మాతో - మీరు

దయ్యం కథ (మాతో-మీరు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దయ్యాల మేడ’ క్రైం కథ నిజానికి దయ్యం కథ అయినా తమాషాగా ఉంది. మన సినిమాల్లోనూ కథల్లోనూ వచ్చే పగ, ప్రతీకారాల దయ్యంలా కాక ఇది మేలుచేసే మంచి దయ్యం! హన్సిక తమిళ రంగంలో సెటిల్ అయితేనేం? ఆ చిత్రాలు డబ్ అయి తెలుగులోనూ వస్తాయి కదా. సర్వేశ్వర శర్మగారు చెప్పినట్టు శరీరం తన ఆరోగ్యం తనే చూసుకుంటుంది. తమ శరీరంపై నమ్మకం లేక కొందరు సొంత వైద్యంతోను ఇంకొందరు డాక్టర్లను నమ్మి శరీర వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు. ఔనా, నిజమేనా అనిపించింది థ్రిల్లాట! భారతీయుల్లో ఎక్నాలెజ్డ్‌మెంట్ సంస్కారం చాలా తక్కువంటూ మల్లాది వారు ‘స్ఫూర్తి’ కథలో చెప్పడం సముచితమే.
-హెచ్.పవన్‌పుత్ర (రామారావుపేట, తూ.గో.జిల్లా)

మనసు దాటని మాట
మార్చి 20, ఆదివారం అనుబంధంలో ప్రచురించిన ‘మనసు దాటని మాట’ కథ మమ్మల్నెంతగానో ఆకట్టుకొంది. ప్రతి సన్నివేశంలో పైడిపాల గారి మాటలు బావున్నాయి. జాడలేని జలం - ప్రత్యేక కథనం వాస్తవాలను వెలికితీసింది. వేసవిలో మంచినీటికి జనం ఎంత అవస్థలు పడుతున్నారో తెలిసినప్పటికీ.. ప్రభుత్వాలూ అధికారులూ... సామాన్య మానవుడు ఈ విపత్కర పరిణామాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్నది వాస్తవం.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)

సండే గీత
దేవుడి మీద మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి గాని భయం ఉండనక్కర లేదని ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. ఇంతకు ముందు దేవుని మహిమలతో కూడిన వంద కరపత్రాలు ముద్రించి పంచి పెట్టాలని, వంద కార్డులు రాసి పంపాలని అనేవారు. అది కష్టసాధ్యం కాబట్టి ఇప్పుడు వాట్సప్, ఎస్సెమ్మెస్‌లు అంటున్నారు. మానసిక బలహీనతల వల్లే ఇలాంటివి. కథతోపాటు హామీ పత్రం తిప్పి పంపనందుకు పత్రికపై పోలీస్ కంప్లైంట్ ఇమ్మనడం భలే చమత్కార సమాధానం. అలాగే మేడమ్ టుస్సాడ్ మైనపు బొమ్మల కొలువు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అలాంటివి మన దేశంలోనూ ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయాం.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)

వీడ్కోలు
కాలగతిలో కొన్ని వస్తువులకు వీడ్కోలు కొత్త వాటికి ఆహ్వానం పలక వలసి ఉంటుందని ఓ చిన్న మాటగా ఓ మంచి మాట చెప్పారు. టైప్ మిషన్లు, సైకిళ్లు, టైలరింగ్ లాంటివి వెనకబాట పట్టాయి. కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దిక్కులేని అనాథ అని మీరు చెప్పడం ఎంతో సమంజసం. తెలుగును తొలగిస్తున్నందుకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడులపై ఏడవడం తప్ప సొంత రాష్ట్రాల్లో తెలుగు కోసం చేస్తున్నదేమీ లేదు. తెల్లోడి గొట్టం లోంచి ‘నువ్వు గొట్టం’లో దూరి ప్యాసా మీదుగా గోపాలంగారు మిరప బజ్జీలపై పడటం బాగుంది. తెలుగోడు పిల్లలా పిడుగులా లాంటి కార్యక్రమాలు చూస్తూ ఎలా నవ్వగలడండీ?
-ఆర్.మరుదకాశి (కరప, తూ.గో.జిల్లా)

ఓ చిన్న మాట
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉన్నవి పాతబడిపోతున్నాయి. టైప్‌రైటర్‌ను ఎలక్ట్రానిక్ టైప్‌రైటర్ మింగింది. దీన్ని కంప్యూటర్, దీన్ని లాప్‌టాప్ ఛేదించగా, ఇది కూడా చిన్నదై స్మార్ట్ఫోన్లు చేతులలో ఇమిడిపోతున్నాయి. వీటిలో దొరకని సమాచారం లేదు. ఈ వరుసలో పాత వాటికి వీడ్కోలు పలుకుతున్నా మా ఇంట్లో మావగారి కుర్చీ, రుబ్బురోలు, తిరగలి, రోళ్లను వదలలేక పోతున్నాం. ఇవి వారసత్వంలా మా వెంటనే ఊళ్లు తిరుగుతున్నాయి. ఇప్పటికీ మా ఇంట్లో టైప్‌రైటర్ ఉంది. పాత రోత, కొత్త వింత అయినా కొన్నింటికి వీడ్కోలు పలకలేం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

సైకో కిల్లర్
క్రైం కథ సైకో కిల్లర్ చక్కని చిక్కని సస్పెన్స్‌తో ముగిసి సస్పెన్స్ విప్పకుండా సస్పెన్స్‌లోనే ఉంచేసింది. గోపాలంగారి సాహిత్య గోష్టి, ఏది ముందు? అన్న మీమాంస ఆసక్తికరంగా ఉన్నాయి. అనువాద సాహిత్య వ్యాప్తికి సాహిత్య అకాడెమీ తగినంత కృషి చేయడం లేదు. గోపాలంగారి లాంటి జిజ్ఞాశువులే పూనుకోవాలి. ఈసారి అక్షరాలోచనాలు అలరించాయి. ముఖ్యంగా ‘ఒక దీపం నన్ను మనిషితనంలో నింపితే మరో దీపం ఏకాంత సమూహంగా నిల్పింది’ అనడం బాగుంది. ఈ ప్రపంచంలో విలువలేని దంటూ ఏదీ లేదని చెప్పిన మల్లాదివారి స్ఫూర్తి కథ బాగుంది.
-బి.సోనాలి (సూర్యాపేట)

ఆశాభావం
అణకువ, వినయాల వల్ల చిన్నచిన్న సంఘటనలు పెద్ద గొడవలుగా మారవు. అలా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ‘ఓ చిన్న మాట’గా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మనం సౌమ్యంగా ఉంటే ఎదుటి వారు విజృంభించడమే లోకరీతి. మెత్తనివాణ్ని చూస్తే మొత్తబుద్ధి! సౌమ్యత పనికి రాదని జెఎన్‌యూ, హెచ్‌సియూలలో జరుగుతున్న రగడ నిరూపిస్తున్నది కదా. జాడలేని జలం వ్యాసం ఆలోచింపజేసింది. భయపెట్టింది కూడా. నీటి చుక్కే దొరకని రోజొస్తే ఎంత భయంకరం! ఉచితంగా లభించే ప్రతి దాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంటాడు మనిషి. తమాషా ఏమంటే కొనుక్కున్న నీటినీ వ్యర్థం చేస్తున్నాడు. వృధాచేసే అలవాటు పోతేనే గాని విముక్తి లేదు.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)