ఆంధ్రప్రదేశ్‌

మజ్దూర్‌దే ఆధిక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్ర విభజన తరువాత ఎపిఎస్‌ఆర్టీసీలో తొలిసారిగా ఎంతో ప్రతిష్ఠాకరంగా మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా గురువారం జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ 552 ఓట్ల మెజార్టీతో ముందుకు సాగుతున్నది. అయితే పోస్టల్ బ్యాలెట్లు పోలింగ్‌కు అన్ని జిల్లా కేంద్రాల్లో, కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈనెల 23, 24 తేదీల్లో పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 24వ తేదీ సాయంత్రం ఓట్ల లెక్కింపు అనంతరం అధికారికంగా తుది ఫలితం వెలువడనుంది. నేషనల్ మజ్దూర్ యూనియన్ కనీసం మరో 250 ఓట్లు సాధించగలిగితే విజయకేతనం ఎగురవేస్తుంది. అయితే ఎంప్లారుూస్ యూనియన్ అత్యధిక ఓట్లను రాబట్టి గుర్తింపు పొందేందుకు వ్యూహరచన గావిస్తున్నది. ఈ మూడురోజుల్లోను పెద్దఎత్తున కార్మికులను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటుకు నోటు ముందుకొచ్చే అవకాశం కన్పిస్తున్నది. ఇప్పటికే ఎన్నికల్లో రెండు ప్రధాన యూనియన్లు కూడా లక్షలాది రూపాయలను విరజిమ్మింది. ఇక మిగిలిన పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంత ఖర్చయినా వెనుకాడే పరిస్థితి కనిపించటం లేదు. కిడ్నాప్‌లు చోటుచేసుకోగలవనే భయం రెండు సంఘాలకు వెంటాడుతున్నది. ముందు జాగ్రత్తగా వివిధ జిల్లాల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. తమ తమ అనుకూలురను శిబిరాల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేలా నాయకులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈదఫా ఎన్నికలను తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకుంది. జాతీయ కార్యదర్శి లోకేష్ ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈ ఎన్నికలపై చర్చించటం జరిగింది. వివిధ జిల్లాల్లో తెలుగుదేశం నాయకులు ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. రాష్టస్థ్రాయి గుర్తింపు క్లాస్-3లో 56,437 ఓట్లకు గాను 55,035 ఓట్లు పోల్ కాగా 172 ఓట్లు చెల్లలేదు. అత్యధికంగా మజ్దూర్ యూనియన్ 24,708 ఓట్లు, ఎంప్లారుూస్ యూనియన్‌కు 24,156 ఓట్లు లభించగా బహుజన వర్కర్స్ యూనియన్‌కు 163, కార్మిక పరిషత్‌కు 2387, కార్మిక సంఘ్ 175, వర్కర్స్ ఫెడరేషన్ 2,154, యునైటెడ్ వర్కర్స్ యూనియన్‌కు 257, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 863 ఓట్లు లభించాయి. ఇక క్లాస్-6లో 13 జిల్లాలపై ఎన్‌ఎంయుకు 24,607 ఓట్లు రాగా, ఇయుకు 23,442 ఓట్లు లభించాయి. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 1120 ఓట్లు లభించాయి. 50 శాతం మించి ఓట్లు లభిస్తేనే ఆయా జిల్లాల్లో యూనియన్లకు గుర్తింపు లభిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాలు కలిపి వున్న నెక్ రీజియన్‌లో ఎంప్లారుూస్ యూనియన్‌కు గుర్తింపు లభించింది. గుంటూరు జిల్లాలోను ఇయుకు గుర్తింపు లభించింది. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఎన్‌ఎంయుకు గుర్తింపు లభించింది. మిగిలిన జిల్లాల్లో రాష్టస్థ్రాయి గుర్తింపు పొందిన సంఘానికి మాత్రమే జిల్లాల్లో కూడా గుర్తింపు లభించనుంది. మజ్దూర్ యూనియన్ పట్ల విశ్వాసంతో ఓట్లు వేసిన కార్మికులందరికీ చైర్మన్ ఆర్‌విఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు చంద్రయ్య, ముఖ్య ఉపాధ్యక్షుడు డిఎస్‌పి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.