లోకాభిరామం

పల్లె రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బండిమీద చింతచిగురు బూడ్డెవోసి (కుప్ప పేర్చి) అమ్ముతుంటరు. ఎంత? అని అడగాల్సిన పని. దానికి ఎట్ల యిచ్చినవు? అని ప్రశ్న. కిలో ధర చెపితే ముందు, అంత ఎవరూ కొనరు. కొని ఆరబెట్టి వాడుకోదలుచుకున్నా, ఆ ధర విన్న తరువాత గుండె ఆగిపోతుంది. ఇంక చింతచిగురుతో పనే ఉండదాయె. అందుకే యాభయి గ్రాములు, వంద గ్రాముల ధర చెపుతరు. గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఆగదు. అయినా తినక తప్పదు. రుచి మరిగిన నోరు అంటరు. ‘క్యా పకాయె మాలన్, చింతచిగురు బైంగన్’ అని చిన్నప్పుడు విన్న పాట గుర్తుకు వస్తుంది. ఈ దేశంలో ఉత్తరాన చింతపండు తినడమే తెలియదు. ఇక చింతకాయ, చిగురు, పువ్వు తినడం గురించి చెపితే, నిజంగనే దాక్షిణాత్యులను, అంధకులు, బర్బరులు, దస్యులు అంటరేమో? ఏ పదార్థమయినా రుచి, తిన్న వానికి తెలుస్తుంది. విన్న వానికి దాని సంగతి తోచనే తోచదు. ఒక స్వామి ఈ విషయంగ చక్కని మాట చెప్పినరు. ‘తేనెను తెచ్చి పూజ చేస్తే, దాని స్వారస్వం (రుచి) తెలియదు. దాన్ని తింటే రుచి తెలుస్తుంది, అన్నరు. చింత చిగురయినా అంతే, బొంత కాకరకాయలయినా అంతే.
‘చింతపండు చెట్టు’ అన్నరు ఎవరో. చింతచెట్టు ఉంటుంది. పండు చెట్టు, కాయ చెట్టు, చిగురు చెట్టు ఉండవు. ఇదే దారిలో ఒక అమ్మగారు కంది చెట్టును, చేనును పప్పుచెట్టు అన్నరట. ఆమెకు విస్తరిలో వడ్డించిన పప్పు కళ్ల ముందు కనిపించినట్లు ఉంటుందేమో? ఇంకా నయం, బియ్యం చెట్టు, అన్నం చెట్టు అనలేదు. అన్నవారు ఎవరో ఉండే ఉంటరు.
చిన్నప్పుడు దోస్తులనే, మిత్రుల సావాసం కారణంగా గమనించిన ఒక వింత విషయం గుర్తుకు వచ్చింది. అందరము కలిసి పొలాలలో పడి తిరుగుతున్నము. ఎవరికో మరి ముందు నుంచే ఆలోచన ఉన్నట్టుంది. మర్రి ఆకులు తెంపి ఒక దొనె్న అనే ఆకుగినె్న తయారుచేసినరు. అందులో మూడు వంతుల వరకు చింత చిగురు తెంపి నింపినరు. ఇప్పుడు మీరు గుండె గట్టిగ పట్టుకుని చదవండి. కొన్ని వేప అనే యాపపండ్లు తెచ్చి అందులో కలిపినరు. ఉప్పు కూడ తెచ్చి కలిపినట్టు అనుమానం. అప్పుడొక తంతు. దొనే్న, దొప్ప, చిప్ప, గినె్న అనే పాత్రను, పత్ర పాత్రను గడ్డిలో పెట్టినరు. ఆకులతో మూసినరు. అందరు దాని మీద ఒక దాని మీద ఒకటిగా చేతులు పెట్టినరు. ఒకరెవరో పైనుంచి ఆ చేతుల మీద గుద్దుతున్నరు. అంటే చాల నెమ్మదిగ ఆ లోపలి వస్తువులను కలియబెట్టినరని అర్థం. కొంతసేపు తర్వాత, చూస్తే లోపల ఒక వింత మిశ్రమం తయారయింది. అందులోనుంచి వేపపండ్ల గింజలు, పొట్టు తీసేసినరు. చిగురు పులుపు, వేపపండులోని చేదుగల తీపి, కలగలిసి వింత రుచి. నేను తినడానికి భయపడినట్టు బాగ గుర్తుంది. ఇట్ల తింటుంటే మనం మొరటు వాండ్లము గాక మరేమి అవుతము?
అసలు ఇదంత చెపుతున్ననంటే వెనుక, మనసులో ఒక సూత్రం ఉంది. అప్పట్లో ఈ వస్తువులు ఏవీ కొనవలసిన అవసరం ఉండేది గాదు. ఊరి చుట్టు వేపచెట్లు ఉండేవి. రాలిన వేపపండ్లను తెచ్చి, గింజలు తీసి ఆరబెట్టి, వాటిని అమ్మి, నాలుగు పైసలు సంపాయించిన తీరు నేను చూచిన. సాయంత్రం బయటకు వెళ్లి కొంత దూరం తిరిగితే, మరునాటికి కూరలు, కాయలు ఊరికే దొరికేవి. ఏ కాలంలో ఆ రకాలు తగినట్టు ఉండనే ఉండేవి. చెరువు కంటే చిన్న జలాశయం పేరు కుంట. ఆ కుంటకట్ట మీద పొన్నగంటి కూర, దోస కాయలు, గుమ్మడికాయలు పెరుగుతుండేవి. ఆశ పడకుండ, కొంత మాత్రం తెచ్చుకుంటే అభ్యంతరం లేదు. నాకు ఇప్పుడు ఒక సంగతి తోస్తుంది. అప్పట్లో ఊళ్లోని చాలామందికి కూరగాయలు పండించడమే గాని వండుకుని తినడం, అంత అలవాటు ఉండేది కాదని అనుమానం. అందరి కోసం అడివంతా పండుతున్న పండ్లు, కాయల కోసం అంతగా పోటీ ఉండేది కాదు.
మా పాలమూరు ప్రాంతం సీతాఫలాలకు ప్రసిద్ధి. అడవులను గుత్తేదారులు అనే కాంట్రాక్టర్లు డబ్బు పెట్టి పట్టుకునేవారు. లారీల కొద్ది కాయలను బొంబాయికి రవాణా చేసేవారు. అయినా ఊరి వారు కాయలు, పండ్లు తినకుండా ప్రతిబంధకం ఉండేది కాదు. మాలాంటి కొందరు, గంపతో కాయలు ఇంటికి తెచ్చుకున్నా అడిగింది లేదు. అది పక్కన బెడితే అడవిలో రకరకాల పండ్లు, కాయలు దొరికేవి. ఆదివారాలు, సాయంత్రాలలో వాటి సేకరణ ఒక ప్రత్యేక కార్యక్రమం. ఏటా ఒక నాడయినా నక్కరి పండ్ల కొరకు అడివికి పోయేవాళ్లం. అవి ఎర్రని రంగులో అందంగా మెరిసిపోతూ ఉండేవి. పులుపు కలిసిన తీపి రుచి. లోపల గుండ్రని, పెద్ద గింజ. బాగా పండిన పండ్లను అక్కడికక్కడ తినడం. సాయంత్రం అయేసరికి, ఆ పండ్లలోని అసిడిటీ కారణంగా నాలుక పగిలేది. ఒకటి రెండునాళ్లు, తిండి తింటే నోరు మండేది.
నిన్ననెవరో పల్లె మనిషి, సంచిలో ఇప్పపండ్లు తెచ్చి, అరుస్తూ వీధిలో అమ్ముతున్నడు. కొన్ని రకాల పల్లె పండ్లు, పల్లెల్లో ఉన్నయో లేవో గానీ, పట్నంలో మాత్రం తప్పక దొరుకుతయి. పులిచింత పండ్లు అని, చూడడానికి చిక్కుడుకాయలాగ కనిపించే రకం ఒకటి ఉంటుంది. అందులో చింతగింజ లాంటి గింజలు ఉంటయి. గింజ చుట్టు తెల్లని, తినడానికి వీలుండే పదార్థం ఉంటుంది. అది తెలుపు నుంచి కొంత రంగు తిరుగుతుంది. ఈ పండ్లు పట్నంలో కూడ అక్కడక్కడ కనబడుతుంటయి. ఎవరు కొని తింటరో మరి. పట్నం నిండ, నాలాగనే, పల్లెవాండ్లే గదూ! నా లాగనే వాళ్లంత పల్లె రుచులను మిస్ అవుతుంటరు.
తుత్తురు పండ్లు, ఇంకా దొరుకుతున్నయా? పల్లెలు పల్లెలలాగ లేవు. అడవులు, అసలే లేవు. చెట్లు కనిపిస్తే, అందులో సగం సర్కారు (మురికి) తుమ్మలే ఉంటయి. గచ్చపొదలు, గురివింద పొదలు, బలుసురు చెట్లు మొదలయినవి ఉన్నయో లేదో తెలియదు. తుత్తురు పండ్లు, చూడడానికి పొడుగాటి గొంగడి పురుగులాగ ఉంటయి. కమ్మని రుచి, వాసన ఉంటయి. బలుసు పండ్లు గుండ్రంగ, చిన్నగ, పసుపు రంగులో ఉంటయి. నాకు ఈ క్షణాన బయలుదేరి పల్లెల్లో తిరిగి చూడాలని అనిపిస్తున్నది. అట్ల అనుకునేది, నేను ఒక్కడినే కాదని నాకు గట్టి నమ్మకం.
జిట్టరేగి పండ్లు ఏమయినయి? పట్నంలో బండ్ల మీద కనబడతయి గానీ, ఎండిపోయి ఉంటయి. చిన్ననాడు గంగరేగు అనే పెద్ద, పొడుగాటి పండ్లు అరుదు. జిట్టరేగు బాగా దొరికేవి. వాటి కోసం నానా కష్టాలు పడేవాండ్లము. తినగలిగినన్ని పండ్లు తింటే, వాటిలోని పిండి పదార్థం కారణంగా గొంతు పూడుకు పోయేది. అయినా వాటి రుచి ముందు మరేదీ ఎదురు నిలవదు. రేగిపండ్లు కొన్నింటిలో పులుపు పాలు ఎక్కువగ ఉండేది. అటువంటి పండ్లు దొరికినప్పుడు, అమ్మ వాటితో పచ్చడి తయారుచేసేది. ఉప్పు, పులుపు, తీపి, ధనియాల పొడి వాసన కలిసిన, ఆ గింజలను ఎంతసేపు చప్పరించినా ఇక చాలు అనిపించేది కాదు. రేగి, రేగు చెట్లకు ముళ్లు, ముండ్లు ఉంటయి. వాటితో జాగ్రత్తగ ఉండాలె. లేదంటే చిలుకముక్కులాగ వంపు తిరిగిన ఆ ముండ్లు చర్మాన్ని చీల్చి గాయం చేసేవి. పల్లెలో కూడా పిల్లలకు ఈ కాలంలో, అడవిలో తిరగడం, పండ్లు, కాయలు ఊరికే తెచ్చుకోవడం తెలుసా?
ఆ మధ్యన ఒక పల్లెకు వెళ్లాను. వాళ్ల ఇంటి ఆవరణ ఫుట్‌బాల్ గ్రౌండుకు సమానంగా ఉంది. అందులో మధ్యన దయ్యమంత చింతచెట్టు ఉంది. దయ్యాన్ని నేను చూడలేదు. అది ఈ చింతచెట్టంత ఉండదని నాకు అనుమానం. ఆ చింతచెట్టు నిండ కాయలున్నయి. అంటే చిగురుకాలం దాటిపోయిందని అర్థం. కానీ, కాయలయినా తీసుకుపొమ్మన్నారు. విచిత్రంగా, వాటిని తెంపడానికి చెట్టు ఎక్కగల, ఆ ఓపికగల మనిషి దొరకలేదు. బెంగుళూరు అన్నగారు, కర్ణాటకలో వాళ్ల పల్లె నుంచి తెప్పించిన చింతచిగురు (ఎండినది) నాకు బోలెడంత తెచ్చి యిచ్చారు. అది ఇంకా కొంత మిగిలి ఉన్నట్టుంది. ఇక అటువంటి పదార్థాలను రుచిగ వండుకుని తినడం తెలిసి ఉండాలి. అందుకు అవసరమయిన ఓపిక ఉండాలి. ఎండబెట్టిన చింతచిగురును వేసి, పప్పులు, కొబ్బరితో కలిపి పొడి తయారుచేస్తే, చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఎన్ని వ్యంజనాల గురించయినా చెప్పగలను. అన్నిటికీ ఆధారం అమ్మ. ఆమెకు రుచిగా ఉండడం, ఎందుకంత చేతనయ్యేదో అర్థంకాదు. ఆమె చేత ఏం వండినా అది రుచిగానే ఉండేది. అమ్మవల్ల తిండి రుచిగా తినడం అలవాటయింది. ఈ కాలంలో అందరికీ తొందర! రుచి గురించి పట్టించుకునే టైం లేదేమో? వంకాయ కూరలో, చింతచిగురు పులుపు! వారెవ్వా? ఏమి టేస్టు బాసూ?
పల్లె తిండి, అది ఏ దేశంలోనయినా, ఏ ప్రాంతంలోనయినా, బాగుంటుంది. ఆ మధ్య శ్రీలంకలో తిండి గురించి ఒక టీవీ షో చూచాను. వారెవ్వా! అనిపించింది! తిండి మీద ప్రేమ లేకుంటే, మరి ఇన్ని తిప్పలెందుకూ?’
*

కె. బి. గోపాలం