లోకాభిరామం

పాత-కొత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత పేపరు: ఈ మధ్యన ఒక ప్రకటనలో ఒక వింత సంగతి చూచాను. ఒకానొక సరికొత్త మాడల్ మొబైల్ ఫోన్ (సెల్‌ఫోన్ అంటే సులభంగ అర్థమవుతుందేమో!?) కొంటే, ఆ సందర్భంలో మన దగ్గరున్న పాత ఫోన్ తిరిగి ఇస్తే, కొత్త ఫోన్ ధరలో తొమ్మిది వేల రూపాయలు తగ్గిస్తాడట! రట! ఇందులో వింత ఏముందని అడగదలుచుకున్న వారికి దండాలు. నాకు అన్ని విచిత్రంగనే వింతగనే కనిపిస్తయి మరి! అంత తగ్గిస్తరంటే అసలు ఆ ఫోను ధర ఎంత ఉంటుంది. పాత ఫోనుకు నిజంగ అంత విలువ ఉంటుందా? నాకు అనుమానాలు మొదలయితే ఆగవు. ఈ మొత్తంలో అసలు వింతను సైన్‌ప్రింట్ అంటరు. కంటికి సులభంగ కనబడకుండ ఉండే అక్షరాలని అర్థం! తొమ్మిది వేల వరకు అని తరువాత చెపుతరు. నీ ఫోన్‌కు తొమ్మిది వందలే వస్తయి అంటరు! కనుకనే ఇవన్ని పట్టించుకోకుండ బోలెడు నగదు (నా దృష్టిలో) ఇచ్చి ఒక ఫోన్ తెచ్చుకున్న! ఆ అంగడి అబ్బాయిని సూటిగ అడిగిన. నెట్‌లోగాక నీ దగ్గర కొన్నందుకు తేడా ఏమని? ఏమీ లేదని, ఇంచుమించు సూటిగనే చెప్పినడు ఆ యువకుడు.
పాత పేపర్ అని శీర్షిక పెట్టి, పాత, కొత్త ఫోన్ గురించి చెపుతున్నందుకు మీరు నన్ను నిలదీసి అడగవలసి ఉంది. అవునూ! నా దగ్గర అయిదారు పాత ఫోన్‌లు జమయినయి. అవన్ని చక్కగ పని చేస్తున్నయి. వాటిని ఏం చేయాలన్నది ప్రశ్న. కొననుపోతే కొరివి. అమ్మబోతే అడివి అని ఒక మాట ఉంది. అది ఈ కాలంలో అన్ని విధాల సత్యంగ ఉన్నది. ఆ మధ్యన ఒక ఫ్రిజ్ కొంటిమి. పాత ఫ్రిజ్ బాగనే పని చేస్తుంది. కాని దానము చేతమంటే కూడ తీసుకునే వారెవరు లేరు. కొత్త ఫ్రిజ్ అమ్ముతున్న వారినే అడిగితే, దాన్ని అమ్మే ఏర్పాటు చేస్తామన్నరు. చేసినరు. ఇద్దరు వచ్చినరు. ఫ్రిజ్ కొంటము అన్నరు. ఎంతయిస్తరు అంటే ‘పనె్నండు వందలు’ అన్నరు. దాన్ని మనము ఇంట్లో పెట్టుకోలేము. పారేయలేమని వారికి తెలుసు! అమ్మవలసిందే. అదే జరిగింది. కొత్త ఫ్రిజ్ దర నలభయి వేలట! నాకు శరీరంలో చేతులు, కాళ్లకు కలిపి ఉన్న వేళ్లు ఇరవయే!
ఒకప్పుడు ‘ప్యేప్వార్’ అంటూ అరుస్తూ సైకిల్ మీద మనుషులు వచ్చేవారు. వారు పాత పత్రికలు కొంటరన్నమాట. వాండ్లు తూకం వేసే తక్కెడలు సరిగ్గ ఉండవని కొందరు గోల చేసేవారు. ఈ మధ్యన స్ప్రింగ్ బ్యాలెన్స్ అనే కొత్త తక్కెడతో పాత కాగితాలను బరువు తూస్తున్నరు. వార్తాపత్రికల ధర ఎన్నో రెట్లు పెరిగింది. పాత పేపరు ధర మాత్రం అంతగా పెరగలేదు. నా దగ్గర పాత పేపర్ కొనే మనిషి, ఎన్ని రోజుల తర్వాత వచ్చినా, ఎన్ని పేపర్లు ఇచ్చినా చివరికి అయిదే కిలోలు అంటడు. అదేమి చిత్రమో నాకు అర్థంగాదు. ఈ ప్రపంచములో నాకు అర్థముగాని సంగతులు చాలనే ఉన్నయి గద. అందుట్లో ఇదిగూడ ఒకటి అనుకుంట. పేపర్లు అమ్మే సందర్భం వచ్చినప్పుడల్ల నాకు ఒక మనిషి గుర్తుకు వస్తడు. సంతోష్‌నగర్‌లో ఉన్నప్పుడు ఆయన నా దగ్గర పాత పేపర్ కొనేవాడు. పెద్ద మనిషి. పంచెకట్టుకుని ఉండేవాడు. ‘సారూ! నీవీ పేపర్ చదువుతవా? లేక కొని ఊరికె నాకు అమ్ముతున్నవా?’ అన్నడు ఒకసారు. నాకు మళ్ల అర్థముగాలేదు. ‘ఒక్కొక్క ఇంట్లో పేపరు పుంటికూరలాగ (గోంగూర వలె) నలిగి ఉంటది. నీ పేపర్లు కొత్తగ ఉన్నయి’ అన్నడు. నాకు నా పద్ధతి గురించి అప్పుడు అర్థమయింది. కాగితమంటే దేవత. అక్షరమంటే గౌరవము. భక్తి. పడవేసే కాగితాన్ని గూడ నలిపి ముద్ద చేయగూడదన్నది, నాకున్న ఛాదస్తాలలో ఒకటి!
ఈ మధ్యన కూరగాయలు, పండ్లవాండ్లు, స్వంతంగ అరవడం లేదు. రికార్డు, మైకులు వాడుతున్నరు. ఈ క్రమంలో వీధిలో ఒక పాత వ్యాను నుంచి ‘పాత పేపర్లు కొంటాం!’ అని ప్రకటన వినిపించింది. ఎందుకోగాని నాకు, ‘పాత దీపాలకు కొత్త దీపాలు’ అనే అలాదీన్ కథ గుర్తుకు వచ్చింది. పాత జరీ అంచులు కూడ ఈ పద్ధతిలో కొంటున్నరు. అంత వింత!
బిళ్లలు - నోట్లు: హరికథ అయిపోయే చోటికి చేరుతున్నది. అప్పుడు ఒక హారతి పళ్లెమును అందరి మధ్యలో తిప్పుతరు. హరికథ చెపుతున్న ఆయన ‘అయ్యా! పైసలు ఏసేవాండ్లు చప్పుడు గాకుండ ఎయ్యిండి’ అని అన్నడు. సంగతేమిటని ఆలోచిస్తే, అడిగితే ‘చిల్లర పైసలుగాదు నోట్లు ఎయ్యిండి’ అని ఆయన మాటకు అర్థమని చెప్పినరు. కొందరు వెంటనే, కొందరు ఆలస్యంగ నవ్వినరు. నేను ఎప్పుడు నవ్వింది మీకు అర్థమయే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత నవ్విన!
ఒక వకీల్‌గారు. కాదు. లాయర్‌గారు అందము. అందాము. అంటాము. ఆయన అందముగనే ఉన్నడు. ఆయన ఆలోచనలు ఆయనకంటే అందముగ ఉన్నయి. ఆయన వకాలతు అంటే లా ప్రాక్టీస్ మానేసినడు. స్థితిపరుడు గనుక మరే పని అవసరం లేదు. కనుక అలవాటయిన చదువు, ఆలోచనలను బలంగ ముందుకు సాగించినడు. ఆలోచనలు మరీ బలంగ మారితే, వాటిని అక్షరాలలో పెట్టి అందరికి అందించాలని అనిపిస్తుంది. అందుకే వకీలుగారు రచయితగా మారిరి. ఆయన కథలు, నవలలు చదివినడుగాని, రాతలో వాటి తెరువుపోలేదు. ఆర్థిక, సామాజిక అంశాలను గురించి ఆయన ఆలోచనలు సాగినవి. వాటిని గురించే రాసి పుస్తకాలు వేసి, అనువాదం పుస్తకాలు గూడ వేయించి, ఆయా అంశాల మీద తనకున్న విధేయతను ప్రపంచానికి పంచినడు. ఇంతకు ఆయన ఏమంటడో తెలుసునా? కాగితం రూపాయిలు, బ్యాంకులు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన వాదం. ఈ ఆలోచన ప్రపంచంలో మరి కొందరులు గూడ అవునన్నదేనట.
ఒక్క రూపాయి నోటు తప్ప, మన దేశంలోని మిగతా నోట్లన్ని రిజర్వ్ బ్యాంక్ వారివి అని తెలియని వారు ఇవాళటికీ చాలమంది ఉన్నరు. నాణానికి కనీసం ఆ లోహం విలువ ఉన్నది నూరు రూపాయి కాగితము, వెయ్యి కాగితం యించుమించు ఒకంతే ఉంటయి. కాని రంగు, అంకెల కారణంగా వాటి విలువలో పదంతల తేడా! ఈ కాగితం రూపాయలు విలువలేనివి! వాటిని ఎన్నింటిని, ఏ విషయం ఆధారంగ అచ్చు వేస్తరన్నది మీరు, నేను సులభంగ అర్థం చేసుకోజాలము. పద్ధతి ఉంటుంది. ఉండదు. ఇదంత మోసము అంటరు వకీలుగారు. నిజంగ అందరు ఆలోచించవలసిన విషయము.
ప్రభుత్వాలు కుట్రపన్ని బ్యాంకులను, కాగితం రూపాయలను ప్రవేశపెట్టి, శ్రమ శక్తి విలువను తగ్గించినయని ఈయన తమ రచనలలో వాదించారు. ఆశ్చర్యం కలిగింది నాకు. మనం నిజంగ పట్టించుకోవలసిన విషయాలను, అర్థం చేసుకునే ప్రయత్నం గూడ చేయడం లేదనిపించింది. ఆశ్చర్యపడదలచుకుంటే, మన మూర్ఖత్వం కన్న గొప్ప అంశం మరొకటి లేదుగద! మనలను చూచి మనం ఆశ్చర్యపడవలసి ఉందని భావం.
పుస్తకాలు: ఈ ప్రపంచంలో ఇన్ని రకాల పుస్తకాలు ఇంతగా ఎందుకు ఉన్నయి అన్నది నన్ను నేను ఎంతకాలంగనో అడుగుకుంటున్న ప్రశ్న. వాటిలో నుంచి ఎన్నింటిని మనము చదవగలుగుతము అన్నది తర్వాతి ప్రశ్న! మాట, భాషల పుట్టుక, పెరుగుదలల తీరు గురించి చదువుతున్న. పాత, కొత్త నవలలు, కథలు చదువుతున్న. ఇక సైన్సు గురించి చదవకుండ కాలము గడవనే గడవదాయె. ఇవన్ని చదువుతుంటే సంతృప్తి, ఆనందము కలుగుతుంది నిజమే! కానీ, నేనొక్కణ్ని చదివితే చాలా? అందరికి ఈ ఆలోచనలు అందాలె గద! అన్న బాధ నన్ను మరింత నలగగొడుతుంది. అందుకే ఈ రాతలు, కూతలు, అనువాదాలు. లేదంటే, నేనెందుకు రాయాలె? నేను రాసింది మీరెందుకు చదవాలె?

- కె.బి. గోపాలం