మెయిన్ ఫీచర్

ఇదీ ముగింపు లెక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ..
పిఎస్‌ఎల్‌విలాంటి రాకెట్ ప్రయోగానికి ముందు కౌంట్‌డౌన్ ప్రక్రియ ఒకటుంటుంది. 48 గంటల ముందునుంచి అది మొదలవుతుంది.
ఇప్పుడు-
ఒక తెలుగు సినిమాకు కౌంట్‌డౌన్ నడుస్తోంది. ‘ఏప్రిల్ 28న బాహుబలి -ది కన్‌క్లూజన్’ అని ఎప్పుడైతే జక్కన్న అనౌన్స్‌మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచే అది మొదలైంది. సంవత్సరాలు, నెలలు, పక్షాలు, వారాలు దాటుకుని రోజుల్లోకొచ్చింది. మరో 48 గంటల తరువాత బాహుబలి విడుదల. -అచ్చంగా, అధికారికంగా, ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదివేల థియేటర్లలో.
***
సినిమా ఎంత గొప్పదీ? అంటే చెప్పలేం. అంత గొప్పదా? అన్న అనుమానపు ప్రశ్నలకూ స్పష్టమైన సమాధానమివ్వలేం. నిజానికి బాహుబలిని -పొడుగు పొట్టి, ఎత్తు లోతు, లావు సన్నం.. లెక్కల్లో చూడకూడదు. కొన్ని ప్రత్యేకతలున్న సినిమా. కొన్ని రికార్డులు సృష్టించుకున్న సినిమా. తెలుగు పరిశ్రమ తయారుచేసిన భారతీయ సినిమా. అంతే!
***
కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే -వంద సినిమా పేర్లు గుర్తొస్తాయి. కమర్షియల్ కోణాన్ని కాదని -బాహుబలినీ ప్రస్తావించలేం. అలాగని కమర్షియల్ సినిమాలతో కంపేర్ చేయలేం. ఎందుకంటే -హాలీవుడ్ సినిమాను ఎంతపెట్టి తీశారని ఎవరూ అడగరు. ఎంత గొప్పగా తీశారనే మాట్లాడుకుంటారు. ఇక్కడా అంతే. ఆఫ్ట్రాల్ ఓ తెలుగోడు.. హాలీవుడ్ బడ్జెట్‌లో పదిశాతం పెట్టుబడితో ఆ స్థాయి సినిమా సిద్ధం చేశాడు. ఆ స్థాయిలోనే విడుదల చేస్తున్నాడు. సినిమా ఫలితం కంటే -ఇది గొప్ప ఫలితమే.
***
శిల్పాన్ని చెక్కినంత జాగ్రత్తగా సినిమానూ చెక్కుతాడు కనుక -జక్కన్న పనితనం మీద ఎవరికీ అపనమ్మకాల్లేవు. ‘సింహాద్రి’లో ఆయుధం పదును రుచి చూపించాడు. కెరటం పోటెత్తితే హీరోయిజం ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ‘్ఛత్రపతి’తో మెప్పించాడు. యమలోకం సెట్ వేస్తే ఎంత క్లారిటీగా ఉంటుందో ‘యమదొంగ’లో ఆవిష్కరించాడు. రాక్షసుడిలాంటి విలన్ మీదకు కీటకాన్ని ఎక్కుపెట్టి -గ్రాఫిక్స్ మాయాజాలంతో ‘ఈగ’ను సృష్టించాడు. ఇవన్నీ జక్కన్న పనితనాన్ని లెక్కించుకునే మెచ్చుతునకలే. వీటన్నింటి అనుభవాన్ని రంగరించి ‘బాహుబలి’ని ఎక్కుపెట్టాడు. సో.. విమర్శించేవాళ్లకు సైతం ఒకసారి చూడాలన్న తలంపు కలిగించే అంశాలే ఇవన్నీ. సినిమాలు చూసేవాళ్లు ఎలాగూ చూస్తారు. సినిమా మానేసినోళ్లు, చూడలేకవెళ్లనివాళ్లు.. పిల్లల్నీ, పెద్దల్నీ థియేటర్లవైపు కదిలించే సినిమా ‘బాహుబలి’. అందులో సందేహం లేదు.
***
ఏం మిగిలింది-
భారీ బడ్జెట్ సినిమా కనుక ఈ లెక్కను -లెక్కల్లో లేకుండా చూడలేం. ఏం మిగిలింది, ఎంత మిగిలింది? అన్న లెక్కలు కామన్. నిజానికి బాహుబలి ఫస్ట్ పార్ట్ అసలువాళ్లకు మిగిల్చింది తక్కువ. బావుకత కలిగిన దర్శకుడు, బలమైన నిర్మాత అన్న ఇమేజ్ తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికిది నమ్మలేని నిజం లాంటిది. ‘బిగినింగ్’, ‘కన్‌క్లూజన్’లో కొంత పార్ట్ కలిపి -130 కోట్ల బడ్జెట్ అన్నది ఒక అంచనా. 300 కోట్లు కలెక్ట్ చేసిందన్నది టాక్. ఈ వ్యత్యాసంలో బయ్యర్లకు దక్కింది ఎక్కువ, నిర్మాతలకు ముట్టింది తక్కువన్న లెక్కలూ ఉన్నాయి. వీటినే ప్రామాణికంగా తీసుకుంటే -‘బిగినింగ్’తో బాగుపడింది పెద్దగా ఏమీలేదన్నది నిజం. కానీ ఇదే -‘కన్‌క్లూజన్’కు కలిసొచ్చింది. ‘ముగింపు’ చూపించడానికి ‘మొదలు’పెట్టిన పెట్టుబడికంటే కాస్త ఎక్కువే పెట్టినా -అమ్మకాలు, ప్రకటనల ఒప్పందాలు, శాటిలైట్ హక్కుల విక్రయాలు.. ఇలా అన్ని కోణాల్లో హీనపక్షం 500 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న అంచనాలున్నాయి. ఇక్కడ నిర్మాతలకు బెంగలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నలాంటివే ఈ లెక్కలు కూడా. అసలు లెక్కలు ఎవ్వరికీ తెలీదు. నిప్పులేకుండా పొగ రాదు కనుక -బయటకు వచ్చిన పొగ నిజమనుకుంటే, వీటినే ప్రామాణికంగా తీసుకుంటే.. అసలు బెంగ బయ్యర్లకే. ‘బిగినింగ్’ బలాన్ని చూసి -‘ముగింపు’ను ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొన్నారు. కనుక -ఇంతకుముందుకంటే ఎక్కువ కలెక్షనే్ల రాబట్టాలి. లేదంటే -‘ముగింపు’ ఎంత భయంకరంగా ఉంటుందో ఎవ్వరి ఊహకూ అందదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం తెలిసినా ప్రయోజనం ఉండదు.
***
అదే ధైర్యం-
అవును, బిజినెస్ విషయంలో ఢోకాలేదన్న ధైర్యంతోనే బయ్యర్లు కూడా ఉన్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. రెండు ప్రభుత్వాలు ‘బాహుబలి’ని మోసేందుకు సహకరిస్తామని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. థియేటర్లలో టికెట్లను యూనిఫారమ్ రేట్లకు అమ్ముకోడానికి అనుమతులిస్తున్నట్టు వినికిడి. అంటే -ఏస్థాయి టికెట్ అయినా ఆ థియేటర్‌లో హయ్యెస్ట్ ధరపెట్టి కొనాల్సి రావొచ్చు. అలాగే, ఏపీలో రోజూ ఆరు ఆటలు, తెలంగాణలో రోజూ ఐదు ఆటలు వారంపాటు ప్రదర్శించేందుకు అనుమతులు ఇస్తున్నారు. జక్కన్న భారీ బడ్జెట్ సినిమా తీశాడన్న గౌరవంతో ఇద్దరు సిఎంల నుంచి సానుకూల స్పందనే లభించింది. ఇది బయ్యర్లకు భారీగా మేలు చేసేదే.
***
తెలిసిపోయిందా?
బాహుబలి-2ని బతికించే ఏకైక బలమైన ప్రశ్న -కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ విషయంలో ఇప్పటి వరకూ సీక్రెట్ నడిచినా -విడుదలకు ముందు బయటికొచ్చిన ‘సమాధానం’ మరింత ఆసక్తినే రేకెత్తిస్తోంది. బాహుబలి -బిగినింగ్‌లోని తొలి సీనే ప్రశ్నకు అసలు సమాధానమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొదటి సీన్‌లో -తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి బాహుబలి కొడుకును శివగామి రక్షిస్తుంది. అప్పుడు ఆమె ముఖంలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకోడానికి వీరుడైన బాహుబలి కొడుకును ఎప్పటికైనా రాజును చేయాలన్న కాంక్ష కనిపిస్తాయి. అంటే -కచ్చితంగా బాహుబలిని శివగామి చంపించి ఉండాలన్న కథనం వినిపిస్తోంది. కొడుకుమీది మమకారంతో బిజ్జలదేవుడు పరివారం చెప్పుడు మాటలకు తలొగ్గిన శివగామి -మాహిష్మతి కట్టుబానిస కట్టప్ప ద్వారా బాహుబలిని చంపించి ఉంటుందన్నది ప్రశ్నకు మూల సమాధానం. ఇది కేవలం అంచనాలేనా? నిజమా? నిజమైతే -ఇప్పుడు బయటకు రావడం వెనుక మరింత ఆసక్తిని పెంచాలన్న జక్కన్న వ్యూహం ఏమైనా ఉందా? అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు సమాధానాలు, అంచనాలు అనుమానాలు, మచ్చట్లు మనీ లెక్కలు వీటన్నింటికీ ‘ముగింపు’ -విడుదల ఒక్కటే. అప్పటి వరకూ వెయిట్ అండ్ సీ.

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2కి
పలికిన రేటు (కోట్లలో).. అంచనాలు

ఉత్తరాంధ్ర 13
ఈస్ట్ 11
వెస్ట్ 9.5
కృష్ణా 9.0
గుంటూరు 12
నెల్లూరు 5.5
సీడెడ్ 25
నైజాం 45
(అడ్వాన్స్ బేసిస్)

-విజయప్రసాద్