లోకాభిరామం

ఫిర్‌సే ఖయాలో మే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను నడుస్తున్నాడు. కానీ వడివడిగా మాత్రం కాదు. అతని తీరే అంత. పరుగులు, ఉరుకుల అవసరం ఏమిటి? ఇంట్లో నుంచి బయలుదేరింది ఎందుకని? ఎవరి మీదయినా యుద్ధం చేయడానికి కాదు గదా! ఆరోగ్యం కొరకు వాకింగ్ చేయాలన్న ఆలోచన అతనికి ఇంకా రాలేదు. కనుక తన తీరు నడక సాగిస్తుంటాడు. కానీ ఇప్పుడు అతను ఆలోచనలో తీవ్రంగా మునిగినట్లు కనబడుతుంది. మామూలు కన్నా నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టుపక్కల మనుషులను పరిశీలించడం, వారి గురించి ఆలోచించడం అతనికి బాగా అలవాటు. పరిసరాలను కూడా అదే పనిగా, ఏదో పరిశోధన కొరకు అన్నట్లు తరచి చూస్తూ ఉంటాడు. ఫలానా ఇంట్లో వాళ్లు స్వచ్చ భారత్ అభియాన్ చేసి, అక్కడ అప్పటి వరకు చేరిన చెత్తను తొలగించారు అని కూడా చెప్పగలుగుతాడు. ఇవాళ మాత్రం, కనీసం ప్రస్తుతం అతను తల కొంచెం తలవంచుకుని నడుస్తున్నాడు. ఏదయినా ఆలోచనలో పడితే మన కనుగుడ్లు పైకి తిరుగుతాయి. ముఖం మాత్రం కిందకు వాలుతుంది. ఎందుకట్లా అని ఆలోచిస్తున్నాడా అతను. కాదు. అంతకన్నా లోతయిన ఆలోచన మనసులో మెదిలినట్లు ఉంది. ముఖం గంభీరంగా కనబడుతున్నది.
అవును! ఇంతకు ఎవరీ అతను? ఇన్నాళ్లయింది. అతని ఊరు, పేరు తెలియవు. కనీసం వయసు, శరీరం తీరు, వేసుకున్న దుస్తులు లాంటివి కూడా మన మాటల్లో రాలేదు! ఇంతకూ, దారి వెంట నడుస్తూ కనిపించిన అన్ని సంగతులను పట్టించుకునే ఈ అతను, నిజంగా ఉన్నాడా? ఉంటే ఎవరతను? ఆ అతను నేనా? అతని గురించి నేను చెపుతున్నాను. కనుక బహుశః నేను కదా. బహుశః అంటే అనుమానం వస్తుంది. నేనే అతను అయితే, నేను చాలు, అతను అవసరం లేదు. లేడు అనాలేమో? అతనంటే మీరు కాకూడదా? మీరు కూడా తప్పకుండా, నడుస్తుంటారు. ప్రపంచాన్నీ, మనుషులను పరిశీలిస్తుంటారు! మీకన్నా మీ పక్కింట్లో ఉండే ఫలానా గారికి, ఈ అతనికి బాగా పోలికలు కనిపిస్తున్నాయా? రయ్యిమని ఒక వస్తువేదో అతని ముఖం పక్కగా దూసుకుపోయింది!
అతను ప్రపంచంలోకి వచ్చాడు. పరిస్థితి గమనిస్తే దూసుకుపోయింది. బహుశః ఒక బంతి అని అనుమానం కలిగింది. పిల్లలు నడిరోడ్ మీద క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్లకు మరి స్టేడియం, కనీసం ప్లేగ్రౌండ్ దొరకదు. బంతి యింకా నయం, క్రికెట్ బంతి కాదు. రబ్బరు బంతి! దాన్ని తెచ్చిన పిల్లవాడు అతని వేపు నవ్వుతూ చూస్తున్నాడు. అతనికి ఒక క్షణం చిర్రెత్తింది. ఆ బంతి తన ముఖానికి తగిలేదే. కొద్దిలో తప్పినట్టుంది. ఆడుతున్న పిల్లలు క్షమాపణగా చూడవలసింది పోయి, తనను చూచి నవ్వుతున్నారు. తాను ఆలోచనల్లో మునిగి, బంతి కారణంగా ప్రపంచంలోకి, ధ్యాసలోకి వచ్చినప్పుడు, తనలో భయం, ఉలికిపడడం లాంటి లక్షణాలు కనిపించి ఉంటాయి. పిల్లలకు మరి నవ్వు రాక ఏమవుతుంది? తానయినా ఆ పరిస్థితిలో నవ్వి ఉండేవాడు. ఆ సంగతి మనసులో మెదిలిన తరువాత అతను కూడా పిల్లల వేపు చూచి, ఒక నవ్వు విసిరాడు. పిల్లలు మాత్రం తికమక పడినట్లు కనిపించారు. తాము నవ్వినందుకు అతను, అందరిలాగయితే, కోపగించుకుని ఉండాలి. కానీ అట్లా చేయలేదు. తానూ నవ్వాడు. పిల్లలకు నమ్మకం కలగలేదు. కనుక బిత్తరపోయారు. పిల్లలు ఆడుకోవాలి. అది అవసరం. కానీ, అందుకు చోటు ఎక్కడుంది?
పల్లెల్లో పిల్లలకు కావలసినంత చోటు. లక్ష రకాల ఆటలు ఉంటాయి. పట్నం పిల్లలకు అంత చోటు లేదు. రకరకాల ఆటలాడాలన్న ఆలోచన అంతకన్నా లేదు! అయ్యో! ఆలోచన! బంతి రాక ముందు అతను ఆలోచిస్తున్నాడు. దేని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచనలకు అంతరాయం కలిగిన వారు తిరిగి, అదే ఆలోచనలోకి జారుకునే అవకాశం ఉందా? ఇక్కడ అతను మాత్రం, మళ్ల పాత పద్ధతిలో అందరినీ పరిశీలిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అక్కడ అతను ఒక మలుపు తిరిగాడు. మలుపు తిరగవలసిన చోట రోడ్‌లో ఒక కరెంట్ స్తంభం ఉంది. అది నిజానికి దారికి అడ్డంగా ఉంది. దాని పక్కన రాళ్లు, సిమెంట్ దిమ్మె లాంటివి కూడా అడ్డుగా వున్నాయి. వాటిని తప్పించుకుంటూ అతను అప్రయత్నంగా నడుస్తున్నాడు. అంటే అలవాటయిన దారి అని అర్థమవుతుంది. ఎప్పుడూ తిరిగే దారి అయితే, ఎక్కడ ఏం ఉందని చూడకుండానే నడవడం కుదురుతుంది. ఇంటి నుంచి బయలుదేరిన పశువులను వెళ్లవలసిన చోటికి చేర్చడానికి అదిలించవలసిన అవసరం ఉంటుంది. తిరుగుదారిలో మాత్రం అవి బుర్ర కిందకు వేసుకుని వెళ్లిపోతూనే ఉంటాయి! అనాస్ బండి వాడు అరుస్తున్నాడు!
మామూలుగా ఎప్పుడూ ఒకేచోట నిలబడి పళ్లు అమ్మేవాళ్లు అరవరు. హాయిగా కూచుని ఉంటారు. అలవాటుగా కొనేవాళ్లు కొందరయితే, సరుకు చూసి కొనేవాళ్లు కొందరు. అనాస అంటే ఎంతమందికి తెలుసు? దాన్ని పైన్ ఆపిల్ అంటారు. విషయం ఏమిటో తెలియదు గానీ, ఈ పళ్లను గుర్రంబండి మీద తెచ్చి అమ్ముతారు. అది సైకిల్ చక్రాలు నాలుగింటితో అమర్చిన పళ్లబండి కాదు. అసలు గుర్రంబండి. గుర్రం మూతికి కట్టిన సంచిలోనుంచి శెనగలో, మరొకటో తింటూ ఉంటుంది. అదే పనిగా తినడమేనా? ఈ గుర్రం తినడం లేదు. మోర అంటే ముఖం ముందుకు వాల్చి ఆలోచనలో పడినట్లుంది. గుర్రం ఆలోచిస్తుందా? అతనికి పైన్-ఆపిల్ కొనే ఉద్దేశం లేనట్లుంది. అతనికి ఏ వస్తువూ కొనే ఉద్దేశం లేనట్టు కనబడుతుంది. అన్నింటినీ ఆసక్తితో పరిశీలిస్తాడు. ఏదో అంగడిలోకి దూరతాడు, అనిపిస్తుంది. అది జరగదు. ఆలుబకారా అమ్ముతున్నవాడు అరవడం లేదు.
ఒక బండి అతను సంవత్సరాలు తరబడి సపోటాలే అమ్ముతుంటాడు. వాటి నాణ్యతలో గొప్ప తేడా కనబడుతుంది. ఉత్తర భారతదేశంలో సపోటా పళ్లను చిక్కూ అంటారు. అతనికి అవి చాలా నచ్చుతాయి. అయినా కొన్నట్లు మాత్రం కనబడదు. ఇతను కొంటాడు. ఇంటికి మోసుకుపోయి ఫ్రిజ్‌లో పెట్టాలని తలుపు తెరిస్తే ఎదురుగా సపోటాలు వెక్కిరిస్తున్నట్లు కనబడతాయి. అంట్లే ఇంట్లో మరెవరో కూడా వాటిని కొని తెచ్చారని అర్థం! అందుకే అతను కొనడు. తిక్కముదిరితే కొంటాడు. ఆలుబకారా అమ్మే అతను అరవడం లేదు! అతను అరిచినా ఇప్పుడు వినిపించదు. అతను ముందుకు సాగిపోయాడు. ఆలుబకారా లేక బకారా? ఏమిటి పేరు? అన్ని పళ్లలాగే వాటిని కూడా తింటారా? కిలోల కొద్దీ కొంటారా? కొనకుంటే, అతను బండి మీద ఎందుకని అంత కుప్ప పోసుకుని కూచున్నాడు? ఈ పళ్లు చూడడానికి చాలా అందంగా, టమాటాల వలె ఉంటాయి. కొన్నాళ్లకు నల్లబడతాయి. మరిన్ని నాళ్లకు ఎండిపోతాయి. ఎండిన పళ్లను కూడా అమ్ముతారు. బండి మీద కాదు. మామూలు అంగట్లో అమ్ముతారు. నోటిలో అరుచి ఏర్పడితే, వాటిని చప్పడానికి ఇస్తారు. పుల్లగా, తియ్యగా బాగుంటాయి. వాటికి ఆలూ అనే బంగాళాదుంపకు సంబంధమే లేదు! ఇక్కడ దానిమ్మ సేపు పళ్లు అమ్ముతున్నారు. ఆపిల్ పళ్లను మన దేశంలో సేబ్, సేప్ అంటారని ఎవరికయినా గుర్తుందా? గ్లోబలైజేషన్ అంటే ఇదేనేమో! ఏదో పొరపాటు జరిగినట్టుంది!
గ్లోబలైజేషన్ గొప్ప పొరపాటు అంటున్నారు. కానీ అతనికి అనుమానం వచ్చింది, ఆ పొరపాటు గురించి కానదు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, ఏవో ఒకటి రెండు వస్తువులు కొని తేవాలని గట్టిగా అనుకోవడం గుర్తుంది. ఏమిటా వస్తువులు? అది మాత్రం గుర్తు లేదు. ఒక క్షణం ఆగి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తనకు అవసరమయే వస్తువులన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతుంది. అయితే అవసరాలు కాదు కొనదలచుకున్నది. ఐచ్ఛికాలు, అంటే ఆప్షనల్స్. అంటే వాటిని కొనకున్నా కొంప మునగదు. కానీ, ఎందుకు మరిచిపోవాలి? అంత నిర్లక్ష్యం ఎందుకు? అంతగా అవసరం లేని వస్తువులను కొనడం ఎందుకు? పాపం, ఈసారి అతను నిజంగా ఆలోచనల్లో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నాడు? కొనదలుచుకున్న వస్తువుల గురించా? అవి గుర్తుకు రాకపోవడం గురించా? లేక పాత ఆలోచనలు మళ్లీ చుట్టుముట్టాయా? అతను మళ్లీ నెమ్మదిగా నడుస్తున్నాడు!

కె. బి. గోపాలం