మెయన్ ఫీచర్

న్యాయం చెప్పిన జస్టిస్ ఈశ్వరయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీసీలకు క్రీమీలేయర్ నిబంధన వర్తింప చేయగలమంటూ తెలంగాణ ప్రభు త్వం పది రోజుల క్రితం ప్రకటించినప్పటి నుంచి అందుకు వ్యతిరేకంగా బీసీ నాయకులు చేసిన హెచ్చరికలతో వాతావరణం వేడెక్కిపోయింది. అటువంటి స్థితిలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ ఈశ్వరయ్య ఈ నెల 24న హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ, క్రీమీలేయర్ నిబంధన సరైనదేనని, అది అమలు కావాలని చెప్పిపోయారు. ఆయన స్వయంగా ఈ వర్గాలకు చెందిన వాడైనందున, న్యాయంగా వ్యవహరించే వాడన్న ప్రతిష్ట కూడా ఉన్నందున తనపై దాడి చేసేందుకు ఈ నాయకులకు అవకాశం లేదు. ఆ నిబంధన రద్దు కావలసిందేనంటూ ఇప్పటికీ మొండిగా వాదిస్తే వాదించ వచ్చుగాక. కాని, నిబంధన ఎందుకు అవసరమో ఆయన ఇచ్చిన సహేతుకమైన వివరణను కాదనేందుకు వారివద్ద మాటలేమీ ఉండవు.
జస్టిస్ ఈశ్వరయ్య చెప్పిన దాని ప్రకారం, బీసీలలోని అన్ని కులాల వారికి సమాన న్యాయం లభించాలన్న సదుద్దేశంతోనే క్రీమీలేయర్ నిబంధనను తీసుకొచ్చారు. ఇందు లో కొంతవరకు బాగున్న కులాలు, చాలా వెనుకబడిన కులాలు ఉన్నాయి. చాలా వెనుకబడిన వారిని మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) అంటున్నారు. ఎస్సీలలో మాలలకు భిన్నంగా మాదిగలు, మాదిగ ఉపకులాల వెనుకబాటుతనం ఎంత నిజమో, బీసీలలో ఎంబీసీలు మరి కొందరి పరిస్థితి కూడా అటువంటిదే. అటువంటి స్థితిలో, ఏ మాత్రం సహేతుకంగా, న్యాయంగా ఆలోచించే వారైనా క్రీమీలేయర్ పద్ధతిని సమర్ధిస్తారు. ఎస్సీలకు ఎ-బి-సి-డి వర్గీకరణను సమర్థించటం వంటిదే ఇది కూడా.
జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ మొత్తం దేశానికి సంబంధించినటువంటిది. ఆయనకు ఏ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో తెలుసు. తను క్రీమీలేయర్ గురించి వివరించిన దానినిబట్టి అనేక చోట్ల ఈ నిబంధనను ఉద్యోగాలకు వర్తింప జేస్తున్నారు గాని విద్యా సంస్థలలో ప్రవేశాలకు కాదు. ఇది సరైనది కాదని, విద్యా సంస్థల్లోనూ అది వర్తించి ఎంబీసీ స్థాయి వారికి ప్రవేశాలు లభిస్తేనే ఆ వర్గాల వారు ఇతర బీసీలతో సమానంగా విద్యావంతులై ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారని ఆయన చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోలేనిది కాదు. అయినప్పటికీ బీసీలలో ముందు పడిన కులాల వారు, అధికారంలోగల వారు, బ్యూరాక్రసీలో పలుకుబడి ఉన్నవారు తెలివైన రీతిలో తాము లాభపడి, ఎంబీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉన్నప్పటికీ తగిన విద్యార్హతలు ఎంబీసీలకు లేనపుడు జరిగేదేమిటి? బాగున్న బీసీ కులాల పిల్లలు బాగా చదివి ఉంటారు గనుక ఉద్యోగాలు వారికే లభిస్తాయి. ఎంబీసీల పిల్లలు ఆ ఉద్యోగాలకు అసలు దరఖాస్తు చేయలేరు. బాగున్న బీసీ కులాల పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తే, ఎంబీసీల పిల్లలకు నాలుగోతరగతి ఉద్యోగాల రిజర్వేషన్లలో మాత్రం అవకాశముంటుంది. ఇది తెలివితో కూడిన ఏర్పాటు. ఇందుకు పరిష్కారం విద్యాసంస్థల ప్రవేశాలలోనూ క్రీమీలేయర్‌ను వర్తింపచేయటం.
జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ తమ సిఫారసులను ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. వాటిని ఎన్‌డిఎ ప్రభుత్వం అదే స్ఫూర్తితో ఆమోదించగలదని ఆశించాలి. కేంద్ర స్థాయిలో పలుకుబడిగల వివిధ పార్టీల క్రీమీ నాయకులు, అధికారులు అం దుకు అడ్డుపడబోరని కూడా ఆశించాలి. కాని సమస్య అంతటితో తేలేది కాదు. కేంద్ర పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలకు సంబంధించి అక్కడ ఇది జరిగినా, అంతకు అనేక రెట్లు చదువులు, ఉద్యోగాలు గల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ పని చేయటం అవసరం. బాగున్న బీసీ వర్గాలకు కేంద్ర స్థాయిలో కన్నా రాష్ట్రాలలో ఎక్కువ పలుకుబడి ఉంటుంది. అందువల్ల రాష్ట్రాలు కూడా న్యాయబుద్ధితో వ్యవహరించటం తప్పనిసరి. వారిని ఒప్పించేందుకు బీసీ కమిషన్‌తో పాటు కేంద్రం చొరవ తీసుకోవాలి.
కమిషన్ అధ్యక్షుడు మరొక అడుగు ముందుకు వెళ్లి బీసీలను బ్యాక్‌వర్డు, మోర్ బ్యాక్‌వర్డు, మోస్ట్ బ్యాక్‌వర్డు పేరిట వర్గీకరించాలని కూడా అన్నారు. పైన చెప్పుకున్నట్లు ఇది ఎస్సీలలోని మాదిగలు, మాదిగ ఉపకులాల వారు కోరుతున్న ఎ-బి-సి-డి వర్గీకరణ వంటిది. విద్యారంగ ప్రవేశాల్లో క్రీమీ నిబంధన అమలుకు ఇది తార్కికమైన పొడిగింపు వంటిదవుతుంది. అంతకు మించి ఈ విభజనను అన్ని విధాలుగా వ్యవస్థీకరించటమవుతుంది. బీసీలలో మరీ వెనుకబడిన వారికి న్యాయం జరగాలంటే ఇటువంటి పునర్ వ్యవస్థీకరణ పరిష్కారమవుతుంది. విద్యా సంస్థలలో క్రీమీ నిబంధనవల్ల తగినంత ప్రయోజనం ఉండటం నిజమైనా, అటువంటివి అంతిమ విశే్లషణలో పాక్షిక చర్యలవుతాయి. కనుక అంతటితో సరిపుచ్చకుండా కేంద్రం, రాష్ట్రాలు కూడా బీసీలను జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ సిఫారసు మేరకు మూడు విధాలుగా వర్గీకరించి, విద్యా ప్రవేశాలను, ఉద్యోగాలను తగు విధంగా రిజర్వ్ చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది.
అయితే వారిని వర్గీకరించటం, ఆ ప్రకారం రిజర్వేషన్లు చిక్కులతో కూడిన పనే. అయినప్పటికీ ఆ దిశలో పని చేయాలి, వేగంగా చేయాలి. జస్టిస్ ఈశ్వరయ్యతోపాటు ఇప్పటికే కోర్టులు, ఇతర వ్యవస్థలు ఎత్తి చూపినట్లు బీసీల గుర్తింపు, జనగణనలు సరిగా లేవు. ఆ పని జరిగిన తర్వాత, పైన పేర్కొన్న మూడు వర్గీకరణలలో ఏ కులం ఎందులోకి వస్తుందన్నది రిజర్వేషన్ల శాతాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే ప్రశ్న వస్తుంది. జనాభా ప్రాతిపదిక అన్నది వెంటనే సరైనది కాకపోవచ్చు. కింది రెండు వర్గీకరణల వారికి విద్యా సంస్థల రిజర్వేషన్లు వెంటనే వర్తింప జేయగలిగినా, వారి నుంచి అభ్యర్థుల తయారయ్యేలోగా ఉద్యోగాల రిజర్వేషన్లు తమ జనాభా నిష్పత్తిలో రిజర్వ్ చేయటం ఆచరణలో సమస్య కావచ్చు. లేదా ఆ ప్రకారం రిజర్వ్ చేసి అంత సంఖ్యలో అభ్యర్థులు ఆ వర్గం నుంచి లేనట్లయితే అదే బీసీలలోని ఎగువ వర్గం వారికి అవకాశం ఉండేట్లు చేయవచ్చు. ఇవన్నీ చక్కబెట్టటం కమిషన్‌కు, అధికారులకు రొటీన్‌గా చేసే పని అయినప్పటికీ, నిజమైన సమస్య ఆయా బీసీ వర్గాల నుంచి వత్తిళ్లతో ఎదురవుతుంది.
బీసీల్లో ఒక మేరకు బాగున్నవారి న్యాయబుద్ధి అనేది కనిపించవలసింది ఇక్కడనే. కనిపించకుండా పోతున్నది కూడా ఇక్కడనే. క్రిమీలేయర్‌ను వర్తింపజేయగలమని ప్రభు త్వం ప్రకటించిందే తడవు క్రీమీ నాయకులు యుద్ధ భేరీలు మోగించటంలోనే ఇది అర్థమవుతున్నది. ఈ నాయకులు, వారి కులాలు, వారి చుట్టూ చేరే వారి స్వార్థ ధోరణులను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. రిజర్వేషన్లు బీసీలు అందరూ బాగుపడాలని ప్రవేశపెట్టారు తప్ప వారిలో బాగున్నవారే ఇంకా బాగుపడాలని, శాశ్వతంగా వారే బాగుపడుతూ పోవాలని కాదు. క్రీమీ నిబంధనవల్ల బీసీలలోనే వెనుకబడిన ఇతర కులాలకు ప్రయోజనం కలుగుతుంది తప్ప అటువంటి అవకాశాలు బీసీల చేజారి ఇతర కులాలకు లభించవు. అటువంటి స్థితిలో వీరి నిరసనలకు సహేతుకమైన కారణం ఏమీలేదు. అందులో స్వార్థం తప్ప మరొకటి కనిపించదు. అగ్రకులాలవల్ల, ధనిక వర్గాలవల్ల బీసీ లకు న్యాయం జరగటం లేదని వాదించి రిజర్వేషన్లు సాధించుకున్న వారు, తమ కులాలలోనే గల బలహీనులను తెలివిగా అణగదొక్కి తాము మాత్రమే లాభపడాలనుకోవటం సమర్థనీయం కాబోదు. అట్లా ఆలోచించటం వారిని బీసీలలో అగ్రకులంగా మార్చ దా? అపుడు వారికి ఎలిటిజం, క్రీమీ, బ్రాహ్మణిజం, అరిస్టోక్రసీ వంటి మాటలన్నీ వర్తిస్తా యి. అగ్రవర్ణాల అణచివేత గురించి మాట్లాడే నైతిక హక్కు అపుడు వారికెట్లా ఉంటుంది? ఇతరులు తమను అణచి దొక్కరాదు, దోపిడీ చేయరాదు గాని, తమ వారిని తామే ఆ పని చేయవచ్చునన్న మాట. తెలంగాణలో ఇటువంటి వారి గురించి ఒక సామెత ఉంది. ‘‘నీ కులం నాకులం ఒక్కటీ, కాళ్లు పట్టరా వెంకటీ’’ అని. వెంకటి అనే మనిషి ఎంబీసీ, సామెత చెప్తున్న మనిషి అంతకన్నా పై స్థాయి బీసీ అనుకోవాలి. మాలలు మాదిగలతో అంటున్న ఈ మాటనే బీసీలలో క్రీమీ వారు ఎంబీసీలతో అనదల్చుకున్నారా? అందువల్ల బీసీ నేతల వైఖరి మారటం అవసరం.
వాస్తవానికి క్రీమీ నిబంధన కొత్తగా వచ్చింది కాదు. ఇది అందరికీ తెలిసిన విషయం. క్రీమీ బీసీలు దీనిని రకరకాలు ఉపాయాలతో కుంటుపరుస్తూనే ఉన్నారు. అసలు నిబంధనలలోనే వారికి అనేక మినహాయింపులున్నాయి. కేంద్రం ఇచ్చినవి, రాష్ట్రాలు ఇస్తున్నవి చూసినట్లయితే, వాటినన్నింటిని దాటుకుని క్రీమీగా తేలేవారు అతికొద్ది మంది. నిబంధన ఉద్యోగ ఆదాయాలకు, వ్యవసాయ ఆదాయాలకు వర్తించదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులకు వర్తించదు. సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల దాకా ఇతర ఆదాయాలకు వర్తించదు. రైతులకు కుష్కీ భూమి ఎంత ఉన్నా, తరిలో గణనీయమైన భాగం వరకు వర్తించదు. ఇంకా ఇటువంటి మినహాయింపులున్నాయి. ఇవన్నీ పోగా చివరకు తేలేది ఎంత శాతం? ఇది చాలదన్నట్లు ఆదాయం సర్ట్ఫికెట్ ఇవ్వవలసింది తహసీల్దారు. దానిని బట్టి క్రీమీ సర్ట్ఫికెట్ నిర్ణయమై జారీ అవుతుంది. తహసిల్దార్లపై ఎన్ని విధాలైన ప్రభావాలు పనిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాలా? అనగా, నిబంధన ప్రకారం ఖచ్చితంగా గణించదగ్గ రాజ్యాంగ పదవులు, ప్రభుత్వ పదవులను మినహాయిస్తే, ఆదాయం పన్ను రిటర్న్‌లను వదలివేస్తే, తక్కిన వారందరి విషయంలో క్రీమీలేయర్ అన్నది ఒక బ్రహ్మ పదార్థంగా మిగులుతుందన్న మాట.
బీసీలలోని క్రీమీలు, వారి ఆబాగు మాత్రమే తమ బాధ్యతగా భావించే బీసీ నాయకులు దీనిని కూడా భరించలేకపోతే, వారికి స్వార్థబుద్ధి వికసించినంతగా న్యాయబుద్ధి వికసించలేదని భావించవలసి వస్తుంది. కాని అపుడు వారి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎంబీసీలు, అదే విధమైన ఇతర బీసీలలో ఇప్పటికే తగినంత అసంతృప్తి, నిరసన గూడు కట్టుకొని ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో వారు రాజకీయంగా, ఇతరత్రా కూడా క్రీమీ బీసీల నుంచి దూరమై సంఘటితమవుతున్నారు. అటువంటిదే ఇక్కడ కూడా జరగలబోదనే హామీ లేదు. అది బీసీ నాయకులమని చెప్పుకునే వారి వైఫల్యమవుతుంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)