లోకాభిరామం

ఎవరన్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనిషి ఉండటం మామూలే. మనిషిని పోలిన మనుషులు ఒకే ఊళ్లో ఉండనవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉండవచ్చు. నిజంగా మన లాంటి మనిషి ఎదురైతే మనకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ కొంచెం సైన్స్ పద్ధతిలో ఆలోచిస్తే, అన్ని రకాల మనలాంటి మనిషి మరొకరు ఉండడం కుదరదు అని అర్థం అవుతుంది. జన్యువులు ఇన్ని రకాలుగా ఉండి రకరకాల కలయికలతో వస్తూ ఉంటే, అచ్చంగా అదే వరుసలో మళ్లీ వచ్చే పద్ధతి అసలు కుదరదేమో కనుకనే, మనిషిని పోలిన మనిషి అంటే పోలికలు ఏమో కొంతవరకు మాత్రమే ఉంటాయి అనవచ్చు.
మనిషి శరీర లక్షణాలకు కారణం, లేదా అందుకు కావలసిన బ్లూ ప్రింట్ డిఎన్‌ఏ అనే జన్యు రసాయనంలో ఉంటుందని మనకు కనీసం ఇప్పుడు తెలుసు. ఇదంతా నేను చదువుకున్న విషయమే. అయితే నడకను బట్టి మనుషులను గుర్తించవచ్చు అంటే మాత్రం నాకు కూడా ఆశ్చర్యం కలిగింది.
చెవుల తీరునుబట్టి మని అదృష్టాన్ని చెప్పవచ్చును అన్న భావన మనవారికి చాలా కాలంగా ఉంది. పొడుగాటి చెవులు ఉండే వారికి తెలివి ఎక్కువగా ఉంటుంది అంటారు. ఈ విషయాలను పక్కనపెడితే ఒక్కసారి మీ చెవులను రెంటిని అద్దంలో జాగ్రత్తగా పరిశీలించి చూడండి. కుడి, ఎడమ చెవులు ఒకే రకంగా ఉండవు గాక ఉండవు. కథ అంతటితో ముగియదు. చెవులు ఏ ఇద్దరిలోనూ పూర్తిగా ఒకే రకంగా ఉండవు.
కడుపులో శిశువు అయిదు వారాల వయసుకు చేరగానే చెవులు ఏర్పడడం మొదలవుతుంది. తలకు రెండు వేపులా చెవులు ఉండవలసిన చోట్లలో ఆరు చిన్నచిన్న బుడిపెలు పెడతాయి. అవి పెరుగుతూ రానురాను కలిసిపోతాయి. జన్యువుల కారణంగా చెవుల ఆకారం ఏర్పడుతుందని చెప్పనవసరం లేదు. శరీరంలోని అన్ని భాగాలకూ అసలయిన ప్లాన్ జన్యువులలోనే ఉంటుంది. కానీ, వేలిముద్రలలాగే చెవులు కూడా గర్భంలోని వత్తిడి, ద్రవాల ప్రభావానికి గురి అవుతాయి. కడుపులో శిశువు ఉంటే తీరు కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి మరీ ఎక్కువయినప్పుడు చెవులు కొంచెం వంకర టింకరగా కూడా మారతాయి. అరుదుగా కొంతమందిలో ఇటువంటి మార్పులను మనం చూడగలుగుతాము. చెవుల నిర్మాణం ఒకసారి పూర్తి అయిన తరువాత వాటిలో మార్పులు ఉండవు. వయసుతోబాటు చెవులు కూడా పెరుగుతాయి గానీ, వాటి ఆకారంలో మార్పు రాదు. కనుక చెవులు ఆధారంగా వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు చాలా పరిశోధనలలో జరుగుతున్నాయి. ముఖం ఆధారంగా మనిషిని గుర్తించినట్టే చెవుల ఆధారంగా కూడా అంత నిక్కచ్చిగా గుర్తించవచ్చునని పరిశోధకులు నిర్ణయించారు. నిజానికి కొన్ని దేశాలలో వేలిముద్రలలాగే చెవి ముద్రల ఆధారంగా నేర పరిశోధనలో కూడా నిర్ణయాలు జరిగాయి.
చెవి నిర్మాణంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది నిజమే కానీ, ఇంకా చెవులను, మనుషుల గుర్తింపుగా వాడడం పూర్తి అంగీకారం పొందలేదు. చెవి ముద్రలు తీయడానికి కొన్ని చిక్కులు ఎదురవుతాయి. వాటి కోణంలో ఏ కొంచెం తేడా వచ్చినా ముద్ర మరో రకంగా రావచ్చు. కనుక చెవిని గుర్తింపు కోసం వాడడం అప్పుడే మొదలు కాలేదు. కానీ మనిషిని గుర్తించడానికి మనం ఇప్పటివరకు గమనించిన మిగతా కొన్ని భాగాలలాగే చెవులు కూడా చేతనయినంత సాయం చేస్తాయి. ఎవరికి వారు ప్రత్యేకం అన్న సూత్రానికి అవి కూడా ఆధారంగా నిలబడతాయి.
ఇన్ని రకాలుగా శరీరంలో భాగాలన్నీ మనలను ప్రత్యేకంగా చూపిస్తుంటే ఇక కళ్లు వెనుకబడి ఉంటాయా. వాయవ్య రాష్ట్రాలలోనూ, చైనా, జపాన్‌లోనూ మనుషుల కళ్లు ఒక రకంగా ఉండడం మనకు తెలిసిందే. అయితే ఇంగ్లండ్, అమెరికా, కెనడా దేశాలలో కూడా కళ్లు వేరువేరుగా ఉంటాయట. కనుక మనుషులను గుర్తించడానికి కళ్లను ఆధారంగా తీసుకోవడం అంత నమ్మదగిన పద్ధతి కాదని అనుకున్నారు. ఇక ఒక తండ్రికి పుట్టిన సంతానానికి అందరికీ కళ్లు ఒకే రకంగా ఉండడం కూడా మామూలుగా గమనించిన విషయమే. అప్పుడు కళ్ల ద్వారా వ్యక్తి ప్రత్యేకత తెలియడానికి ఆధారం ఏమిటి అన్న ప్రశ్న పుడుతుంది. కంటిలోని నల్లని గుడ్డు మధ్యలో కంటిపాప ఉంటుంది. ఇంగ్లీషులో దాన్ని ఐరిస్ అంటారు. దాని చుట్టూ ఉండే నల్లగుడ్డులో రకరకాల నిర్మాణాలు, రూపాలు కనపడతాయి. కండరాలు, రక్తనాళాలు కూడా కలిసిన తీరు ఆ కళ్లలో తెలుస్తుంది. కంటి రంగుకు ఆధారమయిన కణాలు ప్రత్యేకంగా కనపడతాయి. కంటిపాప చుట్టూ ఉండే గీతలలో లోతు, ఎత్తు, మచ్చలు కూడా కనపడతాయి. మామూలుగా కంటి రంగు, రూపం ఒక కుటుంబంలో అందరికీ ఒకే రకంగా ఉండవచ్చు. కుడి, ఎడమ కళ్లు ఒకే రకంగా ఉండడం కూడా తెలిసిన విషయమే.
అయితే ఐరిస్ ఆధారంగా వ్యక్తులను గుర్తించే పద్ధతి విమానాశ్రయాలలో కూడా వాడుకలోకి వచ్చింది. కంటిని బట్టి మనిషిని గుర్తించే యంత్రాలు కంటిరంగును పట్టించుకోవు. కంటిపాప చుట్టూ ఉండే ఎత్తు, పల్లాలు, మచ్చల వివరాలను అవి బాగా గమనిస్తాయి. కంటి లోపలి కండరాలు, లిగమెంట్స్, రంగు కణాలు ఉండే తీరునుబట్టి ఎవరికి వారిని వేరుగా గుర్తించే వీలు ఉంది. పుట్టుకకు ముందే ఐరిస్ నిర్మాణం పూర్తి అవుతుంది. దీని మీద జన్యువునియంత్రణ ఉండదని కూడా తెలుసు. కనుక కండరాలు, కణాలు ఇష్టం వచ్చిన పద్ధతిలో అక్కడ చేరుకుంటాయి. కంటికి ప్రత్యేకమయిన ఒక రూపాన్ని బయటకు కనిపించకుండానే ఇస్తాయి. నిజానికి ఈ భాగాల్లో తేడాతో కుడి ఎడమ కళ్లను కూడా గుర్తించవచ్చు. ఇక మనుషుల మధ్య తేడా గుర్తించడం ఎంతో సులభం.
స్వరం అంటే గొంతుక వినిపించే తీరు కూడా ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఒక మాట పలికినప్పుడు ఆ ధ్వని రకరకాల భాగాల ద్వారా బయటకు వస్తుంది. స్వరపేటిక (లారింక్స్)లో రెండు పట్టీలు ఉంటాయి. గాలి ఆ రెండు పట్టీల మధ్య నుంచి తోసుకుని వస్తుంది. నోట్లోకి ప్రవేశించిన తరువాత ఆ ధ్వని అక్కడి భాగాలకు కొట్టుకొని ప్రతిధ్వనిస్తుంది. ముక్కు రంధ్రాల ప్రభావం కూడా ధ్వని మీద పడుతుంది. ఇక అంగిలీ, నాలుక, పెదవులు, బుగ్గల నిర్మాణాన్నిబట్టి ధ్వని ఒక ప్రత్యేక పద్ధతిలో బయటకు వచ్చి వినిపిస్తుంది. స్వరపేటిక, నోరు, ముక్కు, దంతాలు, వీటన్నింటికీ సంబంధించిన కండరాలు ఏ ఇద్దరు మనుషులలో ఒకే రకంగా ఉండవు. కనుక గొంతు తీరు కూడా ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రకంగా గొంతు ఆధారంగా మనం మనుషులను సులభంగా గుర్తించ గలుగుతాము. యంత్రం మరింత సులభంగా గొంతును గుర్తిస్తుంది. కానీ గొంతు ఆధారంగా ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించి చెప్పడంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. కొంచెం ప్రయత్నం మీద గొంతు మరొక రకంగా వినిపించేట్టు మాట్లాడడం ఇంచుమించు అందరికీ వీలవుతుంది. ఇక మిమిక్రీ, వాయిస్ ఆర్టిస్ట్, ఐదు నిమిషాలు విన్న గొంతుకను అనుమానం రాకుండా అనుకరించ గలుగుతారు. వారు ఆ పనిని చేసిన పద్ధతిని మాత్రం చెప్పలేరు. చేయడం వరకే వీలవుతుంది. మరొకరిలా మాట్లాడాలంటే ముఖ కవళికలు కూడా మారతాయి. శృతి, స్థాయి విషయంలో కూడా తేడాలను సులభంగానే తీసుకురావచ్చు. ఈ రకంగా మిమిక్రీ కళాకారులే కాక మిగతా వారంతా కూడా కొంచెం ప్రయత్నం మీద తమ స్వరాన్ని మార్చగలుగుతారని పరిశోధకులు గుర్తించారు. కొన్నిసార్లు తెలియకుండానే మన గొంతుక మరొకలా వినిపిస్తుంది. చుట్టు ఉన్న వాతావరణం, మనుషుల కారణంగా కూడా మన గొంతుకలో తేడాలు వస్తాయి. గొంతు మార్చడం కొంతమంది విషయంలో మరింత బాగా వీలు అవుతుంది. మొత్తానికి వేలిముద్రలు, కనుపాప వివరాలు వాడినట్టు మనిషిని గుర్తించడానికి గొంతును వాడడం కుదరదని పరిశోధకులు తేల్చి చెప్పారు. మామూలుగా విన్నవారికి మాత్రం గొంతు ఆధారంగా మనుషులను గుర్తించడం సులభం అనిపిస్తుంది. కానీ ఇందులో మోసాలు జరగడానికి కావలసినంత అవకాశం ఉంది.
మనుషులంతా ఒక్కటే. అందరిలోనూ అదే రక్తం ప్రవహిస్తున్నది అంటూ ఉపన్యాసాలు దంచేవారు ఈ నాలుగు ముక్కలు చదివితే బహుశః మాటలు తగ్గిస్తారేమో. చూడగలిగితే, మనుషుల మధ్యన గల తేడాల గురించి చిన్న భారతమే తయారయింది. సైన్స్ అంటే మరి ఇలాగే ఉంటుంది. పట్టించుకుని లోతుగా చూస్తే, ఎన్నో వింత విషయాలు మన ముందుకు వస్తాయి. మన లాంటి మనుషులు మరొకరు లేరు అన్న సంగతిని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. సైన్స్ మీద మనుషులకు గౌరవం పెరగాలి. ఇది నాకున్న గట్టి కోరిక. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ముచ్చట. ప్రపంచమంతా సైన్సు. విశ్వమంతా సైన్సు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బ్రతుకు కూడా సైన్సు. మన ఆలోచనలు కూడా ఆ పద్ధతిలో సాగితే, ప్రపంచం మనకు మరింత సులభంగా అర్థమవుతుంది. అది లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ముందుకు కదులుతూ ఉంటే, ఒక పక్కన మిగిలిపోయిన గడ్డి గురిచి మనకు తెలియనే తెలియదు. కనుకనే, సైన్స్ అన్నది బడిలో చదువుకునే వారి కొరకు మాత్రమే అనుకోకుండా, అందరము పట్టించుకోవాలి. చల్లగా ఉంది అంటే రాత్రి చలి పెడుతున్నది అంటే ఎందుకు ఎక్కువ అని ఆలోచించాలి. భూమి నిటారుగా ఉండి గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఋతువులు ఉండేవి కావు. అద కొంచెం ఏటవాలుగా ఉండి తిరుగుతున్నది కనుక రుతువులు ఏర్పడుతున్నాయి అని చెబితే, అంత సులభంగా అర్థంకాదు. అందుకని దాన్ని వదిలిపెట్టకూడదు. నా బాధ అంతా ఒకటే. సైన్స్ అంటే ప్రపంచం గురించిన అవగాహన లేకుండా బతికితే అదేదో తెలిసీ తెలియని పద్ధతిగా ముందుకు సాగుతున్నట్టు ఉంటుంది. చీకట్లో కూడా కనబడుతున్నది అనుకున్న పద్ధతిగా ఉంటుంది. అందులో ఆనందం లేదు. తెలుసుకోవడమే ఆనందం.

-కె.బి.గోపాలం