మెయన్ ఫీచర్

తిరుగులేని జనాకర్షక నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే అతిపేద రాష్ట్రంగా పేరొందిన ఒడిషాలో ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలకు పైగా నవీన్ పట్నాయక్ విజయవంతంగా తిరుగులేకుండా పాలన సాగిస్తున్నారు. ప్రతి ఎన్నికకు ఆయన బలం పెరుగుతున్నది. ప్రతిపక్షాలు బలహీనపడుతున్నాయి. ఆయన విజయరహస్యం ‘‘శత్రువులు నిన్ను బలోపేతం చేస్తారు, మిత్రులు బలహీన పరుస్తారు,’’ అన్న నానుడి అని చాలామంది భావిస్తారు. గత ఫిబ్రవరిలో బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా ఏడవసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలను ప్రకటించారు. ఈ ఏడాది ఆయన ప్రకటించిన జనాకర్షణ పథకాలలో ఇది ఏడవది. ఇటువంటి పథకాలు ఆయనకు తిరుగులేని నాయకుడిని చేస్తున్నాయి.
విశేషమైన ప్రజానాయకుడిగా పేరొందిన తండ్రి బిజూ పట్నాయక్ మృతి చెందడంతో అనుకోకుండా, అప్రయత్నంగా 2000లో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికి ఆయనకు ఒడిషా భాష కూడా సరీగ్గా రాదు. ఒడిషా కంటె ఫ్రెం చ్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. బహ్మచారిగా విలాసవంత జీవితం గడిపిన ఆయనకు ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి లేదు. సంస్కృతి, సాహిత్యం, పర్యావరణం అంశాలపై గల మక్కువతో ప్రపంచం అంతా తిరుగుతూ ఎక్కువగా గడిపారు. అయినా రాజకీయాలలో విజయసాధనకు మొదటి రహస్యం దేశంలోని ఇతర ప్రాంతంలోని నాయకుల వలె ఆయన ఎన్నడూ జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. జాతీ య రాజకీయాలలో ‘కింగ్’ కావాలని గాని, ‘కింగ్ మేకర్’ కావాలని గాని ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ‘నా ప్రజలకు సేవ చేస్తూ నేను సంతోషంగా ఉంటాను’ అని అంటుంటారు. పదిహేను సంవత్సరాలకుపైగా అధికారంలో ఉంటున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనని రాజకీయ పార్టీ బహుశా బిజెడి ఒక్కటేనని చెప్పవచ్చు. సాధారణ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, సహకార ఎన్నికలు-ఏవి జరిగినా ప్రతి ఎన్నికలో ఆయన బలం పెంచుకుంటూ వస్తన్నారు. ప్రతిపక్షాలు బలహీన పడుతుండటంతో ఆయ న్ను ఎదిరించే రాజకీయ శక్తి అంటూ లేకుం డా పోతున్నది. ఆయన విజయానికి విశే్లషకులు ఎన్ని కారణాలు చెబుతున్నా, ప్రధార కారణం ప్రజల దృష్టిలో ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. ఆయనతో సరిపోల్చగల నాయకుడు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలలో కనిపించడం లేదు. కాంగ్రెస్, బిజెపిలకు సమాన దూరంలో ఉండటం ద్వారా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చేసుకోగలుగుతున్నారు.
నవీన్ పట్నాయక్ పాలనలో రాష్ట్రం పేదరికం దుష్ప్రభావాలకు లోనవుతున్నదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఎన్నికలలో ఎలా గెలుపొందాలనే సూత్రం ఆయనకు వంట బట్టినట్టు బహుశా దేశం లో వేరెవరికి వంటబట్టి ఉండదు. అందుకే రాష్ట్రంలో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు భౌగోళికంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు పొందగలుగుతున్నారు. రాష్ట్ర జనాభాలో 65 శాతంకు పైగా ప్రజలు నిరుపేదలుగా ఉన్నారు. వారే నవీన్ పట్నాయక్‌కు ప్రధాన మద్దతుదారులు కావడం విశేషం. ఒక వ్యక్తి పుట్టుకనుంచి మరణం వరకు జీవితంలో ప్రతి దశలో ఏదోవిధంగా ప్రభుత్వ సహాయం అందేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలు బిజెడికి ప్రజల్లో మంచి పలుకుబడిని సంపాదించి పెడుతున్నాయి. తల్లులు కాబోయే వారికి సహాయం అందించడానికి ‘మమతయోజన’ నుండి మరణించిన తర్వాత అంత్యక్రియలకు, సహాయం అందించే ‘హరిశ్చంద్ర యోజన’ వరకు ప్రతి ప్రథకం ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒక్క రూపాయికే కిలోబియ్యం, ఉచితంగా స్కూల్ యూనిఫాం, విద్యార్థులకు సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, ఉచిత మందులు, దోమతెరలు, వితంతు- వృద్ధా ప్య పింఛన్లు, ఉచిత గొడుగులు, దుప్పట్లు వంటి పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల వలె ఎన్నికల సమయంలో నవీన్ పట్నాయక్ భారీ పథకాలను ప్రకటించరు. ప్రజలకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక చిన్న పథకం ప్రకటన ఇస్తూ ఉంటారు. పట్టణాలలో రూ.5లకే భోజనం అందిం చే ఒక బృహత్తర పథకం ‘ఆహార్’ను ఈ మధ్యనే రూర్కేలాతో సహా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పేదలకు వేడివేడి అన్నం, కూరలు అందించే ఈ పథకం మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధింపజేయడంతో మొత్తం 30 జిల్లాల ప్రధాన కేంద్రాలకు విస్తరించారు. ఇది ప్రజాకర్షక పథకాల ప్రభుత్వం అని ప్రతిపక్షాలు అవహేళన చేస్తుంటాయి. ఈ పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతున్నా ముఖ్యమంత్రి తొణకరు, బెణకరు. ఈ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరి, మంచి ఫలితాలనిచ్చేవిధంగా చూడటంలో క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగం విజయం సాధిస్తున్నది. మంచి పార్టీయంత్రాంగం ఉండడమే అందుకు కారణం.
2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందిన రెండు జాతీయ పార్టీలు- కాంగ్రెస్, బిజెపిలు ఎటువంటి గుణ పాఠాలు ఏర్చినట్టు కనబడదు. నవీన్ పట్నాయక్ ఈ రెండు పార్టీల రాష్టస్థ్రాయి నాయకులను అసలు పట్టించుకోరు. అయితే వారి జాతీయ నాయకులతో మాత్రం మంచి సంబంధాలను కొనసాగిస్తుంటారు. అందుకనే మైనింగ్, బొగ్గుగనుల కుంభకోణాల నుండి గతంలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం కాపాడితే, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం భారీ బాలల నిధి కుంభకోణంపై సిబిఐ విచారణ నుండి రక్షణ కల్పిస్తున్నది. సిబిఐ విచారణ బిజెడి ప్రభుత్వ అంతానికే దారితీయగలదని చాలామంది భావించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రభాత త్రిపాఠి, ఎంపి మయూర్ భంజ్ జైలులో ఉండగా, 11 మంత్రులపై దర్యాప్తుకొనసాగుతున్నది. నవీన్ పట్నాయక్ వ్యక్తిగత సహాయకుడు సరీజ్ సహాను సిబిఐ ప్రశ్నించినప్పుడు ఈ దర్యాప్తు ముఖ్యమంత్రి ఇంటి ముంగిటకు చేరిందని అంతా భావించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం నవీన్ పట్నాయక్‌ను అవినీతి ఆరోపణలపై త్వరలో అరె స్ట్ చేయబోతున్నదని రాష్టస్థ్రాయి భాజపా నాయకులు ప్రకటనలు కూడా చేశారు. అయితే రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్యమంత్రి పేరు ను ప్రస్తావించలేదు. అత్యుత్సాహంతో వ్యవహరించిన భువనేశ్వర్‌లోని సిబిఐ ఎస్.ఐ.ని బదిలీ చేశారు. నవీన్ పట్నాయక్‌కు విరోధిగా పేరొందిన ప్రకాశ్ మిశ్రాకు రాష్ట్రంలో సిబిఐ అధిపతి కాకుండా నిలిపివేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రాన్ని విమర్శిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నదని తరచూ నిందిస్తుంటారు.
ఒకపక్క పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మరోపక్క రాష్ట్రానికి రావలసిన నిధుల్లో కేంద్రం కోత విధిస్తున్నదంటూ విమర్శిస్తారు. ఇదే సమయంలో కేంద్రం లోని బిజెపి నాయకులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు. తద్వారా రైల్వే బడ్జెట్‌లో, స్మార్ట్ సిటీలలో కొన్ని ప్రత్యేకతలు కూడా సాధించుకోగలుగుతున్నారు. నిజం చెప్పాలంటే నవీన్ పట్నాయక్ అనుసరిస్తున్న విభిన్న శైలి ఆయన్ను నాయకుడిగా నిలబెడుతున్నది.
నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న తమ నాయకులు అనుసరిస్తున్న ధోరణుల కారణంగా రాష్ట్రంలోని బిజెపి, కేంద్ర పార్టీ నాయకులు మనోస్థైర్యం కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. వరుసగా ఎన్నికల్లో ఓటములు, ప్రజలను సమీకరించగల ఆకర్షణ గల నాయకుడు తమకు లోపించడంతో రాష్ట్రం లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగే ప్రయ త్నం చేయలేకపోతున్నారు. నవీన్ పట్నాయక్ మరో మధుకోడా అని, త్వరలో జైలుకు వెళ్లాల్సిందేనని శాపాలు పెట్టే రాష్ట్ర బిజెపి నాయకులు 2014 ఎన్నికల్లో దేశం అంతటా ప్రభావం చూపిన నరేంద్ర మోదీ ప్రభంజనం తమ రాష్ట్రంలో ఎందుకు చూపలేకపోయిదో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. నవీన్ పట్నాయక్ దృషి టలో రాష్ట్రం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మావోయిస్టుల హింసాయుత కార్యకలాపాలు. వారిని అదుపుచేయడం కోసం కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లకు పొరుగున ఉన్న జిల్లాల్లో కొంతవరకు కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు ఇంతవరకు అడుగుపెట్టని జిల్లాలో తమ ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నారు.
కేవలం రాజకీయ సుస్థిరత, ఆర్థికాభివృద్ధికి దారితీయదని చెప్పడానికి ఒడిషా చక్కని ఉదాహణ అని చెప్పవచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య. దేశంలోనే పెట్టుబడులు ఆకర్షించే మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా జోడిస్తామని చెబుతూ, అభివృద్ధి చేయడం కోసం ఒక ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలు జరుపుతున్న విధానాలను పరిశీలిస్తున్నారు.
పలు కీలక బిల్లులను ఆమోదించడంలో పార్లమెంటులో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న నవీన్ పట్నాయక్ భూసేకరణ, గనుల చట్టాలలో మార్పులను మాత్రం వ్యతిరేకించారు. లోక్‌సభలో 20 మంది, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్న ననీన్ పట్నాయక్ విధానానికి ప్రధానమంత్రి ఇప్పుడు సముఖంగా లేరన్నది యదార్థం. ఇదిలావుండగా నవీన్ పట్నాయక్ రాజకీయ ప్రత్యర్థులపై కటువుగా మాట్లాడినట్టు, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు ఎప్పుడూ ఉండరు. ఆ హుందాతనమే ఆయన్ను తిరుగులేని నాయకుడిగా చేస్తున్నది. ప్రజాభిమానాన్ని కాపాడుతున్నది.

-చలసాని నరేంద్ర