మెయన్ ఫీచర్
పలికించిన వాడు రామభద్రుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనింగించిన వాడు ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ వావికొలను సుబ్బారావు (వాసుదాసు). ఒంటిమిట్ట కోదండ రామస్వామికి సరీగ్గా 108 ఏళ్ల క్రితం అంటే 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో ఈ దేవాలయంలో అంకితమిచ్చారు. నాటి కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీమదాంద్ర వాల్మీకీ రామాయణం తెలుగునేల నలు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలతో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. వావికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందఃయతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, ‘‘మందరం’’ అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం-గ్రంథోత్పత్తిని గురించి స్వయంగా వాసుదాసుగారే ఈవిధంగా వివరించారు.‘‘ మా బాబాయి లక్ష్మణరావుగారికి నిరంతర రామాయణ పారాయణం చేసే అలవాటుండేది. ఆయనే నన్ను కూడా రామాయణ పారాయణానికి ప్రోత్సహించి, చేసే విధానాన్ని ఉపదేశించారు. ఒకనాడు బమ్మెర పోతన పలికిన ‘చెనకకి చెరిచిననాడు భాస్కరుడు గాకుండిన రామాయణము బండ్ల కెక్కింపనా’ అన్న వాక్యాలు నా మనసులో చొరబడి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలన్న భావన కలిగింది. వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24,000 పద్యాలను రాయాలని సంకల్పించాను. అయితే అందుకు శ్రీరామచంద్రుడే నాకు శరణ్యమనుకొని, ఒకనాడు పారాయణం ముగించుకొని, భగవత్ సన్నిధానంలో కూర్చొని శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకొని ప్రశ్న వేసుకున్నాను. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం ‘ఉత్తిష్ఠ హరి శార్దూల లంఘయస్వ మహార్ణవమ్’ (లెమ్మా హరి శార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ) అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కృపకు పాత్రుడనయ్యాయని భావించి, 1900, ఆశ్వయుజ శుద్ధ దశమినాడు, గ్రంథ రచన ఆరంభించాను.’’
‘‘నేను రచించిన ‘శ్రీ కౌసల్యాపరిణయం’ భద్రాద్రి రాముడికి అర్పించాను. ఒంటిమిట్ట నేను పుట్టిన మండలం లోనే ఉండటం వల్ల, శ్రీమదాంధ్ర భాగవతానికి జన్మస్థలం కావడం వల్ల, ఒకవేళ ఆయన రామాయణం రాసి వుంటే ఆ రామభద్రుడికే అంకితం ఇచ్చి వుండేవాడైనందువల్ల, ఆయన సంకల్పం నెరవేర్చాలన్న అభిలాష కలిగినవాడనై ‘ఇంటిముందున్న పారిజాతం’ ఒంటిమిట్ట కోదండ రాముడికి ఈ కృతిని అంకితం చేశాను.’ గ్రంథ రచన కొనసాగిస్తున్న సమయంలో నా స్నేహితుడు, కొత్తపల్లె పద్మనాభ శ్రాస్త్రులవారు ఈవిధంగా సలహా ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి యథామూలంగా ఉన్న గ్రంథం అప్పటి వరకు లేదని, మూలాన్ని అనుసరించి గ్రంథముంటే ఎక్కువ పూజించబడుతుందని, సాధ్యమైనంత సంస్కృతంలో మూల గ్రంథాన్ని అతిక్రమించకుండా విషయం లోపించకుండా రచించమని సూచించారు. అంతేకాదు దీనికి ‘‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’’ అని కూడా పేరు పెట్టమని కూడా చెప్పారు. రాసేది లోకోపకార గ్రంథం కాబట్టి సార్వజనీకంగా వుండాలన్నదే నా అభిప్రాయం. ఈ కారణం వల్ల మూలంలో గూఢంగా వున్న సందర్భాల్లో దాని అర్థం విడమరచి కొంచెం పెంచి రాశాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని నిర్వచనంగా రాసారో, అదే కారణం వల్ల నేను కూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను.’’
అయితే ఇంత గొప్ప గ్రంథాన్ని ఎలా ముద్రించిందీ వివరాలను వాసుదాసుగారు స్వయంగా చెప్పిన మాటలను 1910, అక్టోబర్ 17న నాటి ప్రముఖ దినపత్రిక ‘‘ఆంధ్ర ప్రకాశిక’’ ప్రచురించింది. ‘‘ ఈ గ్రంథాన్ని ముద్రించడం ఎలాగని నా స్నేహితులతో కలిసి సమాలోచనలు జరిపాను. ఈ వార్త తెలుసుకున్న ఒక స్వదేశీ ప్రభువు అందుకు ముందుకు వచ్చి ప్రతిఫలాపేక్ష లేకుండా, వేలాది రూపాయలను వ్యయం చేసి గ్రంథాన్ని ముద్రింపజేసి ‘‘కృతి’’కి ‘‘కృతికర్త’’కు చిరాయువు కలిగించారు. ఈ విషయంలో ఆ సత్ ప్రభువును శ్రీరాముడే సర్వ శ్రేయోదాయి అవ్వాలి. ఆ మహనీయుడు తన పేరును ఇందులో ప్రకటించడానికి నాకు అనుమతినివ్వలేదు. అందువల్ల ఆయనెవరో లోకానికి తెలియజేయలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నా.’’
‘‘గ్రంథ రచన పూర్తి కాగానే ముగ్గురం స్నేహితులం కూర్చొని, దీన్ని కృతిపతియైన ఒటిమిట్ట శ్రీ కోందడ రాముడికి నివేదించి, లోకానికి తెలియజేయడం ఎలాగని ఆలోచించాం. సరీగ్గా ఇదే సమయంలో కడప మండలం-పొద్దుటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న వసంతరావుగారు చెన్నపురికి వచ్చి, వార్త తెలుసుకొని కార్యక్రమాన్ని మంచిగా జరిపించడానికి ప్రోత్సహించడమే కాకుండా, సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేకాదు ఒక ఆహ్వాన సభను కూడా ఏర్పా టు చేశారు. ’’‘‘గ్రంథ సమర్పణ సమయంలో సభాధ్యక్షుడిగా ఉండటానికి, శతావధాని ఉభయ వేదాంత ప్రవర్తకులు, న్యాయవాద వృత్తిలో ఉన్న శ్రీమద్ధర్మవరము రామ కృష్ణమాచార్యులు అంగీకరించారు. 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో- అంటే కీలక నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి-విదియ తిథులలో ‘కావ్య సమర్పణబ జరుగుతుందని పత్రికా ప్రకటన ఇచ్చింది ఆహ్వాన సంఘం. అంతే కాకుండా హితకవి పండితులను ప్రత్యేకంగా, ‘విజ్ఞాపన పత్రికల’ను పంపి ఆహ్వానించారు. ఒంటిమిట్ట దేవాలయ ధర్మకర్త, నా స్నేహితులు తిప్పన సుబ్బారెడ్డి గారు, గ్రామ మెజిస్ట్రేట్ ఆకేపాటి సుబ్బారెడ్డి గారు గ్రామంలో అన్ని వసతి ఏర్పాట్లు చేయించారు. దేవాలయాన్ని అలంకరించారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి దాదాపు ఆరువేల మంది ప్రజలు ఒంటిమిట్టకు చేరుకున్నారు.
‘‘ఆహ్వానాలందుకున్న వారిలో చాలామంది గొప్ప కవులు, విద్వాంసులు, అధికారులు, పూజ్యులు ఉన్నారు. కొందరు గ్రంథావిష్కరణకు తమ ఆమోదం తెలుపుతూ ప్రత్యుత్తరమో-మాటమాత్రంగానో తెలియపరచారు. కొందరు సందేశాలను పంపారు. చెన్నపురి నుంచి, శ్రీమత్కుమార తాతాచార్యులు వచ్చా రు. శ్రీకాళహస్తి నుంచి శ్రీ శతఘంటము వేంకట రంగ శాస్ర్తీ వచ్చారు. ఇంకా ఆహుతులుగా వచ్చినవారంతా విద్యావంతులే. అదేవిధంగా అనాహుతులుగా హాజరైన వారిలో కూడా పెక్కు మంది విద్యావంతులున్నారు. అపరిచితులైన వారిపేర్లను నమోదు చేసుకునే అవకాశం కలగలేదు.’’ ‘‘కార్యక్రమం మూడు రోజులు, ఉదయం శ్రీ సీతారామ చంద్రులకు సహస్రనామార్చన యథావిధిగా జరుపబడింది. మొదటిరోజు ఉదయాన సంస్కృత వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం పుస్తకాలను శ్రీ స్వామివారి పల్లకిలో ఉంచి దాన్ని శ్రీ హనుమంత గౌడ్, నెమలి సుబ్బారావు, మల్లవరపు పెంచలార్య కవి, కాకినాడ సరస్వతీ పత్రికాధిపతి కొత్తపల్లి సూర్యారావు ఇతర ప్రముఖులు భుజాలపై మోశారు. మంగళ వాద్యాలతో దేవాలయ గ్రామ ప్రదక్షిణగా వూరేగించారు. గ్రంథానికి పూజ చేసిన తర్వాత ముందున్న కొంత భాగాన్ని చదివారు. ఒక్కరే మూడు దినాల్లో పూర్తి గ్రంథాన్ని చదవడం కష్టమని భావించి, చిలుకూరి కృష్ణమూర్తిగారు, వేంకట సుబ్బయ్యగారు, పద్మనాభ శాస్ర్తీగారు, కోమాండూరు శ్రీనివాసాచార్యులుగారు, కొత్తపల్లి సూర్యారావుగారు, కూనపరాజు శేషాద్రి రావుగారు, కాళహస్తి శర్మగారు తోడ్పడి పుస్తక పఠన పూర్తి చేశారు. మొదటి రోజు మధ్యాహ్నం దేవాలయ ముఖ మంటపంటలో సభ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు శ్రీ రామాయణం గురించి ఉపన్యసించారు.’’
‘‘రెండో రోజు మధ్యాహ్నం తిరిగి సభ జరిగింది. ఆహ్వాన సభా సభ్యుడు వి. వసంత రావుగారు సభ ఉద్దేశాన్ని, ఒంటిమిట్ట గ్రామ ప్రసిద్ధిని, కార్యక్రమ అపూర్వతాన్ని వివరించారు. ఆహ్వానితులకు స్వాగతం పలుగుతూ ‘స్వాగత పంచరత్నాలు’ (మూడు సీస పద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక కవిరాజ విరాజితము) చదివి వినిపించారు. అనంతరం సభాధ్యక్షుడు శ్రీమద్ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్రభాష విషయాలపై ఉపన్యసించారు. సందేశాలు చదివి వినిపించి గ్రంథోత్పత్తిని గురించి తెలుపమని కోరారు. ‘‘్భక్తే ఈ గ్రంథ రచనకు కారణం’’ అని చెప్పిన నేను, ఈ విషయంలో శ్రీరామచంద్రుడు చేసిన సాయం వివరించాను. ఆ తర్వాత సభాధ్యక్షుడు పండితులనుద్దేశించి ఆంధ్ర రామాయణాన్ని పరీక్షించవచ్చని కోరారు. అప్పటికప్పుడు కొందరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. చాలామంది పండితులు సభానంతరం వారి వసతి గృహాలకు గ్రంథాలను తీసుకొనిపోయి శోధించారు. ఆ రాత్రి పాదుకా పట్ట్భాషేకం నాటకం ప్రదర్శించారు. పిండారబోసినట్లున్న పౌర్ణమి నాటి పండు వెనె్నల్లో నంజుండప్పగారు, కమలాపురం రాఘవాచార్యులవారు, నెమలి సుబ్బారావు గరు సీతాకళ్యాణం హరికథా కాలక్షేపం బోధించారు.’’
‘‘మూడోరోజు ఉదయం హిందూమతం గురించి ఉపన్యాసాలయిన తర్వాత గ్రంథ పరీక్ష జరిగింది. పండితులంతా వారి సంతుష్టిని పద్యంగానో-ఉపన్యాసంగానో వెల్లడిచేసి, కృతిని ప్రశంసించి కవిని ఆశీర్వదించారు. పట్ట్భాషేకం భాగం పఠనంతో, సభాధ్యక్షుడి ఉపన్యాసంతో సభ ముగిసింది. కనీ వినీ ఎరుగున రీతిలో కార్యక్రమం ముగిసి, లోకులెల్లరు కొనియాడుతుంటే శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కృతి భర్త అయిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి సమర్పించబడినది.’’‘‘దినత్రయం అన్నదానం జరిగింది. చిన్నా-పెద్దా తేడా లేకుండా అంతా అందులో పాల్గొన్నారు. హేమా-హేమీలనుకున్న వారు నడుం బిగించి వడ్డన చేశారు. వారందరికి నా సాష్టాంగ ప్రమాణాలు. అన్నదానానికి సహాయపడిన పుణ్యాత్ములకు శ్రీరాముడు శాశ్వత సౌఖ్యాలు ఇచ్చుగాక. కొక్కొండ వేంటకరత్నము పంతులుగారు ‘‘శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ కృతి ప్రశంస’’గా ‘‘ రత్నావళి పద్య పంచక బహుకృతి’ని చేశారు. అలనాటి పత్రికల్లో ఈ కార్యక్రమాన్ని గురించి విశేషంగా వార్తలు వచ్చాయి. ప్రశంసిస్తూ ప్రసంగం చేసిన వారు పద్యాలను చదివినవారు నన్ను బమ్మెర పోతనతో పోల్చారు.’’ నిజంగా వావికొలను సుబ్బారావుగారు ప్రాతఃస్మరణీయుడు.
చిత్రం... సీతా, లక్ష్మణ సమేత ఒంటిమిట్ట శ్రీరామభద్రుడు.
ఆంధ్రవాల్మీకి రామాయణ కృతికర్త వావికొలను సుబ్బారావు (ఇన్‌సెట్‌లో)