మెయన్ ఫీచర్

సేంద్రియ వ్యవసాయ క్షేత్రం..సిక్కిం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్కిం రాష్ట్రం సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ ప్రాంతంగా ఆవరించడం క్షతగాత్ర అయిన భూమికి చికిత్సను చేసే ప్రక్రియకు దోహదం చేయగలదు. దశాబ్దుల తరబడి భూమి అనేక రకాలుగా గాయపడింది. నిరంతర భూసార పరిరక్షణకు దోహదం చేయగల ప్రాకృతికమైన ఆరోగ్య వ్యవస్థ భంగపడడంవల్ల భూమి అంతటా రసాయన విష వ్రణాలు విస్తరించిపోయాయి. భూమికి సహజ ఆహారమైన ఆవుపేడ, ఆవు పంచితం, ఆకులు, పచ్చదనం కరువైపోవడం ప్రాకృతిక ఆరోగ్య వ్యవస్థ భంగపడడంలో భాగం. ఇలా రోగ నిరోధకశక్తి నశించిన వ్యవసాయ భూమిని కృత్రిమ రసాయన విషాలు కలసిన ‘ఎరువులు’, క్రిమిసంహారక విషాలు మరింతగా గాయపరచడం చరిత్ర! జన్యుపరివర్తక- జెనటిక్ మాడిఫికేషన్- ప్రక్రియ ద్వారా రూపొందిన ‘మహాసంకర’మైన విత్తనాలు వ్యవసాయ భూమి రుగ్మతను మరింత పెంచి నిర్జీవ క్షేత్రంగా మార్చుతున్నాయి! ఇది మొదటి వైపరీత్యం! పారిశ్రామిక ప్రయోజనాల పేరుతో లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని, అటవీ భూమిని పాడుపెట్టడం రెండవ రకం గాయం! ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ నెలకొన్న రెండు దశాబ్దుల కాల వ్యవధిలో ‘హరితహనన’ ప్రక్రియ మరింత వికృతంగా విస్తరించి పోయింది!! ఈ ‘రసాయన’, ‘కాలుష్య’ వ్యవసాయపు ‘ఎడా రి’లో సేంద్రియ వ్యవసాయ- ఆర్గానిక్ ఫార్మిం గ్- క్షేత్రాలు చిట్టిపొట్టి సుజల ప్రాంతాలు- ఒయాసిస్సులు-! ఇలాంటి సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు దేశంలో అక్కడక్కడ ఏర్పడుతున్నప్పటికీ వీటిని మళ్లీ దిగమింగడానికి ‘అసేంద్రియ’ కాలుష్య వ్యవసాయ కబంధుడు కాచుకొని ఉన్నాడు! ఈ కబంధ బంధం నుండి మొదటి విముక్తి సిక్కిం రాష్ట్ర విజయం. దేశంలో కొన్ని మండలాలు, కొన్ని తాలూకాలు సంపూర్ణ సేంద్రియ క్షేత్రాలుగా అవతరించిన వార్తలు అప్పుడప్పుడు వెలువడుతున్నాయి! కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో అలతూర్ అనే ‘మండలం’ గత డిసెంబర్ ఇలా సంపూర్ణ సేంద్రియ క్షేత్రంగా వెలసిందట! కానీ ఒక రాష్ట్రం మొత్తం సేంద్రియ వ్యవసాయ క్షేత్రం కావడం గొప్ప హరిత విప్లవం. ఆ విప్లవ విజయానికి తొలి ‘ప్రతీక’ సిక్కిం రాష్ట్రం!
జనవరి 18వ తేదీన ‘సిక్కిం’ రాజధాని గాంగ్‌టక్ రాజధానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రం ‘సేంద్రియ వ్యవసాయ క్షేత్రం’గా అవతరించినట్టు అధికార ప్రకటన చేశారు. ‘‘సంప్రదాయ విజ్ఞానం పట్ల పెరిగిన విశ్వాసం వల్ల కఠోర పరిశ్రమవల్ల’’ సిక్కిం ఈ అద్భుతాన్ని సాధించినట్టు నరేంద్రమోదీ ఈ సేంద్రియ వ్యవసాయ సభలో చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రం ‘మండలాన్ని’, ‘తాలూకా’ను జిల్లాను సేంద్రియ వ్యవసాయ విభాగాలు తీర్చిదిద్దాలని తద్వారా క్రమక్రమంగా మొత్తం దేశం వంద శాతం సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా అవతరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించడం మరో అద్భుతం! సేంద్రియ వ్యవసాయం అనాదిగా, యుగాలుగా, తరాలుగా ఈ దేశంలోని కర్షకులు భూమిని పండించడానికి అనుసరించిన మాధ్యమం! క్రీస్తుశకం 1947 తరువాత మన వ్యవసాయ పద్ధతులు క్రమంగా పాశ్చాత్యీకరణకు బలికావడంవల్ల సేంద్రియ వ్యవసాయం మూలపడింది! 1994 తరువాత ప్రబలిన వాణిజ్య ప్రపంచీకరణ సంప్రదాయ వ్యవసాయాన్ని బహిరంగంగా హత్యచేసింది!! అందువల్ల నరేంద్రమోదీ ఆకాంక్షించినట్టు దేశమంతటా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం జరగాలంటే మరో ‘మృతసంజీవని’ చికిత్స అనివార్యం! దేశవాలీ ఆవుపేడ, దేశవాలీ ఆవుమూత్రం, అడవులలో లభించే పచ్చి ఆకులు, నిలువపోసిన పాత మన్ను వంటివి అధునాతన ‘అమృత రూపాలు’! వీటిని వ్యవసాయానికి ఉపయోగించే విధంగా మన జీవన విధానం మారాలన్నది నరేంద్రమోదీ సూచించిన మార్గం!! జీవన విధానం మారడమంటే భావదాస్యం నుండి విముక్తిని పొందడం మాత్రమే!! రసాయనపు విషాలు, క్రిమిసంహారాలు, వాణిజ్యపు విత్తనాలు- వీటివల్ల పంటల దిగుబడి పెరిగిందని పెరుగుతుందని భావించడం భావదాస్యం!! వీటివల్ల దిగుబడులు పెరిగాయన్నది భ్రమ!! ‘రసాయన’ వ్యవసాయంవల్ల రైతులు ఆత్మహత్యలను చేసుకొనడం మాత్రమే వాస్తవం!!
ఒకవైపున ‘సంప్రదాయ సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న ప్రభుత్వాలు మరోవైపున విష రసాయన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉండడం ‘ప్రపంచీకరణ’ మాయాజాలం! జన్యుజీవకణాలను మార్పిడి చేసి రూపొందిస్తున్న‘మహాసంకర’ బీజాలలో ‘బాసిలస్ తురింజెన్సిస్’అన్న జీవ రసాయనం తయారవుతోంది!! ఈ ‘బి.టి.’ రసాయనం పంటల దిగుబడిని పెంచుతుందని జరిగిన ప్రచారం రైతులను వ్యామోహానికి గురిచేసింది! త్రేతాయుగంలో ‘బంగారపు జింక’ను చూసి సీతారాములు భ్రమించినట్టుగా ‘బిటి’ పంటల ప్రచారం పట్ల భారతీయ కర్షకులు ఆకర్షితులైపోతున్నారు! ఇప్పటికే సారం నష్టమైపోయిన వ్యవసాయ భూమి, వ్యవసాయానికి పనికిరాకుండా పోవడానికి ‘బిటి’పంటలు దోహదం చేస్తాయన్నది సం పన్న దేశాలలోని శాస్తవ్రేత్తలే చెబుతున్న మాట! కానీ ఈ సంపన్న దేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- మల్టీనేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు- వారు ‘బిటి’ పంటలను వర్ధమాన దేశాల ప్రజల నెత్తికెత్తుతున్నారు! వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటుచేస్తున్న ‘బహుళజాతీయ సంస్థలు’ ప్రవర్ధమాన దేశాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని తగ్గించి వేయడానికి కృషిచేస్తున్నాయి. మనం పప్పు్ధన్యాలను భారీగా దిగుమతి చేసుకొనే వైపరీత్యం కొనసాగుతుండడం ‘బహుళ జాతీయ సంస్థల’ కుట్ర ఫలితం! మన దేశంలోని దేశవాలీ ఆవులను ఇతర పశువులను హత్యచేసి మాంసంగామార్చి డబ్బాలలో భద్రపరచి ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా 1947లో సగటున ప్రతి భారతీయుడికి నాలుగు ఆవులుండగా నేడు సగటున ప్రతి తొమ్మిది మందికి ఒక ఆవు మాత్రమే ఉంది! ఇలా పశుసంపద తగ్గడంవల్ల ప్రాకృతికమైన సేంద్రియమైన ‘పేడ’వంటి ఎరువుల కొరత ఏర్పడిపోయింది!! అందువల్ల కృత్రిమమైన ఎరువులను విదేశీయ సంస్థలు భారీగా మన దేశంలోకి తరలిస్తున్నాయి- ఈ కృత్రిమమైన ఎరువుల, క్రిమిసంహారాల విషపు వాసనలకు బెదిరిపోయిన ‘వానపాములు’- ఎఱ్ఱలు- భూమిలో ముప్పయి అడుగుల కంటె ఎక్కువ లోతునకు పారిపోయాయి. సహజమైన మట్టి పరిమళాల మధ్య మాత్రమే ‘వానపాములు’ జీవించగలవు!! అందువల్ల ‘సేంద్రియ వ్యవసాయం’ నిజంగా విస్తరించాలంటే కేంద్ర ప్రభుత్వంవారు కృత్రిమమైన ఎరువులను, క్రిమిసంహారకాలను దిగుమతి చేయడం క్రమంగా మాన్పించాలి! దేశవాలీ ఆవుల పేడ మూత్రం సేంద్రియ వ్యవసాయానికి అనివార్యం కనుక ఆవులను హత్యచేయడాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ జాతీయస్థాయిలో సమగ్రమైన చట్టంచేయాలి. ఆవుపేడ గోమూత్రం తగిలినచోట ఆ వాసనలను పసికట్టిన ‘వానపాములు’ ముప్పయి అడుగుల లోతునుంచి బిలబిలమంటూ భూమిపై పొరలలోకి వచ్చేస్తున్నాయి. వానపాములు నిరంతరం భూమిగుండా ప్రయాణం చేస్తూ, సహజంగా దున్నుతున్నాయి. ఈ ప్రక్రియవల్ల భూసారం నిరంతరం పరిపుష్టం అవుతోంది! అందువల్ల ‘వానపాముల’ను బతికించగల దేశవాలీ ఆవులను బతికించడం పెంపొందించడం సేంద్రియ వ్యవసాయానికి మాధ్యమం....
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ‘గ్రామీణ’ సమస్యల పరిష్కారానికి ఏకైక ప్రత్యామ్నాయమని గత ఆగస్టులో ‘లోక్‌సభ’ అంచనాల సంఘం- ఎస్టిమేట్స్ కమిటీ- వారు కేంద్ర ప్రభుత్వానికి ‘సిఫార్సు’చేశారు. భారతీయ జనతాపార్టీ వరిష్ఠనేత మురళీమనోహర్‌జోషి నాయకత్వంలోని ఈ ‘సంఘం’వారు ‘రసాయన వ్యవసాయం’- కెమికల్ బేస్డ్ ఫార్మింగ్-వల్ల ‘్భమి’కి దాపురించిన దుస్థితి గురించి అనేక వివరాలను వెల్లడించారు. రసాయనాలవల్ల భూసారం, భూగర్భ జలాలు అంతరించిపోయాయి! మన ఆహారం కలుషితమైపోయి చిత్ర విచిత్ర వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయంవల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ జరగడం మాత్రమేకాక కలుషితం కాని నిర్మలమైన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గాలి లభిస్తాయన్నది ఈ ‘పార్లమెంటరీ’ సంఘంవారి అధ్యయనం... తెలుగు రాష్ట్రాల- అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోసహా అనేక రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం చేసుకొనే రైతులకు హెక్టారునకు పదిహేనువేల రూపాయల వరకూ ‘సహాయం’ అందచేయాలని ప్రభుత్వాలు నిర్ధారించినట్టు 2008లోనే ప్రచారమైంది!! ఈ సహాయం వాస్తవరూపం ధరించిన ‘జాడ’మాత్రం లేదు. కానీ ఆ తరువాతనే దేశమంతటా ‘బి.టి.’ పత్తి సాగు మరింతగా విస్తరించింది. ‘బి.టి.’ విత్తనాలు సేంద్రియ వ్యవస్థ పాలిట విషపు గుళికలు... మృత్యుదండాలు!! మన దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి జన్యుజీవకణాల మార్పిడి- జిఎమ్- ప్రక్రియ ద్వారా రూపొందిన ‘బిటి’ పంటలని 2008లో అంతర్జాతీయ సంస్థలు సైతం హెచ్చరించాయి. వందనాశివ ఆధ్వర్యంలోని ‘నవధాన్య’ సంస్థవారి వేదికపై 2008 అక్టోబర్‌లో ప్రసంగించిన బ్రిటన్ యువరాజు ఛార్లెస్ ‘బిటి’పంటలు రైతులను హత్యచేస్తున్న వివరాలను వెల్లడించాడు! ‘జిఎమ్’ ప్రక్రియ ద్వారా రూపొందే విత్తనాలలో ఉత్పత్తి అయ్యే ‘బిటి’రసాయనం భూమిని, పరిసరాలను విషప్రభావితం చేస్తోంది, భూమి చివరికి వ్యవసాయానికి పనికిరాదు! ‘బిటి’ పంటలవల్ల ‘చీడ’ను నిరోధించవచ్చునన్న ప్రచారం పచ్చి అబద్ధమని ఋజువైపోయింది. ‘బి.టి.’ పంటలలో నిరంతరం చిత్ర విచిత్రమైన పురుగులు చేరిపోయి ఆకులను కాండాన్ని పిందెలను నమిలిమింగేసి ఎగిరిపోతున్నాయి. ‘మాన్‌సాంటో’ సంస్థవారి ‘బిటి’ పత్తివిత్తనాలు మొలకెత్తిన వెంటనే కొత్తరకాల క్రిములు కూడ మొలకెత్తిపోతున్నట్టు 2010లో అంతర్జాతీయంగా నిర్ధారణ జరిగింది. ఈ ‘క్రిములు’, ‘కీటకాలు’ విష రసాయనాలను చప్పరించేసి మరింతగా బలిసిపోతున్నాయి!! పంజాబ్‌లో సాగయిన పనె్నండు లక్షల ఎకరాల ‘బిటి’ పత్తిపంటలు మూడింట రెండవ వంతును గత అక్టోబర్‌లో ‘‘తెల్లఈగలు’’ తినేశాయి. నాలుగువేల రెండువందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట!! తెలంగాణ రాష్ట్రంలోని అనేకచోట్ల ‘బిటి’పత్తిపై గులాబి రంగు పురుగులు దాడిచేస్తుండడం నడుస్తున్న వ్యధ...
వాణిజ్యపు అవసరాలు ప్రాతిపదికగా మాత్రమే జరుగుతున్న రసాయన వ్యవసాయం మన జీవన విధానాన్ని వికృతపరచినట్టు గాంగ్‌టక్ నరేంద్రమోదీ ప్రకటించారు. ‘వికృతి’ని ‘సంస్కృతి’గా మార్చడానికి ప్రాకృతిక సేంద్రియ విధానం దోహదం చేయగలదు!!

చిత్రం... గాంగ్‌టక్‌లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్

-హెబ్బార్ నాగేశ్వరరావు