మెయన్ ఫీచర్

ప్రజాస్వామ్య వ్యవస్థకు అపచారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీ, పార్లమెంటు అనే చట్టసభలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయాలు. ఈ ఆలయాలను ప్రజాప్రతినిధులు బహిష్కరించడమంటే- ప్రజల నమ్మకాలను వమ్ము చేసినట్లే. నిరసన తెలియచేసేందుకు ప్రతి దానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులు హద్దు దాటితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభమై, ఈ నెలాఖరు వరకు జరుగుతాయి. ఏపీలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నాయి. ఈ సమావేశాల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఒకసారి, డిసెంబర్‌లో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందున దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతోంది.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికార పార్టీ తప్పులను వేలెత్తి చూపే విధంగా ప్రతిపక్ష పార్టీలు చట్టసభలను ఉపయోగించుకోవాలి. అధికార పార్టీ కూడా విపక్షాలు ప్రజావాణిని బలంగా విన్పించేలా తగిన వాతావరణాన్ని కల్పించాలి. ఏపీ అసెంబ్లీ తొలిరోజునే గవర్నర్ ప్రసంగ సమావేశానికి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హాజరు కాలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయమై స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలన్న వైకాపా డిమాండ్ సబబే. కాని ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం సరైన విధానం కాదు. గత అసెంబ్లీ సమావేశాలకు కూడా వైకాపా హాజరు కాలేదు.
చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం, ఫిరాయింపులను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనే అంశం ప్రజల పరిధిలోకి రాదు. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తుంటారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తే, ఎన్నికల్లో గెలిచిన నేతలు అసెంబ్లీకి వస్తారు. పార్టీ కార్యాలయంలో, అసెంబ్లీ ఆవరణలో, మీడియా పాయింట్‌లో, బహిరంగ సభలు, ధర్నా ప్రదేశాల్లో మాట్లాడం వేరు. అసెంబ్లీలో మాట్లాడడం వేరు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించాలి. ప్రజల సొమ్ముతో చేపట్టే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రభుత్వాన్ని విపక్షం నిలదీయాలి. అధికార పక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఓపికతో భరించి తమ వంతు వచ్చినప్పుడు ప్రభుత్వ వైఫల్యాల్యాలను కడిగేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. జీరో అవర్‌ను ప్రస్తుత ఎమ్మెల్యేలు మర్చిపోయారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు జీరో అవర్ పట్ల శ్రద్ధపెట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీలం సంజీవరెడ్డి మొదలు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్ హయం వరకు జీరో అవర్‌లో ప్రస్తావించిన కొన్ని అంశాలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మీడియా కూడా జీరో అవర్ అంశాలను కవర్ చేసేవి. విపక్షాలు ఇచ్చే కొన్ని వాయిదా తీర్మానాలతో అసెంబ్లీ దద్దరిల్లిన సందర్భాలు కోకొల్లలు. అధికార గణం, మంత్రులు, ముఖ్యమంత్రి సహా అందరికీ ముచ్చెమటలు పట్టేవి. లఘు చర్చలు బాగా జరిగేవి. బడ్జెట్ వచ్చిందంటే చాలు పండగే. వివిధ శాఖలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, వ్యయంపై విపక్షాలు ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. వివిధ బిల్లులపై రసవత్తమైన చర్చ జరిగేది. సాయంత్రం సమయాల్లో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపేవారు. ‘కౌల్ అండ్ షక్దర్’ పుస్తకం చూసి పాయింట్ ఆఫ్ ఆర్డర్లతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆసక్తికరమై వాగ్వాదం జరిగేది. ఇదంతా గతం.
ఇపుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు పేలవంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. తమకు మైక్ ఇవ్వడం లేదనడం, ఇచ్చినా వెంటనే మైక్ కట్ చేస్తున్నారని, తమ నేతపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవకపోవడం తదితర కారణాలపై వైకాపా తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. కొత్తదనం లేని ఈ కారణాలను చాలారోజులుగా వైకాపా ప్రస్తావిస్తోంది. ప్రతిపక్ష పార్టీ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అధికార పార్టీ ప్రతిపక్షపార్టీగా మారినా సభకు హాజరుకాలేని పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత అజెండాలకు అసెంబ్లీని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడం అధికార, విపక్ష పార్టీలకు తగదు. ఒక వైపుఏపీ ప్రజలు ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయాలపై తీవ్ర నిస్పృహతో ఉన్నారు. ప్రజలకు భరోసా కల్పించే విధంగా అధికార, విపక్ష పార్టీలు సభలో ఒక రోజు చర్చించి మంచి సందేశమివ్వాలి. కయ్యాలకు, కవ్వింపులకు, పంతాలకు, పట్టింపులకు అసెంబ్లీని వేదికగా చేసుకుని పోట్లాడుకోవడం ప్రజాస్వామ్య పతనానికి దారితీస్తుంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చి హాజరై సమావేశాలు సజావుగా నడిపేందుకు తమ వంతు సహకరించాలి. అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడే ధోరణిని కొనసాగిస్తే ప్రజల దృష్టిలో చులకన అవుతుంది. అసెంబ్లీకి వచ్చినా సభకు రాకపోవడం, స్థానికంగా ఉంటూ సభకు గైర్హాజరు కావడం అంటే ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసినట్లే అవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును వినిపించేందుకు అసెంబ్లీకి మించిన వేదిక, పవిత్ర మందిరం మరొకటి లేదు. అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీ వచ్చే పరిస్థితులు కల్పించకుండా, వారు రాకుండా ఉండే చాలు, ఏదోలా అజెండాను ముగించుకుని తొందరగా సభను వాయిదా వేసుకుని పోదామనే ధోరణి అధికార పార్టీలో ఉండరాదు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం మూడే పార్టీలు ఉన్నాయి. అధికార టిడిపితో బిజెపి భాగస్వామ్యంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా వైకాపా ఉంది.
ఏపీలోని ఐదు కోట్ల మంది ఆంధ్రులు దిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఢిల్లీకి వెళ్లి ఉద్యమాన్ని చేపట్టింది. టీవీ చానళ్లు జనంలోకి వెళ్లి ప్రత్యేక హోదాపై అభిప్రాయ వేదికలను నిర్వహిస్తున్నాయి. ఇంత హడావుడి జరుగుతుంటే, మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి కొనసాగితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైఫల్యానికి దారితీస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరు అద్భుతంగా ఉంది. రాజకీయాలు, పరస్పరం విమర్శించుకోవడం ఎలా ఉన్నా, మూడేళ్ల పాటు పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య భగ్గుమనే వాతావరణం ఉన్నా, శాసనసభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కరచాలం చేసుకునే మంచి వాతావరణం ఉంది. ఈ విషయాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. సభ వెలుపల ఏ అంశంపైన అయినా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. నిబంధనలకు లోబడి స్పీకర్ శాసనసభను నిర్వహిస్తారు. అధికార, విపక్ష పార్టీ సభ్యులు హద్దు దాటితే స్పీకర్ కట్టడిచేస్తారు. మరీ శ్రుతిమించితే కొన్ని సార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రతి రోజూ ప్రతి అంశంపై అధికార, విపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తూ పోతే ప్రజాస్వామ్యానికి అపచారం చేసినట్లే. శాసనసభను అర్థవంతమైన చర్చలకు ఉపయోగించుకోవాలి. ఏపీలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, హైకోర్టు ఏర్పాటు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ మొదలైన అంశాలు చర్చకు సిద్ధంగా ఉన్నాయి. కాని ఎంతసేపూ అధికార, ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూసుకుని, సంబంధం లేని అంశాలపై ఆరోపణలు చేసుకుని చర్చను పక్కదారి పట్టించి సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగించే సంస్కతి పెచ్చుమీరింది. తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ సారి కాళేశ్వరం ప్రాజెక్టు, భూసర్వే తదితర అంశాలపై అధికార, విపక్ష పార్టీలు మంచి చర్చ జరగాల్సి ఉంది. 24 గంటల వ్యవసాయ విద్యుత్, రైతులకు పట్టాదార్ పుస్తకాల పంపిణీ లాంటి వినూత్న విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రపంచంలో ఎక్కడైనా చట్టసభలు ప్రజాప్రతినిధులకు కాలక్షేపానికి ఉపయోగపడే వినోద కేంద్రాలు కావనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తమ సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తారా? అన్న ఉత్కంఠతో ఎదురుచూసేవారు. ఇప్పుడు ఎవరూ ఇలా ఎదురుచూడడం లేదు. వాళ్లు కొట్టుకునేందుకే సమయం చాలదు. మన గురించి ఎవరు పట్టించుకుంటారనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగింది. ఇది మంచి పరిణామం కాదు.

-కె.విజయశైలేంద్ర 98499 98097