మెయిన్ ఫీచర్

‘మనిషితనం’ ఉత్తమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండేవారు. పల్లెటూళ్ళలో కూడా అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఊరికి ఏ కష్టం వచ్చినా కుల, మత, జాతి భేదం లేకుండా అందరికీ సహాయం చేసేవారు. ఆ సహృదయత, సద్భావం పూర్తిగా అంతరించలేదు. ఇప్పటికి కొన్ని పల్లెటూళ్ళలో వరసలతో పిలుచుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు.
అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటాముగాని నిజానికి ఎంత ముందుకు వెళ్ళామో అంత వెనక్కు వచ్చేస్తున్నాము. ఈ రోజుల్లో డబ్బు, పలుకుబడి, హోదా మాత్రమే ‘మనిషి’ని నిర్ణయిస్తున్నాయి. డబ్బుని ఎలాగైనా సంపాదించనీ డబ్బు ఉన్నవాడికి విలువ ఎక్కువ ఇస్తున్నారు. మానవత్వం, మనిషితనం అన్నది ఇప్పుడు పెద్ద హాస్యాస్పదంగా మారిపోయాయి. నిజాయితీ, నీతి, విలువలు అని ఎవరితో అయినా మాట్లాడినా పిచ్చివాడి కింద జమ కడుతున్నారు. ఇప్పటి కాలంలో ఎంతమందిని మోసం చేస్తే అంత తెలివైనవాడు, డబ్బు సంపాదనే ముఖ్యం. అది ఎలా వచ్చినా పర్లేదు అనే స్థాయికి దిగజారిపోయారు. వీటికి కారణం మారుతున్న మనుషుల ఆలోచనలు, సామాజిక స్థాయిభేదాలు, సినిమాలు, కథలు, పుస్తకాలు ఏదైనా కావచ్చు, త్వరగా ఆకర్షించబడుతున్నారు. ఇక నేటి సినిమాల్లో అయితే చెడు చేయడం తప్పుకాదు, వొప్పే అని హీరోలతో చెప్పిస్తున్నారు. దాని ప్రభావం ఎలా వుంటుందో వారికి తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా సమాజంపై ప్రభావం చూపుతుంది. ఒక దొంగతనం ఎలా చెయ్యాలో సవివరంగా సినిమాలో చూపించాక అదే ప్లాన్‌ని బయట అమలుపరచి ఎందరో కటకటాల పాలు అవుతున్నారు. మంచి విలవలు వున్న సినిమా ఇపుడు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మంచి పుస్తకం గొప్ప స్నేహితుడితో సమానం అంటారు. అలాంటి విలువలు వున్న పుస్తకాలని చదివి సారాన్ని అర్థం చేసుకునేవారు కరువు. ఇప్పటికాలంలో మంచి చెప్పేవాడిని చేతకానివాడికింద జమ కడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
ఇక పట్నంలో, నగరాల్లో ఒక మనిషిని మరో మనిషి అస్సలు పట్టించుకోరు. ఒకే
అపార్ట్‌మెంట్‌లో ఎదురుఎదురుగా వున్నా కూడా, పక్కన వున్నా కూడా ఎవరో తెలియదు. దొంగతనం జరిగినా, హత్య జరిగినా మాకు తెలియదు అనే సమాధానమే వస్తుంది తప్ప తోటి మనిషి కదా ఇలా ఎందుకు జరిగింది అని ఎవరూ అడగరు. పూర్వకాలంలో ఎవరైనా ఇంటికి వస్తే వారి ఇంట్లో వాళ్ళతో చక్కగా కలిసిపోయి పక్క పక్కనే వుండి అన్నిరకాల సహాయాన్ని అందించేవారు. ఇపుడు అవసరం అయితే తప్ప పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో అయినా, పట్నంలో అయినా సరే.. వారికి అవసరం పడితేనే మాట్లాడతారు, అవసరం లేదు అనుకుంటే కూరలో కరివేపాకులా తీసిపడేస్తారు. వీటన్నిటికీగల కారణాలను విశే్లషిస్తే ఆధునిక జీవన విధానంలో సంతృప్తి లేకపోవడం, వ్యక్తిస్వామ్యం పెరిగిపోవడం, స్వార్థం, అవకాశవాదం ఇంకా చెప్పాలి అంటే ‘నేను’ తప్ప ‘మనం’లోకి మారని గుణం.
సాంకేతికంగా అభివృద్ధి చెందని రోజుల్లోనే కుటుంబ వ్యవస్థ, సామాజికతకు భరోసాని ఇచ్చేవి. పల్లెల్లో అయినా, పట్నంలో అయినా వ్యక్తి అభివృద్ధికి చుట్టుప్రక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు- ఇలా అందరూ వ్యక్తి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండేవారు. ఎప్పుడైతే నాగరికత అభివృద్ధి వెర్రితలలు వేసిందో అప్పటినుంచి విలువలు, నీతి, నిజాయితీ అన్నవి పనికిరాని నాణేలుగా మారిపోయాయి.
ఆత్మహత్యలు, డిప్రెషన్, హత్యలు.. ఇంకా చాలా అనర్థాలకి కారణం మనిషితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం. మనిషి సంఘజీవి అన్న అరిస్టాటిల్ మాటలని సరిగా అర్థం చేసుకోగలిగితే ప్రపంచం అంతా కుగ్రామమే. సాంకేతికత పెరిగి చేతుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చే పరిస్థితుల్లో కూడా మనిషి ఒంటరితనంతో కుమిలిపోవడం, వందమంది మధ్యలో కూడా ఒక్కడిగా ఫీల్ కావడం, కష్టం, సుఖం చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఆత్మహత్యకి దారితీయడం నడుస్తున్న చరిత్ర. సామాజిక మాధ్యమాల్లో పడే నిజమైన జీవితంలో ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళు ఎందరో. మనిషితనం మానవత్వం అందరిలోను రావాలంటే ఒక్కటే మార్గం. మనిషిని తోటి మనిషి ప్రేమించడం, గౌరవించడం, నిస్వార్థంగా సహాయపడగలిగే గుణాన్ని అలవర్చుకోవడం. తోటి మనిషికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ హాని మాత్రం చేయకూడదు అన్న సిద్ధాంతాన్ని ప్రతివ్యక్తి, కుటుంబం, సమాజం - ఇలా అందరూ ప్రతినబూని మానవతా విలువలు కలిగి నిజాయితీతో కూడిన వ్యవస్థ ఏర్పడాలంటే తలా ఒక చేయి వేసి ముందుకు నడిపించాల్సిందే.
ఇది అనుక్నుంత సులువు కాకపోయినా కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏదీ కాదు. ముందు నేనును విడిచి మనంలోకి మారగలిగితే, ప్రతి వ్యక్తి ప్రేమ గుణాన్ని, త్యాగాన్ని అలవర్చుకోగలగితే మానవత్వం పరిమళించే ఉన్నతమైన సమాజాన్ని త్వరలోనే సాధించుకోవచ్చు.
ఉన్నత విలువలు కలిగిన సమాజానికి కావాల్సిన వ్యక్తులని తీర్చిదిద్దే విద్యని ప్రభుత్వాలు అందించాలి. వ్యక్తిత్వంతోపాటు వికాసం కూడా వెంట నడుస్తుంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు’ ఎప్పటికీ కావు, మనిషితనంలోనే నిలిచిపోతుందని నిరూపించే దిశగా అడుగులేద్దాం..!

- పుష్యమీ సాగర్ 7997072896