ఎడిట్ పేజీ

‘ఆకాంక్ష’ సరే.. మెజారిటీ ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో కూటమికి మెజారిటీ సీట్లు దక్కితే- తాను ప్రధానమంత్రి పదవిని స్వీకరిస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడం దేశంలో సరికొత్త చర్చకు తెరతీసింది. మొన్నటి వరకూ పార్టీ పగ్గాలు చేపట్టేందుకే వెనకడుగు వేసిన ఆయన ఇప్పుడు తన ఆకాంక్షను బయటపెట్టి, దేశ ప్రజానీకంలోకి స్పష్టమైన సంకేతాలను పంపించారు. కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రపంచంలోనే మనది అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. లోక్‌సభలో 272 సీట్లు దక్కించునే పార్టీ ఎన్నుకున్న నేతను రాష్టప్రతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో- ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీల సంఖ్యపై రాష్టప్రతి వివేచనతో యోచిస్తారు. అనంతరం ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పక్షాల నుంచి లేఖలు తీసుకుంటారు. ఆ పార్టీల మద్దతుతో ఎన్నుకున్న నాయకుడిని రాష్టప్రతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించడం ఆనవాయితీ. 1989 నుంచి 2014 ఎన్నికల వరకు మొత్తం తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. 1984 తర్వాత- తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బిజెపి, వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీపీ సింగ్ ప్రభుత్వం పతనం కావడంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి ‘షాక్’ ఇచ్చింది.
1991లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు రాజకీయ మహర్దశ పట్టింది. ఆయన ఐదేళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా మన్ననలు పొందారు. 1996లో బిజెపిని దూరంగా ఉంచేందుకు అన్ని పార్టీలు చేతులు కలిపాయి. కర్నాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. కాని కూటమిలో లుకలుకలు పొడసూపడంతో ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఐకే గుజ్రాల్ అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. గుజ్రాల్ ప్రధానమంత్రి పదవికి యోగ్యుడని తేల్చడంతో రాష్టప్రతి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1996లోనే బిజెపి ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా అవతరించినా, ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో వాజపేయి ప్రభుత్వం కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండి దిగిపోవాల్సి వచ్చింది. 1998 ఎన్నికల్లో భాజపా సారథ్యంలో నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. వాజపేయి ప్రధాని అయ్యారు. ఎఐఎండికె మద్దతును ఉపసంహరించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోలేక పతనమైంది. 1999 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో వాజపేయి మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2004లో ఎన్‌డిఏ కూటమి ముందస్తు ఎన్నికలకు పోవడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యుపిఏ) అధికారంలోకి వచ్చింది. బిజెపి, టిడిపి, ఎఐఎడిఎంకె తదితర పార్టీలు మినహా, మిగతా పార్టీలు యుపిఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఒకప్పుడు పీవీ నరసింహారావుమంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2009 ఎన్నికల్లో కూడా యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, మన్మోహన్ సింగ్‌నే ప్రధానమంత్రిగా రెండోసారి ఉండేందుకు యుపిఏ పక్షాలు బలపరిచాయి. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చింది. దీంతో నరేంద్ర మోదీ బిజెపి లోక్‌సభ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుగులేని మెజార్టీతో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో అత్యధిక సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
భారతదేశంలో ప్రధానమంత్రి పదవి ఆశిస్తే వచ్చేది కాదు. ఒక లక్ష్యంగా పెట్టుకుంటే ఆ పదవిని చేజిక్కించుకున్న ఉదంతాలు లేవు. చరణ్‌సింగ్ లోక్‌సభకు రాకుండానే ప్రధానమంత్రి పదవి నుంచి గద్దె దిగాల్సి వచ్చింది. కుమ్ములాటల ఫలితంగా వీపీ సింగ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ పరిస్థితి అంతే. వీరి నాయకత్వాన్ని బలపరిచిన పార్టీల్లో కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల వల్ల వీరు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు. పీవీ నరసింహారావు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశారు. ఇతనెంత కాలం పదవిలో ఉంటారని కాంగ్రెస్ నేతలు భావించారు. దేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి నూతన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలవైపు భారత్‌ను నడిపించిన ఆధునిక భారత నిర్మాణ కర్త, దార్శనికుడు నరసింహారావు. తాను ప్రధానమంత్రి అవుతానని పీవీ కలలో కూడా అనుకోలేదు. రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ నాయకత్వంలో తలెత్తిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు సోనియాగాంధీ అనివార్యంగా పీవీ వైపు మొగ్గుచూపారు.
కాగా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ కూటమిలో పెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధానమంత్రి అవుతానని రాహుల్ గాంధీ కోరుకోవడంలో తప్పేమీ లేదు. ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్ష రాహుల్ గాంధీకి ఉండడాన్ని ఆహ్వానించాలి. సోనియా గాంధీ అనుకుని ఉంటే- 2009 తర్వాతనే రాహుల్ ప్రధాన మంత్రి అయి ఉండేవారు. ఆ సమయంలో రాహుల్ కూడా ప్రధాని పదవి పట్ల ఎలాంటి మొగ్గు చూపలేదు. సోనియా గాంధీకి 2004 ఎన్నికల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అనేక కారణాల వల్ల ఆమె ఆ పదవిని తిరస్కరించారు. రాహుల్ ముత్తాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రాణించారు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్ర్తీ ఊహించని పరిణామాల మధ్య ప్రధాని పదవిని చేపట్టి ప్రజారంజక పాలన అందించారు. కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పెరిగి నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆమె 1967, 1971, 1980 ఎన్నికల్లో గెలిచి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశాభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలు తీసుకుని అందరి మన్ననలు పొందారు. ఆనాడు అస్సాంకు చెందన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా ఇందిర’ అనే వరకు వ్యక్తిగత స్తుతి వెళ్లింది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో జనతాపార్టీ నెగ్గడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పాలనా పగ్గాలు స్వీకరించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక సొంతంగా 272 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ఆ పార్టీకి, దేశానికి తిరుగులేని నాయకుడవుతారు. ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రధానమంత్రి పదవి రాహుల్‌ను వరిస్తుంది. ఇదే జరిగితే నెహ్రూ కుటుంబంలో నాల్గవ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే ఖ్యాతి దక్కుతుంది. కాని ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి ? కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే కూటమికి బొటాబొటి సీట్లు వస్తే రాహుల్ నాయకత్వాన్ని మిగతా పార్టీలు బలపరుస్తాయా ? కాంగ్రెస్‌కు ఏ మేరకు సీట్లు వస్తాయి ? కాంగ్రెస్‌కు కనీసం 180 సీట్లు వస్తే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కూటమిలోని మిగిలిన పక్షాలు అభ్యంతరం చెప్పకపోవచ్చు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 44 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. పంజాబ్,హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లోని అనేక మంది నేతలకు దేశ ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఉంది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ఉన్నారు. ఒక వేళ పశ్చిమ బెంగాల్‌లో 42 సీట్లకు 40 సీట్ల వరకు తృణమూల్ కాంగ్రెస్ నెగ్గితే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఫైర్‌బ్రాండ్’ మమతా బెనర్జీ ఊరికే ఉంటారా? అప్పటికి అమె బెంగాల్ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించి 9 ఏళ్లవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏతో జతకట్టి ఉన్నా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానంటున్నారు. రాజకీయాల్లో ఏ క్షణం ఏమవుతుందో ఎవరూ అంచనా వేయలేరు. సంక్లిష్ట పరిస్థితులు, రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు ప్రధాన మంత్రి పదవికి ‘డార్క్ హార్స్’లు అనుకోకుండా తెరపైకి వస్తాయి. సాధారణంగా రాజకీయాల్లో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవి చేపట్టాలని ఉందని ముందుగా ఎవరూ బాహాటంగా ప్రకటించరు. తమ పార్టీకి సొంతంగా మెజార్టీ వస్తుందనే ధీమా ఉండాలి. మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారు ప్రధానమంత్రి పదవి గురించి అసలు తొందరపడరు. నిన్నమొన్నటి వరకు అధికార రాజకీయాల పట్ల నిరాసక్తతగా ఉండే యువనేత, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే తాను ప్రధానమంత్రి అవుతాననడం వెనుక మర్మం ఏమిటో? ప్రధాని పదవి రేస్‌లో ఉంటానని బహిరంగంగా రాహుల్ ప్రకటించడంతో రాజకీయ సమీకరణల్లో మార్పులకు అవకాశం ఉందని భావించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097