మెయన్ ఫీచర్

దళిత ఉద్యమ వైతాళికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్పృశ్యుల హక్కుల కోసమే కాదు, జంతుబలుల నిషేధానికి, జోగినీ వ్యవస్థ అంతానికి ఆయన అలుపెరుగని పోరాటం చేశాడు.. 1920 ప్రాంతంలో హైదరాబాద్ బస్తీలలో భయానకమైన ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలు పెద్దఎత్తున మరణించినపుడు ఆయన తన సంస్థ ద్వారా ఎనలేని సేవలందించి నిజాం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు.. తన జీవితాన్ని దళితుల అభ్యున్నతి కోసం, సాంఘిక దురాచారాల నిర్మూలనకు వెచ్చించి, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలిచాడు.. తెలుగు ప్రాంతాల్లో ‘దళిత జాగృతి పితామహుడి’గా కీర్తిశిఖరాలను అధిరోహించిన మాదరి భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం.
జ్యోతిరావు పూలే, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి వంటి సామాజిక ఉద్యమకారులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో భాగ్యరెడ్డి వర్మ దళితుల, పీడితుల హక్కుల కోసం, వికాసం కోసం నిరంతరం శ్రమించారు. రచనలు, ప్రసంగాల ద్వారా అణగారిన వర్గాల్లో ఆయన చైతన్యం రగిలించారు. వివిధ ప్రాంతాలకు చెందిన దళిత, బిసి కులాల నాయకులతో మంచి సంబంధాలు నెలకొల్పుకొని సభలు, సమావేశాలు నిర్వహించటంతో పాటు దళిత జాతిని జాగృత పర్చటానికి ఒక పత్రిక నడిపిన నాయకుడు భాగ్యరెడ్డి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారందరూ వలసదారులని, దళితులు ఇక్కడి మూలవాసులని, వారే ఆది హిందువులని ప్రచారం చేసి నిజాం ప్రభుత్వంలో జనాభా లెక్కల్లో దళితులను ‘ఆది హిందువులు’గా చేర్చించిన ఘనత ఆయనదే. హిందీ, ఆంగ్లం, తెలుగు, మరాఠీ, తమిళ, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల్గిన బహుభాషాకోవిదుడు భాగ్యరెడ్డి వర్మ. దళితులు అంటే మద్యం సేవిస్తారని, మాంసాహారం తింటారని చులకన భావంతో చూస్తున్న వారికి ఆ కాలంలోనే ఆయన తగిన జవాబు చెప్పారు. హైదరాబాద్‌లో మద్యపాన నిషేధ ఉద్యమ నిర్మాణంతో పాటు జంతుసంరక్షణ మండలిని ఏర్పాటు చేశారు. జాతరలు, మతపరమైన పండుగల సందర్భంగా జంతుబలులను అడ్డుకునేందుకు విశేషంగా కృషి చేశారు. మహిళలను చైతన్యవంతం చేయడానికి బస్తీల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి వారికోసం ప్రత్యేక పాఠశాలలు, పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లోని కోఠి సమీపంలోని ఇసామియా బజార్ ప్రాంతంలో మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888, మే 22న జన్మించారు. ఆయన అసలు పేరు భాగయ్య. ఒక శైవ పండితుడు బాల్యంలోనే ఆయన పేరులో ‘రెడ్డి’ పదాన్ని చేర్చగా, హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ‘ఆర్య సమాజ్’ వారు ఆయనకు ‘వర్మ’ అనే బిరుదును ప్రకటించారు. దీంతో భాగయ్య కాలక్రమంలో భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనం నుంచి చదువుపై అమిత శ్రద్ధాసక్తులున్న ఆయన ఆర్యసమాజ్ నిర్వాహకుడు బాజీ కిషన్‌రావుతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఆర్యసమాజ్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అయితే, ఆర్యసమాజ్‌లో కూడ దళితులను చిన్నచూపు చూస్తున్నారని విభేదించిన ఆయన 1908లో ‘జగన్ మిత్రమండలి’ పేరిట ఓ సేవాసంస్థను ఏర్పాటు చేశారు. తాను ఆది హిందువునని, వలసదారుణ్ణి కాదని భావించే ఆయన తనను అంతా ‘్భగ్యరెడ్డి వర్మ’గానే పిలవాలని కోరుకునేవారు. దేశాన్ని పరిపాలిస్తున్నది ఇక్కడికి వలస వచ్చిన వారేనని, ఈ దేశంలో పుట్టి పెరిగిన మూలవాసులందరూ ఆది హిందువులేనని ఆయన తన సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేవారు. అస్పృశ్యుల పాలిట కొనసాగుతున్న సాంఘిక దురాచారాలు అంతం కావాలని పరితపించడమే కాదు, హైదరాబాద్, సికిందరాద్‌లోని పేదల బస్తీల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలను ఆయన తెలుసుకునేవారు. వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను సాధించేవారు. హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున చాదర్‌ఘాట్ వద్ద సువిశాల స్థలంలో ‘ఆది హిందూ భవన్’ను నిర్మించి, అక్కడ ప్రత్యేకించి బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. ‘ఆది హిందూ భవన్’ నుంచే ఆయన తన కార్యకలాపాలను నిర్వహించారు.
దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నిజాం సంస్థానంలో కులసంఘాలు ఆవిర్భవించాయి. రెడ్డి సంఘం, కమ్మ సంఘం, వెలమ సంఘం వంటివి ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని, దళితుల కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఆయన 1906లో ‘జగన్ మిత్రమండలి’ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1911లో ‘మన్య సంఘం’గా మార్పు చేసి, అటుపై దానిని ‘ఆది హిందూ సాంఘిక సేవా సమితి’గా ఏర్పాటు చేశారు. 1912లో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ‘స్వస్తిక్ సేవాదళ్’ను ఏర్పాటు చేసి సేవలు అందించారు. 1915లో తనకు పరిచయం ఉన్న మార్వాడీల సహాయంతో ‘దక్కన్ హుమ్యానిటేరియన్ లీగ్’ను ఏర్పాటు చేసి జీవసంరక్షణ కోసం విశేష ప్రచారం నిర్వహించారు. బస్తీల్లో దళితుల సమస్యలను పరిష్కరించటానికి ‘ఆది హిందూ సోషల్ లీగ్’ను ఏర్పాటు చేశారు. దళితుల హక్కుల కోసం ఒకవైపు పోరాడుతూనే మరోవైపు ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. సురవరం ప్రతాపరెడ్డి, కృష్ణస్వామి ముదిరాజ్, పల్తాటి శేషయ్య, మాడపాటి హనుమంతరావు, బాలముకుంద్ లాంటి హైదరాబాద్ నేతలతో కలిసి పనిచేశారు. ఆర్యసమాజ్ ,బ్రహ్మసమాజ్, దివ్యజ్ఞాన సమాజ్‌లు దళితులకు సమానమైన గౌరవం ఇవ్వటం లేదని అసంతృప్తి చెందాక, హిందుమతాన్ని 1915లో వదిలిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి తుదిశ్వాస విడిచే వరకూ ఏటా బుద్ధపౌర్ణిమ రోజు బుద్ధజయంతిని నిర్వహించారు.
భారత రాజ్యాంగ నిర్మాత, దళితజన బాంధవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌తోనూ పలు ఉద్యమాల్లో భాగ్యరెడ్డి వర్మ కలసి పనిచేశారు. నాటి హైదరాబాద్‌తోపాటు మద్రాసు రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల్లో చైతన్యం కోసం విస్తృతంగా పర్యటించి వేలాది ఉపన్యాసాలు చేశారు. దిల్లీ, నాగపూర్, కోల్‌కత, అలహాబాద్, హుబ్లీ, బీజాపూర్ , పాట్నా ప్రాంతాల్లో జరిగిన అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. దళితులపై దాడులకు నిరసనగా లక్నోలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని, 1932లో లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్‌ను పంపాలని ప్రతిపాదించారు.
విజయవాడలో పంచమ మహాసభ..
సమాజంలో సవర్ణ హిందువులు అణగారిన ప్రజలను అంటరానివారుగా చూస్తున్నారని నిరసిస్తూ విజయవాడలో 1917లో మూడు రోజుల పాటు ‘పంచమ మహాసభ’ నిర్వహించారు. ఈ మహాసభ నిర్వహించటంతో విజయవాడలోని దుర్గగుడిలోకి దళితులు వస్తారని భావించి మూడు రోజులపాటు ఆలయం తలుపులను మూసివేశారట. కానీ, మహాసభకు హాజరైన వారిలో కొంతమంది అభ్యర్థన మేరకు పంచమ మహాసభకు బదులుగా ‘ఆది ఆంధ్ర మహాసభ’గా పేరు మార్చారు. ‘మాలపిల్ల’ నవలా రచయితగా ప్రసిద్ధి చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ సైతం మహాసభకు హాజరయ్యారు. అంతకు పూర్వమే ‘వెట్టిమాదిగ’ నవలను భాగ్యరెడ్డి వర్మ రాశారు. ‘వెట్టిమాదిగ’ స్ఫూర్తితోనే ఉన్నవ ‘మాలపిల్ల’ రాశారని సాహీతీవేత్తలు చెబుతుంటారు. ‘వెట్టిమాదిగ’ తొలి దళిత సాహిత్యమని నాటి చరిత్రకారులు భావించేవారు.
సభలు, సమావేశాల్లో పాల్గొనడమే కాదు, ఎంతోమంది ఉద్యమనేతలతో భాగ్యరెడ్టి వర్మ పరిచయాలు పెంచుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో సామాజిక ఉద్యమాలు నడిపిన కుసుమ ధర్మన్న లాంటి వారితో అభిప్రాయాలను పంచుకునేవారు. అంబేద్కర్ తన ఉద్యమంలో భాగంగా ‘మూక్‌నాయక్’ అనే పత్రికను నడపటానికి ముందుగానే హైదరాబాద్‌లో 1931లో ‘్భగ్యనగర్ పక్ష పత్రిక’ను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. దురాచారాలను వదిలిపెట్టి బౌద్ధమతం వైపుప్రజలు ఆకర్షితులయ్యేలా రచనలు చేసి, ప్రతి పున్నమి రోజున సభలు, సమావేశాలు నిర్వహించేవారు. 1931 సెప్టెంబరు 27న లక్నోలో జరిగిన ఆది హిందూ రాజకీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఇదే సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి పంపాలని ప్రతిపాదించడమే గాక, దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని తీర్మానించారు. లక్నో సమావేశం తీర్మానాలను హైదరాబాద్ రాష్ట్రంలోని దళితులకు తెలియజేసేందుకు సికింద్రాబాద్ వద్ద బొల్లారంలో చిత్తారయ్య అధ్యక్షతన ఆది హిందువుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దళితులకు ప్రత్యేక హక్కుల కోసం పలు ప్రతిపాదనలను ఆయన వివరించారు. వాటిని నాటి నిజాం ప్రభుత్వంలోని గవర్నర్ జనరల్ రాజకిషన్ ప్రసాద్‌కు మెమొరాండం ద్వారా సమర్పించారు. భాగ్యరెడ్డి వర్మ ప్రతిపాదనలను పరిశీలించిన నిజాం ప్రభుత్వం దళితులకు విద్య, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌లు కల్పిస్తూ 1935లో ఒక చట్టం తీసుకుని వచ్చింది.
నిజాం ప్రభుత్వంలో ‘ఉర్దూ’ అధికార భాషగా ఉన్న సమయంలో 1911లో బాలికల కోసం ఇసామియా బజార్‌లో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో జంట నగరాల్లో 26 పాఠశాలలను కేవలం బాలికల కోసం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలను నిజాం ప్రభుత్వం తీసుకుంది. నిజాం కాలంలో దళిత నాయకులు బియస్ వెంకటరావు, బత్తుల శ్యాంసుందర్, కట్ట రామక్క , ఎంఎల్ ఆదయ్య, అప్పారావు లాంటి నాయకులతో మంచి సంబంధాలు కొనసాగించారు. 1901లో శ్రీకృష్ణ ఆంధ్ర భాషానిలయం ఏర్పాటులో రావిచెట్టు రంగారెడ్డితో కలిసి పనిచేశారు. తెలుగు భాష ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ‘ఆది హిందూ సోషల్ లీగ్’ ద్వారా ప్రతి బస్తీలో మహిళా కమిటీలు నియమించి పొదుపు గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగటానికి కృషి చేశారు. అణగారిన ప్రజలకు అంకితభావంతో సేవలు అందించిన భాగ్యరెడ్డి వర్మ అనారోగ్యంతో 1939, ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. కేవలం 50 ఏళ్లు జీవించి తెలుగు సమాజంపై ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే, నేటి పాలకులు ఆయన సేవలను పూర్తిగా మర్చిపోయారు. హైదరాబాద్ నగరంలో ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలు, తీర్మానాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవటం విచారకరం.

- ఆస శ్రీరాములు సెల్: 94400 37196