మెయిన్ ఫీచర్

‘పంచ్’ కొడితే పతకం గ్యారంటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై ఏళ్ల వర్షారాణికి ఒకప్పుడు నలుగురిలో తిరగాలంటేనే మితిమీరిన మొహమాటం.. బడికి వెళ్లాలంటేనే ఎంతో బిడియం.. అలాంటిది ఇపుడు ఆమె అందరిలో చలాకీగా తిరుగుతూ నవ్వుతూ కనిపిస్తుంది.. బాక్సింగ్ క్రీడ తన జీవితాన్ని మార్చేసిందని, తాను ఇపుడు ఎంతో శక్తిమంతురాలినని ఆమె ధైర్యంగా చెబుతోంది.. ఆత్మవిశ్వాసం పెరగడంతో అటు ఆటలో, ఇటు చదువులో దూసుకుపోతున్నానని ఎంతో సంతోషంగా అంటోంది..
***
సనాతన సాంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల ఫలితంగా అక్కడి బాలికలు పాఠశాలకు వెళ్లడం అరుదు.. ఒకవేళ ఒకరిద్దరు బడిబాట పట్టినా మధ్యలోనే చదువుకు స్వస్తి పలికి ఇంటిపట్టునే ఉంటారు.. యుక్తవయసు రాకుండానే పెళ్లిళ్లు చేయడంతో చదువుసంధ్యలు, ఆటపాటలకు దూరమై అత్తవారింటికి వెళ్లిపోతుంటారు.. ఇపుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఆడపిల్లలు అక్షరజ్ఞానం సంపాదించేందుకు పోటీ పడుతున్నారు.. ఒకప్పుడు పురుషుల ఆటగా భావించే బాక్సింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్న అక్కడి బాలికలు నేడు సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు.. బాలికల వల్లే ఆ పల్లెటూరికి ఇపుడు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.. సరణ్ జిల్లా (బిహార్)లో మారుమూల పల్లె దిఘ్వారాకు ‘బాలికల బాక్సింగ్’ కారణంగా ఇంతటి ఘనత సాధ్యమైంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ జరిగే బాక్సింగ్ పోటీలకు దిఘ్వారా బాలికలు హాజరవుతూ ‘పంచ్’లు కురిపిస్తూ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. 2009 వరకూ ఈ గ్రామం గురించి బాహ్య ప్రపంచానికి ఏమీ తెలియదు. ఎవరూ ఊహించని రీతిలో ‘బాక్సింగ్ చాంపియన్లకు పుట్టినిల్లు’గా ఈ గ్రామం అవతరించింది. ఇక్కడి బాలికలు దేశవ్యాప్తంగా జరిగే అనేక బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటుతున్నారు. పురుషులకు తలదనే్నలా ‘పంచ్’లు కొడుతూ ఈ బాలికలు బిహార్‌కు గర్వకారణంగా నిలిచారంటే- దాని వెనుక కఠోర దీక్ష, నిరంతర సాధన ఉన్నాయి. ఇరవై ఏళ్ల ప్రియాంక (20) ఇటీవల గౌహతిలో జరిగిన జాతీయ మహిళా బాక్సింగ్ పోటీలకు హాజరై మూడు పతకాలను తన ఖాతాలో వేసుకోవడంతో దిఘ్వారా పేరు మరోసారి మార్మోగింది. తమ గ్రామంలోని ‘ఆర్‌జెఎస్ బాక్సింగ్ క్లబ్’లో వర్షారాణి, ప్రియాంకలతో పాటు ఎంతోమంది బాలికలు తర్ఫీదు పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కనిపించే ఆధునిక సౌకర్యాలేవీ ఈ క్లబ్‌లో కనిపించవు. ఇటుకలతో నిర్మించిన సాదాసీదా బాక్సింగ్ రింగ్‌లో బాలికలు ప్రతిరోజూ కనీసం రెండు గంటల సేపు సాధన చేస్తుంటారు. ఈ క్లబ్‌లో చేరే బాలికల నుంచి నిర్వాహకులు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచితంగానే శిక్షణ ఇస్తారు.
దిఘ్వారాకు చెందిన రోషన్ సింగ్, ధీరజ్ కాంత్ అనే స్నేహితులు ఈ క్లబ్‌ను 2009లో ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్సులో ‘బ్లాక్ బెల్ట్’లు సాధించిన వీరు గ్రామీణ బాలికలను క్రీడల్లో తీర్చిదిద్దాలని సంకల్పించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసినా ఆ ఉద్యోగంలో ఎలాంటి సంతృప్తి లేదని భావించి ధీరజ్ స్వగ్రామానికి చేరుకుని బాక్సింగ్ క్లబ్ ప్రారంభించాలని భావించాడు. ఓ ప్రైవేటు స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోషన్ సింగ్ సహకారంతో ధీరజ్ ‘ఆర్‌జెఎస్ బాక్సింగ్ క్లబ్’ను ప్రారంభించాడు. తైక్వాండో ఆటను నేర్చుకుంటున్న సుమారు పదిమంది బాలికలు మొదట్లో ఈ బాక్సింగ్ క్లబ్‌లో చేరారు. అయితే, ఇది పురుషుల క్రీడ అని తల్లిదండ్రులు సంశయించడంతో కొందరు బాలికలు క్లబ్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. అయినప్పటికీ ధీరజ్, రోషన్ నిరుత్సాహ పడలేదు. 2009లో పాట్నాలో జరిగిన జాతీయ మహిళా బాక్సింగ్ పోటీలకు వారు కొంతమంది బాలికలను తీసుకువెళ్లారు. ఆ పోటీల్లో ప్రియాంక, వర్షారాణిలకు పతకాలు లభించడంతో దిఘ్వారా బాలికలకు బాక్సింగ్ పట్ల ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. తమ గ్రామం గురించి పత్రికల్లో, టీవీ చానళ్లలో గొప్పగా చెప్పడంతో బాలికలు ఆనందంలో మునిగిపోయారు. ఆ ప్రాంతానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే అశోక్ సింగ్ కృషి ఫలితంగా ఆర్‌జెఎస్ క్లబ్‌కు స్థానిక కళాశాలలో ఉచితంగా వసతి కల్పించారు. కళాశాల మైదానంలో బాక్సింగ్ శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ క్లబ్‌లో అబ్బాయిలకు కూడా తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడి కోచ్‌లు ఎలాంటి లింగవివక్ష చూపకుండా అన్ని విషయాలను నేర్పుతున్నారని బాలికలు చెబుతుంటారు. దీంతో తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చింది. బాలికలను ఇష్టపూర్వకంగానే బాక్సింగ్ శిక్షణకు వారు పంపుతున్నారు. 2010లో తమిళనాడులో, 2011లో పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో వర్షారాణి పతకాలను సాధించింది. ఇప్పటికే పలు పోటీల్లో సత్తా చాటుకున్న దిఘ్వారా యువతులు వర్ష, ప్రియాంక ప్రస్తుతం బిఎస్సీ చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నారు. డిగ్రీ పూర్తి చేశాక పాటియాలాలోని నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ జాతీయ క్రీడాసంస్థలో డిప్లమో పూర్తి చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వీరు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తే మరికొంతమందికి శిక్షణ ఇచ్చే వీలుంటుందని క్లబ్ నిర్వాహకుడు ధీరజ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది శిక్షణ పొందుతున్నారని, వీరిలో 13 మంది బాలికలు ఉన్నారని ఆయన తెలిపారు. ఏడో తరగతి విద్యార్థిని పల్లవి, పీజీ విద్యార్థిని మోనా ఇక్కడే బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధించారని ఆయన గుర్తుచేస్తున్నారు. ఈ క్లబ్‌కు విరాళాలు సేకరించేందుకు ఇటీవల కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తమ వంతు కృషి ప్రారంభించారు. ఆధునిక వసతులతో బాక్సింగ్ రింగ్ ఏర్పాటు చేసేందుకు కనీసం మూడు లక్షల రూపాయలు అవసరమని క్లబ్ నిర్వాహకులు చెబుతున్నారు. త్వరలోనే ఈ కలను నిజం చేసి, మరింత ఎక్కువ మందికి బాక్సింగ్ నేర్పుతామన్న ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
*