అదిలాబాద్

ఔషద దుకాణాలను తనిఖీచేసిన జిల్లా అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 12: పట్టణంలోని అధికారికంగా, అక్రమంగా నడుస్తున్న ఔషద దుకాణాలను జిల్లా డ్రగ్ ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కొన్ని మందుల దుకాణాలు ఫార్మాసిస్ట్ లేకుండానే కొనసాగిచడం, మరికొన్ని దుకాణాలు ఎలాంటి సర్ట్ఫికెట్లు లేకుండ జనరిక్ మందులతో నడపడం ఖానాపూర్‌లో షరామామూలుగానే నడుస్తున్నాయి. ఇట్టి విషయం తెలుసుకున్న జిల్లా ఔషద అధికారి శ్రీకాంత్ శుక్రవారం భవాని, మల్లికార్జున, శ్రీనివాస, బాలాజి, కేర్ ఔషద దుకాణాలను తనిఖీ చేయగా ఇందులో బిల్లులు లేకుండా మందులను అమ్మడం, జనరిక్, ఫార్మాసిస్ట్ లేక ఎలాంటి దృవీకరణ పత్రాలు లేకుండా విక్రయిస్తున్నారని, వారిపై షోకాజ్ నోటీలను జారీచేస్తామని శుక్రవారం జిల్లా అధికారి శ్రీకాంత్ విలేకర్లతో తెలిపారు. కొందరు తనిఖీ నిర్వహిస్తుండగా మందుల దుకాణాలను బంద్ చేయడం జరిగిందని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకముందు అన్ని రకాల దృవీకరణపత్రాలు, ఫార్మాసిస్ట్ ఉంటేనే మందుల దుకాణాలను నడపాలని జనరిక్ లాంటి మందులను విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
* మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దురాభవానీ
ఇచ్చోడ, ఫిబ్రవరి 12: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నందునా పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్థికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దుర్గా భావాని కోరారు. శుక్రవారం మండలపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కళ్లబొళ్లి కథలు చెబుతూ ప్రజలను, రైతులను మోసగిస్తుందని విమర్శించారు. ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వివరించినట్లయితే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరం కోటేష్, నారాయణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
మంచిర్యాల ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం
నెనె్నల, ఫిబ్రవరి 12: భూగర్బ జలాలు అడుగంటిపోవడంతో రానున్న రోజుల్లో నీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, అందుకు ప్రతీ ఒక్కరు ఇంటి ఆవరణలో విధిగా ఇంకుడు గుంతలను (సోప్‌కిట్) నిర్మించుకోవాలని మంచిర్యాల ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం కోరారు. శుక్రవారం మండలంలోని నందులపల్లి, గన్‌పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు. గుంత నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.3900 ఉపాధి హామీ ద్వారా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. దాంతో పాటు ఓడి ఎస్ గ్రామాల్లో ప్రతీ ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. బాహ్య మలవిసర్జన పూర్తిగా నిర్మూలించాలని ఆమె అన్నారు. బాహ్య మల విసర్జన ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఎవరి ఇంట్లో వృథా నీరు వారి వద్దనే నీరు ఇంకేలా అధికారులు శ్రద్ద వహించాలని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ గౌడ్, ఎంపిడివో రాదాకృష్ణ, ఏపీవో నవీన్, ఈజీ ఎస్ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఐకెరెడ్డి దిష్టిబొమ్మ దగ్దం
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 12: ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నాగోబా దర్బార్‌లో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తే వారిని కించపర్చే విధంగా మంత్రి ప్రసంగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల అధ్వర్యంలో మంత్రి ఐకెరెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సంధర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్, సచిన్, చంటి, సురేష్‌లు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా నుండి యూనివర్సిటీ తరలిపోతుంటే దానిని అడ్డుకోవాల్సింది పోయి యూనివర్సిటీ సాధన కోసం పోరాటాలు చేస్తున్న విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులపై మంత్రి ఐకెరెడ్డి కించపర్చే విధంగా మాట్లాడడం సరికాదని, వెంటనే క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూనివర్సిటీని నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించాల్సిందిపోయి విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా మంత్రులుగా ఉండి తరలిపోతున్న యూనివర్సిటీని అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి వద్ద యూనివర్సిటీ విషయం ప్రస్తావన తెచ్చి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసేలా స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడలా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల అధ్వర్యంలో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్, సతీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ దేశిదారు మద్యం పట్టివేత
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 12: జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ఫ్లాజా వద్ద ఇండికా కారులో 35 దేశిదారు బాక్సులను అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసిపట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపర్‌రింటెండెంట్ అనీత తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అజార్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్‌కు అక్రమంగా దేశిదారు బాక్సులను తరలిస్తున్నట్లు వచ్చిన మందుస్తు సమాచారం మేరకు పిప్పర్‌వాడ టోల్‌ఫ్లాజా వద్ద దాడులు చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 35 బాక్సుల్లో 1680 బాటిళ్లను స్వాదీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులను గమనించిన అజర్ పారిపోయాడని, అక్రమంగా తరలిస్తున్న దేశిదారు ఖుర్షిద్ నగర్ కాలనీలోని అక్బర్ అనే వ్యాపారస్తునికి చెందినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడు అజర్ పరారీలో ఉండగా, వ్యాపారస్తుడు అక్బర్ ముందస్తు బెయిల్‌కోసం జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకోగా అరెస్టు తర్వాతనే బెయిల్ మంజూరి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి హకూం సబర్వాల్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు అక్రమ మద్యం అడ్డుకుంటామని ఆమె తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ దేశిదారు మద్యం, గుడుంబాను విక్రయించినట్లయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడులు చేసి పట్టుకున్న వారిలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్సై రషీద్‌ఖాన్, సిబ్బంది ఇంతియాజ్, నాందేవ్, కిష్ఠారెడ్డి తదితరులు ఉన్నారు.

రాబందువులకు ఆవాసం పాలరాపు గుట్ట
* కాగజ్‌గర్ డిఎఫ్‌వో రవిప్రసాద్
బెజ్జూరు, ఫిబ్రవరి 12: రాబందువులు నివాసం ఉండేందుకు పాలరాపుగుట్ట అనుకూలంగా ఉందని కాగజ్‌నగర్ డిఎఫ్‌వో రవిప్రసాద్ అన్నారు. శుక్రవారం బెజ్జూరు రేంజ్ పరిధిలోని ముర్లీగూడెం డిప్‌లోని నందిగామ అటవీ ప్రాంతంలోని రాబందువులు నివాసం ఉండే పాలరాపు గుట్టను సందర్శించారు. పాలరాపుగుట్టవద్ద 28 రాబందువు లుఉన్నట్లు అటవీశాఖ గుర్తించిందన్నారు. రాబందువుల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నందిగామ అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట 108 మీటర్లఎత్తుపై రాబందువులు నివాసం ఉంటున్నాయన్నారు. రాబందువులు మానవాళి జీవనానికి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. రాబందువులతోపాటు రెండుషాహిన్‌పాల్కన్ పక్షులు, ఆరు నెమల్లు, కొండగొర్రె లు, నీలుగాయి, చుక్కల జింక, అడవి కుక్క, సాలుగు, చిరుతపులి, కొండముచ్చులు, కోతులున్నాయ న్నారు. పాలరాపుగుట్ట వద్ద 40 రాబందువులు ఉండటానికి అవకాశం ఉంద న్నారు. 1.5హెక్టార్లలో రాబందువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతసమీపంలో మహారాష్టల్రోని కమలాపూర్ వద్ద 200 నైట్‌బ్యాక్డ్ వల్చర్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. నందిగామ నుంచి మహారాష్టక్రు తరుచూ రాబందువులు వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. రాబందువులకోసం త్వరలో మైక్రోచిప్‌లు ఏర్పాటుచేసి వాటి కదలికలను గుర్తిస్తామన్నారు. రాబందువుల రక్షణ కోసం ప్రత్యేకంగా రవికుమార్ అనే పరిశోధకు న్ని ఏర్పాటుచేసి పరిశోధన జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వీటి రక్షణకోసం ఇప్పటికే ముగ్గురు బర్డ్‌వాచర్లను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.
బేస్ క్యాంప్‌ను సందర్శన
ఇందూర్‌గాం బేస్‌క్యాంపును డిఎఫ్ వో రవిప్రసాద్ సందర్శించారు. ఇందూర్‌గాం బేస్‌క్యాంపు 1325 హెక్టార్లలో ఉందన్నారు. డివిజన్‌లోని ఆరు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. బేస్ క్యాంపులోని రాముడు, భీముడు చెట్ల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్నచెట్ల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట బెజ్జూరు సెక్షన్ అధికారి సద్దాం హుస్సేన్, కుష్ణపల్లి సెక్షన్ అధికారి రమాదేవి, బీట్ అధికారులు గిరిబాబు, మోహన్‌రావు, వల్క మోహన్, బేస్ క్యాంపు సిబ్బంది ఉన్నారు. అనంతరం మానిక దేవార సమీపంలోని ఫైర్ వాచ్ కవర్‌ను పరిశీలించారు.

జన జాతరగా కెస్లాపూర్
ఉట్నూరు, ఫిబ్రవరి 12: ఏజెన్సీలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర జన జాతరగా వెల్లివిరుస్తోంది. ఈనెల 7న నాగోబాకు సంప్రదాయ పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు కెస్లాపూర్ వైపు వస్తుండడంతో జాతర జనంతో కిటకిటలాడుతోంది. రెండురోజులుగా భక్తులు, ప్రజలు పోటెత్తడంతో ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. శుక్రవారం నాగోబా దర్శనానికి సుమారు 40వేల మందికి పైగా తరలిరావడంతో సుమారు 6 కిలోమీటర్ల వరకు జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. సాంప్రదాయ పూజల్లో భాగంగా మెస్రం వంశీయులు శుక్రవారం ప్రత్యేక పూజల్లో భాగంగా బేతాల్ పూజలు, మండదగ్ని పూజలు సంప్రదాయబద్ధంగా చేపట్టగా గిరిజనులు భక్తిశ్రద్ధలతో పాటు తమ ఆరాధ్య దైవాన్ని పూజించారు. దీనికి తోడు భక్తులు అధికంగా రావడంతో పలు వ్యాపార సంస్థలు వెలియగా వారి వారి అవసరాలకు తగ్గట్లు భక్తులు వస్తువులను కొనుగోలు చేయడంతో దుకాణ సముదాయాలు, హోటళ్లు కిటకిటలాడాయి.

ఫిరాయింపులు కాదు పరిపాలనపై శ్రద్ధ చూపాలి
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
శ్రీరాంపూర్ రూర్, ఫిబ్రవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యవర్గ కౌన్సిల్ సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కార్పోరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో రాయితీలను ఇస్తూ దేశ సంపదను దోచి పెడుతున్నారని అన్నారు. దేశంలో పాలన గాడి తప్పిందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, 14 రాష్ట్రాల్లో 3కోట్ల ఎకరాలు నష్టం జరిగిందని, వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రతిపక్షాలు ఆందోళన చేయడం వల్లనే నిలుపుదల చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలం చెందిందని, ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ సిద్దహస్తుడన్నారు. ప్రజలకు ఆసరా పించన్, కరెంటు, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీటుపీజీ విద్య, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజాపరిపాలనపై లేదని ఆరోపించారు. ప్రజా పరిపాలన గాడి తప్పిందన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్, సిపి ఐ నియోజకవర్గ కార్యదర్శి కలవేని కుమార స్వామి, ఏ ఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, బ్రాంచి కార్యదర్శి కొట్టె కిషన్‌రావు, బాజీసైదా, కృష్ణమూర్తి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో శాంతిభద్రతలు భేష్
* ఎస్పీ తరుణ్ జోషి
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12: జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, కేసుల సత్వర పరిష్కారం కోసం పోలీసు అధికారులు మరింత కృషి చేయాలని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. శుక్రవారం స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీసు సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇటీవల నేరాల పురోగతి, దర్యాపు వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను ఎస్పీ తరుణ్ జోషి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ చోరీలు, హత్యకేసులు, దళితుల కేసులు, గుడుంబా, దేశీదారు నిరోదించుటకు డివిజన్ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పోలీసులకు వివరించారు. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టి సత్వర న్యాయం జరిగేందుకు త్వరలో పోలీసు అధికారులకు ఆధునిక పరికరాల కిట్‌ను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బెంగళూర్ ఫోరెన్సిక్ సంస్థ అధ్వర్యంలో దర్యాప్తు కిట్‌ను ప్రదర్శించి, దాని ఉపయోగంపై వివరించారు.
మెరిట్ స్కాలర్‌షిప్‌ల అందజేత
ఈ సంవత్సరం వివిధ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభకనబర్చిన పోలీసు కుటుంబాల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను ఎస్పీ తరుణ్ జోషి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మార్కుల ఆధారంగా 4000 నుండి 6వేల వరకు స్కాలర్‌షిప్‌లను అందించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 140 మంది పోలీసు పిల్లలకు 6.86 లక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సన్‌ప్రీత్ సింగ్, టి.పనసారెడ్డి, జిఆర్ రాధిక, మంచిర్యాల ఎఎస్పీ విజయ్‌కుమార్, డిఎస్పీలు మల్లారెడ్డి, రమణారెడ్డి, చక్రవర్తి, మనోహర్ రెడ్డి, అందె రాములు, పోలీసు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు విరాసత్ అలి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

భక్తజనంతో పులకించిన బాసర క్షేత్రం
* రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
* అక్షరస్వీకార పూజ సందడి
* భారీగా తరలివచ్చిన భక్తులు
బాసర, ఫిబ్రవరి 12: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం శుక్రవారం భక్తజనంతో పులకించిపోయింది. అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి పర్వదినాన అమ్మవారి చెంత తమచిన్నారులకు అక్షరస్వీకార పూజలు నిర్వహిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులవుతారని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ రాష్ట్రాల నుండే కాక కర్ణాటక, మహారాష్టల్ర నుండి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామున అమ్మవారి అభిషేక సేవ అనంతరం నుండే భక్తులు అక్షరాభ్యాస క్యూలైన్‌లో బారులు తీరారు. అక్షరస్వీకార పూజలకు 2 నుండి 3 గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. వివిధ వాణిజ్య బ్యాంకులు, బాసర మిషన్ సభ్యులు దాతల సహాయంతో వసంత పంచమి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు, అరటిపండ్లను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉదయం 9 గంటలకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్ శైలజ, మండల పరిషత్ అధ్యక్షురాలు అనూష సాయిబాబా, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి మంగళవాయిద్యాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రులను ఆలయ ఈవొ వెంకటేశ్వర్లు, ఛైర్మెన్ శరత్‌పాఠక్ ఆలయ మర్యాదలతో పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో బాన్సువాడకు చెందిన శ్రీశ్రీశ్రీ మంగళగిరి నర్సింహమూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాన్సువాడ శారదాదీక్ష స్వాముల భవనానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. వసంత ఉత్సవాల సందర్భంగా ఆలయంతోపాటు వివిధ సత్రాల ద్వారా భక్తులకు ఉచిత అన్నదానాన్ని ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భైంసా డిఎస్పీ అందె రాములు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.