Others

గూఢచారి 116 (ఫ్లాష్‌బ్యాక్ @50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: ఆరుద్ర
నృత్యం: చిన్ని సంపత్
కళ: వి కృష్ణారావు
కూర్పు: యన్‌ఎస్ ప్రకాశం
కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
డివొపి: రవికాంత్ నగాయిచ్
సంగీతం: టి చలపతిరావు
దర్శకత్వం: యం మల్లిఖార్జునరావు
నిర్మాతలు: డూండీ,
సుందర్‌లాల్ నహతా

ప్రముఖ నిర్మాతలు సుందల్‌లాల్ నహతా, పోతిన డూండేశ్వరరావు (డూండీ) కలిసి రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. 1966లో వీరి బ్యానర్‌లోనే విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంతో నిర్మించిన చిత్రం ‘గూఢచారి 116’. ఆగస్టు 11, 1966లో చిత్రం విడుదలైంది.
ఆండ్రూ హునీబెల్లి దర్శకత్వంలో కెర్విన్ మాథ్యూస్ హీరోగా ఫ్రెంచి గూఢచారి చిత్రం ‘బ్యాంకో ఎ బ్యాంకాక్ పోర్ ఒఎస్‌ఎస్ 117’ (ఓఎస్‌ఎస్ 117) 1964లో విడుదలైంది. ఈ చిత్రం ఇటలీలో ‘మినాకియా బ్యాంకాక్’ పేరిట, ‘ప్యానిక్ ఇన్ బ్యాంకాక్’ పేరుతో అమెరికాలోనూ విడుదలైంది. వీటి కథాంశాన్ని ఆధారం చేసుకుని, తెలుగుకు అనుకూలంగా కొద్దిగా మార్పు చేర్పులతో తీసిన చిత్రమే -గూఢచారి 116. తెలుగులో అప్పటివరకూ రాని జేమ్స్‌బాండ్ తరహా చిత్రంగా సన్నివేశాలు, పోరాటాలను వైవిధ్యంగా అల్లుకొని నిర్మించారు. హీరో కృష్ణ ‘తేనెమనసులు’, ‘కనె్నమనసులు’ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే -నిర్మాత డూండి ఈ సినిమాకు కృష్ణను హీరోగా నిర్ణయించటం జరిగింది. తరువాత డూండీ నిర్మాతగా కృష్ణ హీరోగా 25 చిత్రాలు వరకూ రూపొందాయి. జేమ్స్‌బాండ్ చిత్రానికి సీనియర్ శ్రీరంజని (లవకుశ సీత 1934) కుమారుడు యం మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించారు. ఈయన పౌరాణిక తొలి చిత్రం ‘ప్రమీలార్జునీయం’. రెండో చిత్రంగా కృష్ణతో సాంఘిక చిత్రం చేశారు. తరువాత వీరి కాంబినేషన్‌లో 13 చిత్రాలు వరకూ రూపొందటం ఒక రికార్డు.
***
విదేశీ శక్తులు మన దేశంలో చేపడుతున్న విధ్వంసక చర్యల గుట్టు తెలుసుకోవటానికి ప్రభుత్వం శివరావును గూఢచారి 303 (శోభన్‌బాబు)గా నియమిస్తుంది. శివరావు ఓ ఆనకట్ట పేల్చివేత చర్యను అడ్డుకొని విద్రోహుల ఫొటోలు తీసి, చివరకు దుండగుల కాల్పుల్లో మరణిస్తాడు. ఈ ముఠా గుట్టు సేకరించమని మరో గూఢచారి 116 గోపిని (కృష్ణ) నియమిస్తాడు ఓ ప్రభుత్వ అధికారి. ఈ సంగతి తెలుసుకున్న ముఠా నాయకుడు సుప్రీం (రాజనాల), గోపిని అంతం చేయాల్సిందిగా విద్రోహచర్యల్లో తమకు సాయపడుతున్న దామోదరం (ముక్కామల)ని ఆదేశిస్తాడు. శివరావు చెల్లెలు సుగుణ (గీతాంజలి) తన అన్న చావుకు గోపియే కారణమని అనుమానిస్తుంది. ఇదిలావుంటే, గోపి పరిశోధనకు, సింహాచలం (రేలంగి), అతని కుమారులు (రమణారెడ్డి, నేరెళ్ళ వేణుమాధవ్), మేనల్లుడు (రాజ్‌బాబు) సహకరిస్తుంటారు. దామోదరం కుమార్తె రాధ (జయలలిత)తో కలిగిన పరిచయంతో ప్రేమలో పడిన గోపి, ఆమెకు తన తండ్రి నిజ స్వరూపాన్ని తెలియచేస్తాడు. తండ్రి దామోదరాన్ని రాధ నిలదీస్తుంది. దీంతో, ఇక ఈ పనులకు స్వస్తి చెబుతానని సుప్రీంకు చెబుతాడు దామోదరం. దీంతో రాధను బంధించి దామోదరాన్ని లొంగదీయాలని ప్రయత్నించిన సుప్రీం ప్రయత్నాలను గోపి సాహసంతో ఛేదించి వారి ఫ్యాక్టరీని నాశనం చేసి, సుప్రీంను జీపుతో అంతం చేసి విజయం సాధిస్తాడు.
ఈ చిత్రంలో ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ రమణారెడ్డి సోదరుడుగా కనిపిస్తారు. రమణారెడ్డిని, రేలంగిని అనుకరించి నవ్విస్తాడు. రేలంగికి నలుగురు భార్యలు, 18మంది సంతానం. పైగా మేనల్లుడు నూకరాజు. వీరితో పుట్టించిన హాస్యం, పరిశోధన కలిసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విలన్ ముఠాలో ఒకడిగా నెల్లూరు కాంతారావు, నారాయణగా సిహెచ్ కృష్ణమూర్తి, సుప్రీం అనుచరులుగా జగ్గారావు, పిజె శర్మ, కృష్ణతో పరిచయ గీతంలో వసంతగా వెన్నిరాడై నిర్మల, ‘ఎర్రబుగ్గల మీద’ పాటకు ముందు జానపదాన్ని గురించి వివరించే వ్యక్తిగా సంగీత దర్శకుడు టి చలపతిరావు నటించారు. ‘వీరాభిమన్యు’ చిత్రంలో అర్జునునిగా మెప్పించిన శోభన్‌బాబు, ఈ చిత్రంలో గూఢచారి 303గా కొద్దిసేపే కనిపించే పాత్ర పోషించి -విలన్‌ల నుంచి తప్పించుకోవటం, డామ్‌ను కాపాడటం లాంటి సన్నివేశాల్లో రాణించే నటన చూపారు.
హీరో ‘గోపి’గా కృష్ణకు ఇది 3వ చిత్రం. అయినా విలన్లను ఎదుర్కొనే ఫైట్స్ సన్నివేశాల్లో వేగం, చురుకు, తమాషా.. రాధతో ప్రణయంలో చిలిపితనం.. పాటల్లో హుషారు.. ఇలా వైవిధ్యమైన నటనతో మెరుపులు ప్రదర్శించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, సాహసాలకు మారుపేరుగా, సూపర్ స్టార్‌గా నిలవటానికి ఈ చిత్రం కృష్ణకు దోహదపడింది.
రాధగా జయలలిత అమాయకత్వం, వలపు, తండ్రి దేశద్రోహి అని తెలిసి పరితాపం, అతనిలో మార్పునకు ఆనందం, ప్రియునితో యుగళ గీతాల్లో.. (ముఖ్యంగా ‘ఎర్రాబుగ్గల మీద మనసైతే ఏంచేస్తావురా’ -సినారె- ఘంటసాల, సుశీల కోరస్) అలరించే నృత్యంతో నటనతో మెప్పించింది. దర్శకులు మల్లిఖార్జునరావు సన్నివేశాలను సాంకేతిక ఆపాదనతో ఉన్నతస్థాయిలో చక్కని టెంపోతో నడిపించారు. ఆహ్లాదకరమైన పాటల చిత్రీకరణతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. గూఢచారి 303 విలన్ల తుపాకి కాల్పుల నుంచి తప్పించుకుని ఓ యువతి చేతిలో మరణిస్తాడు. గూఢచారి 116 ఆమె చేతనే విలన్‌ను కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ వద్ద వైవిధ్యంగా చంపించినట్టు సన్నివేశాన్ని రూపొందించటం దర్శకుని ప్రతిభకు తార్కాణం. బాంబుల నారాయణ కాల్చివేసిన ఉత్తరం బూడిద నుంచి తిరిగి రేలంగి బృందం ప్రింట్ తీయటం, రాజ్‌బాబు వద్ద హోటల్‌లో ఉంచిన బజర్ రేడియో నుంచి బయట దూరంగావున్న కృష్ణకు సంకేతాలు అందటం, దామోదరం ఇంట్లో ఫోన్ టాప్ చేసి బయట వ్యాన్‌లోనుంచి రమణారెడ్డి, కృష్ణ వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవటం, నదిలో బోటులో ప్రయాణించాక వచ్చే విలన్ స్థావరం, చివర సుప్రేమ్ మన దేశంలో పొలాలపై ప్రయోగించదలచిన రసాయన తయారీ ఫ్యాక్టరీ క్రింద రాధ, సుగుణ, కృష్ణను బంధించటం, చివర్లో బాంబులతో ఫ్యాక్టరీ పేల్చేయటం, జీపుతో హెలికాప్టర్ ఢీ.. లాంటి గగుర్పొడిచే సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత మరెన్నో యాక్షన్ చిత్రాలకు ఇలాంటి సన్నివేశాలే మార్గదర్శకంగా నిలిచాయి.
రాత్రివేళ సముద్ర తరంగాలను చూపుతూ బీచ్ ఒడ్డున చిత్రీకరించిన గీతం -పడి లేచే కెరటం చూడు/ పడుచు పిల్లఅందం (ఆరుద్ర- సుశీల) కృష్ణ, జయలలితలపై అద్భుతంగా చిత్రీకరించారు. వీరిపైన ఊటీలో రంగుల్లో చిత్రీకరించిన మరో గీతం -నువ్వు నాముందుంటే/ నిన్నలా చూస్తుంటే (సినారె- ఘంటసాల, సుశీల), మరో గీతం -మనసుతీరా నవ్వులే నవ్వాలి (ఆరుద్ర- ఘంటసాల, సుశీల కోరస్), కృష్ణ, వెన్నిరాడై నిర్మలపై గీతం -డీరి డిరి డీరి.., గీతాంజలి, కృష్ణను కవ్విస్తూ పాడే గీతం -నీతో ఏదో పనివుంది (ఆరుద్ర- సుశీల) అలరిస్తాయి. ఈ గీతాల్లో -ఎర్రబుగ్గల మీద చిత్రీకరణ, నృత్యం, సంగీతం వాయిద్యాలు, డప్పులతో, వైవిధ్య భరితంగా ఆకట్టుకునేలా తమాషాతో కొంత, ఇంగ్లీష్ డాన్స్ కొంత, కొంత జానపద నృత్యంతో సాగటం విశేషం.
తొలుత తెలుగులో తీసిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో సుందల్‌లాల్ నహతా, డూండీలు ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేశారు. తరువాత హిందీలో కెమెరామెన్ రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో జితేంద్ర, బబిత హీరో హీరోయిన్లుగా ‘్ఫర్జ్’ పేరిట నిర్మించారు. ఈ చిత్రం కూడా విజయం సాధించి రికార్డులు సృష్టించింది. వెన్నిరాడై పాత్రను అరుణాఇరానీ, గీతాంజలి పాత్ర కాంచన పోషించగా, రాజనాలే ఫర్జ్‌లో కూడా నటించటం, రాజనాల నటించిన ఏకైక హిందీ చిత్రం ఫర్జ్ కావటం విశేషం. యాక్షన్, థ్రిల్లర్, జేమ్స్‌బాండ్ చిత్రంగా ‘గూఢచారి 116’ గుర్తింపు పొందింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి