. తమస్ లాంటి రచనలలో ఆ పరిస్థితులు మామూలు టీవీ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాయి. కానీ, మంటో రచనలలో కనిపించిన లోతు మరింత ఎక్కువ. మంటో తన రచనలలో ఏ మాత్రం జంకకుండా తన మతం వారు చేస్తున్న ఘాతుకాలను కూడా వివరించాడు. నిరసించాడు. కథలు చదివిన వారికి ఆవిషయం సులభంగానే అర్థమవుతుంది.
మంటో 1912లో పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. తండ్రి పెద్ద పేరున్న బారిస్టర్. అతను మరీ మొరటు మనిషి. మారుటి తల్లి మాత్రం మంచిది. మంటో రచనల మీద మొదట్లోనే ఆ తల్లిదండ్రుల ప్రభావం కూడా కనిపించింది. మంటోలోని తిరుగుబాటు పద్ధతి అక్కడే మొదలయింది అనవచ్చు. ఇక అమృత్‌సర్‌లో అప్పటి పరిస్థితులు దారుణమయినవని వేరుగా చెప్పనవసరం లేదు. జలియావాలా బాగ్ గురించి చాలామందికి తెలుసు. అయినా, ఆ పరిస్థితిని మనసులో చిత్రీకరించుకున్న వారు ఎక్కువగా లేరని అనాలి. ఏడేళ్ల వయసులోనే సాదత్, ఆ సంఘటనను అర్థం చేసుకున్నాడు. అతనితోపాటు దేశంలో మరెంత మందో ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. జాతీయ ఉద్యమం బలం పుంజుకున్నది. అది మరింతగా ముందుకు సాగింది. సరిగ్గా ఆ కాలంలోనే మంటో ఆలోచనలు కూడా స్థిరపడసాగాయి. కుర్ర వయసులోనే అతను తిరుగుబాటుదారు మనస్తత్వంలో స్థిరపడిపోయాడు. అనుభవం లేకున్నా, ఎక్కడో చదివిన మాటలను అరువు తెచ్చుకుని ఆకర్షణ గల మాటలతో పోస్టర్లు తయారుచేయడంలో పాలుపంచుకున్నాడు. ఆస్కార్ వైల్డ్ రచనల నుంచి నినాదాలను ఎత్తుకువచ్చాడని పరిశీలకులు తరువాత చెప్పారు. యూరోపియన్ సాహిత్యం ప్రభావం భారతీయ రచయితల మీద అప్పట్లో బాగా ఉండేదని వాళ్లు సిద్ధాంతం కూడా చేశారు.
సాదత్ హసన్ మంటో కథలు చాలా అదుపులేకుండా ఉంటాయి. అవి బండ బూతులని అన్నవాళ్లే ఎక్కువ. ఇస్మత్ చుగ్తాయి లాగే ఇతను కూడా సంచలనాలకు కారణమయి కోర్టు దాకా వెళ్లాడు. అయినా, ఇద్దరిదీ ఒకటే పద్ధతి. నిజాన్ని ఉన్నది ఉన్నట్టు ఎత్తి చూపడం మా ధర్మం అంటారు ఇద్దరు.
మంటో మాటలు సూటిగా ఉంటాయి. అక్కడ తెరలు, పొరలకు చోటు లేదు. చెప్పవలసిన మాట చెప్పవలసిన బలంతో చెప్పడమే అతని రచనలలోని బలం! ఉదాహరణగా చెప్పడానికి లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. ఆ కథల గురించి ఎంత చర్చ జరిగినా తక్కువే. ‘దేఖ్ కబీరా రోయా’ (చూచి, కబీర్ ఏడ్చాడు) అన్న కథ నభూతో నభవిష్యతి. కథలో కబీర్ లక్ష్మి విగ్రహాన్ని చూచి ఏడుస్తాడు. కాలే కడుపులతో కూడా సైనికులు ఆజ్ఞలను పాటించవలసి వచ్చింది అని కూడా ఏడుస్తాడు.
మంటో గొప్ప కథలు తెలుగులో సంకలనాలుగా వచ్చినట్టున్నాయి. రాకుంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఆయన రచనల్లో అందరూ చదివి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద గట్టి చర్చలు జరగాలి. ఆ లోగా మంటో తీరు గురించి పరిచయం చేసుకోవడం సాహిత్యాభిమానుల, మానవతావాదుల కనీస కర్తవ్యం.

కె. బి. గోపాలం