మెయిన్ ఫీచర్

నాదయోగికి స్వరనీరాజనం ( నేడు శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీణావాదన తత్త్వజ్ఞో శ్రుతి జాతి విశారదః
తాలజ్ఞశ్చా ప్రయాసేన మోక్షమార్గం నియచ్ఛతి’
-యాజ్ఞవల్క్య స్మృతి
దైవభక్తి, సత్యము, భూతదయ, సత్ప్రవర్తన, సంపూర్ణ శరణాగతి, అద్వైత స్థితి ముఖ్యాంశాలుగా, కావ్య పురాణేతి హాసములను మనకందించినవారు వాల్మీకి వ్యాస మహర్షి. భాగవత శిఖామణియై లోకకల్యాణాన్ని సర్వదా కాంక్షించే నారదుడు భగవన్నామ సంకీర్తనలతో తరించవచ్చని నిరూపించాడు. సర్వవస్తువులయందు వాసుదేవ భావన కలిగి, త్రికరణశుద్ధిగా దేవుని భజిస్తూ సర్వజ్ఞులకు దైవభక్తిని బోధిస్తూ, తను తరించి ఇతరులను తరింపజేయగల మోక్షసాధనం ‘సంగీతం’ అని చాటి చెప్పిన వాగ్గేయకారులు- వాసుదేవ విఠలుని వాసిగా భజించిన పురందరదాసు, గీత గోవిందాన్నందించిన జయదేవుడు, శ్రీకృష్ణ లీలాతరంగములను సమాధి నిష్ఠలో రచించిన శివనారాయణ తీర్థులు, ఆర్తితో, శరణాగతితో సీతారాములను కీర్తించిన రామదాసు, పద కవితా కమలములతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాద పద్మములనర్చించిన పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య, అమ్మమీద కీర్తనలను అనితర సాధ్యముగా ‘శ్యామకృష్ణ సోదరి’ ముద్రతో వెలయించిన, కామాక్షీ వరప్రసాది ‘లయబ్రహ్మ’ శ్యామశాస్ర్తీ, భావ గంభీరమైన కృతులను ‘గురుగుహ’ ముద్రతో సర్వదేవీ దేవతలమీద అందిస్తూ, జగన్మాత శ్రీచక్రార్చనగా నవావరణ కీర్తనలను అనుగ్రహించిన ముత్తుస్వామి దీక్షితులు మున్నగు మహానుభావులు ఈ కోవకు చెందినవారు.
యోగము చేతను, సంగీతము చేతను మోక్షము సాధించుట సులభమని యోగము కంటే సంగీతావలంబనము చేత తరించుట సులభ సాధ్యమని తన జీవితానే్న మనకు ఆదర్శంగా చూపి, సద్భక్తి సహిత సంగీత వినీలాకాశంలో ధృవతారగా నిల్చిన పరమ భాగవతోత్తముడు సద్గురు త్యాగరాజస్వామి. రామతారక బ్రహ్మోపాసనముతో నాదోపాసనమును మేళవించి, సప్తస్వర సుందరుల భజించి, ఆరాధించి, ఉపాసించి- సాహిత్యమందు సంగీత సంప్రదాయములను, సంగీత సాహిత్య పొందికను అర్థవంతముగా, మేధాశక్తి సంపన్నముగా, హృద్యంగా ఆర్ద్రతతో ఆర్తిగా రూపొందించి భావ గాంభీర్యంతో రామభక్తి నిండారిన అనేక కృతులను వివిధ రాగములలో వెలయించి ‘తెలిసి రామ చింతన’ చేసిన బ్రహ్మ విద్యా సార్వభౌముడు నాదయోగి, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.
భగవద్రూపమందు మనస్సును లయింపజేసి, భక్తి పారవశ్యతను అనుభవించి, రాముని దివ్య సౌందర్యమును కన్నులారా దర్శించి, ఆ మధురానుభవమునకు కీర్తనాకృతినిచ్చి, భగవంతుని భజనానందమే తరుణోపాయమని భక్తి మార్గాన్ని సిద్ధాంతీకరించి, స్వరరాగ లయాదులతో భావ గాంభీర్యాన్ని అనుభవించి గానం చేసే వారికి దైవ సాక్షాత్కారం సాధ్యమని చెబుతూ దృశ్య రాగ చిత్రాన్ని అందించిన కళాస్రష్ట త్యాగరాజస్వామి.
‘నకారం ప్రాణనామానం, దకారమనలం విదుః,
ప్రాణానల సమా యోగాన్నాద నామాభి ధీయతే’
‘న’కారమంటే ప్రాణం (ప్రాణవాయువు), ‘ద’కారమంటే ‘అగ్ని’. ఈ రెండింటి కలయిక చేత ఆవిర్భవించింది నాదము. ఆ ప్రణవ నాదమే వేద పురాణేతి హాసములకు ఆధారమైంది. నాదమే అన్నింటికీ మూలం, ఆధారం. నాద సుధారసమే సంగీతము. అదే ‘నరాకృతి’ అయినది. అనగా రాముని ఆకారముగా అయినది. సంగీతములో సప్తస్వరాలుంటాయి. అవి రాముని కోదండమందున్న ఆరున్నొక్క గంటలు. సంగీతంలో రాగమున్నది. ఆ రాగమే రాముని కోదండము. సంగీతమునందు ‘తుర’ అనగా ద్రుతగతి, నయము, దేశ్యము అని త్రిగుణములుంటాయి. అవే రాముని వింటినారి. రాగమునకు సరసమయిన స్వరముల కూర్పు ఉంటుంది. అవే రాముని మృదు భాషణములు, నిరతగతి బాణ పరంపర. కోదండ ధారియైన రాముడే నాదాత్మమైన వాడగుట వలన- నాదము, కోదండ రాముడు ఒక్కటే, ఒకే చైతన్యం అని నాదోపాసకులు గ్రహించి ఉపాసన చేయాలని ఆరభి రాగంలో అద్భుతమైన ‘నాద సుధా రసంబిలను నరాకృతాయె మనసా..’ అన్న కీర్తనలో అందించాడు త్యాగరాజ స్వామి.
భారతీయ సంగీతానికి ఆత్మస్వరూపులు శ్రీ త్యాగరాజస్వామి. నాదోపాసనాసిద్ధితో సాక్షాత్తూ శ్రీరామ సాయుజ్యం పొందిన జీవన్ముక్తుడు త్యాగరాజస్వామి.
మహోన్నతమైన ఆదర్శములతో, గంభీరమైన రాగ భావ లయాది చరణ విన్యాసములతో, ముచ్చటగొలిపే తెలుగు నుడికారపు సొంపులతో చక్కని సమాసములతో, శ్రుతి స్మృతి పురాణేతిహాస తాత్పర్యములతో శ్రీరామ మధుర నామమును ఆడుచూ పాడుచూ మనకందించిన నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి.
రాముడు పరాత్పరుడు, సీత పరాప్రకృతి. వారి అనుబంధం సహజ సిద్ధం, సర్వలోక రమణీయం. చేతనాచేతన జీవరాశికి ప్రతీక సీత. ఆత్మనిష్ఠకు మారుపేరైన ఆమె సుఖదుఃఖములకు అతీతముగా నిలిచి, ‘రామమే వానుపశ్చతి’ అని యోగాద్వైత స్థితిలో అతడిని ఏకాగ్రతతో దర్శించిన విజ్ఞాన జ్యోతి ఆమె. భగవంతుడిని జీవుడు ఆశ్రయించటం కల్యాణం, మంగళప్రదం, ఆనంద దాయకం. రాముడు పరబ్రహ్మము, సీత మోక్షలక్ష్మి. రాముడు తపస్వి, సీత తపస్సిద్ధి. సీతారాములు పుణ్యదంపతులు. ఆ కల్యాణ దంపతుల స్మరణము ‘జగదానందకారకము’ అని ఉదాత్తంగా, గంభీరమైన పదజాలంతో, సంస్కృతాంధ్ర భాషలలోని అలతి అలతి పదములతో విశ్వమంతయూ పంచభూతాత్మకమయి యున్నట్లు, ఉపనిషత్తులు పురాణములు భగవద్గీత బ్రహ్మసూత్రములు, వేద శాస్తమ్రులలోని ఆధ్యాత్మిక విషయములను, హరిహరాద్వైత భావముతో, సంగీత సాహిత్య ప్రపంచమంతయూ యిమిడియున్న ‘ఘనరాగ పంచరత్న కీర్తనలను నాట, గౌళ, ఆరభి,వరాళి, శ్రీరాగములలో ఆదితాళ నిబద్ధనతో, భక్తిరస సమ్మితముగా అందించి పూర్ణత్వమొందిన కళాద్రష్ట త్యాగరాజస్వామి.
శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి చైత్రోత్సవ సంఘటనలు, చిత్తూరు జిల్లా పుత్తూరు గ్రామమున మరణించిన వానిని పునర్జీవితుని గావించిన విశేషములు, నాగలాపురం అడవులలో త్యాగరాజస్వామి బృందంపై పడి దోచుకొనునప్పుడు రామలక్ష్మణులు కోదండపాణులై దొంగలను పారద్రోలిన ఘట్టములు, తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధానములో జరిగిన అద్భుత విషయములు, ఇంకనూ త్యాగరాజస్వామి వారి జీవితములోని మరికొన్ని సంఘటనలు మరపురానివి. అవి మనలను సంభ్రమాశ్చర్యములలో ముంచి, ఆనంద సాగరంలో తేలియాడించి పరవశింపజేసి, ఎంతటివారికైనా భక్త్భివనను కలుగజేస్తాయి.
శ్రీరామబ్రహ్మము, సీతాంబ అనే పుణ్యదంపతులకు సర్వజిత నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠీ సోమవారము (1783) రోజున పరమేశ్వరానుగ్రహ లబ్ధుడై జన్మించిన కారణజన్ముడు శ్రీ త్యాగయ్య. శ్రీ శొంఠి వేంకట రమణయ్య వద్ద సంగీత విద్యను అభ్యసించి, నారద గురుస్వామి అనుగ్రహించిన నారదీయం, స్వరార్ణవమ సంగీత శాస్త్ర గ్రంథములతో, సంగీత శాస్త్ర మర్మములను తెలిసికొన్నారు. శ్రీరామకృష్ణానందుల వారి ఉపదేశాన్ననుసరించి తొంబదియారు కోట్ల సార్లు దీక్షగా ఆర్తితో రామతారక మంత్రాన్ని జపించి, ఫలసిద్ధుడై, తన వాక్సుద్ధిని విశ్వమానవ కల్యాణానికి ఉపకరించిన మహనీయుడు త్యాగరాజస్వామి.
‘సర్వమూ రాముడే’అని విశ్వసించి, సర్వులయందు రాముని గాంచి అద్వైత సిద్ధితో జీవన్ముక్తుడైన త్యాగయ్యకు, పరాభవ నామ సంవత్సర (1847) పుష్య శుద్ధ ఏకాదశి నాడు భద్రాచల రాముడు దర్శనమిచ్చి, పది పూటలలో కరుణింతునని చెప్పినాడట. పుష్య శుద్ధ పూర్ణిమ నాడు త్యాగయ్య ఆపత్సన్యాసమును స్వీకరించి ‘శ్రీత్యాగరాజస్వామి’ ఆశ్రమ నామాంకితులైనారు. పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజస్వామి- శ్రీరామచంద్రుని ‘పరితాపముగని యాడిన పలుకులు మరచితివో..’ అని మనోహరి రాగంలో ‘పది పూటలలో (రోజులలో) కరుణిస్తానన్న’ పలుకులను ఆయనకు జ్ఞప్తికి తెచ్చాడు. శ్యామల వర్ణ సూచితమయిన ‘త్రిగుణాత్మక ప్రకృతి’యే ఉపాధి కల వాడగుటచే శ్యామలుడైన శ్రీరామచంద్రుని ‘శ్యామ సుందరాంగ’ అని ధన్యాసి రాగంలో నిండు మనసుతో కీర్తిస్తూ- ‘సకల శక్తియూ నీవేరా, త్యాగరాజు నీకు వేరుకాద’ని పలుకుతూ గంభీర సమన్వయముతో కీర్తించి, సమాధి నిష్ఠతో రామునియందు విలీనమైన బ్రహ్మనిష్ఠుడు- శ్రీ త్యాగరాజస్వామి.
సర్వులయందు రాముని చూచి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించి, నాటికి నేటికీ ఏనాటికీ- నాదోపాసన చేసేవారికి అన్నవస్తమ్రులకు లోటులేని ప్రణాళికను అందించుటయే కాక, మోక్ష మార్గాన్ని కూడా చూపించిన అనవరత స్మరణీయుడు, నాద యోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.

-పసుమర్తి కామేశ్వర శర్మ సెల్ నెం: 94407 37464