లోకాభిరామం

మురళి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. ఇక నేను అదే పనిగా సిలోన్‌లోనూ, ఇతర స్టేషన్‌లలోనూ సినిమా పాటలు వినసాగాను. సంగీతం వింటే మాగుంటుందని నాన్న చూచాయగా మాత్రమే చెప్పాడు. నిజానికి ఆయన శాస్ర్తియ సంగీతం అంతగా విన్నట్టు గుర్తు లేదు. ఎన్నిసార్లు చెప్పినా కర్ణాటక శాస్ర్తియ సంగీతం అనే గండుచీమ నన్ను గట్టిగా కుట్టేసిందని, అయినా నాకు ఆనందమే గానీ, బాధ తెలియలేదని తప్ప కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.
రేడియోలో అంటే హైదరాబాద్ రేడియోలో ఆదివారం నాడు పొద్దున్న గంట కచేరీ ఒకటి ప్రసారమయ్యేది. ఇప్పటికీ అవుతున్నది కూడా. అందులోనే అనుకుంటాను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గొంతు మొదటిసారిగా విన్నాను. కేదారగౌళ రాగం పాడినట్టు గట్టిగా గుర్తున్నది. తరువాత మురళిగారుగా, గురువుగారుగా మిగిలిన ఆ మహానుభావుని కచేరీలు ఎన్నో సంపాదించాను. అందులో ఈ కేదారగౌళ కచేరీ మాత్రం చేతికి అందినట్టు లేదు. మొత్తానికి ఆయన పాట తీరు నా మనసులో నాటుకు పోయింది. ఆ తరువాత ఆయనను శ్రద్ధగా వింటూ వచ్చాను. ఆయన రికార్డు చేసిన చాలా క్యాసెట్‌లను కొన్నాను. సంగీత సేకరణలో పడ్డ తరువాత అరుదయిన ఆయన కచేరీలను సంపాదించి సంగీత ప్రియులతో పంచుకున్నాను కూడా. ఇంకా పంచనివి నా దగ్గర చాలా మిగిలిపోయాయి.
హైదరాబాద్ చేరిన తరువాత మూడు గంటల కచేరీలు వినడం వీలయ్యింది. ఒకప్పుడు మురళిగారు రవీంద్రభారతిలో పాడిన ఒక కచేరీ నుండి గంటపాటు సాగిన పంతువరాళి రాగంలో అప్ప రామభక్తి అన్న కీర్తన రేడియోలో ప్రసారం చేసినప్పుడు విని ఒక్క పాటను అంతసేపు పాడడం గురించి చాలా ఆశ్చర్యపోయాను. అప్పటివరకు మరి విన్నవి రేడియో పద్ధతిలో గంట మించని కచేరీలు మాత్రమే. రవీంద్రభారతికి లేదా మరొక చోటికి వెళ్లి మూడు గంటల కచేరీ వింటే మృష్టాన్న భోజనం కడుపు నిండా తిని జిర్రున తేన్చిన భావం కలిగింది. కర్ణాటక సంగీతంలో ఆసక్తి కలగడానికిఒక కారణం నాదస్వరమయితే మరొక కారణం బాలమురళి. ఈ రెంటిలో ఏది ముందు, ఏది వెనుక అన్న ప్రశ్న లేదు. ఆయన పాటకు సాటి లేదు. ఆయన విద్వత్తుకు అంతులేదు. ఆయన గొంతెత్తి ఏం పాడినా అందులో నుంచి అమృతం చెందుతుందని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. ప్రతి విషయంలోనూ దారి తెలిసి, ఆ దారిన నడిచి, మిగతా వారికి దాన్ని దారిగా చూపించిన వాళ్లే నాయకులు అని ఒక పద్ధతి ఉంది. మురళిగారు కర్ణాటక సంగీతం విషయంలో దారులు చూపిన నాయకులు అంటే కొంచెం కొత్తగా ఉంటుందేమో. ఆయన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలను ఎత్తుకుని వాటికి వరుసలు కట్టి పాడిన తరువాత బహుశా ఆ రచనలకు చాలా ప్రాచుర్యం వచ్చి ఉంటుంది. ఇవాళటికీ ఆయన వరుసలలోనే చాలామంది ఆ పాటలను పాడుతున్నారు.
జయదేవుని అష్టపదులు ఉత్తర భారతదేశానికి చెందినవి. రఘునాథ పాణిగ్రాహి వాటికి హిందుస్థానీ పద్ధతిలో వరుసలు కట్టి పాడారు. ఆయన భార్యామణి సంయుక్తా పాణిగ్రాహి వాటికి అభినయం చేసి శాశ్వతత్వం చేకూర్చారు. ఇక మురళిగారు జయదేవుని అష్టపదులను పాడి ఒక సరికొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. ‘తవవిరహే కేశవా’ అన్నా, ‘మంగళశతాని కురు మురారే’ అన్నా జయదేవుని మనసులోని భావాన్ని ఆయన పుణికి పుచ్చుకుని ఆవిష్కరించిన తీరు తలుచుకుంటే ఒళ్లు ఝల్లుమంటుంది. అష్టపదులకు చాలామంది తమ ఇష్టంకొద్దీ వరుసలు కట్టి పాడారు. అవి బాగుండలేదని ఎవరూ అనలేదు. కానీ మురళిగారి దారి మాత్రం మరీ ప్రత్యేకం. ఆ పాటలను తలుచుకుంటే చాలు జయదేవుని కన్నా ముందు నాకు కళ్ల ఎదుట మురళిగారే కదులుతారు.
ఆయన రామదాసు కీర్తనలను ఎత్తుకుని ఒక రికార్డు విడుదల చేశారు. ఆ రికార్డు బహుశా రికార్డులను బద్దలు కొట్టి ఉంటుంది. ‘అదుగో భద్రాద్రి’ అంటూ ఆరంభమయ్యే ఆ రికార్డులోని పాటలు భక్తి లేనివారికి కూడా భక్తిని పుట్టించే రకంగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ఆ రికార్డును తలచుకున్నప్పుడల్లా నాకు అందులోని ఒక లోటు కూడా గుర్తుకు వస్తుంది. కోరస్ పాడడానికి అంతా తమిళ అమ్మాయిలను ఏర్పాటు చేసినట్టున్నారు. మురళిగారు ‘పాహి రామప్రభో!’ అని ఆర్తిగా పాడితే, పాట మొత్తంలోనూ కోరస్ వాళ్లు మాత్రం ‘ప్రబో’ అని మాత్రమే అంటారు. మురళి గారికి కోపం వచ్చి ఉండాలి. అప్పట్లో రాలేదేమో! ఆయన దేన్ని పట్టుకున్నా ఆ విషయంలోని లోతులను తాకడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఒక పూర్తి రెండున్నర గంటల కచేరీలో కేవలం రామదాసు కీర్తనలను మాత్రమే ఆయన పాడి శ్రోతలను మైమరపించారు. ఇక భద్రాచలం దేవస్థానం వారి తరఫున రామదాసు ప్రాజెక్టులో మరెన్నో పాటలను స్వరపరిచి రికార్డు చేయించారు. మురళి గారు పోయారు అన్న మాట నాకు నచ్చడంలేదు. అందుకే ఆ రోజు వ్యాసం రాయమని అడిగిన వారికి లేదు పొమ్మని మొహం చాటు వేశాను. అది వేరే సంగతి కానీ, కొద్దిసేపటికి మా తమ్ముడు వాట్సాప్‌లో నాకొక పాట పంపించాడు. ‘సెలవా, ఇక మాకు సెలవా’ అన్న ఆ పాట వింటే నా గుండె కరిగి కాలువలై పారింది. అది రామదాసు కీర్తనమట. నేను అప్పటివరకు దాన్ని వినకపోవడం నాకే ఆశ్చర్యం కలిగించింది. మురళిగారు వెళ్లిపోయి ఇక నాకు సెలవా అన్న భావం కలిగి కన్నీరు మున్నీరయ్యాను.
బాలమురళిగారు కొంతకాలం పాటు పురందరదాసుల వారి దేవరనామాలు బాగా పాడి వినిపించారు. ‘అనుగాలవు చింతే జీవక్కే’ అని ఒక పాట ఉంది. ఒకటేమిటి.. మరెన్నో చక్కటి పాటలున్నాయి. మురళి గారికి ఏమనిపించిందో గానీ ఆ పాటలన్నింటికీ అదే వరుసలో తెలుగు వర్షన్స్ తయారుచేశారు. ‘బతుకంతా చింతే, జీవికి’ అని ఆయన తెలుగులో పాడిన పురందరుల పాడిన పాట లేకుండా కొంతకాలం ఆయన కచేరీ ముగిసేది కాదు. ఆయన పాడకుంటే అందరూ అడిగి మరీ పాడించుకునేవారు. ‘మతిలేని సతితో మరిమరి చింతే’ అన్న మాట ఆ పాటలో వచ్చినప్పుడు అందరూ హాయిగా నవ్వుకునేవారు. మురళిగారు పాడిన పురందర దేవర నామాలను గురించి తెలుగు శ్రోతలకు నిజంగా తెలిసి ఉండకపోవచ్చు. ఆయన చాలా పాటలు పాడారు. కన్నడ సినిమాల్లో కూడా ఆయన పాడారు. నాకు వెంటనే సుబ్బాశాస్ర్తీ అనే సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రానికి దొరైస్వామి అయ్యంగార్, కృష్ణమూర్తి గారలు సంగీత దర్శకులు. కన్నడంలో గాయకులు లేనట్టు వాళ్లు మురళిగారిని, గోపాలరత్నం గారిని పిలిచి పాటలు పాడించుకున్నారు. ఆ పాటలు తెలుగు శ్రోతలు బహుశా విననేలేదేమో!
మురళిగారు కైవార అమరనారేయణ స్వామి కీర్తనలు అని ఒకసారి తీసుకువచ్చారు. వాటిని స్వరపరిచి భక్తిరంజనికి గాను రేడియోలో రికార్డు చేశారు. ‘తెలిసినందుకు గురుతు’ లాంటి పాటలు అందరినీ ఆకర్షించాయి. ఆసక్తి పుట్టి నేను ఈ అమరనారేయణ స్వామి గురించి కొంత పరిశోధించాను. రాయలసీమ ప్రాంతం వారయిన ఈ మహానుభావుని గురించి చాలా తెలిసింది. మురళిగారి తీరు గురించి చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక త్యాగరాజు, శ్యామాశాస్ర్తీ, దీక్షితార్ కీర్తనలను ఆయన వెతికివెతికి పాడిన తీరు చాలామందికి చేతకాలేదు. అయితే మురళిగారి పాటలో ఒక ప్రత్యేకత కనిపించేది. సికిందరాబాద్ కీస్ హైస్కూల్‌లో ఆయన ‘మాయే త్వం యాహి’ అనే తరంగిణి కీర్తన పాడుతున్నారు. అప్పటికి ఆ కీర్తన నేను విన్నాను. కొంచెం విస్తుపోయి వింటున్నాను. పాట మధ్యలో ఆపి ఆయన ఇంగ్లీషులో నాలుగు ముక్కలు చెప్పారు. ‘నాకు తెలుసు. నేను వరుస మార్చానని మీరు అనుకుంటున్నారు. కానీ మరోలా పాడుతున్న వాళ్లే ఈ పాట వరుసను మార్చారు’ అని ఆయన చెప్పారు. అందరూ రేవతిలో పాడుతున్న అన్నమాచార్య కీర్తనను ఆయన ముఖారిలో పాడారు. అది ఆయన తీరు. ఆయన ఇష్టం. ఆయనను కాదనడానికి, తప్పులు పట్టడానికి ఎవరికీ ధైర్యం లేదు.
మురళి పాట గురించి, ఆయనతో మెలగిన క్షణాల గురించి ఎంతయినా చెప్పవచ్చు. వద్దనుకుంటూనే ఇంత చెప్పాను. ఇది చాలు.

కె. బి. గోపాలం