మెయన్ ఫీచర్

న్యాయ ప్రమేయం...ఎవరి నిర్వాకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థవారి గగనశకటాల-హెలికాప్టర్స్-కొనుకోళ్ల అవినీతిని గురించి సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నది కాంగ్రెస్ పార్టీవారి కోరిక. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే వెలిబుచ్చిన ఈ మహదాకాంక్ష దృశ్యమాధ్యమాలలో ప్రముఖంగా ఆవిష్కృతమైంది. సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించగలదన్న విశ్వాసం కాంగ్రెస్‌కు ఇప్పుడు కలిగింది. కానీ నల్లడబ్బును గురించి దర్యాప్తును జరపడంలో సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం ఉండదని గతంలో కాంగ్రెస్ నిర్వాహక కేంద్ర ప్రభుత్వం వాదించడం చరిత్ర. తమకు అనుకూలంగా ఉంటుందని భావించినప్పుడు రాజకీయ పార్టీలు న్యాయప్రమేయాన్ని, న్యాయక్రియాశీలతను కోరుకుంటున్నాయి. తమకు నచ్చనప్పుడు న్యాయక్రియాశీలతను రాజకీయ పక్షాలు మితిమీరిన న్యాయప్రమేయంగా చిత్రీకరిస్తున్నాయి. ఏళ్లతరబడి సాగుతున్న ఈ రాజకీయ ద్వంద్వవిధానానికి అగస్టా అవినీతి విషయాలలోను, నల్లడబ్బు విషయంలోను కాంగ్రెస్ వారు ప్రదర్శించిన పరస్పర విరుద్ధ వైఖరులు ఒక ఉదాహరణ మాత్రమే. ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాము గెలిచినప్పుడు న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని రాజ్యాంగ పరిరక్షక స్వభావాన్ని వేనోళ్ల కొనియాడే ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలు, విపక్షాల నేతలు తాము ఓడినప్పుడు చేస్తున్న నినాదం ఒక్కటే- ‘‘న్యాయ వ్యవస్థ ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడిపోతోంది..’’అన్నది ఆ నినాదం. మంత్రివర్గ, క్రియాశూన్యత నిజానికి న్యాయ క్రియాశీలతకు కాని, మితిమీరిన న్యాయ ప్రమేయానికి గాని వౌలిక ప్రాతిపదికగా మారి ఉండడం ఎవరైనా నిరాకరించగలరా? నిరాకరిస్తున్నవారు ‘రాజ్యాంగ నిబద్ధత’ ప్రాతిపదిగా కాక రాజకీయ ప్రయోజన నిష్ఠతో మాత్రమే వ్యవహరించడం లేదా..?
రాజకీయవేత్తల విధానం ఆశ్చర్యకరం కాదు. రాష్టప్రతి సైతం మితిమీరిన న్యాయప్రమేయం తగదని హెచ్చరించడమే విచిత్రమైన రాజ్యాంగ పరిణామం. ‘‘సరిహద్దులను గౌరవించండి..’’ అని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయవ్యవస్థ నిర్వాహకులకు సలహాలనివ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగాలేని వ్యవహారం. న్యాయ కార్యశీల పరిధిని మితిమీరిన రీతిలో విస్తరించకండి అని రాష్టప్రతి ఏప్రిల్ 16న జరిగిన న్యాయమూర్తుల సమావేశంలో పిలుపునిచ్చారు. న్యాయ క్రియాశీలతకు కళ్లెం వేయాలని, అలా జరగనట్టయితే రాజ్యాం గం నిర్దేశిస్తున్న అధికార విభజన స్ఫూర్తి దెబ్బతింటుందని రాష్టప్రతి భోపాల్ సమావేశంలో అభిభాషించారు. మూడు రాజ్యాంగ విభాగాలైన శాసన నిర్మాణం-లెజిస్లేచర్-, కార్యనిర్వహణ-ఎగ్జిక్యూటివ్, న్యాయ నిర్వణ-జ్యుడిషియరీ-ల మధ్య స్పష్టమైన అధికార విభజన జరిగి ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థ స్వభావం. ప్రతి రాజ్యాంగ విభాగం తమ పరిధిలో మాత్రమే అధికారాలను, విధులను నిర్వర్తించాలని, ఒకదాని పరిధిలోకి మరొక విభాగం చొరబడి పోరాదని రాష్టప్రతి హితవు చెప్పారు. ఇలా చొరబడిపోతున్నది న్యాయవ్యవస్థ మాత్రమేనన్నది సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి తీర్థసింగ్ ఠాకూర్ సమక్షంలోనే నిర్ధారించారు. రాష్టప్రతి స్వయంగా ఇలా నిర్ధారించడం ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో జరిగిన మరో సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి కంటతడికి బహుశా కారణం కావచ్చు. మితిమీరిన న్యాయ ప్రమేయం గురించి రాష్టప్రతి క్రీస్తుశకం 2012, సెప్టెంబర్ 8న మదరాసు ఉన్నత న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసి ఉన్నారు. మదరాసు హైకోర్టునకు 150 ఏళ్లు వచ్చిన సందర్భంగా జరిగిన సమావేశమది.
రాష్టప్రతి మూడు రాజ్యాంగ విభాగాలకూ సర్వోన్నత అధిపతి. ఎగ్జిక్యూటివ్, విభాగాధిపతి అయిన ప్రధాని కాని, లెజిస్లేచర్ విభాగం అధిపతులైన ఉపరాష్టప్రతి కాని, స్పీకర్ కాని ఇలా న్యాయవ్యవస్థ చొరబాటును గురించి ఫిర్యాదులు చేయవచ్చు. మూడు విభాగాలకూ సమాన అధిపతి సమన్వయకర్త అయిన రాష్టప్రతి మిగిలిన రెండు విభాగాల తరపున ప్రతినిధి వలె వ్యవహరించవచ్చునా? న్యాయవ్యవస్థను ఇలా బహిరంగంగా తప్పుపట్టవచ్చునా? న్యాయవ్యవస్థ మిగిలిన రాజ్యాంగ విభాగాల పరిధిలోనికి ఎలా చొరబడుతోందన్నది మాత్రం రాష్టప్రతి 2012 నుంచి ఇప్పటి వరకూ వివరించలేదు. ప్రధానమంత్రుల, స్పీకర్ల ఆరోపణలను నిరసించినట్టుగా సర్వోన్నత న్యాయమూర్తులు రాష్టప్రతి ఆరోపణలను నిరాకరించలేరు. ఏది న్యాయక్రియాశీలత? ఏది మితిమీరిన న్యాయ ప్రమేయం? అన్న ప్రశ్నలపై మూడు రాజ్యాంగ విభాగాలవారు మాత్రమేకాదు, మేధావులు రాజ్యాంగ కోవిదులు సైతం భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో ఈ మూడు విభాగాల మధ్య అధికార విభజన రేఖలు స్పష్టంగా ఉండడం మాత్రమే కాదు, ‘‘పరస్పర నియంత్రణ సమతుల్యం’’ కూడా నెలకొని ఉంది. పరస్పర నియంత్రణ మన రాజ్యాంగంలో కూడ నిహితమై ఉంది. ఏది ఎలాంటి నియంత్రణ? ఏది చొరబాటు? అన్నది ఎవరు తేల్చాలి? రాజ్యాంగ వ్యవస్థలో సర్వోన్నతుడైన రాష్టప్రతి తేల్చాలి. ఇలా నిర్ణేత అయిన రాష్టప్రతి ఫిర్యాదు దారుడుగా మారడమే విచిత్రమైన పరిణామం. ఇలా తేల్చవలసిన రాష్టప్రతి స్వయంగా నిర్ణయం తీసుకోలేరు. రాజ్యాంగంలో 143వ అధికరణ ప్రకారం రాష్టప్రతి సుప్రీంకోర్టును సంప్రదించి సలహాలను తీసుకొని నిర్ధారించవచ్చు. అందువల్ల ఎవరి అధికార పరిధిలోకి ఎవరు చొరబడుతున్నారన్న దాన్ని విచారించి నిగ్గు తేల్చడానికి వీలుగా, మరింత స్పష్టంగా సరిహద్దులను నిర్వచించి నెలకొల్పడానికి వీలుగా రాష్టప్రతి నిబంధన కింద చర్యలను ప్రారంభించవచ్చు. లేదా ఈ చర్యను చేపట్టవలసిందిగా కేంద్ర మంత్రివర్గానికి, కేంద్రానికి సలహానివ్వవచ్చు...2012 నుండి కూడ రాష్టప్రతికి ఈ ధ్యాస ఎందుకని కలుగలేదు? ఇప్పుడైనా చర్యను మొదలుపెట్టవచ్చు.
సర్వోన్నత న్యాయస్థానం మంత్రివర్గాల పాలనాపరిధిలోకి చొరబడుతోందని ఆరోపిస్తున్నవారికి చిత్తశుద్ధి ఉందా? ఉన్నట్లయితే ‘‘చొరబడవలసిందిగా’’ వీరు ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలను పదే పదే ఎందుకని కోరుతున్నారు? చట్టసభల అంతర్గత వ్యహారాలలో సభాధ్యక్షులదే తుది నిర్ణయమని చెబుతున్నవారు ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ఎందుకని న్యాయస్థానాలను ఆశ్రయించారు? కొందరు ఉన్నత న్యాయస్థానాలలోను, సర్వోన్నత న్యాయస్థానాలలోను, ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొందరు మితిమీరిన న్యాయప్రమేయం గురించి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు తెలిపేవారు ‘్ఫర్యాదు’ చేసేవారు కూడ చట్టసభలకు చెందినవారే మరి...2004లో అవినీతికి పాల్పడి సభలో ప్రశ్నలు అడగడానికై లంచాలు తీసుకున్న పదకొండు మంది సభ్యులను లోక్‌సభ నుండి బహిష్కరించారు. వారి సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. ఈ అంతర్గత వ్యవహారాన్ని సభ్యత్వం పోగొట్టుకున్న వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయ పరిధిలోకే రాదని, ఇది లోక్‌సభ అంతర్గత వ్యవహారమని అప్పటి స్పీకర్ సోమనాథ చటర్జీ పదే పదే చెప్పారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వారు మాత్రం వివాదాన్ని విచారించి తీర్పు చెప్పారు. అవినీతిపరుల లోక్‌సభ సభ్యత్వం రద్దుచేయడం సమంజసమేనన్నది ఆ తీర్పు...ఇప్పుడు ఉత్తరఖండ్‌లో ఈ కథ పునరావృత్తం అయింది. మార్చి 26న తొమ్మిది మంది పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల సభ్యత్వాన్ని ఉత్తరఖండ్ స్పీకర్ రద్దు చేశారు. ఈ రద్దు గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు విచారించాయి. విచారిస్తున్నాయి. మే 10న ఉత్తరఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్షలో ఈ సభ్యులు పాల్గొనలేక పోవడం సర్వోన్నత న్యాయస్థానం వారి ఆదేశ ఫలితం...ఇదంతా కొందరి దృష్టిలో మితిమీరిన ప్రమేయం. చట్టసభల అంతర్గత వ్యహారాలలో తీర్పు వల్ల లాభ పడుతున్న వారి దృష్టిలో ఇదంతా న్యాయం...
ఫిరాయింపులకు సంబంధించిన రాజ్యాంగ పదమూడవ అనుబంధంలోని ఏడవ నిబంధన ప్రకారం సభ్యుల అనర్హత గురించి ఎలాంటి అధికార పరిథి లేదు. అయితే ఇప్పటికి అనేకసార్లు న్యాయస్థానాలు అనర్హత గురించి ఎలా విచారించగలిగాయి? దీనికి సమాధానం కూడ సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానికి నిర్నిరోధకమైన అధికారాలు ఉన్నాయి. న్యాయాధికార పరిధిని విస్తరించే అధికారం కూడ సుప్రీంకోర్టునకు ఉంది. ఈ విషయం గురించి సుప్రీంకోర్టు అనేకసార్లు స్పష్టం చేసింది. అందువల్ల న్యాయాధికార పరిధిని ‘‘్ఫరాయింపుల’’కు వర్తింపజేశారని భావించాలి! ఇలా వర్తింపజేయకపోయినట్టయితే రాజకీయ ప్రయోజనాలు ప్రాతిపదికగా చట్టసభలలోని మెజారిటీ పార్టీ వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు నిరోధించడం సాధ్యం కాదు. రాష్టప్రతి పాలన విధించిన సందర్భాలలో దాన్ని న్యాయసాధనాలు సమీక్షించరాదన్నది 1980వ దశకం వరకు, కొనసాగిన అభిప్రాయం. అందువల్ల రాష్టప్రతి పాలనను విధించే చర్యలను ఎవ్వరూ న్యాయస్థానాలలో సవాలు చేయలేదు. ఇప్పుడు రాష్టప్రతి పాలనను కూడ న్యాయస్థానాలు సమీక్షిస్తున్నాయి. ఉత్తరఖండ్‌లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయకాండ ఇందుకు సరికొత్త ఉదాహరణ.
మూడు రాజ్యాంగ విభాగాల మధ్య పరస్పర నిరోధక సమతుల్య’ వ్యవస్థ కొనసాగుతుండడానికి మాత్రమే ఇదంతా నిదర్శనం. ‘ఓవర్ రీచ్’ కాదు. ‘ఓవర్ ఆక్టివిజమ్’ కూడ కాదు. రాజ్యాంగంలోని 124వ అధికరణం ప్రకారం 217వ అధికరణ ప్రకారం సర్వోన్నత ఉన్నత న్యాయమూర్తులను తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నది. కానీ ‘‘ఈ అధికారాన్ని పార్లమెంట్ చెలాయించడం న్యాయవ్యవస్థ పరిధిలోకి శాసనసభ నిర్మాణశాఖ చొరబడడంతో సమానం...’’ అని భాష్యాలు చెబితే ఎలా ఉంటుంది?

- హెబ్బార్ నాగేశ్వరరావు