మెయిన్ ఫీచర్

వధువుల కోసం దూరతీరాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్యానాలోని సోర్కీ గ్రామం.. 35 ఏళ్ల సాధూరామ్ తనకిక పెళ్లి కాదేమోనన్న ఆందోళనతో డీలా పడుతుండగా వధువు కోసం అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులను తెగ వాకబు చేశారు.. సమీప గ్రామాలన్నీ చుట్టివచ్చారు.. తమ రాష్ట్రంలో వధువు లభించకపోవడంతో చివరకు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళలో ఓ సంబంధం కుదుర్చుకున్నారు.. తమ ఆచారాలు, పద్ధతులకు భిన్నంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రానికి చెందిన అమ్మాయిని సాధూరామ్ పెళ్లి చేసుకోక తప్పలేదు..
...ఈ పరిస్థితి ఒక్క సోర్కీ గ్రామంలోనే కాదు. హర్యానాలోని వేలాది పల్లెల్లో సాధూరామ్ లాంటి యువకులు వధువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆడపిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో హర్యానాతో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇపుడు వధువులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యారేజీ బ్యూరోలు, దళారీలు రంగప్రవేశం చేసి పొరుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పెళ్లిళ్లు చేసేందుకు భారీగా డబ్బు వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. లింగనిష్పత్తికి సంబంధించి దేశం మొత్తమీద హర్యానా ఎంతో వెనుకబడిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆడశిశువుల జననాల్ని అడ్డుకోవడం వల్లే ఇపుడు ఉత్తరాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి ఆందోళన కలగిస్తోంది. సోర్కీ గ్రామంలోనే సుమారు 250 మంది యువకులు పెళ్లి ఘడియల కోసం ఏళ్ల తరబడి నీరీక్షిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అవగతమవుతుంది.
ఆడపిల్ల భారమని..
‘ఆడశిశువు జన్మిస్తే కుటుంబానికి అన్ని విధాలా భారమే’ అన్న భావజాలం ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తోంది. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి రావడంతో ఆడశిశువులు జన్మించకుండా అడ్డుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ప్రమాదకర గర్భస్రావాలు, భ్రూణహత్యలతో ఆడశిశువుల సంఖ్య ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టింది. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వైద్యులపై, ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆడశిశువుల పట్ల సమాజం వైఖరిలో మార్పు రావడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ 1994లోనే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. హర్యానాలోని మారుమూల గ్రామాలకు సైతం ఈ అక్రమ పద్ధతులు అందుబాటులోకి వచ్చేలా కొందరు వైద్యులు సంచార వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. ఆడపిల్ల పుడితే చదివించడానికి, వివాహం చేసేందుకు భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఇప్పటికీ చాలామంది దంపతులు భావిస్తున్నారు. ఆడపిల్లను బాగా చదివిస్తే అందుకు తగ్గట్టు హోదా ఉన్న వరుడ్ని అనే్వషించాలని, కట్నకానుకలు, లాంఛనాల కింద లక్షలాది రూపాయలు అవసరమని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. మగపిల్లవాడు పుడితే తమకు జీవితాంతం తోడుంటాడని, ఎలాంటి ఆర్థిక భారం ఉండదని భావిస్తుంటారు. హర్యానాలో కూడా ఒకప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులే పెళ్లి సంబంధాల కోసం బంధుమిత్రులను ఆరా తీసేవారు. ఈ పరిస్థితి ఇపుడు పూర్తిగా తారుమారైంది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గడంతో అబ్బాయిల తల్లిదండ్రులు వధువుల కోసం ఊళ్లవెంట పడి అనే్వషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే హర్యానాకు వస్తున్న కేరళ వధువుల సంఖ్య ఈమధ్య బాగా పెరిగింది. వధువులకు కొరత ఏర్పడంతో అక్రమాలకు పాల్పడే దళారుల సంఖ్య కూడా పెరుగుతోంది. హర్యానా, పంజాబ్‌లకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న దళారులు కొన్ని సందర్భాల్లో మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఒక్క 2013లోనే సుమారు 25వేల మంది (15 నుంచి 30 ఏళ్లలోపు) యువతులను అక్రమంగా తరలించారని జాతీయ నేరగణాంక నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) నివేదికలు చెబుతున్నాయి.
లింగనిష్పత్తికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే 2001లో దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 927గా ఉంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆ తర్వాత పరిస్థితి కొంత ఆశాజనకంగా మారింది. 2011 జనాభా లెక్కల మేరకు జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యిమంది బాలురతో పోల్చి చూస్తే బాలికల సంఖ్య 943గా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన మార్పు కానరావడం లేదనే చెప్పాలి. 2011 గణాంకాల ప్రకారం దేశం మొత్తమీద హర్యానాలో లింగనిష్పత్తి ఆందోళనకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 879 మాత్రమే. జాతీయ స్థాయిలో చూస్తే కేరళలో లింగనిష్పత్తి మెరుగ్గా ఉంది. ఈ దక్షిణాది రాష్ట్రంలో ప్రతివెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య
1,084గా ఉంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో (ప్రతి వెయ్యిమంది బాలురకు) బాలిక సంఖ్య 912, బిహార్‌లో 918, పంజాబ్‌లో 895గా నమోదైంది. ఆరేళ్ల లోపు పిల్లలకు సంబంధించి హర్యానాలో ప్రతి వెయ్యిమంది బాలురకు బాలికల సంఖ్య 834గా ఉంది. ఫలితంగా వధువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అనే్వషించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. వధువులు లభించకపోవడంతో మగపిల్లల కుటుంబాలు కట్నకానుకలను ఆశించకుండానే సంబంధాలు కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. కట్నకానుకల ప్రసక్తి లేకపోవడంతో హర్యానా యువకులను పెళ్లి చేసుకునేందుకు కేరళ అమ్మాయిలు సుముఖత చూపుతున్నారు. భాష, ఆచారాలు ఇపుడు అడ్డుగోడలు కావడం లేదు. పెద్దగా ఖర్చు లేకుండా పెళ్లి జరిగితే చాలని పేదవర్గాల అమ్మాయిలు భావిస్తుండగా, తమకు కల్యాణ యోగం వస్తే చాలని ఉత్తరాది యువకులు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో చదువుకున్న అబ్బాయిలు, కాస్తోకూస్తో ఉద్యోగాలు చేస్తున్న కుర్రాళ్లు విదేశీ సంబంధాలకు సైతం మొగ్గు చూపుతున్నారు. దేశం, ప్రాంతం, భాష ఏదైనా తగిన వధువు దొరికితే అదే పదివేలని వారు భావిస్తున్నారు. కేరళకు చెందిన చదువుకున్న అమ్మాయిలు దాంపత్య బంధంతో హర్యానాలో అడుగుపెడుతూ అక్కడ మహిళల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగడంతో విస్మయం చెందుతున్నారు. నేటి ఆధునిక కాలంలోనూ మహిళలు ముఖాలకు ముసుగులు ధరించి తిరగడం చూసి వారు ఆశ్చర్యపడుతున్నారు. విద్య, ఆహారం, ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక సాధికారత వంటి విషయాల్లో ఉత్తరాది మహిళలకు ఇప్పటికీ స్వేచ్ఛ లేదని కేరళ యువతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటి విపరిణామాలను తాము ఎదుర్కొనగలమన్న ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

-స్వాతి