మెయిన్ ఫీచర్

యాజ్ఞసేని 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రౌపది సమేతులై కుమ్మరి ఇంటికి వెళుచున్న భీమార్జులను, తండ్రి ఆజ్ఞ మేరకు దృష్టద్యుమ్నుడు వారి వెనుక నుండి వారిని అనుసరించాడు. భీమార్జునులకు తెలియకుండా సేవకులను అంతా నియమించాడు.
దృష్టద్యుమ్నుడు భార్గవుని ఇంటి వద్ద అజ్ఞాతంగా ఉన్నాడు. పాండవుల గురించి గోప్యంగా వివరాలను సేకరిస్తున్నాడు.
సాయం సమయం అయింది. భీమార్జున నకుల సహదేవులు భిక్షాటనం కోసమై బయలుదేరి వెళ్ళారు.
వారలా భిక్షపాత్రలు పట్టుకొని వెళ్ళటం చూచిన ద్రౌపది, తాను రాజ గృహంలో పరిచారికలు సేవిస్తుండగా కోరిన భోజనం చేసిన తనకు ఇక్కడ భిక్షాన్నం తినవలసి రావడం ఒక్కింత కష్టమనిపిస్తున్నది. ఇది విధి నిర్ణయం అని తలపోసి ముందు ఏమి జరుగనున్నదో అని వేచి చూస్తున్నది.
బయటికి పోయిన భీమార్జున నకుల సహదేవులు బ్రాహ్మణుల ఇండ్లలో భిక్షాటం చేసి ఇరిగి వచ్చాడు. భిక్షాటనంలో తెచ్చిన ఆహారాన్నంతా ధర్మరాజుకు నివేదించారు. కుంతిదేవి లేచి భిక్షాన్నాన్ని చూసి ఆప్యాయంగా ద్రౌపదిని పిలిచింది.
‘‘సుందరీ! ద్రౌపదీ! ముందు నీవా అన్నం తీసికొని అందు అగ్రభాగాన్ని తీసికొని ఒక భాగం దేవతలకు నివేదించుము.
మరొక భాగం విప్రులకు భిక్షగా పెట్టుము. మన చుట్టూ ఆశ్రయించుకొన్నవారికి కొంత భాగం పెట్టుము.
మిగిలిన దానిలో సగభాగం ఒక ప్రక్కన పెట్టుము.
ఇంకా మిగిలిన దానిని ఆరు భాగాలుగా చేయుము. నాలుగు భాగాలు కొడుకులకూ, నాకు ఒకటి, నీకు ఒకటి.. మొత్తం ఆరు భాగాలు.
మొదట చేసిన సగ భాగం.. అడుగో ఏనుగులా, వృషభంలా తెల్లగా పెద్ద శరీరంతో ఉన్న యువకుడు ఉన్నాడే వాడు కాస్త ఎక్కువగా తినగలడు. వాడికి పెట్టుము’’ అని అన్నది.
ఆ మాటలు విన్న ద్రౌపది ఎంతమాత్రం శంకించకుండా ‘‘తమరు ఎలా చెబితే అలానే చేస్తాను’’ అని అన్నది. సంతోషంతో కుంతీదేవి చెప్పినట్లుగా అక్షరాలా చేసింది.
అందరూ అభినందించారు.
భోజనానంతరం సహదేవుడు నేలమీద దర్భలతో శయనం ఏర్పాటుచేశాడు.
ద్రౌపది ప్రీతితో అందరి పడకలపై జింక చర్మాలను పరిచింది.
పాండవులందరూ దక్షిణాభిముఖంగా తలలు పెట్టి శయనించారు. వారి తలల వద్ద కుంతీదేవి తలగడగా శయనించింది.
ద్రౌపది పాండవుల కాలి దిండులా నేలమీద పరచిన దర్భలపై పరుండింది.
ద్రౌపదికి తొందరగా నిద్రబట్టలేదు. పాండవుల భిక్షాటనం గురించి ఆలోచించింది. తాను ఆగర్భశ్రీమంతురాలను. భిక్షాన్నం స్వీకరించవలసి వచ్చింది. దర్భలపై పరుండవలసి వచ్చింది. అయినా స్వయంవరంలో గ్రహించినవారి ఆచార వ్యవహారాలను తాను పాటించవలసిందే గదా! వేరే మార్గం లేదు. తానొక స్ర్తిని. అత్తవారింటికి వెళ్లిన తరువాత వారు చెప్పినట్లుగా చేయట తనకు ధర్మం అని పరిపరి విధాలా ఆలోచించింది. మనస్సును పదిలపరచుకుంది.
పడుకొని వున్న పాండవులు కొంతసేపు మాట్లాడుకొనటం శ్రద్ధగా విన్నది. వీరు పాండవులన్న నమ్మకం కలిగింది.
వీరు కాంపిల్యానికి ఎలా వచ్చారు. గొప్ప తేజస్సుతో ఉట్టిపడుచున్నవాడు ధర్మరాజా! ధర్మానికి మారు పేరే. సందేహం లేదు. ఇలాంటివాడికి విధి వక్రించి మారువేషంలో ఉండవలసి వచ్చింది.
ధర్మరాజుకు ఎడమ ప్రక్కన పరుండినవాడు భీమసేనుడా! పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు. అతి బలాఢ్యుడు. అందుకే కుంతీమాత తెచ్చిన భిక్షాన్నంలో సగభాగం అతడికి పెట్టమన్నది.
భీమసేనునికి ఎడమప్రక్కన పరుండినవాడే ‘అర్జునుడా’! తన తండ్రిని పట్టి గురుదక్షిణగా ఇచ్చినవాడు. ఈతడికొరకేనా నా తండ్రి యజ్ఞం చేసి నన్ను పొందింది. పాండవులలో మేటి. ఇతడికి ఇతడేసాటి. స్వయంవరంలో ఎవ్వడూ ఛేదించలేని మత్స్యయంత్రాన్ని అవలీలగా పడగొట్టి తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నా పాణిని గ్రహించగలిగినాడు. మా తండ్రి కోరిక నెరవేర్చినాడు.
అర్జునునికి ప్రక్కనే పరుండినవారు నకుల సహదేవులా! మాద్రేయులు. వినయ సంపన్నులు. అన్నల ఆజ్ఞను శిరసావహించి పాటించువారు.
పాండవులు జీవించే ఉన్నారు. ఇది నిజం కావాలి. ధర్మవర్తనులు కష్టాలను పొందినా అవి తాత్కాలికమే అవుతుంది.
అంతిమంగా విజయం తప్పక వారిని వరిస్తుంది. ఈ సత్యము వీరి విషయంలో తేలిపోయింది.
అర్జునుడు తనను గెలుచుకున్నాడు. నేను అతడికే భార్యను కాగలనా? లేక అత్త అన్నమాట నెరవేరుతుందా?
అని అనేక విధాలుగా ఆలోచిస్తూ నిద్రలోనికి వాలిపోయింది.
***

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము