మెయన్ ఫీచర్

విప్లవ విజ్ఞాన వీచిక ఓయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో మొదటి దశ (1969) ఉద్యమ సందర్భంగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా కుప్పకూలింది. మాస్ కాపీయింగ్‌తో ఉస్మానియా డిగ్రీలకు విలువలేకుండా పోయింది. తిరిగి గాడిలో పెట్టడానికి ఎకడమిషన్ కానటువంటి జగన్మోహన్‌రెడ్డిని ఎమర్జెన్సీ కాలంలో వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. ఆయన రావడంతోనే విశ్వవిద్యాలయ కోర్సులకు, మెడిసన్‌కు ఎంట్రెన్స్ నిర్వహించాడు. అలా ప్రారంభమైన ఎంట్రెన్సు ప్రస్థానం తర్వాతికాలంలో విశ్వవిద్యాలయ పరిధి కోర్సులకు రాష్ట్ర వ్యాపిత (ఉమ్మడి) కోర్సులకు విస్తరించింది. అప్పటికే జార్జిరెడ్డి హత్య జరిగి (14-4-72) మూడు సంవత్సరాలైంది. క్యాంపస్‌లో నాటికే చొరబడిన సంఘ వ్యతిరేక శక్తుల, జులాయిల టైట్ ప్యాంట్లను (ఆజదఆ ఔ్ఘశఆఒ) తనధైన శైలిలో జగన్మోహన్‌రెడ్డి లూస్ (్య్యఒళ) చేసి క్యాంపస్‌తో పాటుగా తెలంగాణలోని (అప్పటికి కాకతీయ ఏర్పడలేదు) అనుబంధ కాలేజీల వాతావరణానే్న మార్చివేశాడు. తర్వాత వచ్చిన ప్రొ. రాంరెడ్డి ఎకడమికల్‌గా, పాలనాపరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
అదేకాలంలో ఓయుతోపాటుగా సంబంధిత కళాశాలల్లో వామపక్ష భావజాలం ఊపందుకోగా ప్రగతిశీల, రాడికల్ విద్యార్థి సంఘాలకు అంకురార్పణ జరగ్గా, కౌంటర్‌గా జాతీయ భావజాల విద్యార్థి పరిషత్ వేళ్లూనుకోవడం జరిగింది. క్యాంపస్‌లో ప్రగతిశీల శక్తుల్ని కూడగడుతున్నారని భావించిన వెంగళరావు ప్రభుత్వం ఎంఎల్‌ఏ నీలం రామచంద్రయ్యతోపాటు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌ను నవంబర్ 5, 1975 ఎన్‌కౌంటర్ చేయించింది. ఇలా మొదలైన క్యాంపస్ రాజకీయాలు రెండు రాజకీయ శిబిరాలుగా చీలిపోయాయి. ఎమర్జెన్సీ కాలంలో మరింత తీవ్రరూపం దాల్చి, మరికొంతమంది విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎమర్జెన్సి ఎత్తివేసిన తర్వాత క్యాంపస్ వాతావరణం నివురుగప్పిన నీరులా ఉండేది.
కుల, కుటిల రాజకీయాలకు నిలయమైన ఉస్మానియాలోని తరగతి గదుల్లో బోధన తక్కువ, సాచివేత ఎక్కువగా ఉండేది. మారుమూల ప్రాంతాలనుంచి వచ్చిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల్ని ఉన్నత కులాల ఆచార్యులు రెండోశ్రేణి విద్యార్థులుగా చూసేవారు. ప్రశ్నిస్తే ఫెయిల్ చేయడం సర్వసాధారణం. దీనికి జడిసిన విద్యార్థులు కొందరు అధ్యాపకులకు అనుకూలంగా మారితే, మరికొందరు తిరుగుబావుటా ఎగరేసేవారు. మిగతావారు తటస్థంగా, అవకాశవాదులుగా మెదిలేవారు. తిరుగుబావుటా ఎగరేసిన వారిలో కొందరు రాజకీయ చైతన్యంతో విప్లవ రాజకీయాల్లోకి వెళ్లారు. దేశ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నంలో ప్రాణాల్నే ఫణంగా పెట్టారు. ఇంతటి బలిదానాలకు నిలయమైన విశ్వవిద్యాలయం దేశంలో మరొకటి లేదు. ఇలాంటి శ్రేణులకు నిలయమైన ఉస్మానియాలో నిత్యం వివిధ రంగాలపై చర్చలు సాగేవి. దీనికి ఆర్ట్స్ కాలేజీలోని రూం నెం.57 కేంద్ర బిందువుగా వుంటే, ఎ, బి, సి, ఓల్డ్ పిజి హాస్టల్స్ విభిన్న అంశాల చర్చాగోష్టులకు నిలయంగా వుండేవి. ఆర్ట్స్ కాలేజీ సెమినార్ లైబ్రరీతోపాటు, మొత్తం క్యాంపస్‌కే ధ్వజస్తంభంలా వుండే సెంట్రల్ లైబ్రరీలు అధ్యయన కేంద్రాలుగా విరాజిల్లేవి.
ఇలాంటి చైతన్యపూరిత వాతావరణాన్ని జీర్ణించుకోని శక్తులు పాలకవర్గాలతో, పోలీసుల సహకారంతో దాడులు, నిర్బంధం మామూలైపోయింది. మరోవైపు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ ప్రిపరేషన్‌కై వచ్చామంటూ హాస్టల్ గదుల్లో చొరబడి, విద్యార్థుల వివరాల్ని సేకరించి అవసరమైతే హెచ్చరికలు చేసేవారు. నూతన పత్రికను నడిపే రత్నమాలతోపాటు దేవులపల్లి అమర్, హెచ్చార్కే తదితరులు సి హాస్టల్ రూం నెం.40కి తరచుగా రావడమేకాకుండా, ‘ఉదయసాహితి’ అనే పత్రికకు నాందీప్రస్తావన జరిగిందని, డిస్టర్బ్‌డ్ రూంగా పిలిచేవారు. ‘డి’ హాస్టల్లో వుండే జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ దగ్గరికి కాశిపతి, వరవరరావు లాంటివారు రావడంతో పోలీసు కాపలా వుండేది. దళిత విద్యార్థులుండే గదులకు కత్తిపద్మారావు లాంటి వారు వచ్చేవారు. ఎంటి ఖాన్ లాంటి వారిచే విభిన్న అంశాలపై చర్చలు జరిగేవి. హాస్టళ్ల పక్షాన ‘యువత’ అనే పత్రిక (సావనీర్) ప్రచురించారు. మధ్య మధ్యన గద్దర్, అరుణోదయ రామారావు పాడిన పాటలు విద్యార్థుల్ని ఉత్తేజపరిచేవి. గద్దర్ స్వీయ రచనలైన ఒడ్డెరోళ్ళమండి, యాడరో ఈ మాదిగ బతుకు, గ్యాంగోళ్లమండి, గూడ అంజయ్య ఊరు మనదిరా, అసలేటి వానల్లో, కాశీపతి విరచిత, రామారావు పాడే జంపాలపై ఉయ్యాలో! జంపాలో పాటలకు లేడీస్ హాస్టల్‌తో సహా మిగతా హాస్టళ్లన్నీ అనునాదంగా మారేవి. క్యాంపస్ బయటి హాస్టల్లో, వివిధ ప్రాంతాల్లో నృత్యరూపకంగా ప్రదర్శించబడే చరబండరాజు కొండలు పగలేసినం విద్యార్థుల ఆలోచనల్ని సుడులు తిప్పేది.
విద్యార్థుల సామాజిక స్వరం
ఇదంతా ఒకవైపు కాగా, సామాజిక సమస్యలపై నిరంతరం గొంతు విప్పేది క్యాంపస్. ఎమర్జెన్సీని కూడా లెక్కచేయకుండా, ముషీరాబాద్ జైల్లో భూమయ్య, కిష్టగౌడ్‌లను ఉరితీస్తే మొట్టమొదట నినదించింది ఓయు విద్యార్థులే! 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనకు జోలెపెట్టి నగరవీధుల్లో సహాయాన్ని సాధించింది ఈ క్యాంపస్ విద్యార్థులే! ఎన్‌కౌంటర్లపై విచారణకై ఏర్పాటైన తార్కుండే, భార్గవ కమిటీల ముందు నిర్భయంగా నిజాలు వెల్లడించింది ఈ విశ్వవిద్యాలయ విశ్వసనీయులే! సిటీ బస్సుల ఐదు పైసల పెంపుదలను, పోలీసు స్టేషన్‌లోనే అత్యాచారానికి గురైన రమెజాబి ఉదంతాన్ని ఎదుర్కొన్నది ఈ విద్యార్థి వర్గాలే! బేగంపేట గ్రీన్స్‌లాండ్ నుండి తార్నాక స్వంత ఇంటికి సిఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చుకున్న చెన్నారెడ్డి ఇందిరతో కలిసి క్యాంపస్ గుండా పోతుంటే ఎమర్జెన్సీని విధించిన నేత అని, చెన్నారెడ్డితోపాటు తెలంగాణ ద్రోహి అని అడ్డుకొని లాఠీదెబ్బలు, తూటా దెబ్బలు తిన్నది వారే!
ఇలా సామాజిక, రాజకీయ న్యాయం అనే సూత్రీకరణతో విద్యారంగాన్ని మిళితం చేసి ‘శాస్ర్తియ విద్య’ అనే సూత్రీకరణను ముందుకు తెచ్చి క్యాంపస్‌లోనే కాక రాష్ట్ర వ్యాపితంగా గోడలపై జాజుతో రాసేలా ఎదిగించిన ఘనత ఓయు విద్యార్థి రాజకీయాలదే! నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్మాణ సిమెంట్ కుంభకోణం సందర్భంగా అరెస్టు అయిన సుబ్బిరామిరెడ్డిని కోర్టు విడుదల చేస్తే, ‘ఇచ్చట న్యాయం అమ్మబడును..’ అని నినదించిన క్యాంపస్ రాష్ట్ర రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావానే్న చూపింది. పల్లె ప్రజలతో, శ్రమజీవులతో మమేకం కాని విద్య విద్య కాదంటూ, ‘గ్రామాలకు తరలండి..’ అనే పిలుపునిచ్చి, భూసర్వేలని చేయించి, పాలేర్లకు వెట్టి జీవితాలకు విముక్తి కల్గించి దొరలను, భూస్వాముల్ని గడీలను వదిలేలాచేసిన ఘనత ఉస్మానియా విద్యార్థులదే! విద్యార్థులు బుద్ధిగా చదువుకొని, బంగారు కలలు కంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలిగాని, ఇవేం రాజకీయాలు అనేవారూ వున్నారు. ఇలాంటివారే నక్సలైట్లే దేశభక్తులని పొగడి రాష్ట్ర రాజకీయాల్లో పాగావేసి ముఖ్యమంత్రులైనారు. చెన్నారెడ్డి, ఎన్‌టిఆర్, కెసిఆర్ ఆ కోవకు చెందినవారే. వీరు ఎన్‌కౌంటర్లనే ప్రోత్సహించారు. విద్యార్థులకు రాజకీయాలు వద్దనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా (1977లోనే చివరివి) చేశారు. ఈ రాజకీయాల్లో పుట్టి పెరిగినవారు బిజెపి, టిడిపి, నేడు టిఆర్‌ఎస్‌లోను పదుల సంఖ్యలో ఉన్నారు.
పోరాడి సాధించారు
అప్పటిదాకా అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకే పరిమితంగా వున్న సాహిత్యాన్ని దళిత, మహిళా వేదికలవైపు నడిపించేలా చేసింది. బి.ఇడి లాంటి వ్యక్తి సంబంధిత కోర్సులు చదవాలంటే భర్త అనుమతితోపాటు నాన్ ప్రెగ్నెన్సి సర్ట్ఫికెట్ కావాలన్న నిబంధనల్ని సడలింపజేసింది ఓయు విద్యార్థులే! ప్రాక్టికల్స్, థియరీ ఒకేసారి పాస్ కావాలన్న రూల్స్‌ను రద్దుచేయించింది, స్కాలర్‌షిప్‌లు సాధించుకునేలా ఉద్యమించింది మొట్టమొదట ఉస్మానియానే! ఈ ఉద్యమంలోంచి పుట్టి, ఎదిగిన నాయకుడే నేటి క్రిష్ణయ్య! ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ప్రిన్సిపాల్, హెడ్, డీన్‌ల పోస్టుల్ని రొటేషన్ పద్ధతిలో అనుభవించేలా, వెనుకబడిన కింది కులాలవారు కూడా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌గా వుండాలని, అందుకు సంబంధించిన నిబంధనల్ని సడలించేలా విద్యార్థులు క్రియాశీలక పాత్రను పోషించి, మొట్టమొదటిసారి క్యాంపస్‌లోని విద్యా కళాశాలల ప్రిన్సిపాల్‌గా బిసి కులస్థుడైన రుక్మారావును నియామకం చేయించింది విద్యార్థులే!
ఇలా 100 సం.ల ఉస్మానియా చరిత్రలో డెబ్భైవ దశకం దాకా ఒక శకంగా, తొంభైయవ దశకం దాకా మరో శకంగా భావించి, తర్వాతి కాలాన్ని మూడో శకంగా గుర్తిస్తే మధ్యనగల రెండు దశాబ్దాలు రాష్ట్ర, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పాయనడంలో అతిశయోక్తిలేదు. దీనికి జార్జిరెడ్డి వారసులుగా జంపాల, ఎర్రంరెడ్డి సంతోష్, మల్లోజుల, రాంచెందర్, రంగవల్లి లాంటి వారెందరో కారకులంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. ఈ రాజకీయాలే పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాలతోపాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఓ కుదుపు కుదిపాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ను 1977లో భూస్థాపితం చేసి జనతా ప్రభుత్వం వచ్చేలా చక్రం తిప్పాయి.
మధుర జ్ఞాపకం
నాణానికి (నాణేనికి) మరోవైపులా ఓయు క్యాంపస్ జీవితం ఓ మధురానుభూతే! నెలకు రూ.225/- స్కాలర్‌షిప్‌లో రూ.25/-లు రూం రెంట్‌గా, రూ.25/-లు పాకెట్ మని పోగా, మిగతాదానితో ప్రతి ఆదివారం ఆఫ్ చికెన్ తినడం, దీనికై ఎదురుచూడడం మరిచిపోలేని జ్ఞాపకమే! గుడ్డి వెలుతురునిచ్చే బల్బుల స్థానంలో ట్యూబ్‌లైట్లను, ఫ్యాన్‌లను సాధించుకోవడం ఓ గమ్మత్తు. సమష్టి డైనింగ్, కిచెన్‌లకు బదులుగా హాస్టళ్లవారీ, రిసెర్చి స్కాలర్స్‌కు ప్రత్యేక హాస్టల్‌ను సాధించుకోవడం ఓ ఘనతనే! ఆర్ట్స్ కాలేజీ పక్కనగల క్యాంటిన్ ఓ పార్లమెంటులా కళకళలాడితే, దగ్గరలోని విశాలమైన క్రీడామైదానం, అనుబంధంగా స్విమ్మింగ్‌పూల్‌లో ఈదడం బహుశ ఈ తరానికి అందని ద్రాక్ష కావచ్చు! జంటనగరాల్లో తిరిగి డబుల్ డెక్కర్ బస్సు క్యాంపస్‌కు రాదనే కొరతను, కోఠీనుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నడిచే ట్రేలర్ బస్సు తీర్చేది. ప్రతీ కండక్టర్‌ను ‘ఏరా’ అని సంబోధిస్తూ రహస్యంగా రూపాయి వసూలు చేసిన కంట్రోలర్ సత్తయ్య మాత్రం విద్యార్థుల మనస్సులను చూరగొనేవాడు. హిందీ డిపార్ట్‌మెంట్ లెక్చరర్ వ్యాస్ నాయకత్వంలో అనూహ్యంగా పెరిగిన గ్రీనరీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, ఊటీని తలపించేవి.
ఇలా స్వచ్ఛమైన విద్యా కుసుమంగానే కాక, నికార్సైన, నిజాయితీ రాజకీయాల నిలయం, నాడు, నేడు పాలకుల కంట్లో నలుసుగా మారడం, వారు జీర్ణించుకోలేకపోవడం ఓ చారిత్రక వాస్తవం. గతంలోలాగా, వర్తమానంలో దీన్ని గుర్తించకపోతే ఆర్ట్స్ కాలేజీని మనవారు అమెరికాకు తాకట్టు కూడా పెడతారు. అందుకే ఈ నెమరువేత!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162