మెయన్ ఫీచర్

సురాజ్యమే లక్ష్యం కావాలి - నేడు 70వ స్వాతంత్య్ర దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జయజయ జయభారత జనయిత్రీ దివ్యథాత్రి’ అనే సంగీతం భూనభోంతరాళాలు మార్మోగుతున్నవేళ. ఉదయ సంధ్యారాణి మరో స్వేఛ్చా స్వాతంత్య్ర హేల. ఈ పవిత్ర సమయంలో జాతి విముక్తికై రక్తతర్పణం చేసి దివికేగిన దేశభక్తులను ఒక్కసారి స్మరించుకుందాం. వారి అడుగుజాడలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. చెరసాలలే పృధుచంద్రశాలలుగా ఉరి కొయ్యలే ఉయ్యాలలుగా చేసుకొని అమరవీరులు నేతాజీ, లోకమాన్యతిలక్, సావర్కార్, ఛాపేకర్ సోదరులు, రాసవిహారీ బోస్, మంగళ పాండ్యా, చంద్రశేఖర ఆజాద్, అల్లూరి సీ తారామరాజు..ఒకరా ఇద్దరా వందలాది, వేలాది దేశభక్తుల త్యాగఫలం ఈ స్వరాజ్య రథం.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి గుండుసూది నుండి బియ్యం కిరోసిన్ పాలడబ్బా వరకు అన్నీ విదేశాలనుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. చేనేత కార్మికులకు తమ మగ్గాలే తమకు ఉరితాళ్లుగా మారగా మాంచెస్టర్ గ్లాస్గో వస్త్ర దారంతో మనం బ్రతకవలసిన ఒక అసహజ పరిస్థితిని బ్రిటీషు పాలన సృష్టించింది. విదేశీ భాషలకు వ్యతిరేకంగా నలభైకోట్లమంది ప్రజలు ఉద్యమించారు. మతకల్లోలాల మధ్య భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇండియా తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ఇలా ముక్కలైన దేశలో అర్థరాత్రి స్వాతంత్య్ర సూర్యుడు ఉదయించాడు.
1947లో స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భారీ పరిశ్రమల మీద, ప్రాజెక్టులమీద ప్రధానంగా దృష్టి సారించారు. నాగార్జునసాగర్, పెరంబుదూరు, మాచ్‌ఖండ్, బొకారో, భాక్రానంగల్ ఇలాంటి వన్నీ నెహ్రూ మానసపుత్రికలే. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ‘‘ఆరామ్ హరామ్ హై కామ్ కీజీయే’’ అనే నినాదాన్ని అందించారు. అప్పటి దేశ జనాభా నలబయి కోట్లు. అవినీతి నేటివలె విశృంఖలంగా లేదు. అందువల్ల నెహ్రూ పదిహేను సంవత్సరాలు సోషలిస్టు పాటర్న్ ఆఫ్ సొసైటీ స్థాపనలో నిమగ్నమయ్యారు. అమెరికాతో ఆయన సన్నిహితంగా ఉన్నా ప్రధానంగా రష్యా భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నారు. బుద్ధునివలె మరోపంచశీలను ప్రతిపాదించారు. ఇదంతా 1965వ దశకంనాటి చరిత్ర.
నెహ్రూజీ రోజుల్లో నిర్లక్ష్యం చేయబడిన ప్రధాన రంగం రక్షణ వ్యవస్థ. 1962లో చైనా భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు మంచుకొండల్లో కాళ్లకు సరియైన ఆచ్ఛాదనకూడ లేకుండా సైనికులు బ్రతకాల్సి వచ్చింది. మనం మంచిగా ఉంటే అవతలవాడు కూడా మంచిగానే ఉంటాడనే ఉటోపియాతో నెహ్రూ జీవించారు. ఫలితంగా ఇటు షేక్ అబ్దుల్లా, అటు చౌఎన్‌లై ఇద్దరూ నెహ్రూను మోసం చేశారు. 1964లో లాల్‌బహదూర్ శాస్ర్తీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత సైన్యం బలాన్ని పెంచుకుంది. 1966లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచింది. జాతికి విజయా న్ని అందించి శాస్ర్తిజీ తాష్కెండ్‌లో మరణిం చారు.
ఇందిరాగాంధీ ఫెడరలిజం వికృతరూపం దాల్చింది. పంజాబ్‌లో భింద్రేన్‌వాలా స్వ తంత్ర పంజాబ్ దేశం కోసం ఉద్యమం నడిపాడు. ఒక వ్యక్తి ఎన్నిక చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడానికి బదులు మొత్తం దేశం మీద ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. తమిళనాడులో ద్రవిడ సంస్కృతి, ఉత్తర భారతీయ ఆర్ష సంస్కృతికన్నా భిన్నమైందనే ఉద్యమాలు బలపడ్డాయి. సిక్కు బెటాలియన్ వలె కర్ణాటకకు చెందిన లింగాయత్ బెటాలియన్ సైన్యం ఉండాలని కోరుకున్నారు. ‘‘అస్సాం ఆస్సామీయులది, భారతీయులారా వెళ్లిపొండి’’ అనే కరపత్రాలను గౌహతిలో పంచిపెట్టారు. బొంబాయిలో మహారాష్ట్రేతరులకు స్థానం లేదు అనే ఉద్యమం శివాజీ పేరుమీద మొదలైంది. అన్నింటికన్నా దేశ సమైక్యత ముఖ్యమన్న అంశాన్ని కొన్ని దశాబ్దులపాటు నాయకులు నిర్లక్ష్యం చేశారు. కశ్మీరునుండి మూడు లక్షలమంది హిందూ పండిట్లను తరిమివేసి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేశారు. మొన్న మెహబూబా మాట్లాడుతూ అటు పాకిస్తాన్, ఇటు హిందూస్తాన్ రెండు దేశాలకు మా కాశ్మీరదేశం వారథిలాంటిది అన్నది. అంటే ఏమిటి? ఈమె హురియత్‌తో వేర్పాటు వాదాన్ని బహిరంగంగా బలపరచిందని అర్థం.
కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా జనతాదళ్ ప్రయోగాలు నాలుగైదుసార్లు జరిగినా ఈ నాయకుల మధ్యగల వ్యక్తిగత అహంకారాలవల్ల విఫలమయ్యాయి. జయప్రకాశ్ నారాయణ్ చేసిన బలిదానాలను చౌదరి చరణ్‌సింగ్ విఫలం చేశాడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పోఖ్రాన్‌లో అణు విస్ఫోటన పరీక్ష జరిపితే లోక్‌సభలో సోమనాథ చటర్జీ ‘్భరతదేశం ఇక సర్వనాశనం అయిపోతుంది’ అని చేసిన ప్రసంగం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. విచిత్రమేమంటే అప్పటికే చైనా వద్ద మూడువందలకు పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. చైనా నియంతృత్వ దేశం కాబట్టి 1948 నుండి ప్రగతి పథంలో దూసుకుపోయింది. వివిధ దేశాల సాంకేతిక అత్యాధునిక పరిజ్ఞానాన్ని హ్యాకింగ్ చేసింది. మరి భారత్‌కు అంతటి తెలివితేటలు లేవు.
2016, ఆగస్టు 11న ఏడు బిలియన్ డాలర్ల విద్యుత్ కంపెనీ నిర్వహణ వేలం ఆస్ట్రేలియా నిర్వహించింది. బిడ్డింగ్‌కు చైనాను ‘దేశ రక్షణ’ రీత్యా అనుమతించలేదు. భారత్ ఈ అంశాన్ని గమనించలేదు. మంగోలులనుంచి తమ జాతిని రక్షించుకోవడంకోసం చైనా అతిపెద్ద గోడ నిర్మాణం చేసింది. దీన్ని పూర్తి చేయడానికి వందల సంవత్సరాలు పట్టింది. భారతదేశంలోకి ఖైబర్ కనుమనుండి కాశిం సైన్యాలు తొలిసారి దండయాత్ర చేశాయి. అక్కడ ఒక చిన్నగోడ కట్టి ఉంటే ఉత్తర భారతం విదేశీయుల వశమయి ఉండేది కాదు. భారతీయుల పతనానికి కారణాలు అనే్వషిస్తూ చరిత్రకారులు చెప్పిన భాష్యం ఏమంటే, బలవంతుడైన ప్రతి రాజు తన సరిహద్దులోని చిన్న రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలిపివేయాలనే అంశం మీద దృష్టి కేంద్రీకరించారు. ఫలితం విదేశీ దాడులు జరిగినప్పుడు ఈ చిన్న రాజ్యాల శత్రువుకు సహాయపడ్డాయి. చరిత్ర పునరావృత్తమవుతున్నది. నేడు భారదేశంలోని 29 రాష్ట్రాలు తమలో తాము ఎలా కలహించుకుంటున్నా యో గమనించండి.
నితీశ్‌కుమార్, ములాయంసింగ్ యాదవ్, జయలలిత, మమతా బెనర్జీ అంతా భారత ప్రధాని కావలన్న కాంక్షతో ఇతర పక్షాలను నిర్మూలించే పనిలోపడ్డారు. దీన్ని చైనా పాకిస్తాన్‌లు సద్వినియోగం చేసుకుంటున్నాయి. నేపాల్‌లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ-కశ్మీర్‌లు వివాదాస్పద ప్రాంతాలుగా మ్యాప్‌లు విడుదల చేశారు.
1950లో నెహ్రూజీ రూపొందించిన విదేశాంగ విధానమే 2014లో సల్మాన్ ఖుర్షీద్ యుగం వరకు కొనసాగింది. ఆగ్నేయాసియాలో నూరు చిన్న లంకలున్నాయి. భారత్ అలక్ష్యాన్ని చైనా సద్వినియోగం చేసుకున్నది. పివి నరసింహారావు కాలంలో ఒకసారి ఈ అంశంపైదృష్టి పెట్టాలని అనుకున్నారు. కాని తక్కిన మహానుభావులు పడనివ్వలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ సమగ్ర విదేశాంగ విధానం ఆగ్నేయాసియా విధానంగా రూపొందించుకోవాలి. దేశంలోని ముస్లిం ఓట్లమీద ఆశతో పాలస్తీనా సంస్థ ఆరాఫత్‌తో దోస్తీ చేసి ఇజ్రాయిల్ దేశానికి కనీస గుర్తింపునివ్వడానకి కూడా భారత్ లోగడ ఇష్టపడలేదు. ఈ ఉష్టప్రక్షి విధానం వల్ల నేడు ఉగ్రవాదం, అగ్రవాదంగా ప్రధాన అజెండాగా మనముందుకు వచ్చింది.
అంతరిక్ష పరిశోధనా రంగంలో తప్ప తక్కిన రంగాల్లో చైనాకు ధీటుగా భారత్ ఎదగలేకపోయింది. ఎందుకని? వ్యక్తి నిర్మాణంపై భారత్ దృష్టి పెట్టలేదు. 1947కు ముందు బ్రిటీషువారిని పారద్రోలడానికి విధ్వంసకాండ జరిపారు. మరి ఇవ్వాళ మన ప్రభుత్వాలే దేశంలో ఉన్నాయి కదా. ఇంకా విధ్వంస పరంపర ఎందుకు కొనసాగుతోంది? ఆలోచించారా? స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడానకి అరాచకం అడ్డంకి అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రతి ఎనిమిది నిముషాలకు ఒక రేప్ కేసు నమోదవుతోంది. ఎందువల్ల? అవినీతిమీద యుద్ధం చేయాలని ప్రకటించి అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ ఎమ్మెల్యేలలో సగంమంది మీద క్రిమినల్ నేరాలున్నాయి.
భారత ప్రధాని కాశ్మీరులో ప్రగతి మంత్రం పఠిస్తున్నారు. ‘‘సబ్‌కా భలా, సబ్‌కావికాస్’ అంటున్నారు. కానీ ‘శ్రీనగర్‌లో బంగారంతో రోడ్లు నిర్మించినా మేము వేర్పాటువాద ఉద్యమం ఆపేది లేదు’’ అని జిలానీ ప్రకటించాడట. గమనించలేదా? 1947లో పాకిస్తాన్‌లో 14శాతం మంది హిందువుల జనాభా ఉండగా ఇప్పుడు ఒక్కశాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ఇండియాలో మైనారిటీల జనాభా విపరీతంగా పెరిగిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మైనారిటీల అణచివేత జరిగి ఉంటే మరి ఈ జనాభా పెరిగేదా? స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకానికి వందనం ఆచరించనివాడు భారతీయుడు ఎట్లా అవుతాడు? జనగణమణ పాడము, వందేమాతరం ఆలాపించము అనే విద్యాలయాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
భారత స్వాతంత్య్ర నిర్మాతలు మనకు బలమైన పునాదుల మీద రాజ్యాంగ నిర్మా ణం చేసి వెళ్లారు. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత భారతీయులందరిమీద ఉన్నది. చట్టసభలను చాకిరేవులుగా, శాసన నిర్మాతలైన నాయకులు మారిస్తే సామాన్యుడు నిస్సహాయుడవుతాడు. ప్రజాస్వామ్యం ఒక అందమైన రంగుల కల. దాన్ని సాకారం చేసుకోవలసిన బాధ్యత ప్రజలందరిమీద ఉన్నది. సబ్సిడీలు, కలర్‌టీవీలు ల్యాప్‌టాప్‌లు ఇచ్చి ఓట్లు దండుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా?
నరేంద్రమోదీ అధికారానికి వచ్చాక భారత్‌పై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగింది. ‘నా జీవన పోరాటానికి మహాత్మాగాంధీయే ఆదర్శం అని బరాక్ ఒబామా చెప్పుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది భారతీయ ఋషులకు మనం సమర్పించిన నివాళి. స్వచ్ఛ్భారత్ అంటే మన ఇంటిని, వంటిని పరిశుభ్రం చేసుకోవడంగా మాత్రమే అర్థం చెప్పుకోకూడదు. మన మనసు, బుద్ధి ఆత్మ అన్నీ శుభ్రం కావాలి. గంగోత్రి వద్ద గంగ పవిత్రంగా ఉన్న రీతిలోనే, హుగ్లీ వద్ద కూడా పవిత్రంగా ఉండాలని కోరుకోవడమే స్వచ్ఛ్భారత నిర్మాణం కోరుకోవడం అవుతున్నది. దేశ ప్రజలంతా, ఈ శుభ సమయంలో1857 నుంచి 1947 వరకు జరిగిన మహోజ్వల త్యాగమయ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన శుభ సమయమిది.

- ముదిగొండ శివప్రసాద్