మెయిన్ ఫీచర్

సేంద్రియ ఆహారం.. నేటి ఆరోగ్య మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజి‘బిజీ’ జీవితం.. రోజంతా ఒత్తిళ్ల భారం.. టీవీతోనో, కంప్యూటర్‌తోనో కాలక్షేపం చేస్తూ ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్ర పోవడం.. జీవనశైలిలో అలవాట్ల కారణంగా ఏ వయసువారైనా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి..
ఈ నేపథ్యంలోనే ఇపుడు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అందరిలోనూ ఆరోగ్యం, ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం అవసరమని గుర్తిస్తున్నారు. క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఆహారోత్పత్తుల (ఆర్గానిక్ ఫుడ్)పై దృష్టి సారించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేందుకు చాలామంది సుముఖత చూపుతున్నారు. సహజ సిద్ధంగా పండించిన ఆహారోత్పత్తుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది.
మధుమేహం వ్యాధికి వరిధాన్యం ఎక్కువగా కారణమవుతోందని తెలుసుకుని ఇపుడు రాగులు, జొన్నలు, ఇతర తృణధాన్యాలను వినియోగించుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది. నగరవాసుల్లో చూస్తే ఉదయానే్న నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆరోగ్యం కోసం నడక, వ్యాయామం, జిమ్‌కు వెళ్లడం వంటి ఆరోగ్య సూత్రాలతో పాటు సేంద్రియ ఆహారం తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వ్యాయామం చేసేందుకు అంత సమయం లేకున్నా నడకకు ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. కాఫీ, టీలను వదులుకోలేక పోతున్నప్పటికీ, ఇంటి భోజనం అంటేనే ఎక్కువ మంది సుముఖత చూపుతున్నారు. ఆహారం విషయంలోనే కాదు, తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యమైన ఆహారం కోసం ఖర్చుకు వెనుకాడడం లేదు. సరైన ఆహారం తీసుకుంటే రోగాలకు దూరం కావచ్చన్న అవగాహన పెరగడంతో సేంద్రియ ఆహారోత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించేందుకు నగరాల్లో ప్రత్యేక దుకాణాలు వెలుస్తున్నాయి. కొవ్వు శాతం అధికంగా ఉండే నెయ్యి, నూనెలకు వీలైనంత వరకూ దూరంగా ఉండేందుకు చాలామంది దృష్టి సారిస్తున్నారు. పాడిపశువుల ద్వారా లభించే పాలకన్నా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తయారయ్యే పాలవైపు మొగ్గు చూపుతున్నారు. సోయా బీన్స్, బాదం, కొబ్బరి నుంచి తయారయ్యే పాలలో కొవ్వు తక్కువగా ఉంటోందని మొగ్గు చూపుతున్నారు. జంక్‌ఫుడ్, ప్యాకేజీ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందన్న వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాపండ్లు, కూరగాయలను తీసుకునేందుకు ఎంతోమంది ఇష్టపడుతున్నారు.
30 శాతం వృద్ధి..
సేంద్రియ ఆహారోత్పత్తులను అధికంగా వినియోగిస్తున్న మొదటి పది దేశాల్లో భారత్ కూడా చేరిందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఇపుడు వెయ్యికోట్ల రూపాయల మేరకు సేంద్రియ ఆహారోత్పత్తుల మార్కెట్ విస్తరించింది. గత ఏడాదిలో ఈ తరహా ఆహారోత్పత్తుల విక్రయాల్లో 30 శాతం మేరకు వృద్ధి కనిపిస్తోందని ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేటతెల్లమైంది. 2020 నాటికి సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయాలు 1.36 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. ఆహారం, ఆరోగ్యం పట్ల నగరవాసుల్లో అవగాహన పెరుగుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. పదిహేనేళ్ల క్రితం ఆహారంపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని, ఇటీవలి కాలంలో సేంద్రియ ఆహారోత్పత్తులకు డిమాండ్ పెరిగిందని సర్వేలో తేలింది. వాస్తవానికి ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తుల వినియోగం తక్కువగానే ఉన్నా, భవిష్యత్‌లో అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల శివారు ప్రాంతాల్లో ఇపుడు సేంద్రియ పద్ధతుల్లో ఆహారోత్పత్తులను అధికంగా పండిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘ట్వంటీఫోర్ ఆర్గానిక్’ వంట సంస్థలు ఈ వ్యాపారంలో ఆధిక్యతను చాటుకుంటున్నాయి. లాభాపేక్ష లేకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నాయి. సేంద్రియ ఆహారంతో పాటు అదే పద్ధతిలో తయారుచేసిన మందులను విక్రయించేందుకు నేడు ఆన్‌లైన్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులను విక్రయిస్తున్నందున వినియోగదారుల్లో నమ్మకం పెరిగిందని ‘జోయ్ బై నేచర్ డాట్ కామ్’ అనే ఆన్‌లైన్ సంస్థ చెబుతోంది. సేంద్రియ, సహజ సిద్ధమైన, ఔషధ గుణాలున్న ఆహారోత్పత్తుల పట్ల భారతీయులకు అనాదిగా ఆసక్తి ఉందని విదేశీ సంస్థలు సైతం కితాబిస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన ఆహారోత్పత్తులను వినియోగించడం భారతీయ సంప్రదాయంగా విలసిల్లుతోంది.
అవగాహన పెరిగింది..
సేంద్రియ ఆహారంపై ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అవగాహన పెరగడంతో తమ వ్యాపారం క్రమంగా విస్తరిస్తోందని ‘బిగ్ బాస్కెట్ డాట్ కామ్’ ప్రతినిధులు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలకు డిమాండ్ పెరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. ప్రముఖ సంస్థల ఉత్పత్తుల కంటే సేంద్రియ ఆహారోత్పత్తుల పట్ల వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండించే ఉల్లిపాయలు, టమాటో, బంగాళాదుంపలు, వరి బియ్యం, గోధుమలు, పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది సుముఖత చూపుతున్నారు. దీంతో భవిష్యత్‌లో సేంద్రియ ఆహారంపై మొగ్గు చూపే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకుంటన్నాయి. రోగాల బారినపడుతూ వైద్యం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడంతో ఇపుడు ఎంతోమంది నాణ్యమైన ఆహారంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఒక్కోసారి ఆహారం కోసం కన్నా వైద్యం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్నందున ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది.
ఖర్చు కాస్త ఎక్కువే..
సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేయడం, ఈ తరహా ఆహారోత్పత్తులను కొనుగోలు చేయడం కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఖర్చుకు వెనుకాడని వారు వీటిపై దృష్టిసారిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఆహారోత్పత్తులపై నెలకు నాలుగువేల రూపాయలు ఖర్చవుతుందని, అదే సేంద్రియ ఆహారం విషయంలో అయితే అదనంగా 1200 నుంచి 1400 రూపాయలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే మొత్తం ఆహార పదార్థాల విక్రయాల్లో సేంద్రియ ఆహారం వాటా ఇపుడు దాదాపు ఏడు శాతం ఉంది. సేంద్రియ ఆహారోత్పత్తుల్లో గోధుమ పిండి ధర 20 శాతం మేరకు తక్కువగా ఉంటోందని, పప్పు దినుసులు, తేనె, వేరుశెనగలో ధర ఎక్కువగా ఉంటోందని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రజల్లో సైతం అవగాహన పెరిగితే సేంద్రియ ఆహారానికి మరింత డిమాండ్ పెరుగుతుందని, ఉత్పత్తులు పెరిగినపుడు ధరలు అందుబాటులోకి రావచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండని కూరగాయలు, పండ్లు వంటివి ఎప్పటికప్పుడు అమ్ముడుపోతేనే తాము లాభాలను చవిచూస్తామని ఉత్పత్తిదారులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు సేంద్రియ ఆహారం పట్ల మొగ్గు చూపితే మార్కెట్ విస్తరణకు అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో సేంద్రియ కూరగాయలు, పండ్ల విక్రయాలకు సంబంధించి రాబోయే అయిదేళ్ల కాలంలో 60 శాతానికి మించి పెరుగుదల ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇ-కామర్స్ రంగం నానాటికీ విస్తరిస్తున్నందున సేంద్రియ ఉత్పత్తుల విక్రయాలు మరింతగా ఊపందుకునే అవకాశాలున్నాయి. ‘బిగ్ బాస్కెట్ డాట్ కామ్’ వంటి సంస్థల విక్రయాల్లో కూరగాయలు, పండ్ల వాటా 45 శాతం మేరకు ఉంటోంది. ట్వంటీ ఫోర్ మంత్ర, ప్రో నేచర్, ఆర్గానిక్ తత్త్వ వంటి వెబ్‌సైట్ల ద్వారా జరిగే విక్రయాల్లో పది శాతం మేరకు సేంద్రియ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఆన్‌లైన్ వినియోగదారుల్లో కనీసం అయిదుశాతం మంది సేంద్రియ ఆహారోత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులకే వినియోగదారులు తొలి ప్రాధాన్యం ఇస్తే- రాబోయే అయిదేళ్లలో మొత్తం దేశీయ మార్కెట్‌లో తాము అయిదుశాతం వ్యాపారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ‘బిగ్ బాస్కెట్ డాట్ కామ్’ వంటి సంస్థలు ధీమాగా చెబుతున్నాయి.

-స్వాతి