మెయన్ ఫీచర్

స్వీయ సంస్కరణల లేమి.. అసలు సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మళ్లీ వివాదంగా మారి చర్చ సాగుతున్న ‘తలాక్’ ప్రశ్నకు మూల కారణం- ముస్లిం సమాజం తన సంస్కరణలు తాను తెచ్చుకోకపోవటం. ఆ పని జరిగి ఉన్నట్లయితే బయటి సమాజానికి గాని, చట్టాలూ- రాజ్యాంగానికి గాని, చివరకు తమను ‘వ్యతిరేకుల’ని భావించే వర్గాలకు గాని ఆ విషయాలలో ‘జోక్యం’ చేసుకునేందుకు అవకాశమే లభించదు. కాని భారతదేశంలోని ముస్లిం సమాజపు పెద్దలు ఈ సాధారణమైన తర్కాన్ని గుర్తించటం లేదు. తలాక్ వంటి విషయాలలో తక్షణ సంస్కరణలు అవసరమంటున్నది వారి ‘శత్రువులు’ మాత్రమే కాదు. వారి శ్రేయోభిలాషుల మాట కూడా అదే. బయటి శ్రేయోభిలాషులే గాక, అంతర్గతంగా ముస్లిం సమాజంలోనే ప్రగతిశీల దృక్పథం గలవారు ఈ సూచన చిరకాలంగా చేస్తున్నారు. ముస్లిం సమాజంలోని ప్రగతిశీలురు వామపక్ష భావజాలాలు గలవారే కానక్కరలేదు. అటువంటి వారు కొందరు ఉండవచ్చుగాక. అంతకన్నా చాలా ఎక్కువగా ముస్లిములలో- విద్యావంతులు, సమాజ పరిణామగతులు తెలిసినవారు, మధ్యయుగాల విశ్వాసాలూ ఆచార వ్యవహారాలలో కాలానుగుణమైన సంస్కరణల అవసరమేమిటో అర్థం చేసుకున్నవారు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లో జరిగిన ముస్లిం పెద్దలు, నాయకుల సమావేశంలో మహిళల విషయమై ‘ఆత్మ పరిశీలన అవసరమని’ పలువురు సూచించారు.
ఇక ‘ట్రిపుల్ తలాక్’ అనే పద్ధతి వల్ల ప్రత్యక్షంగా బాధితులవుతున్న ముస్లిం మహిళల గురించి చెప్పనక్కరలేదు. వారికి ఈ సంస్కరణ పట్ల బలమైన కోరిక ఉంది. లోగడ షాబానో గాని, ప్రస్తుతం కేసువేసిన సైరాబానోగాని- ఈ స్థితికి రెండు ఉదాహరణలు, ప్రతీకలు మాత్రమే. ముస్లిం సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనం విస్తృతంగానే ఉంది. అందులో భాగంగా నిరక్షరాస్యత, నామమాత్రపు చదువులు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. అనేక విషయాలలో వారు ఎస్సీ, ఎస్టీల కన్న వెనుకబడి ఉన్నట్లు జస్టిస్ సచార్ నివేదిక గణాంకాలతో వివరించి చెప్పింది. పురుషుల పరిస్థితే అది కాగా ఇక ముస్లిం మహిళల విషయం చెప్పనక్కరలేదు. ఇది చాలదన్నట్లు వివిధ సంప్రదాయాల మూలంగా ‘ఘెట్టో’ వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ మహిళలు వౌనంగా కుంగిపోవటం తప్ప, తమ మనోభావాలను బయటకు వెల్లడించగల అవకాశాలు లేవు.. షాబానో వంటి ప్రతీకలు సాహసించి ముందుకు వచ్చినపుడు చర్చలు జరగటం మినహా. అయితే, ముస్లిములలోని సంస్కరణవాదులైన పురుషులేగాక స్ర్తిలుకూడా అటువంటి లక్ష్యాల కోసం నిర్వహిస్తున్న సంస్థలు దేశంలో తగినన్ని ఉన్నాయి. కాని అవి చిన్నవి. సభ్యత్వాలు, ఆర్థికబలాలు ఎక్కువగా లేనివి. అదీగాక, స్తీలపై ఆధిపత్యానికి అలవాటుపడిన మగవారి నుంచి, ఆ మగవారి పక్షం వహించి అందుకు సంప్రదాయాల ముసుగులు వేసే ముస్లిం మత పెద్దలనుంచి తీవ్రమైన వత్తిళ్లు వారికి ఎదురవుతుంటాయి. అందువల్ల సంకోచాలు, భయాలతో పనిచేస్తుంటారు. విస్తరించటం, బాధితులైన మహిళలను సంఘటిత పరచటం వారికి తేలిక కాదు.
ముస్లింలలోని సంస్కరణవాదులు గట్టిగా కృషి చేయలేకపోవటానికి మరొక ముఖ్య కారణం ఉంది. అది రాజకీయ పార్టీలు,ప్రభుత్వాలు. ముస్లింలు పునాది కాకుండా సార్వజనికమైన పునాదులుగల పార్టీలే మన దేశంలో ఎక్కువ. వాటిలో అత్యధికం మధ్యేమార్గ పార్టీలు. తలాక్ సంప్రదాయానికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో వారికి తెలుసు. వారెవరూ దానిని ఆమోదించేవారు కాదు. ఈమాట అంటున్నది వారి ఆంతరంగిక భావనల గురించి. కాని రాజకీయ కారణాల వల్ల బహిరంగ వైఖరి మరొక విధంగా ఉంటుంది. కొంత ‘గోడమీద పిల్లివలె’, ఇంకొంత మంది ‘అశ్వత్థామ హతఃకుంజర వలె’ తలాక్ సరైనది కాదని వినిపించీ వినిపించనట్లుగా వ్యవహరిస్తుంటారు. అంతకు మించి స్పష్టమైన వైఖరి తీసుకోరు. అటువంటి వైఖరి తీసుకున్నట్లయితే ముస్లిం మత పెద్దలకు, తలాక్ పద్ధతి వల్ల లాభపడే ముస్లిం పురుషులకు, తలాక్ ఒక్కటే గాక ఇతరత్రా అసమంజసమైన ఆచార సంప్రదాయాల సంస్కరణలకు ఇది ఆరంభంగా మారితే- తమకు నష్టాలు కలిగి ఆధిపత్యం పోతుందనుకునే మగవారికి, వీరందరి ప్రభావంలో ఉండే మహిళలకు ఆగ్రహం కలిగి తమకు ఓట్లు వేయరన్నది ఈ పార్టీల భయం. వీటికితోడుగా ‘మత విషయాలలో జోక్యం చేసుకుంటున్నా’రనే ఆరోపణ ఎప్పుడైనా సున్నితమైనది, ప్రమాదకరం కూడా కావచ్చు. వాస్తవానికి ఇటువంటి ఆరోపణ ముస్లింలు అనేగాక ఏ మతం వారినుంచి వచ్చినా సున్నితమైనదే గనుక ఓట్ల భయం అందరి విషయంలోనూ ఉంటుంది. ఇటువంటి వివాదాలు తలెత్తినపుడు ఇటువంటి పార్టీలు ఏదో ఒక కారణం చూపి మతవాదులకు అండగా నిలిచి సంస్కరణవాదులను ఆక్షేపిస్తుంటాయి. ఈ రకరకాల పరిస్థితులన్నీ మనం చూస్తున్నవే.
కర్ణుని చావుకు ఆరుగురు కారణమన్నట్లు, ఈ విధంగా ముస్లిం సమాజంలోని అంతర్గత పరిస్థితులు, బయటి పరిస్థితులు కలిసి ఆ సమాజంలో సంస్కరణలకు ఆటంకమవుతున్నాయి. బహుశా వారికి భారతదేశంలో ‘మైనారిటీ మెంటాలిటీ’ ఏర్పడటం మరొక కారణం కావచ్చు. ఉదాహరణకు తలాక్ పద్ధతిని సాక్షాత్తూ అనేక ముస్లిం దేశాలలోనే రద్దుపరచటం లేదా తగినంత మార్చటం చేసినపుడు భారతదేశంలో ఎందుకు సమ్మతించరనే ప్రశ్న ఒకటి ఈ చర్చ సందర్భంగా వినవస్తున్నది. ఈ ప్రశ్న స్థూలంగా సరైనదిగానే తోస్తుంది. కాని లోతుకు వెళితే కొన్ని కన్పిస్తాయి. తాము హిందువులు అధికంగాగల దేశంలో మైనారిటీలమని, కనుక వీలైనంత సంఘటితంగా ఉండాలని, లేనట్లయితే భద్రత పోతుందన్నది వారి ఆలోచన. సంఘటితంగా ఉండటంలో భాగంగా తమ విశ్వాసాలను, సంప్రదాయాలను పట్టుదలగా కాపాడుకోజూస్తారు. అటువంటి దృష్టి తరచూ నిర్హేతుకతకు దారితీస్తుంది. తలాక్ తదితర సంప్రదాయాలలో మార్పును నిరాకరించే వైఖరి వెనుక ఈ స్థితి కూడా ఉందనుకోవాలి. అందుకే కావచ్చు తలాక్‌ను ముస్లిం దేశాలు రద్దుపరుస్తున్నా భారతదేశపు మత పెద్దలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు.
అయితే ఇక్కడ ఆలోచించవలసినవి రెండున్నాయి. వాటిలో ఒకటి చారిత్రకం కాగా, మరొకటి వర్తమానం. భారతీయ ముస్లింలలో మైనారిటీ మెంటాలిటీ ఏర్పడి స్థిరపడటం బ్రిటిష్ వలస పాలనా కాలంలో జరిగింది. అందుకు స్థానిక పరిస్థితులు, రాజకీయాలతోపాటు బ్రిటిష్‌వారి విభజన నీతి కారణమయ్యాయి. ఇది చారిత్రకం. అవి దేశ స్వాతంత్య్రం తర్వాత బలహీనపడి క్రమంగా సమసిపోవలసింది. కాని కాంగ్రెస్ వారి ఓటు రాజకీయం, ఆ పార్టీ ప్రభుత్వాలు అభివృద్ధి సాధనలో విఫలం కావటం అనే రెండు కలిసి ఆ మెంటాలిటీని కొనసాగించాయి. దేశ విభజన సమయపు రక్తపాతాల ప్రభావం కూడా- ఒకవేళ అభివృద్ధులు సరిగా జరిగి, ఓటు బ్యాంకు రాజకీయాలు లేనట్లయితే క్రమంగా తగ్గిపోయేది. విభజన కాలపు తరం గడిచిపోయి ఒకటి రెండు కొత్త తరాలు వచ్చేసరికి చదువులు, అభివృద్ధి, ఆధునీకరణలతో ముస్లిం సమాజం గణనీయంగా, తక్కిన సమాజంతోపాటు మారేందుకు అవకాశం ఉండేది. అందువల్ల సంస్కరణలకు, తలాక్ సంస్కరణలకు, ముస్లిం మహిళల అభ్యున్నతికి మార్గం సుగమమయేది. కాని ఇదేదీ జరగలేదు. ఇది వర్తమానం.
పరిస్థితులు ఇవికాగా, క్రమంగా పాకిస్థాన్, పాలస్తీనా, కశ్మీర్, బయటి నుంచి దిగుమతి అయిన టెర్రరిజం, స్థానికంగా రూపుతీసుకున్నది, ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ఘటనలు అన్నీ కలిసి మైనారిటీ యిజాన్ని పెంచుతూ వస్తున్నాయి. తమ ‘శత్రువులు’ అనుకునేవారి వైఖరులు కొంత దోహదం చేశాయి. ఒక విధంగా 1947-48 నాటి మెంటాలిటీ ప్రస్తుతం ఆ స్థాయిలోనే ఉందని ఎంతమాత్రం అనలేముగాని, సమసిపోలేదు కూడా. ఈ చర్చ అంతా చేస్తున్నది యథాతథంగా ఈ అంశాలను ప్రస్తావించేందుకు కాదు. ఈ సమాజం ఈ పద్ధతిలో ఉన్న దాని ప్రభావం ఆ మత పెద్దలు ‘తలాక్’ పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటున్నారనే దానిపై ఉంటుంది. సమాజం ఒక ఘెట్టోవలె ఎంతగా కొనసాగితే, ఉదారవాదం, ప్రగతి ధోరణి అంత తగ్గుతుంది. అంత ఎక్కువ కాలం కొనసాగుతుంది.
మొత్తం మీద ప్రస్తుత పరిస్థితి ముస్లిం సమాజానికి, వారి మహిళలకు ప్రయోజనకరమైనదా? హానికరమైనదా? అన్నది అంతిమంగా ఆలోచించవలసిన ప్రశ్న. 30 ఏళ్ల క్రితం నాటి షాబానో కేసు సృష్టించిన తుపాను సమయంలోనే ఈ ఆలోచనలు సవ్యంగా సాగి ఉంటే ఈ మూడు దశాబ్దాలలో వారికి చాలా మేలు కలిగేది. అందుకు భిన్నంగా ఇపుడు అటువంటిదే మరొక కేసు ముందుకు వచ్చిన మీదట సరిగా అప్పటి వాదనలే ఇపుడు కూడా ముస్లిం పర్సనల్ లాబోర్డు నుంచి, ఇతర సంస్థల నుంచి వినవస్తున్నాయి. ఆ సమాజపు పురోగతి దృక్కోణం నుంచి పరిశీలించినపుడు ఇది విచారకరమైన స్థితి.
సైరాబానో అనే మహిళ తలాక్ సమస్యపై సుప్రీంకోర్టుకు వెళ్లిన దరిమిలా జడ్జీల నిర్దేశం మేరకు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అఫిడవిట్ రూపంలో తెలియజేయటంతో చర్చ కొత్తమలుపు తిరిగింది. ట్రిపుల్ తలాక్ అన్నది దేశ రాజ్యాంగం, న్యాయవ్యవస్థకే గాక మహిళలకు విరుద్ధమైనది. గనుక ఎన్‌డిఎ ప్రభుత్వ అఫిడవిట్‌లో వేలెత్తి చూపవలసింది ఏమీలేదు. ప్రభుత్వం బిజెపి నాయకత్వాన ఉన్నంత మాత్రాన అఫిడవిట్ ముస్లిములకు వ్యతిరేకమైందనటం చెల్లుబాటయేది కాదు. అదే విధంగా, పర్సనల్ లా విషయాన్ని, తలాక్ ప్రశ్నను విడివిడిగా చూడవలసి ఉంటుంది. పర్సల్ లా అంశంపై ఇతరత్రా ఎన్ని చర్చలు అయినా తర్వాత జరుపుకోవచ్చు. తలాక్ సమస్యపై పర్సనల్ లాబోర్డు ప్రభుత్వ వైఖరితో ఏకీభవించటం వల్ల వారి సమాజానికి, మహిళలకు కలిగే మేలు ఎంతైనా ఉంటుంది. దీనిని ఒక ఆరంభంగా తీసుకుని ముస్లిం సమాజం అంతర్గత సంస్కరణలపై తీవ్రమైన మథనం సాగించటం ఈ 21వ శతాబ్దానికి తగిన పని. *

టంకశాల అశోక్ సెల్ : 98481 91767