హైదరాబాద్

మాకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ డివిజన్ల నుంచి కొత్తగా గెలిచి వచ్చిన కార్పొరేటర్లకు అభివృద్ది విషయంలో అధికారులు సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు ముఖ్యంగా డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. దీంతో పాటు రోడ్లు, పచ్చదనం, చెరువుల పరిరక్షణ విషయంలో నూటికి నూరు శాతం కార్పొరేటర్లు కృషి చేయాల్సిన అవసరముందని సూచించారు. ముఖ్యంగా డివిజన్లలో అధికారులు చేపట్టే పౌరసేవల నిర్వహణ పనులను కార్పొరేటర్లు నిరంతరం పర్యవేక్షించాలని, అపుడే మెరుగైన సేవలందే అవకాశముంటుందని ఆయన వివరించారు. అభివృద్ధిలో కార్పొరేటర్లు తమ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాలను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అంతేగాక, ప్రజల అవసరాలు, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరిగేందుకు వీలుగా నిధులు కూడా అవసరమన్న విషయాన్ని గుర్తించి, ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి తమ పరిధిలో కార్పొరేటర్లు సిబ్బంది, అధికారులకు సహకరించాలని సూచించారు. ముఖ్యంగా ఉప్పల్ సర్కిల్‌కు సంబంధించి వేసవి యాక్షన్ ప్లాన్‌ను అదికారులు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఎండకాలం నీటి కోసం ప్రజలు ఎక్కువ తిప్పలు పడుతుంటారన్న విషయాన్ని గుర్తించి, వారికి అవసరమైన చోటుకు తాగునీటి ట్యాంకర్‌ను పంపేందుకు వీలుగా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్లు అభివృద్ధి పనుల్లో కాలనీ సంక్షేమ సంఘాలను కూడా భాగస్వాములను చేస్తే, వారు ఊహించిన తరహాలో అభివృద్ధి జరిగేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక, చెత్త సేకరణను మరింత వేగవంతం చేసేందుకు డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ కార్యక్రమం కూడా విజయవంతమయ్యేందుకు కార్పొరేటర్లు సహకరించాలని సూచించారు.