సబ్ ఫీచర్

పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన సందర్భం గా, తన ప్రసంగాల్లో మనదేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటూ వచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో అనేక దేశాలవారు నివసిస్తుం టే, మన దేశవాసులు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నారని చమత్కరించారు. దాంతోపాటే ప్రపంచ దేశాలన్నిటికీ మనం మానవ వనరులు అందిస్తామని, ఇతర దేశాలవారు మన దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసి మేక్ ఇన్ ఇండియా పేరు (బ్రాండ్)తో అమ్ముకోవచ్చని సూచించారు.
మన ప్రజలు ఇతర దేశాల అభివృద్ధి నిమిత్తం వారిచ్చే వేతనాలకోసం ఇతర దేశాలకు వలస వెళ్ళటం ఏమంత సమంజసమనిపించుకుంటుంది? ఇతర దేశాలవారు తమకోసం మన దేశంలోని మేధాసంపత్తిలో ఉత్తమమైన వారినే ఎంచుకుని తీసుకెళ్తారుకదా! వేతనాలకోసం వెళ్ళేవారికి ఛాయిస్ ఉండదు. ఆ రకంగా మనదైన ఉత్తమ మేధాశక్తి ఇతర దేశాలకు ఎగుమతి చేయటంతో మన దేశంలో మిగిలేది మధ్యరకం ఇంకా నాసిరకంగానే ఉంటుంది. దానికితోడు ప్రధాని చెప్పినట్టు ఇతర దేశాలవారు వారి పెట్టుబడితో మన మానవ వనరులు, ప్రకృతి వనరులతో వస్తువులు ఉత్పత్తిచేసి మన దేశపు పేరుతో ప్రపంచమంతా అమ్ముకోవటం మొదలైతే మన ప్రజలు వారి కూలీలుగానే మిగిలిపోతారు. మన ప్రకృతి వనరులు, ఖనిజ సంపద, ముడిసరుకులు స్వల్పకాలంలోనే వట్టిపోయే ప్రమాదమూ ఉంటుంది కదా! పైనుంచి మనకు వాతావరణ కాలుష్యం మిగులుతుంది. ఇతర దేశస్థులు ఎందుకూ కొరగానివారి ధనంతో మన ముడిసరుకులు మానవ వనరులను కొల్లగొడతారు. వీలైనంత ఎక్కువ ఉత్పత్తిచేసి లాభానికి అమ్ముకోవటమే వ్యాపార లక్షణంకదా! పైగా వారికి వారి దేశంలోకంటే మానవ వనరులు మనదగ్గర తక్కువ ధరకు లభిస్తాయి. ఇవన్నీ తెలివిగా ఆలోచించి ఇప్పటికే కొన్ని పాశ్చాత్య కంపెనీలు తమ స్థావరాలను మన దేశానికి బదిలీ చేసుకుంటున్నాయి. అదీకాక ఎక్కువ లాభం పొందాలని నాసిరకం ఉత్పత్తులు మొదలైతే మన దేశానికే అప్రతిష్ఠ కదా! మన దేశ వనరులలో తక్కువ ధరతో వారు ప్రపంచమంతా వ్యాపారం చేసుకుంటారు. ఈ రకమైన వ్యాపారం పేరుతో వచ్చే మన దేశాన్ని ఆంగ్లేయులు వశపరచుకున్నారు కదా!. ప్రస్తుతం మనం ఎంతసేపటికి మన ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెరుగౌతున్నాయనే ఆలోచిస్తున్నాము కాని దీర్ఘకాలంలో మనకు జరుగబోయే అపార నష్టం గురించి ఆలోచించలేక పోతున్నామేమోననిపిస్తుంది.
మన ప్రాచీన సనాతన సంస్కృతిలో మన పూర్వులు తక్కువ ప్రకృతి వనరుల వినియోగంతో ఎంత పొదుపుగా జీవించవచ్చో నిరూపించారు. నిరాడంబర జీవన విధానం అందులో భాగమే. అదే పాశ్చాత్య దేశాలవారు దీనికి భిన్నంగా ఎంత ఎక్కువ వనరులను ఖర్చుచేసైనా ఎంతో విలాసవంతమైన జీవితం గడపటం వారి సాంప్రదాయం. దాంతోవారి ప్రకృతి వనరులు వట్టిపోతాయని మనలాంటి దేశాలను ఆక్రమించుకోవటం 19వ శతాబ్దపు చరిత్ర. నిరాడంబర జీవనం సాగించాలంటే కుటుంబాలలో సమాజంలో ఎంతో కట్టుబాటు అవసరం. ఆధునిక వ్యక్తిగత స్వతంత్ర భావాలతో ఏవిధమైన కట్టుబాటు లేకుండాపోయింది.అందుకే ఒకప్పుడు కుటుంబ, సమాజ కట్టుబాట్లు ఉండేవి. ఒకప్పుడు మన దేశంలో ఎంతో నిరాడంబరత, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం పరిఢవిల్లాయని చరిత్ర చెబుతోంది.
జపాన్ వారి దేశభక్తిని చాటే ఒక వ్యాసం ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. ఒకసారి బీరుట్‌లో జపాను పౌరుడు ఒక షాపులో జపానులో తయారైన వస్తువులు ఏ విభాగంలో ఉంటాయని అడిగి తెలుసుకుని, అక్కడికి వెళ్ళి తన లిస్టు ప్రకారం అన్నీ జపాను తయారీ వస్తువులే కొనుక్కుంటాడు. తరువాత మాటలలో ఇక్కడ దొరకని వస్తువులు వచ్చేటప్పుడు తీసుకురమ్మని తన భార్యకు చెపుతానని అంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ స్వదేశీ తయారీ ఉత్పత్తులనే వాడాలని తమ దేశ ప్రజల ప్రతిజ్ఞ, నిర్ణయమని దాంతో తమ వస్తువులకు వ్యాపారం పెరుగుతుందని చెపుతుంటాడు. అంత దేశభక్తి వారిలో ఉండబట్టే రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నింటినీ శాసించగలిగే స్థాయికి చేరుకుంది. దేశభక్తితోనే అక్కడి ప్రజలకు కష్టపడి పనిచేయటంపట్ల శ్రద్ధ వస్తుతయారీలో నాణ్యత, మోసంలేకపోవటం వారి నైజంగా మారిపోయింది.
ఒకప్పుడు పైన చెప్పుకున్న గుణాల విషయంలో మన దేశమే ప్రపంచానికి మార్గదర్శనంగా ఉన్నా అవన్నీ వర్తమానంలో లోపించటానికి కారణం కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలో మగ్గటమే కారణమంటాం. కాని ఒకనాటికైనా సరియైన మార్గంలో నడవటం మొదలుపెడితేగదా చేరవలసిన గమ్యం చేరేది. ఇప్పటికే మనం మన దేశ తయారీ వస్తువులకంటే విదేశీ వస్తువులపైనే మోజు పడతాము. నాణ్యమైన వస్తువులు మనం మాత్రం ఎందుకు ఉత్పత్తిచేసుకోకూడదు.
మొట్టమొదట మన ప్రజలు పాలకులు పాటించవలసినది అన్ని విషయాలలో పొదుపు, నీతి, నిజాయితీలు. ప్రజలలో నీతినిజాయితీ రావాలంటే ఇప్పటికే అవి తప్పినవారిని నయానోభయానో చిత్తశుద్ధితో దండించో సరైనదారికి తేవలసి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మన ముందుతరాలవారు నిజాయితీపరులుగా ఉండాలంటే మన విద్యావిధానం మారాలి. మెకాలే మహాశయుని విద్యావిధానం వదిలేసి మనదైన సంస్కృతీ, సాంప్రదాయాలతో కూడిన విద్యావిధానం ప్రవేశపెట్టాలి. రాబోయే తరం పౌరులలో దేశభక్తి, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం పెంపొందాలంటే నేటి బాలల విద్యావిధానంలో ఆ విషయాలకు సంబంధించిన విషయాలను చేర్చాలి.
ఈ రకమైన స్వాభిమానం, దేశభక్తి నేటి యువకులలో, భావిభారత పౌరులు కాబోతున్న బాల బాలికలలో కలగజేయటం మొదట కుటుంబ వాతావరణంలోని పెద్దల, నాయకుల, పీఠాధిపతుల, ఇంకా సమాజశ్రేయస్సు కోరే పెద్దమనుషుల గురుతర బాధ్యత. అది వారు నిర్వర్తిస్తేనే కొంత కాలానికైనా మనం ప్రపంచంలో తలెత్తుకో గలుగుతాము.

- కౌస్త్భు