మెయన్ ఫీచర్

రామాయపట్నానికి స‘పోర్టు’ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి భద్రతా కారణాల రీత్యా ‘్భరత అంతరిక్ష పరిశోధనా సంస్థ’ (ఇస్రో) అభ్యంతరం చెబుతుండడంతో ప్రకాశం జిల్లాలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నెలకొల్పే యోచన మరోసారి తెరపైకి వచ్చింది. సహజ సిద్ధమైన వనరులు ఉన్నప్పటికీ రామాయపట్నం ప్రాంతం చిరకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. దుగరాజపట్నం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని సూచిస్తే పోర్టు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంసిద్ధత తెలిపినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ విషయమై వేగంగా అడుగులు వేసినపుడే పోర్టు నిర్మాణంలో ఇప్పటికే జరిగే తీవ్ర జాప్యాన్ని మనం అధిగమించే అవకాశం ఉంటుంది.
నౌకాశ్రయం నిర్మాణానికి రామాయపట్నం పూర్తిగా అనుకూలమని, అక్కడ పోర్టు నిర్మాణమైతే వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడగలదని ఇప్పటికే పలు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. యూపీఏ హయాంలో దేశంలో రెండు భారీ నౌకాశ్రయాల నిర్మాణానికి సంకల్పించిన సమయంలోనే ఈ పోర్టు అంశం తెరపైకి రావడం గమనార్హం. అప్పట్లో పశ్చిమ బెంగాల్‌కు ఒకటి కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌లో మరొకటి ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై సమగ్ర సర్వే చేయించి విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం ప్రాంతాలను ఎంపిక చేశారు. నక్కపల్లికి సమీపంలో ఇప్పటికే విశాఖ, గంగవరం, కాకినాడ నౌకాశ్రయాలు ఉండడంతోపాటు నౌకాదళం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. దుగరాజపట్నంకు సమీపంలోనే కృష్ణపట్నం వద్ద పోర్టు నిర్మాణంలో ఉండడంతో రామాయపట్నం వైపు మొగ్గు కనిపించింది.
రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖతో కలిసి జరిపించిన సర్వేలో నౌకాశ్రయ నిర్మాణానికి రామాయపట్నం అన్ని విధాలా సౌకర్యవంతంగా వుంటుందని 2012 సెప్టెంబర్‌లోనే నిర్ణయానికి వచ్చారు. అప్పుడే నిర్మాణం ప్రారంభించి ఉంటే ఈపాటికి మూడొంతులు పూర్తయి ఉండేది. ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో రూ. 25 వేల కోట్ల వ్యయంతో,ఏడాదికి 30 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా, ఆరు బెర్తుల సామర్థ్యంతో నౌకాశ్రయం ఏర్పాటుచేసేలా నివేదిక రూపొందించారు.
భవిష్యత్‌లో 30 బెర్త్‌ల వరకు దీనిని విస్తరించి దేశంలోనే పెద్ద నౌకాశ్రయాల్లో ఒకటిగా చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి వచ్చినట్లేనని భావిస్తున్న తరుణంలో అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్ పార్లమెంటు సభ్యులతో సంతకాలు చేయించి పోర్టు విషయమై ఒత్తిడి తెచ్చారు. దీంతో దుగరాజపట్నం పోర్టుకు 2013లో కేంద్రం సుముఖత తెలిపింది. అయితే సమీపంలోనే శ్రీహరికోట రాకెట్ కేంద్రం (షార్) ఉన్నందున ‘ఇస్రో’ తొలి నుంచీ దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ వచ్చింది. దగ్గరలోనే వున్న కొల్లేరు సరస్సు రక్షణ అంశం కూడా ప్రస్తావనకు రావడంతో నిర్మాణ ప్రతిపాదనలు ఏళ్లపాటు మూలన పడ్డాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన నౌకాశ్రయం నిర్మాణం 80 శాతం వరకు పూర్తయింది. ఏపీలో మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక రామాయపట్నం నౌకాశ్రయంపై మరోసారి దృష్టి పెట్టింది. 2015లో రైట్ సంస్థతో నివేదికలు తయారు చేయించింది. ‘సాగరమాల’లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో తొలిదశలో 1200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారుచేసింది. ఒక్క పెద్ద పరిశ్రమ కూడా లేని ప్రకాశం జిల్లాకు రామాయపట్నం నౌకాశ్రయం పెద్ద వరమే కాగలదని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి గ్రానైట్, పొగాకు, పత్తి, ఉప్పు, ఆక్వా ఉత్పత్తులు, జీడిపప్పు వంటివి ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. ఆంధ్ర, రాయలసీమతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఈ పోర్టు వుంటుంది.
ప్రస్తుతం ఈ ప్రాంతం నుండి జరుగుతుతున్న సుమారు రూ.25 వేల కోట్ల విలువ చేసే 30 లక్షల టన్నుల పొగాకు, మిరప,గ్రానైట్, పత్తి, వస్త్రాలు, ఉప్పు, కాఫీ, మొక్కజొన్న, రసాయనాలు, ఆక్వా ఉత్పత్తులను రామాయపట్నం నుండి ఎగుమతి చేసే అవకాశం వుంది. ఇప్పుడు జరుగుతున్న లక్షలాది టన్నుల ఎరువులు, వంట నూనెలు, పెట్రోల్, డీజిల్, బొగ్గు, యంత్ర పరికరాల దిగుమతులను ఇక్కడి నుండి చేసుకొనే వీలుంటుంది. రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గించుకొని మన ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింతగా పోటీ ఇచ్చే అవకాశం వుంటుంది. ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు విశాఖపట్నం 620 కిమీ, ముంబయి 740కిమీ దూరంగా ఉండడంతో రామాయపట్నం పోర్టు వస్తే ఎగుమతులు, దిగుమతులకు ఎంతో సౌకర్యంగా వుండగలదు. ఏపీ నుండి జరిగే ఎగుమతులతో చాలావరకు ఈ పోర్టు దగ్గర కాగలదు.
రామాయపట్నం పోర్టు కార్యరూపం దాల్చితే పెట్రో కెమికల్స్ సముదాయం ప్రకాశం జిల్లాలో ఏర్పడే అవకాశం వుంటుంది. అప్పుడు ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అత్యద్భుతంగా అభివృద్ధి చేసే వీలు కలుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మధ్యలో వుండడం, అటు కర్నాటక, తమిళనాడులకు సైతం అందుబాటులో వుండడంతో ఆయా ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తులను చేరవేయడంలో రవాణా చార్జీలను గణనీయంగా ఆదా చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది.
వికేంద్రీకృత అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సమయం నుండి స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రతి జిల్లాలో ఒక్కో ప్రధానమైన పరిశ్రమ సముదాయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా వైపు ఆయన దృష్టి సారించలేకపోయారు. రామాయపట్నం నౌకాశ్రయంతోపాటు పెట్రో కెమికల్స్ సముదాయాన్ని ఈ జిల్లాకు తీసుకు రాగలిగితే ప్రకాశం జిల్లా అభివృద్ధి చరిత్రలో ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకొనే అవకాశం వుంది.
తొలి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఇప్పుడు విభజిత తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారకులు కావడం చారిత్రాత్మక అంశంగా మిగిలిపోయే వీలుంటుంది. అధికారంలో వున్న వారు సకాలంలో తగు నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయాలను అమలు జరపడం పట్ల పట్టుదల చూపకపోవడం కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి జాతీయ స్థాయిలో పలు ప్రాజెక్టులను, పరిశ్రమలను పొందలేకపోతున్నాము. పి.వి.నరసింహారావు ప్రధానిగా వున్న సమయంలోగాని, కేంద్రంలో వి.పి.సింగ్, దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాటులో మన ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, చంద్రబాబు నిర్ణయాత్మక పాత్ర వహించిన సమయంలో గాని మన రాష్ట్రానికి చెప్పుకోదగిన ఒక్క పెద్ద పరిశ్రమను కూడా పొందలేకపోయాము. విశాఖ తరువాత మరో పెద్ద ఓడరేవును నిర్మించుకొనే అవకాశం యూపీఏ ప్రభుత్వ హయాంలో లభించినా ఉపయోగించుకోలేకపోవడం దురదృష్టకరం. తిరిగి విభజన చట్టం రూపంలో ఆ అవకాశాన్ని కార్యరూపం దాల్చుకునే సందర్భం వచ్చింది. ఈ విషయంలో ఎటువంటి కాలయాపన లేకుండా పోర్టు నిర్మాణం ప్రారంభం కావడానికి చొరవ చూపవలసి వుంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రాజకీయంగా ఏపీ అభివృద్ధి పట్ల దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఇక్కడ అధికారంలోకి రాగలమని బిజెపి అనుకోవడం లేదు. ఒడిశా, కర్నాటక, తెలంగాణలపై అటువంటి ఆశలు కొంతమేరకు వున్నాయి. ఈ కారణంగానే విభజన చట్టంలోని అంశాల అమలుపట్ల సహజంగానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపుతోంది. ఎన్టీయే భాగస్వామ్య పక్షంగా కేంద్రంపై రాజకీయంగా వత్తిడి తీసుకురావడం ద్వారా ఆయా అంశాలను అమలుపరచేటట్లు చేసుకోవలసిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపైనే ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లిప్త ధోరణి అవలంబించిందని చెప్పవచ్చు. ఒంటెత్తు పోకడలతో రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం కాకుండా, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉమ్మడిగా కేంద్రంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసుంటే మరింత ఎక్కువగా ప్రభావం ఉండేది.
chitram...
విశాఖ తరువాత మరో పెద్ద ఓడరేవును నిర్మించుకొనే అవకాశం యూపీఏ ప్రభుత్వ హయాంలో లభించినా ఉపయోగించుకోలేకపోవడం దురదృష్టకరం. తిరిగి విభజన చట్టం రూపంలో ఆ అవకాశాన్ని కార్యరూపం దాల్చుకునే సందర్భం వచ్చింది. ఈ విషయంలో
ఎటువంటి కాలయాపన లేకుండా రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభం
కావడానికి చొరవ చూపవలసి వుంది.

-చలసాని నరేంద్ర