మెయన్ ఫీచర్

కులాలు బలోపేతం-విలువలు పతన పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వర్గాల మధ్యన వైరాన్ని లేవదీయడం వలసవాదుల నీతి. ఈ నీతిని బ్రిటీషు వాళ్ల నుంచి వారసత్వంగా అదిపుచ్చుకున్నారు మన పాలకులు. స్వాతంత్య్రానికి ముందు ఎలాంటి సామాజిక సమస్యలున్నాయో, దాదాపు దేశంలో ఇప్పుడు అవే సమస్యలు జఠిలంగా మారి కొనసాగుతున్నాయి. బ్రిటీషు ఇండియాలో జాతుల మధ్యన గల వైరుధ్యాల్ని, వెనుకబడిన ఆదిమ జాతుల సామాజిక ఆర్థిక, రాజకీయ కారణాల్ని పరిశీలించడానకి అనేక కమిషన్లను వేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఎంతోమంది ఎథినోగ్రాఫర్స్ (మానవ జాతి పరిశోధనా శాస్తజ్ఞ్రులు) అనేక పరిశోధనలు చేశారు. మన దేశానికి సంబంధించి వెరియర్ ఎల్విన్, ఎడ్గర్ థర్‌స్టన్, ఆర్‌వి రస్సెల్ బ్రిటీషు కాలంలో తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశ ఆదివాసుల గూర్చి పరిశోధనలు చేసి అనేక ఆవిష్కరణలను గావించారు. తెలంగాణకు సంబంధించి నైజాం కాలంలో హెమన్‌డార్ఫ్ గోండులు, కోయల, చెంచుల స్థితిగతుల గూర్చి పరిశోధనలు చేసి, నైజాంకు మంచి సూచనలు చేశారు. ప్రపంచ స్థాయిలో జార్జ్ డి.స్పిండ్లర్ పరిశోధనలు చాలా ప్రామాణికమైనవి. వీటి ఫలితంగా ఆదివాసుల, మూలవాసుల జీవన విధానాలు బాహ్య ప్రపంచానికి తెలిసాయి. ఆదివాసులు, మూలవాసులు అంటే ఎవరు అనే స్పష్టత ఏర్పడింది. పోతే ఇలాంటి గుణగణాలున్న కొన్ని జాతులు గిరిజనులుగా గుర్తించబడ్డారు. బంజారాలు ఈ కోవకు చెందినవారే. దీంతో ఆదివాసులు, గిరిజనులు ఒకటే అనే తప్పుడు సంకేతం, ఆదివాసుల హక్కుల్ని హరించి వేస్తున్నాయి. ఈ విషయాల్ని కూడా పైన పేర్కొన్న పరిశోధకులు విశదీకరించారు కూడా. మధ్య మధ్యన రాజకీయ జోక్యంతో ఆదివాసేతరులను కూడా గిరిజనులుగా అయిదవ షెడ్యూలులో చేర్చారు. రాజ్యాంగ పరమైన రక్షణతో పాటుగా విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఇలా షెడ్యూల్డు కులాల్ని, తెగల్ని ప్రత్యేకంగా అభివృద్ధి పరచి 1960 నాటికి వీరిని జాతీయ స్రవంతి లోకి తీసుకు రావాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఏడు దశాబ్దాలు గడిచినా బాగుపడిన వారు ఒకటి, రెండు శాతం అయితే, వీటిని అందుకోని వారే అధికం. బాగుపడిన వారంతా ఆధిపత్య వర్గాలలో చేరిపోయి స్వంత వర్గాలకు దూరమయ్యారు. నిజ జీవితంలో సంబంధిత తెగేతరులుగా జీవనం సాగిస్తూ, తెగలకు సంబంధించిన సౌకర్యాల్ని మాత్రం అనుభవిస్తూనే ఉన్నారు.
ఇలా జనాభాలో 25 శాతం దాకా ఉన్న ఈ వర్గాలు బాగుపడాల్సినంతగా బాగుపడకపోగా, ఇదే కాలంలో వెనుకబడిన వర్గాల సమస్య ముందుకు వచ్చింది. దీనిపైన కూడా బ్రిటీషు కాలంలో కమిషన్లను నియమించారు. వాటి సిఫార్సుల మేరకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించబడినాయి. మరికొన్ని వర్గాల్ని ఈ జాబితాల్లో చేర్చడంతో వీరిలో వీరికే అంతర్గత పోరు మొదలైంది. పెరియార్ పోరాట స్ఫూర్తితో 1951లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గాల్ని గుర్తించాలని కేంద్రం సూచించి, 1953లో స్వయాన కాకా కాలేల్కర్ కమిటీని వేసింది. దేశవ్యాపితంగా 2399 కులాలున్నట్లు తేల్చినా, వీరి అభివృద్ధికై చేసింది శూన్యం. పోతే 1961లో ఆయా రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలను గుర్తించి, రిజర్వేషన్లు కల్పించుకోవాలని సూచించింది. 1977లో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ కాకా కమిటీని సిఫార్సులను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చినా కాకా కమిటీని పక్కన బెట్టి 1978లో బిపి మండల్ కమిటీని ఏర్పాటు చేసింది. జనతా ప్రభుత్వం కూలిపోయ, తిరిగి ప్రధాని అయిన ఇందిరాగాంధీకి 1980 డిసెంబర్‌లో మండల్ కమిటీ నివేదిక ఇచ్చినా తర్వాత వచ్చిన వీపీ సింగ్ మాత్రమే 1990 ఆగస్టున కమిటీ సిఫార్సులను ఆమోదించారు.
మండల్ కమిటీకి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా ఆందోళనలు జరిగాయి. రాజీవ్ గోస్వామి అనే యువకుడు పెట్రోలు పోసుకొని ఢిల్లీలో ఆత్మాహుతి చేసుకున్నాడు. దీని కొనసాగింపుగానే రూపం మార్చిన ఉన్నత వర్గాలు హార్థిక్ పటేల్ నాయకత్వాన గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, హర్యానాలో జాట్‌లకు ఈ సౌకర్యాలు కల్పించాలని, రాజస్థాన్‌లో గుజ్జర్లు కూడా ఉద్యమాలు చేసిన సంగతి తెలిసిందే. జాట్‌లలో కొంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉండవచ్చు కాని, మొత్తంగా అభివృద్ధి చెందిన వర్గాలని భావించిన కోర్టు రిజర్వేషన్లు వద్దని తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపులు ఉద్యమం కూడా ఇలాంటిదే.
నిజానికి కాపుల ఉద్యమం కొత్తదేమీ కాదు. దీనికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. 1919లోనే ది మోన్‌టాక్-చెల్మ్స్‌ఫోర్డ్ సంస్కరణల కమిటీ సూచనల మేరకే కాపులను (తెలిగ/బలిజ/ నాయుడు/మున్నూరు కాపు/ఒంటరి/తూర్పు కాపు) వెనుకబడిన వర్గాలుగా గుర్తించగా, ఆంధ్రప్రదేశ్ అవతరణ (1956) తో ఈ సౌకర్యం రద్దయింది. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వీరిని బీసీ జాబితానుంచి తొలగించారు. తిరిగి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 1961లో ఈ వర్గాన్ని బీసీలుగా గుర్తించారు మళ్లీ 1966లో బ్రహ్మానంద రెడ్డి రద్దు చేశారు. తిరిగి మండల్ కమిషన్ నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994లో జూలైలో మళ్లీ జాబితాలో చేర్చారు. బీసీల్లోనే ఓ వర్గం దీన్ని హైకోర్టులో సవాలు చేయగా, 17, ఏప్రిల్ 1995న తీర్పునిస్తూ, ప్రభుత్వ చర్యను సమర్థించింది. కాని ఓ కమిషన్‌ను వేసి సాధ్యాసాధ్యాల్ని చూసి రిజర్వేషన్ సౌకర్యాల్ని కల్గించాలనే పీటముడిని పెట్టింది. అప్పటి నుంచి ఈ సమస్య ఇలా నానుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో 1993-2003 దాకా కెఎస్ పుట్టస్వామి కమిషన్, 2004-2011 దాకా డి.సుబ్రహ్మణ్యం కమిషన్ పనిచేశాయి. దాదాపుగా ఏడుకోట్లు ఖర్చు చేసిన పుట్టస్వామి కమిషన్ ఓ మధ్యంతర నివేదికను కూడా ఇవ్వలేకపోయంది. వైఎస్‌ఆర్ నుంచి, కిరణ్ కుమార్ రెడ్టి దాకా ప్రోత్సాహం కరువైన ఈ కమిటీ పనే చేయని స్థితి. అప్పటి నుంచి అసలు బీసీ కమిషనే లేని వైనం.
ఉమ్మడి రాష్ట్రంలోనే 1988-2005 మధ్యకాలంలో ఐదు సార్లు బీసీ జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ నిరసనలు చేపడ్టారు. మొన్నటిది ఆరవది. 1994లో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి జీవో 30ను విడుదల చేశారు. అంతకుముందే ఏలేశ్వరంలో జరిగిన సంఘటన సందర్భంగా ముద్రగడ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులనుంచి బయట పడడానికే ముద్రగడ ఈ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలున్నాయి. తిరిగి 2005లో ఉద్యమం సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కిర్లంపూడి రాగా, మాట్లాడడానికి నిరాకరించి వెళ్లిపొమ్మని ద్వారాన్ని చూపారు ముద్రగడ. కారణం 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు బీసీల గురించి పట్టించుకోలేదు. తిరిగి 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీసీ కమిషన్ వేస్తానని హామీ ఇచ్చి చర్యలు చేపట్టకపోవడంతో జనవరి 31న ఉద్యమానికి కాపుగర్జన పేరున పిలుపునివ్వడం, దీనికి రెండు రోజుల ముందే 29న కెఎల్ మంజునాథ్ కమిటీని వేసి తొమ్మిది నెలల్లో నివేదిక ఇవ్వమని కోరడం గమనార్హం. అయినా పద్మనాభం ఫిబ్రవరి 5న ఇంట్లో దీక్షకు పూనుకోవడం, నాలుగు రోజులకే ప్రభుత్వం హామీ ఇచ్చిందని విరమించడం, రత్నాచల్ సంఘటన నుంచి బయటపడడానికే.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఈ కులాల చిచ్చు ఇలా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నుంచి ఎంఆర్‌పిఎస్ నాయకత్వం ఉన్నందుకు, కౌంటర్‌గా తూర్పు గోదావరి నుంచే మాల మహానాడు నాయకత్వాన్ని బాబు ఎదిగించాడు. కులాల బలంతో పాలకులు లబ్ది పొందాలని చూస్తుంటే కులాల ఐక్యత పేరున రాజకీయాలు చేసుకోవచ్చని ఆయా కుల సంఘాలు తలుస్తున్నాయి. ఒకే కులంలో ఐక్యత సాధించలేని వ్యవస్థలో, ఒక వర్గానికి చెందిన కులాల మధ్య ఐక్యత అసాధ్యమనేది తెలిసినా, ఐక్యత పేరున మమేకం కావడం గమనించాలి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, సీమ కాపుల్ని బీసీ జాబితాలో చేర్చితే తిరుగుబాటు చేస్తామని బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించడమే కాక, ఫిబ్రవరి 14న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం తెలిసిందే.
ఇలా కుల రాజకీయాలున్నంత కాలం పాలకులకు పం డుగే. అందుకే ఈ ఉద్యమాల సందర్భంగా సార్వజనీక ఉద్యమాలు చేసిన కనె్నగంటి హన్మంతు, సర్వాయి పాపన్నను, చాకలి అయిలమ్మను, కొమురం భీమ్‌ను వాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న ముద్రగడ శ్రీకృష్ణ దేవరాయల్ని కాపు నేతగా బ్యానర్‌లో చూపడం గమనించాలి. సామాజిక న్యాయం కోసం పనిచేయని రాజకీయ ప్రజాస్వామ్యం అర్థరహితమైనదని అంబేద్కర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తించాలి. ఈ దిశగా ఆలోచిస్తే తప్ప కులరహిత సమాజం ఆవిష్కరణ జరగదు.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162