మెయిన్ ఫీచర్

సీక్వెల్స్ సీజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా క్లైమాక్స్ చూశాక -సీక్వెల్ ఉండొచ్చన్న అంచనాలు ఉండేవి ఒకప్పుడు. హిట్టుపడితే -ఏదోక టైంలో దీనికి సీక్వెల్ రావొచ్చన్న అంచనాలు ఉంటున్నాయి ఇప్పుడు. సీక్వెల్ తీయడానికి సీజన్‌తో తప్ప, సీక్వెన్స్‌తో సంబంధం లేదన్నది ఇప్పటి రీతి. అందుకే -బావుందనిపించుకున్న సినిమాలన్నీ మళ్లీ ప్రేక్షకుల ముందు బారులు
కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగు పరిశ్రమలో ఓ రెండేళ్లపాటు సీక్వెల్స్
సీజన్ నడిచే అవకాశం కనిపిస్తోంది.

హాలీవుడ్‌లో సీక్వెల్స్‌గా మొదలైన సంస్కృతి -సిరీస్ వరకూ ఎలాగూ వచ్చేసింది. జురాసిక్‌పార్క్ 1, 2, 3..; మమీ 1, 2, 3..; స్పైడర్‌మ్యాన్ 1, 2, 3... ఇలా చెప్పుకోవడానికి లెక్కలేనన్ని సిరీస్ ప్రాజెక్టులు. ఎప్పటికప్పుడు హాలీవుడ్ మార్క్‌ను అందుకే బాలీవుడ్‌లోనూ చాలాకాలం క్రితమే సీక్వెల్స్ మొదలై, ఒకదశలో ఊపుతో నడిచాయి. బాలీవుడ్ నుంచి తెలుగు పరిశ్రమకూ సీక్వెల్ సంస్కృతి దిగుమతైనా -హిట్టు రేంజ్ అందుకున్న సీక్వెల్స్ చాలా తక్కువ. ఆడియన్స్
ఆదరించిన సినిమాను పార్ట్-2గా తీస్తే మళ్లీ సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో వచ్చిన సీక్వెల్స్ అన్నీ ఒకదశలో ఢమాల్‌మన్నాయి. అయినా, తెలుగులో సీక్వెల్స్ మీద మోజు
తగ్గలేదు. తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలో సీక్వెల్స్ అడపాదడపా రావడమే తప్పించి, క్యూకట్టేంత సీన్ లేదన్నది
గమనార్హం.

ఏ భాషలోనైనా సినిమా సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంటే చాలు -ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించడం ఆనవాయితీగా మారిపోతోంది. ముఖ్యంగా సీక్వెల్స్ విషయంలో దర్శక నిర్మాతలూ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. హీరోలైతే -మరింత క్రేజ్ కోసం వెనకా ముందూ ఆలోచించకుండా డేట్లు అడ్జెస్ట్ చేసేస్తున్నారు. సీక్వెల్స్‌కు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్డే అన్నది ఎవ్వరూ కాదనలేనిది. బాలీవుడ్‌లో దాదాపుగా సీక్వెల్ ప్రాజెక్టులన్నీ ఫస్ట్ పార్ట్‌కు రెట్టింపు హిట్టు అందుకుంటూ వస్తున్నాయి. నిజానికి మొదటి కథతో సంబంధం లేకున్నా, సెకెండ్ పార్ట్ కథ పూర్తిగా వెరైనా -టైటిల్‌కు టు, త్రీ అని చేర్చుకుంటూ పోతున్న సినిమాలూ వస్తున్నాయి. బాలీవుడ్ సీక్వెల్స్‌లో చెప్పుకోదగ్గవి చాలానే కనిపిస్తాయి. ధూమ్ ఫస్ట్, సెకెండ్ ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తే -్ధమ్ 3 చతికిలపడింది. ఇప్పుడు సల్మాన్‌తో ధూమ్ 4 చేయడానికీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హిట్టుకొట్టిన దబంగ్‌కు సిరీస్‌గా సీక్వెల్స్ వస్తే, హేరా ఫేరి, తను వెడ్స్ మను, వెల్‌కం, క్రిష్, గోల్మాల్, మున్నాభాయ్ ప్రాజెక్టులకు సీక్వెల్స్ వచ్చి బాలీవుడ్‌ను అదరగొట్టాయి.
అయితే తెలుగులో ఈ తరహా సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువ మార్కులు ఇచ్చిన దాఖలాలు తక్కువ. అయినా దర్శక, నిర్మాతలు సీక్వెల్స్ వెనుక పరుగులు తీస్తూనే ఉన్నారు. కాకపోతే -పార్ట్ 2 ప్రాజెక్టులో ఏం చెప్పాలన్న అంశంపై కొత్తదనం, వైవిధ్యం కరవై ఢమాల్‌మంటున్న సినిమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. నిజానికి తెలుగులో సీక్వెల్స్ ఎందుకు వర్కవుట్ కావడం లేదు? అన్నది గమనిస్తే -చెప్పిన కథనే మళ్లీ.. మళ్లీ మళ్లీ చెప్పేందుకు ప్రయత్నించడం వల్లేనన్నది అర్థమవుతుంది. తెలుగు పరిశ్రమలో సీక్వెల్‌కు ఎక్కువ ఊపునిచ్చింది మాత్రం -మనీ సినిమా. జెడి చక్రవర్తి, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో వచ్చిన మనీ హిట్ మార్క్ కొట్టడంతో -సీక్వెల్‌గా మనీ మనీ తీసుకొచ్చారు. అయితే అది ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. తరువాత రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన రియల్ లైఫ్ స్టోరీ రక్తచరిత్ర అద్భుతమైన హిట్ అందుకుంది. సీక్వెల్‌గా వచ్చిన రక్తచరిత్ర-2 ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాలీవుడ్ రీమేక్‌లుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబిబిఎస్‌కు హిట్ పడితే, శంకర్‌దాదా జిందాబాద్ ఫట్ మంది. పబ్లిసిటీతో బలంతో వచ్చిన హీరో బన్నీ సినిమా ఆర్య బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటే, సీక్వెల్‌గా వచ్చిన ఆర్య-2 ఘోరంగా దెబ్బతింది. వర్మ డైరెక్షన్‌లో 90వ దశకంలో వచ్చిన గాయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే, దీని సీక్వెల్‌మీద ఏళ్ల తరబడి తర్జనభర్జనల తరువాత -2012లో గాయం-2 వర్కవుట్ చేసినా ఫలితాలు రివర్స్ అయ్యాయి. కృష్ణుడు హీరోగా వచ్చిన వినాయకుడు హిట్ అందుకోవడంతో, సీక్వెల్‌గా విలేజ్‌లో వినాయకుడు తీసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. తెలుగులో లెక్కలేనన్ని సీక్వెల్స్ ఉన్నాయి. కానీ -హిట్టుపడిన సీకెల్స్ ఎన్ని? అని ప్రశ్నిస్తే మాత్రం వేళ్లమీద లెక్కపెట్టాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే, సీక్వెల్స్‌కు మళ్లీ ఊపినిచ్చినవాడు మాత్రం -దర్శకుడు రాజవౌళి. బాహుబలి తీస్తున్నపుడే -సీక్వెల్‌ను ప్రకటించి ఇప్పుడు దాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమైవున్నాడు. బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసి దాదాపు 600 కోట్లకు పైగా వసూలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా బాహుబలి-2ని రూపొందిస్తున్నారు.
****
బాహుబలి ఊపుతో తెలుగు పరిశ్రమలో మళ్లీ సీక్వెల్స్ సీజన్ మొదలైందనికోవాలి. రాబోయే కాలంలో సీక్వెల్స్ దాడి తప్పేలా లేదు. ఒక దశలో బాలకృష్ణకు బ్లాక్‌బస్టర్‌గా పనిచేసిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్ రూపొందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజానికి వందో చిత్రంగా సీక్వెల్‌ను తెచ్చే ఆలోచన చేసినా -చివరి క్షణంలో ‘శాతకర్ణి’ కథ తెరపైకి వచ్చింది. కాకపోతే -నెంబర్‌తో సంబంధంలేని ప్రాజెక్టుగా ‘ఆదిత్య 999’ రావడం ఖాయమన్నది ప్రరిశ్రమలో వినిపిస్తున్న మాట. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావే చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సూపర్‌హిట్ అందించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కీ సీక్వెల్ చేసే ఆలోచన తెరపైకి వచ్చింది. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా మెగా తనయుడు రామ్‌చరణ్‌తో ప్రాజెక్టు తెరకెక్కించవచ్చన్నది వినికిడి. మోహన్‌బాబు కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిన పెదరాయుడు చిత్రానికీ సీక్వెల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ ఈ సినిమా తీసే అవకాశం ఉందంటున్నారు. ఈగ చిత్రానికి సీక్వెల్ తెస్తానని సందర్భం వచ్చిన ప్రతిసారీ రాజవౌళి ప్రకటిస్తుంటే, ఆర్య-3ని తెచ్చే ఆలోచనను అల్లు అర్జున్, సుకుమార్ ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. కొంచెం అటుఇటుగా ఆలోచనలన్నీ ఫినిషింగ్‌కు వస్తే -సీక్వెల్స్ దాడి తప్పదన్న మాట. పెచ్చుమీరుతున్న అవినీతి, నిర్లక్ష్యాన్ని టార్గెట్ చేసిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి పోరాట కథగా వచ్చిన ‘్భరతీయుడు’కి సీక్వెల్ చేయాలన్న ఆలోచన కమల్, శంకర్‌కు ఎప్పటినుంచో ఉంది. ఇటీవలి కాలంలో ఆ విషయం కాస్త ఎక్కువగానే వినిపిస్తోంది కూడా. దేశానికి నా అవసరం వచ్చినపుడు తిరిగి వస్తానంటూ విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు -మళ్లీ తిరిగి వెనక్కివచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్న మాట.
సస్పెన్స్, థ్రిల్లర్ కలగలిపిన సినిమాలకు కొత్త బలాన్ని, ఊపునిచ్చిన చంద్రముఖికి సీక్వెల్ చేయాలన్న ఆలోచన అప్పట్లోనే వచ్చింది. అందుకు రజనీకాంత్ అంగీకరించకపోవడంతో -సీక్వెల్ అన్న ప్రస్తావన రాకుండానే పార్ట్-2కి వెంకటేష్ హీరోగా నాగవల్లి నిర్మించారు. అదికాస్తా డిజాస్టర్ అయిపోవడంతో -చంద్రముఖి సీక్వెల్ ముచ్చట అలాగే ఉండిపోయింది. అయితే, అదే దర్శకుడు పి.వాసు ఇప్పుడు చంద్రముఖి-2 తీస్తున్నాడు. ఇది సీక్వెల్ కాదని మాత్రం ప్రకటిస్తున్నాడు. కన్నడలో ‘శివలింగ’ తీసి మంచి హిట్టుకొట్టిన వాసు, అదే చిత్రాన్ని తమిళంలో చంద్రముఖి-2గా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. లారెన్స్, అనుష్క కాంబినేషన్‌లో ఈ ప్రాజెక్టు తెరకెక్కొచ్చు.
కోలీవుడ్‌లో -జయం రవి, నయనతార జంటగా సెనే్సషన్ క్రియేట్ చేసిన తని ఓరువన్ చిత్రానికీ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు మోహన్‌రాజా. కథ, కథనాలన సిద్ధం చేసుకుంటున్నాడని వినికిడి. ఇప్పటికే రోబోకు సీక్వెల్‌గా వస్తున్న రోబో-2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నై తారమణి ఫిల్మ్ సిటీలో నిన్నమొన్నటి వరకూ జరిగిన షెడ్యూల్‌లో అక్షయ్ కుమార్ సైతం పాల్గొన్నాడు. రజనీ, శంకర్ కాంబోలో హ్యాట్రిక్ ప్రాజెక్టు కావడంతో -దీనిపై భారీగానే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక సూర్యకు సూపర్ ఇమేజ్ తీసుకొచ్చిన సింగం సీక్వెల్ సైతం శరవేగంగా సాగుతోంది. హరి దర్శకత్వంలో అనుష్క, శృతిహాసన్‌తో జతకట్టి సింగం-3గా వస్తున్న సూర్య.. ఈ ప్రాజెక్టును దసరాకే తెచ్చే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.
మహేష్‌బాబు కెరియర్‌కు మలుపులాంటి ‘అతడు’ చిత్రానికి త్రివిక్రమ్, ‘పోకిరి’ చిత్రానికి పూరీ జగన్నాథ్ సీక్వెల్స్ తెచ్చే ఆలోచనలను అప్పుడప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. సొగ్గాడే చిన్నినాయినా హిట్టుతో -ఆ ప్రాజెక్టుకు సీక్వెల్ తెస్తానని నాగార్జున ఎప్పుడో ప్రకటించాడు. చిమ్మ చీకటినుంచి కెరియర్‌కు కొత్త వెలుగు చూపించిన ‘పటాస్’ చిత్రానికీ సీక్వెల్ తేవాలని కల్యాణ్‌రామ్ మదిలోనూ ఉంది. ఇక స్టార్ హీరోలే కాదు, అప్‌కమింగ్ హీరోలు సైతం సీక్వెల్స్ మీద దృష్టి పెడుతున్నారు. నితిన్ కెరియర్‌కు గొప్ప ఊపునిచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రానికి సీక్వెల్ తేవాలని దర్శకుడు కొండా విజయకుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇవన్నీ కొన్ని మాత్రమే. బయటకు చెప్పనివి, ప్రయత్నాలు జరుగుతున్నవి సీక్వెల్ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి, ఉండొచ్చు. హిట్టునిచ్చిన ప్రాజెక్టుల మీద సీక్వెల్ రిస్క్ చేయడానికి సినీ పరిశ్రమలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.

-శ్రీనివాస్