మెయిన్ ఫీచర్

అలుపెరుగని యోధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే రెండేళ్లు! రాజధాని సైతం లేని రాష్ట్రం... నిధులు విదల్చని కేంద్రం...ఆర్థిక లోటు...గాడిన పడని పాలనా యంత్రాంగం ... ఇదీ నేటి అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. బాలారిష్టాలనుంచి గట్టెక్కని రాష్ట్ర రథాన్ని అనుభవజ్ఞుడైన రౌతు చంద్రబాబు ఒడుపుగా నడిపిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథం ఎక్కించేందుకు ఏటికి ఎదురీదుతున్నారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా అభివృద్ధికి ‘మహాసంకల్పం’ చెప్పుకుంటున్న తరుణంలో ఇది ఆంధ్రభూమి అందిస్తున్న ప్రత్యేక వ్యాసావళి.

నారా చంద్రబాబు నాయుడు.. దేశానికి పరిచయం అవసరం లేని పేరిది. సమైక్యాంధ్రలో తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రలో రెండేళ్లు ముఖ్యమంత్రిగా పదవీకాలం పూర్తి చేసుకున్న బాబు విజనరీపై ప్రశంసలు పొందారు. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రగతి రధాన్ని పరుగులు పెట్టిస్తున్న బాబు, ఈ రెండేళ్లలో అనేక కష్టాలు చవిచూశారు. అయినా తన అనుభవమే పెట్టుబడిగా నవ్యాంధ్రను, అసాధ్యమయినప్పటికీ దేనికీ కుంగిపోకుండా ప్రధమ స్థానంలో నిలిపేందుకు తపిస్తున్నారు. భారత రాజకీయాల్లో తన సమకాలీనులంతా నిష్క్రమించినా, బాబు మాత్రం మళ్లీ తనను తాను మార్చుకుని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో పరుగులుపెట్టించే పనిలో ఉన్నారు. కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న బాబు.. రాజకీయ, ఆర్ధిక, సామాజికపరమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా రాష్ట్రాన్ని ప్రగతిబాట నడిపిస్తున్నారు. సంక్షోభాలు, సమస్యలొస్తే చాలామంది కాడి కిందపారేసి పారిపోతారు. కానీ, చంద్రబాబు దాన్నొక అవకాశంగా భావించారు. సంక్షోభ సమయంలోనే చురుకుగా పనిచేశారు. ఇది ఇప్పటికే రుజువైన వాస్తవం. రెండేళ్లుగా అదే జరుగుతోంది! సమైక్య రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందనే కంటే, అసలు పోతేకదా అనే పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తర్వాత, కరెంటు కష్టాలు తీరడం ప్రజలకు ఊరటనిచ్చింది. దశాబ్దాలపాటు కరెంటు కష్టాలు అనుభవించిన ప్రజలకు, విభజన పుణ్యాన నిరంతర విద్యుత్ వరంగా పరిణమించింది. నిజానికి ఈ వరం ఇచ్చింది బిజెపి నేతృత్వంలోని కేంద్రమే అయినప్పటికీ, అది తన ఘనతగా ప్రచారం చేసుకోవడంలో బాబు విజయం సాధించారు.
అయితే, నిరంతర విద్యుత్ పథకం పూర్తిగా బిజెపిదే అయినప్పటికీ, 22.5 మిలియన్ యూనిట్ల లోటును భర్తీ చేసి, మిగులుగా మార్చిన ఘనత మాత్రం పూర్తిగా బాబుదే. గెలిచిన వెంటనే పదవీ బాధ్యతలు స్వీకరించని బాబు, ఆలోగా విద్యుత్ సమస్యపై దృష్టి సారించారు. దాదాపు 1800 కోట్లు వెచ్చించి, పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా నమోదయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ చేయని వినూత్న ప్రయోగాన్ని చంద్రబాబునాయుడు, ల్యాండ్ పూలింగ్ పేరుతో శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వాలన్న బాబు పిలుపు 34 వేల ఎకరాలు అందించింది. ఇదిలా జరగడం చరిత్రలో తొలిసారి. దేశంలో తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన చేస్తున్న ఈ కాలంలో, ఏకంగా 34 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కోసం ఇవ్వడం దేశ చరిత్రలో మరిచిపోని మైలురాయి. ఆ తర్వాత ఆ భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఒక్క పిలుపుతో 34 వేల ఎకరాలు స్వయంగా రైతులే ఇవ్వడం బాబు సాధించిన అపూర్వ విజయం.
మారుతున్న రాజకీయ సమీకరణలు, భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే అయినప్పటికీ.. కులాలపై దృష్టి పెట్టిన బాబు రెండు కులాలను దరిచేర్చుకోవడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న కాపులకు బీసీ హోదా ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టడం సాహసమే. కాంగ్రెస్ పార్టీకి గతంలో కాపులు దన్నుగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ వారికి చేసిందేమీలేదన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుని, వారిని బీసీల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా కోస్తాలో కాపు, రాయలసీమలో బలిజ వర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారే వాతావరణాన్ని బాబు సృష్టించారు. ఇక జనాభాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ, దశాబ్దాల క్రితం ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు 65 కోట్లు కేటాయించి, ఆ వర్గాన్ని దరిచేసుకున్నారు. అదే సమయంలో జనాభాలో 45 శాతం ఉన్న బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ప్రకటించి, దానికి 8 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. తాజాగా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు ప్రత్యేకంగా ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా పూర్తయితే అగ్రకులాలలో 80 శాతం ప్రభుత్వానికి చేరువకావడం ఖాయం. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఏపిలో 43 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని సంక్షేమ ఫలాలను బాబు అందించి.. వృద్ధులు, వికలాంగులు, వితంతుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. 43 శాతం ఫిట్‌మెంట్‌తో అటు ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందినీ మెప్పించి, తాను ఉద్యోగ వ్యతిరేకినన్న అపవాదును చెరిపివేసుకున్నారు.
బాబు కష్టం ఫలితంగా.. ఎఫ్‌డిఐలను ఆకర్షించడంలో దేశంలో రాష్ట్రానికి 3వ స్థానం లభించింది. దానికోసం బాబు కాళ్లకు బలపాలు కట్టుకుని విదేశాలు తిరిగారు. ఎక్కడెక్కడి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను సమీకరించి, వారికి ఆయనే స్వయంగా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి, వారిలో నవ్యాంధ్రపై నమ్మకం పెంచారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఈ రెండేళ్లలో వేసిన బలమైన అడుగు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో కష్టంగా సాగుతున్న సర్కారు బండి, ఎక్కడా అదుపుతప్పి కిందపడకుండా బాబు తన చాతుర్యం, అనుభవాన్ని వినియోగిస్తున్నారు. చంద్రబాబునాయుడు పేరుకు ముఖ్యమంత్రి అన్న మాటేగానీ, సుఖం లేకుండా ఉన్నట్లు రాష్ట్ర పరిస్థితి చూస్తే స్పష్టమవుతోంది. కేంద్రం నుంచి ‘తాను ఆశించిన’ మద్దతు లేకపోయినా భరించి కలసి నడుస్తున్నారు. ఆర్ధికమేలు కోసం అవసరం లేకపోయినా అడిగిన వెంటనే బిజెపికి రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు ఇచ్చారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో ఉన్న జల జగడాలను పరిష్కరించుకోవడంతోపాటు, సంక్షేమం విషయంలో కేసీఆర్ సర్కారు ఇచ్చే వరాలకు కొంచెం అటు ఇటుగా తానూ ఇస్తున్నారు. ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల ఫిట్‌మెంట్ అందుకు ఉదాహరణ. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా, తన సమర్థత, మార్కెటింగ్ మెళకువతో, తన ఇమేజ్‌ను పణంగా పెట్టి నవ్యాంధ్రను..ప్రతికూల పరిస్థితిలో కూడా ప్రగతి పథంలోకి నడిపిస్తున్న బాబు పరిస్థితిని చూస్తే ఎవరైనా మెచ్చుకోక తప్పదు.
chitram...
రాజధాని అమరావతి శంకుస్థాపన దృశ్యం (ఫైల్‌ఫొటో)

- మార్తి సుబ్రహ్మణ్యం