లోకాభిరామం

మళ్లీ ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారజ్ఞుండు అనే మాట చదవడానికి ప్రయత్నిస్తూ నోరు తిరగని మనిషి డజ్ఞు, డంగు, గుండు అంటూ తడబడ్డాడని మా ఇళ్లలో ఒక జోకు సర్క్యులేషన్‌లో ఉండేది. కానీ ఈ మూడు అర్థం లేవనుకున్న మాటలలో చివరి రెండు అర్థం ఉన్న మాటలని చెపితే ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు సిమెంటు లేదు. ఇంటిని సున్నంతో కట్టుకునేవారు. అంటే ఇసుకలో సిమెంటు బదులు సున్నం కలుపుతారని కాదు. ఇసుకను తగిన పాళ్లతో సున్నంతో కలిపి రుబ్బుకోవాలి. రుబ్బు అనగానే దోసెపిండి రుబ్బే రోలు గుర్తుకు వస్తుంది. కానీ ఇల్లు కట్టడానికి అవసరమయ్యే పరిమాణంలో పదార్థం కావాలంటే మామూలు రోలు పనికిరాదు. దాని కోసం డంగు అనే ఒక ఏర్పాటు ఉండేది. భూమిలో వలయాకారంలో రాళ్లతో ఏర్పాటు చేసిన ఒక కాలువ ఇది. అందులో తిరగడానికి వీలుగా ఒక రాతి బిళ్ల ఉంటుంది. దాని పేరు గుండు. ఈ గుండు గుండ్రని బిళ్లలాగ ఉంటుంది. దాని మధ్యలో రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచి వలయం మధ్యభాగంలోకి ఒక పెద్ద దూలం ఉంటుంది. గుండులో నుంచి ఇవతలకు వచ్చిన కర్ర చివరను డంగులో తిప్పే రకంగా ఎద్దులను కట్టడానికి వీలు ఉంటుంది. ఇక్కడ ఎద్దుల సాయంతో సున్నం, ఇసుక కలిపి రుబ్బుతారు. ఈ రుబ్బిన పదార్థాన్ని మా ప్రాంతంలో గచ్చు అంటారు. చార్మినార్ కట్టడానికి ఇటువంటి పదార్థం తయారుచేశారట. అది బాగా మక్కితే భవనం మన్నిక మరింత బాగుంటుందని నిర్మాణం చేయిస్తున్న నిపుణుడు చెప్పాడట. చివరకు ఆ పదార్థాన్ని పరీక్షించడానికి ఎవరో అందులో వేలు పెడితే ఆ వేలు కాలి ఊడిందట. ఇదెంత నిజమో తెలియదు. కథలుగా చెప్పడం మాత్రం విన్నాము. హైదరాబాద్ పొలిమేరల్లో గచ్చిబౌలీ అనే ప్రాంతం ఉంది. అక్కడ బహుశా ఒకప్పుడు గచ్చుతో కట్టిన బావి ఒకటి ఉండేదనుకుంటాను. గచ్చుతో ఇళ్లు కట్టడం నేను కళ్ళారా చూచాను. పాలమూరులో మేము కొన్ని రోజులున్న నారాయణరావు కాంపౌండు వారి గుడి కాంపౌండు పక్కన డంగు, అందులో గుండు ఉండేది. అంటే ఆ గుడిని, దాని పక్కన మేమున్న గదులను గచ్చుతో కట్టారన్నమాట. డంగును మాత్రం వాళ్లెందుకో వదిలేశారు. అప్పట్లో ఇళ్ల కోసం జాగాలను ఇంతగా అమ్ముకోవడం ఉండేది కాదు. ఇప్పుడు నేను వెళ్లి గుడిపక్కన డంగు కొరకు వెదికితే అక్కడ తప్పకుండా సిమెంటుతో కట్టిన నాలుగంతస్తుల ఇల్లు కనిపిస్తుందని నా అనుమానం.
ఇల్లు కట్టడంలో ఒకసారి కొంత వెనక్కి వెళదాం. పాలమూరులో అన్నయ్య కట్టిన ఇంటిపైకప్పు పలాస్ర్తిలతో పేర్చారని చెప్పినట్టున్నాను. ఈ పలాస్ర్తి అనే మాట ఎవరయినా విన్నారా? బహుశా ప్లాస్టర్ అనే ఇంగ్లీషు మాటకు ఇది తెలుగు రూపం అయి ఉంటుంది. ఇంటి పైకప్పును పలాస్ర్తితో నేసేవారు. పలాస్ర్తి అన్నది బ్రెడ్ ముక్కలాగ చదరంగం, మందంగా ఉండే టెరకోటా ముక్క. అంటే ఇటుకలాగే కాల్చిన మంటిపెంకు అని అర్థం. దూలాలు, వాసాలు ఏర్పాటు చేసిన తరువాత ఒక మూల నుంచి మొదలుపెట్టి పలాస్ర్తిలకు గచ్చు, గార అని కొన్ని ప్రాంతాల్లో పిలిచే రుబ్బిన ఇసుక సున్నం కలయికను కొంచెం కొంచెంగా పూస్తూ ఒకదానికొకటి అతికిస్తూ పోతారు. అవి జిగురు పెట్టి అతికించినంత గట్టిగాను ఉండిపోతాయి. మట్టి కనుక ఆ మిద్దెలు అంటే పై కప్పులు మరీ వేడెక్కే పద్ధతి లేదు. ఈ విధానాలు ఎక్కడయినా అమలులో ఉన్నాయేమో తెలియదు. పలాస్ర్తితో కప్పిన పైకప్పును కొంతకాలంపాటు క్యూరింగ్ లాంటి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ప్రత్యేకంగా తయారుచేసిన నీళ్లను ఆ కప్పు మీద కొన్ని రోజులపాటు చల్లుతారు. అన్నగారి ఇంటి ముందు తారు డ్రమ్ములాంటి డ్రమ్ములో నీళ్లు, అందులో అంచులు చెక్కిన కలబంద, తాటిబెల్లం మరేవేవో పదార్థాలను పోసి పెట్టి కుళ్లనివ్వడం, కాదంటే మక్కనివ్వడం బాగా గుర్తుంది. జిగురుగా తయారయిన ఆ నీళ్లను పైకప్పు మీద పోశారు. ఆ జిగురు బహుశా పలాస్ర్తిల మధ్యనున్న ఖాళీలలోకి దూరుతుంది. ఏదో రకంగా ఖాళీలను నింపుతుంది. ఈ రకంగా ఒక మిశ్రమాన్ని తయారుచేయాలని ఏ పరిశోధనలో తేల్చారన్నది నాకు ఇప్పటికీ అంతుపట్టదు. ఆ ఇల్లు కట్టినప్పుడు ఒక పెద్దమనిషి చివరిదాకా కూలీకి వస్తూ రకరకాల సలహాలనిచ్చాడు. అతని అనుభవం ముందు సివిల్ ఇంజనియర్లు దిగదుడుపు అని నాకు అనిపిస్తుంది.
నేను మట్టినేల ఉన్న ఇంట్లో పుట్టి పెరిగాను. వారానికి ఒకటి, రెండుసార్లు పేడ పెట్టి ఆ నేలను అలకడం అనే కార్యక్రమం ఉండేది. పొక్కులు పడినప్పుడు మంచి మట్టి తెచ్చి వాటిని కప్పడమూ ఉండేది. ఈ పనులు రెండూ స్వయంగా నా చేతులతో చేశాను. పేడ అంటే ఇవాళటి కాగితాలు తినే పశువులు వేసిన పట్నపు పేడ కాదు. అచ్చమయిన పచ్చిగడ్డి, ఆకు, అలుము మాత్రమే మేసిన ఆవులు, ఎద్దులు వేసిన పేడ మరో రకంగా ఉండేది. ఆ పేడతో ఇటుకలు చేసి రకరకాలుగా వాడుకునేవాళ్లం. పొయ్యిలోని బొగ్గుతో పళ్లు తోముకోవడం మాకు అలవాటే. పిడక బొగ్గుతో పళ్లు తోముకున్న జ్ఞాపకం నాకు ఇవాళటికి ఉన్నది. అప్పటి పేడ అసహ్యంగా తోచలేదన్నమాట.
కలిగిన వాళ్లు కొంతమంది ఇంటి నేలను గచ్చుతో చేయించుకునేవారు. చివరికి ఎంత దూరం వచ్చిందంటే ఇంట్లో నేలను గచ్చు లేకున్నా సరే, కొంతమంది గచ్చు అంటున్నారు. ఇసుక, సున్నం రుబ్బిన మిశ్రమంతో చేసిన నీళ్ల తొట్టి ఒకటి మా ఇంట్లో ఉండేది. దాన్ని మేము గచ్చు అనేవాళ్లం. బడి నుంచి వచ్చిన తరువాత కాళ్లు కడుక్కోవడానికి బద్ధకించి చిన్నప్పుడు నేను ఏకంగా ఆ గచ్చులోకి దిగి బయటకు రావడం తలుచుకుంటే నాకే నవ్వు వస్తున్నది. గచ్చు నేలను బింగరాయితో రుద్దిరుద్దీ నునుపు తేల్చడం ఒక పని. ఆ నేల ముట్టుకోవడానికి చల్లగా ఉండేది. వేసవిలో కూడా చల్లగా ఉండేదేమో. అసలు ఆనాటి ఎండలు ఇంతగా మండేవి కాదు కదా!
మనిషికి మొదటి నుంచి అంటే, పాత రాతియుగం నుంచి సౌకర్యాలు కావాలన్నది ఒకటే యావ. ఆ యావలో సుఖం గురించి ఆలోచించే తీరు ఎక్కడో జారిపోయింది. జరగవలసిన పని వీలయినంత సులభంగా ముగిస్తే చాలు. తయారయిన పదార్థాలు గానీ, నిర్మాణాలు గానీ ఎంతకాలం నిలబడతాయన్నది, ఎంత అనువుగా ఉంటాయన్నది ఎవరికీ పట్టడం లేదు. మన్నిక అన్న మాట మరుపు తట్టింది. పడమటి దేశాలలో వారు కర్రలు పెట్టి ఇళ్లు కట్టుకుంటున్నారంటే నాకు అసూయగా ఉంటుంది. మన దగ్గర ఒక ఇల్లు కూడా ఆ రకంగా కట్టింది లేదు. కర్ర ఇళ్లను గంటలలో నిలబెట్టే తీరును టీవీలో చూస్తే నాకు మరింత కుళ్లుగా ఉంటుంది. డంగు పోతే పోయింది, దాని స్థానంలో సిమెంటు వస్తే వచ్చింది, ఇప్పుడంతా మిషన్‌లతో పని కనుక డంగు, గుండు అవసరం లేదు. అసలు అనే మట్టి మిశ్రమం అసలే అవసరం లేదు. వాటిని కలిపి రుబ్బడానికి పశువులు, మనుషులు కూడా అవసరం లేదు. పనులు అన్నింటినీ యంత్రాలే చేస్తాయి.
ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కడుతున్నప్పుడు ప్రతి నిత్యం వచ్చి చూచాను. గోడలు నిలబడిన తరువాత చాలాకాలం వాటి మధ్యనే గడిపాను. ఆ తరువాత ఒక్కడిని ఇంట్లో ఉండి వడ్రంగం పని చేయించుకున్నాను. కొత్త ఇల్లు కట్టుకున్నానని మురిసిపోయాను. మొదటి వానల తరువాత అనుభవ రాహిత్యం గురించి అర్థమయింది. బాల్కనీలోకి తెరుచుకునే తలుపు లోపలికి తెరుచుకుంటుంది. వాన బలంగా వస్తే నీళ్లు ఏకంగా బెడ్‌రూంలోకి వచ్చేస్తాయి. ఆ తలుపు బాల్కనీలోకి తెరుచుకునే పద్ధతి అయితే నీళ్లు లోపలికి రావు. ఇది చాలా చిన్న విషయం. కనుకనే ఇల్లు కట్టి చూడు అన్నారు. నాలుగిళ్లు కట్టినా నాకింకా అనుభవం రాలేదు. మరో ఇల్లు కడతానన్న నమ్మకం లేదు.

కె.బి. గోపాలం