మెయన్ ఫీచర్

ఘెట్టో రాజకీయంతో మజ్లిస్‌కే హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పోలింగు రోజున ఇతర పార్టీలపై చేసిన దౌర్జన్యాలతో మజ్లిస్ పార్టీ ఒంటరిగా మారింది. ఎన్నికల కార్యక్రమం మొదటినుంచి ప్రశాంతంగా సాగింది. పోలింగు కూడా ప్రశాంతగా ముగియనున్నదని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఉన్నట్లుండి మజ్లిస్ పార్టీ హింస ఆరంభమైంది. ఇదీ అదీ అని గాక కాంగ్రెస్, బిజెపి, టిడిపిలతోపాటు తమ మిత్రపక్షమని అందరూ భావిస్తున్న అధికార టిఆర్‌ఎస్ పైన సైతం వారు దాడులకు తలపడ్డారు. ఆనాటి ఘటనల పరంపరను ఎంత గమనించినా మజ్లిస్ తీరుకు ఇతమిత్థమైన కారణాలు ఏమిటో అర్ధంకావటం లేదు. సాధారణంగా పాతబస్తీలో మొదటినుంచి మజ్లిస్-బిజెపికి గల వైరం తెలిసిందే. కాని ఈసారీ ఎవరి ప్రచారం వారు గట్టిగా చేసుకోవటం మినహా ప్రచార దినాలలో ఘటనలంటూ జరగలేదు. ఇతర పార్టీలకు సంబంధించిన పరిస్థితి కూడా అదే. పోలింగ్ ఉదయం ఏడుకు మొదలైన తర్వాత కూడా కొన్ని గంటలపాటు సజావుగానే జరిగింది. అటువంటి స్థితిలో మజ్లిస్ అకస్మాత్తుగా దాడులు ప్రారంభించినట్లు వార్తలనుబట్టి అర్థమవుతున్నది. అందుకు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్‌లలో దేనినుంచి కూడా రెచ్చగొట్టుడు చర్యలు చోటుచేసుకున్నట్లు కనిపించదు.
అనగా, మజ్లిస్ పార్టీ తనంతటతాను పూనుకొని, తనకే ఏవో కారణాలు ఉన్నందున దౌర్జన్యాలకు పాల్పడిందనే అభిప్రాయం కలుగుతున్నది. మారణాయుధాల ఉపయోగం, రక్తపాతం వంటివి జరగనందున ఆమేరకు సంతోషించవచ్చుగాని, అసలు సాధారణ స్థాయి దౌర్జన్యానికైనా ఎందువల్ల పూనుకొన్నారు, ఎవరినీ ఎం దుకు మినహాయించలేదన్నది అర్థంకావలసిన విషయాలు. పాతబస్తీ మజ్లిస్‌కు కంచుకోట అని తెలిసిందే. అక్కడ ఏ ఎన్నికలలోనైనా ఒకటి అటుఇటుగా అన్ని స్థానాలు వారివే. మజ్లిస్‌తో రాజకీయ మైత్రివల్ల కాంగ్రెస్, టిడిపిలు తమ అభ్యర్థులను కూడా నిలబెట్టటంతో మజ్లిస్ ప్రత్యర్థి సామాజికవర్గం ఓట్లు చీలి మజ్లిస్‌కు కలిసి రావటం జరుగుతూనే ఉంది. అదిగాక, దళితులను, పేదలను ఆదరించే వ్యూహం కొంత కలిసివస్తూనే ఉంది. ఈసారి టిఆర్‌ఎస్ అదనంగా రంగంలో ఉంది. వీటన్నింటి దృష్ట్యా మజ్లిస్‌కు తగినన్ని స్థానాలు లభించటంపై ఎవరికీ సందేహాలు లేవు. అటువంటపుడు వారిని దాడులకు పురికొల్పిన విషయం ఏమై ఉంటుంది? గతంలోకన్నా బలం కొంత తగ్గే ప్రమాదం ఉందనే అంచనాలు వారికేమైనా ఉన్నాయా? లేక ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని బలం ఇంకా పెంచుకోదలచుకున్నారా? లేక, టిఆర్‌ఎస్ తానే గణనీయంగా సీట్లు గెలిచి స్వంతంగా మేయర్ పదవి సాధించే అవకాశం లేకపోలేదన్న అంచనాలు మజ్లిస్‌ను గాభరాపెట్టి ఉంటాయా? టిఆర్‌ఎస్ తమపై ఆధారపడే స్థితిని సృష్టించాలని, అందుకోసం తాము వీలైనన్ని ఎక్కువ వార్డులు గెలవాలని, ‘‘తమ ఇలాకా’’ అనే దానిలో ఇతరులకు ఎంతమాత్రం అవకాశమివ్వరాదని భావించి ఉంటారా? ముఖ్యం గా టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయిన మహమూద్ అలీ నివాసంపై పెద్దఎత్తున దాడి చేయటాన్నిబట్టి ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి. మునుముందుగాని స్పష్టత రాదు.
ఏదిఏమైనా మజ్లిస్ పార్టీ నాయకత్వం ఒత్తిడికి గురై గాభరా పడటం, తమ చర్యల మూలంగా ఒంటరికావటం అన్నది మాత్రం కనిపిస్తున్నది. ఇటువంటి స్థితి ఏ పార్టీకూడా సంతోషించవలసింది కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో తమ తప్పులవల్ల ఒంటరికావటం అవివేకమైన వైఖరి. అయితే మజ్లిస్‌కు ఇది కొత్తకాదన్నది ముఖ్యంగా గమనించవలసిన విషయం. వారు మొదటినుంచి వ్యవహరిస్తున్న పద్ధతిని ఒక్కమాటలో వర్ణించాలంటే, అది ఘెట్టో రాజకీయం. అది ఆ పార్టీ నాయకత్వపు స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నదనటంలో ఎంత సందేహం లేదో, పాతబస్తీలోని సాధారణ ప్రజలకు అంత నష్టం కలిగిస్తున్నదనటంలోనూ అంత సందేహం లేదు.
పాతబస్తీలోని అధిక సంఖ్యాకులైన ముస్లిములు గతంలో ఈ గడ్డను పాలించినవారి మతస్తులైనా ఆ మతంలోని పై వర్గంవారివలె గాక పేదరికం, నిరక్షరాస్యతలోనే మగ్గుతూ వచ్చారు. తమ పరిస్థితులలో మతపరమైన భావోద్వేగాలకు గురవుతున్నా, వౌలికంగా దుర్భర జీవితాలు గడుపుతున్నవారు. వారికి మనుషులుగా కావలసింది జీవితాల సముద్ధరణ. తక్కినవి తర్వాతి విషయాలు. కాని మజ్లిస్ పార్టీ నాయకత్వం ఆ ప్రజలను బాగుచేయటం, వారికి భద్రత సమకూర్చటం పేరిట వాస్తవంగా చేస్తున్నది వేరే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, ఇతరత్రా స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నది. అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి ఇటువంటి లక్ష్యాలు సిద్ధించాలంటే వారిని పూర్తిగా తమ పరిధిలో బందీచేయాలి. సరిగా ఈ ఆలోచననుంచే ఘెట్టో రాజకీయ-సామాజిక వ్యూహం రూపుతీసుకుంటుంది. ఆ పరిధిలోని జనులకు నిజమైనవి కొన్ని, ఊహాజనితమైనవి కొన్ని భయాలు ఎప్పటికప్పుడు ఉండాలి. అవి మనుగడకు సంబంధించినవి కావచ్చు, భద్రతకు సంబంధించినవి కావచ్చు. అది జరిగినపుడు వారు తమపైనే ఆధారపడి ఉంటారు. మంచికైనా చెడుకైనా తమవైపు మాత్రమే చూస్తారు. ఘెట్టో వ్యూహంలో ఇది మొదటి అడుగు. ఆ తర్వాత, అటువంటి ప్రజలు తమ నికృష్ట స్థితినుంచి బయటపడకూడదు. చదువులు, విజ్ఞానం, ఆధునికతలు, బయటి ప్రపం చం, ప్రజాస్వామికతలు, ఈ క్రమాన్నింటిలో భాగస్వామ్యం, స్వంత ఆలోచనల వంటివేమీ ఉండకూడదు. అది జరిగినట్లయితే వారు తమ పిడికిటి నుంచి బయటపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు తమ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుంది. కనుక వారినట్లా జీవితాలపరంగా నికృష్ట స్థితిలోనే ఉంచాలి. ఇది రెండవ భాగం.
మజ్లిస్ పార్టీ మొదటినుంచి ఈరోజువరకు ఇటువంటి ఘెట్టో పథకంతోనే పాతబస్తీలో తన పట్టును నిలబెట్టుకుంటూ వస్తున్నది. అందుకు భంగం కలిగించే దేనిని కూడా వారు సహించరు. నిజానికి ఆ పార్టీ నాయకత్వపు బలాన్ని, ఔద్ధత్వాన్ని చూసి అసమ్మతి స్వరం వినిపించేందుకే భయపడతారు. అటువంటి లక్షణపు అనుమానాలు ఎక్కడైనా కనిపిస్తే నాయకత్వం వెంటనే అణచివేస్తుంది. అందుకు సర్వసాధారణంగా బేద- దండోపాయాలనే ప్రయోగిస్తున్నారు. అంతర్గత ప్రత్యర్థి తగినంత బలవంతుడైనపుడు మాత్రమే మొదట సామ-దానోపాయాలను ఉపయోగిస్తున్నారు. ఇక ప్రధాన స్రవంతికి చెందిన ఇతర పార్టీల విషయంలో అధికార పార్టీతోనైతే మైత్రీ ఎత్తుగడ, ఇతర పార్టీలతో ప్రత్యర్థిత్వపు ఎత్తుగడ లేదా ఉపేక్షలు ఉంటాయి. మజ్లిస్‌పార్టీ మొదటినుంచి ఇప్పటివరకు చేస్తున్నది ఇదే. మునుముందు కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగించ గలరనటంలో సందేహం అక్కరలేదు.
ఇది విజయవంతంగా సాగాలంటే మరొకటి అవసరం. మునిసిపల్ పాలనను మొదలుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలవరకు అమలుపరిచే పథకాల ద్వారా సాధారణ ప్రజలకు కలగగల ప్రయోజనాలు అమలవటం, కాకపోవటం అంతా తమ నియంత్రణలో జరగాలి. వాటి ప్రభావం ఆ ప్రజలు తమ గుప్పిటనుంచి బయటపడని రీతిలో ఉండాలి. ఇదంతా మొదటినుంచి జరుగుతున్నది కనుకనే, ఎనె్నన్నో పథకాలు అందుబాటులోకి వచ్చికూడా పాతబస్తీ ముస్లిములు, ముఖ్యంగా కొత్త తరాలవారు చదువులు శిక్షణల అవకాశాలను అందుకోలేకుండా ఉన్నారు. అందుకొని ఉన్నంత మాత్రాన పరిస్థితి పూర్తిగా మారేదని కాదు. కాని ఆ దిశలో ముందుకుపోవటం మాత్రం తప్పక మొదలయేది. ఇది జరగకపోవటం మజ్లిస్ పార్టీకి కలిసివస్తున్న విషయం.
ఇది చాలదన్నట్లు, అక్కడి ప్రజలను అదే స్థితిలో ఉంచటానికి, మజ్లిస్ నాయకత్వపు పట్టును కొనసాగించటానికి దోహదంచేస్తున్న అంశాలు రెండున్నాయి. ఒకటి, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ అధికార ప్రయోజనాలకోసం మజ్లిస్‌ను ఉపేక్షిస్తూ రావటం కాగా రెండవది, ప్రత్యర్థి మతం పేరిట జరుగుతున్న రాజకీయం. మజ్లిస్ నాయకత్వం తన ఘెట్టో రాజకీయాన్ని విజయవంతంగా కొనసాగించటానికి ఈ రెండు అంశాలు కూడా తగిన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. అనగా ఒకవైపు మజ్లిస్ ప్రయోజనాలు, మరొకవైపు ప్రధాన స్రవంతి పార్టీల ప్రయోజనాలు కలిసి పాతబస్తీలోని సామాన్య జనులను అవే నికృష్ట పరిస్థితులలో అణగారి ఉండిపోయేట్లు చేస్తున్నాయన్నమాట. ఇటువంటి స్థితి దశాబ్దాలపాటు, ఒక తరం తర్వాత ఒక తరానికి వారసత్వంగా కొనసాగినపుడు దాని దుష్ప్రభావాలు అక్కడివారి జీవితాలు, ఆలోచనలు, ప్రవర్తనలపైన అనేక విధాలుగా ఉంటాయి. మనకు పాతబస్తీ జనులు చీమచిటుకుమన్నా భావోద్వేగాలకు గురవుతూ కనిపించటం అందువల్లనే. అక్కడినుంచి హింసకు మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవటం ఈ మానసికత వల్లనే. గ్రేటర్ ఎన్నిక సందర్భంలో మొదటినుంచి ఎంతో ప్రశాంతంగా ఉండిన స్థితి ఆకస్మికంగా అశాంతియుతం కావటం వెనుక ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అది మజ్లిస్ పార్టీ విషయంలో కావచ్చు, దాని నాయకత్వాన రెచ్చిపోయిన యువకులకు సంబంధించి కావచ్చు.
కాని అసదుద్దీన్ సోదరులు ఒక విషయం సావధానంగా ఆలోచించటం మంచిది. ఇపుడీ గ్రేటర్ ఎన్నిక ఘటనలతో వారు (కనీసం తాత్కాలికంగానైనా) ఒంటరి కావటమన్నది వారు గుర్తించాలి. వారు తమ పార్టీని నగరంలో, రాష్ట్రంలో, దేశంలో ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు ఇటీవల ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా వారు తమ పరిమిత ఘెట్టోనుంచి వెలుపలి ప్రపంచంలోకి వచ్చి ప్రజాస్వామికీకరణ చెందదలచుకుంటే, ప్రధాన స్రవంతిలో భాగం కాగోరితే అది తప్పక ఆహ్వానించదగ్గదే. బయటి దేశంలో ప్రజాస్వామిక శక్తులతో అరమరికలు లేకుండా ఏకంకాగలిగితే అది తమకు, సాధారణ ముస్లిం ప్రజానీకానికి చాలా మేలుచేస్తుంది. కొత్తతరం నాయకత్వాలు కొత్తగా వ్యవహరించాలి. నాయకత్వాలకు ఘెట్టోలో కొన్ని సుఖాలుండవచ్చు. కాని అవి నిరంతర ఘర్షణాత్మక స్థితితో కూడుకున్నవి. తమ వెంట ఉన్నారనుకునే సామాన్యులకు కూడా మేలుచేసేవి కావు. కొత్త హైదరాబాద్‌లో, సికిందరాబాద్‌లో, తెలంగాణ జిల్లాలలోగల ముస్లిముల ఆలోచనలకు మజ్లిస్ ఆలోచనలతో చాలా తేడాలు ఉండటాన్న అసదుద్దీన్ సోదరులు బాధ్యతతో, పరిణతితో గ్రహించాలి.

- టంకశాల అశోక్
(సెల్ : 9848191767)

- టంకశాల అశోక్