మెయన్ ఫీచర్

ఫలితాలివ్వని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో ప్రపంచ యుద్ధంతో సామ్రాజ్యవాద ముసుగులో ఉన్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా చితికిపోగా, వీటి దాడికి గురైన జపాన్, అంతర్గత యుద్ధతోపాటు పక్కదేశాలతో యుద్ధాలు చేసి చతికిలబడిన ఈయు, చైనా లాంటి దేశాలను, ఉత్తపుణ్యానికై సామ్రాజ్యవాద దేశాలకు సహకరించి సమిధలైన భారత్ లాంటి దేశాల్ని ఆర్థికంగా ఉద్ధరించడానికంటూ, పుట్టిన విష బీజమే ప్రపంచబ్యాంకు. జూలై 1944లో అమెరికాలోని బ్రెటన్ ఉడ్స్ న్యూహాంప్‌షైర్‌లో జరిగిన సదస్సులో ఊపిరిపోసుకున్న ఈ బ్యాంకు అనేక శాఖల సమూహం. బడుగు దేశాల బాగుకై ఇంటర్‌నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబిఆర్‌డి), దేశాల మధ్య సంబంధాల మెరుగు కోసం ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐడిఎ), ఆర్థిక సహకారం కోసం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సి), పెట్టుబడులకై మల్టీ లేటరల్ ఇనె్వస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ (ఎంఐజిఎ)లుగా అంకురార్పణ జరిగింది.
ఇలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక పునరుద్ధరణ అనే నెపంతో ఏర్పడ్డ ఈ పాపాల పుట్టలోని డబ్బంతా బడుగు దేశా ల ప్రజలను దోచుకున్నదే! పేరుకు ప్రపంచ బ్యాంకే అయినా, ఆజమాయిషి అంతా అంకుల్ శ్యాం దేశానిదే. రుచిమరిగిన మృ గం, వేట మానదన్నట్టుగా 1950-58 మధ్యకాలంలో అభివృద్ధి స్థానంలో వాణిజ్య సూత్రాల్ని చేర్చింది. 1958-68 మధ్యకాలంలో అభివృద్ధి బ్యాంకుగా అవతారమెత్తింది. ఈ కాలంలోనే అప్పుడే కుదుట పడుతున్న మూడో ప్రపంచ దేశాల మధ్య అంతర్గత కలహాలను సృష్టించి, ముఖ్యంగా ఆసియా ఖండంలో పరోక్ష మూడో ప్రపంచ యుద్ధాన్ని జరిపించింది. కమ్యూనిస్టు దేశంగా రూపొందిన దక్షిణ వియత్నాంపై యుద్ధ మేఘాల్ని సృష్టించింది. ఇలా బ్యాంకు ఏర్పాటై రెండు దశాబ్దాలు కావస్తున్నా బడుగు దేశాల ప్రజల స్థితిగతులు మారకపోవడంతో 1968-82 మధ్యకాలంలో పేదరిక నిర్మూలనంటూ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ 20 సూత్రాల ఆర్థిక పథకాలు, గరీబి హఠావో నినాదాలు భారత్‌లో మారుమ్రోగాయి. ప్రభుత్వాల ఉనికికే ప్రమాదమని భావించి దేశంలో ఎమర్జెన్సీని, పాకిస్తాన్‌లో మిలటరీ పాలనకు దోహద పడింది. అమెరికా నేరుగా దక్షిణ వియత్నాంపై దశాబ్దం పాటు యుద్ధాన్ని జరిపి మూడు మిలియన్ల ప్రజల్ని బాంబులతో చంపింది. ఏ లక్ష్యం తో బ్యాంకు ఏర్పాటైందో, ఆ లక్ష్యం నెరవేరకపోగా, అమెరికా ఆయుధాల్ని తయారు చేసి యుద్ధాల్ని చేయిస్తూ, స్వయంగా చేస్తూ దర్జాగా బతకవచ్చు అనే అమెరకా దమననీతి లక్ష్యం మాత్రం నెరవేరింది. చివరికి 1982-94 మధ్యన వివిధ ఆర్థిక సంస్థ ల్ని హస్తగతం చేసుకుంటూ, 1991 నుంచే ప్రపంచానే్న ఒక కుగ్రామంగా మార్చివేసే ప్రపంచీకరణకు, నాందీ ప్రస్తావన గావించి వస్తు, వ్యాపార, సాంస్కృతిక దోపిడీకి దేశా ల సరిహద్దుల్ని చెరిపివేసింది. ఈవిధంగా 1998 నాటికే 167 రకాల రుణాల రూపం లో 23.5 బిలియన్ల డాలర్లను అప్పుగా భారత్‌కు వివిధ సందర్భాల్లో ఇవ్వడం జరిగింది.
1990లో చైనా జిడిపి 359 బిలియన్ డాలర్లు కాగా, భారత్ జిడిపి 327 బిలియన్ డాలర్లుగా (90%)గా ఉండేది. 2005 నాటికిచైనా 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందంటే భారత్ 834 బిలియన్ డాలర్ల (36.8%)కు, 2016 నాటికి చైనా జిడిపి 10.3 ట్రిలియన్ డాలర్లకు ఎదగగా, భారత్ 2.05 ట్రిలియన్ డాలర్ల (19.8%) దగ్గర ఆగిపోయింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు చెబుతున్న లెక్కలే. దాదాపు ఓ సంవత్సరం తేడాతో స్వాతంత్య్రాన్ని, విముక్తిని పొందిన ఇరు దేశాలు, భిన్న ఆర్థికాభివృద్ధిని ఎందు కు కలిగివున్నాయో మన పాలకులకు పట్టడం లేదు. పైగా ఈరోజు చైనా మొత్తం సామ్రాజ్యవాద దేశాలకు కంటిలో నలుసుగా మారితే, భారత్ ఈ దేశాల చేతులు పట్టుకోవాల్సి రావడం, అణు పదార్ధాల సరఫరా దేశాల (48 దేశాలు) సరసన చేరాలని, మద్దతు కావాలని అడగడం, చైనా దీనికి అడ్డుకట్ట వేయాలని చూడటం తెలిసిందే.
ఏ దేశ వ్యక్తిత్వమైనా దాని ఆర్థిక పునాదిపై, మానవ వనరుల వినియోగంపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే 1990 కాలంలో ఎగుమతి, దిగుమతులపై జిడిపిలో భారత్ 15.2 శాతం వెచ్చించగా, 2014 నాటికి ఇది 48.7 శాతానికి పెరగడం గమనించాలి. ఇదేకాలంలో చైనా 29.6 శాతం నుంచి 41.5 శాతానికి పరిమితమైంది. అమెరికా 19.8 శాతం నుంచి 30 శాతానికి మించలేదు. మన ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం, వీటి వెనుక అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు అనేక సందర్భాల్లో చర్చించినవే. నాడు డాలరుతో రూపాయి మారకం విలువ 25.72 రూపాయలు కాగా, నేడు రూ.67 కు చేరడం గమనార్హం. అంటే, ఈ దేశంలో ఉత్పత్తే జరగడం లేదు. ప్రజలు తేరగా సోమరిపోతుల్లా తింటూ కూర్చుంటున్నారన్నమాట. నాడు 14.62పైసలుగా ఉన్న పెట్రోలు రూ.67కు చేరడాన్ని బట్టి ఆర్థిక మాంద్యం ఎలా పెరిగిందో తెలుస్తున్నది. పోనీ ఇదే తీరున కొనుగోలు శక్తి పెరిగిందా అంటే, కేంద్రం స్థాయిలోని ఉపాథి హామీ పథకం, రాష్ట్రాల స్థాయిలోని ఉచితాలే ఇందుకు నిదర్శనం కావా? ఈసారి బడ్జెట్‌లో 19 శాతాన్ని (రూ.5లక్షల కోట్లు) వడ్డీగా చేస్తున్న అప్పులకే చెల్లించాల్సి ఉంటుంది.
వర్ధమాన దేశాలు ఆర్థికంగా చితికి పోయే ఎత్తుగడల్ని వేస్తూ, అవి ప్రపంచ బ్యాంకు ముందు చిప్ప పట్టుకునేలా చేయడం ఆదినుంచి జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లోనే పివి నరసింహారావు, దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించడానికి 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో, 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో తనఖా పెట్టారు. అత్యంత ప్రాధాన్యమైన 47 రంగాల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు కల్పించే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపిబి)ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఈ చర్యల్ని నిరసించింది. తర్వాత వచ్చిన వాజ్‌పేయి వీటిని నిలువరించకపోగా, ఔషధ తయారీ, ఫార్మా, పర్యాటక, తదితర రంగాలకు విస్తరింపజేశారు. చివరికి మారిషస్, సింగపూర్ లాంటి చిన్న దేశాలు 35.17 శాతం పెట్టుబడుల్ని పెట్టి మన సొమ్ముల్ని కొల్లగొట్టడం ప్రారంభించాయి.
తిరిగి యూపీఏ హయాంలో ఆహార ఉత్పత్తుల డిఫెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని బిజెపి వ్యతిరేకించింది. కానీ మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతా స్వదేశీ అనుకుంటే, అంతా తారుమారైంది. మేడ్ ఇన్ ఇండియా స్థానంలో మేక్ ఇన్ ఇండియా అనే నినాదం వచ్చి చేరింది. ప్రభుత్వం తక్కువ స్థాయిలో, సుపరిపాలన ఎక్కువ స్థాయిలో వుంటుందంటే, ప్రభుత్వ స్థాయి ఖర్చులు తగ్గి ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనుకున్నాం. కాని మాటలకు, చేతలకు గత యుపిఎ ప్రభుత్వానికి భిన్నంగా పాలించకపోగా, ఆహార, రక్షణ, ఫార్మా, విమానయాన రంగాల్లో వందశాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అమరావతినివ్వడం ఎలాంటి అభివృద్ధో తెలుస్తున్నది. ఇలా అంతర్గత విషయాల్లో, రక్షణ విషయాల్లో విదేశీ హస్తాలు చేరి ఎవరి పీక నొక్కుతారో అందరికి అనుభవంలో వున్నదే. అమెరికాను నిలదీసే చావెజ్‌లు కాకున్నా, స్వయంగా బతకాలనే ఆలోచన లేని నాయకులు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో తెలియడం లేదు.
పరాధీనంలో భారత్ అన్న తరిమెల నాగిరెడ్డి మాటలు నేడు అక్షరసత్యాలుగా మారుతున్నాయి. నాయకులు వారు, వీరు అనే తేడా లేకుండా ఆచరించి, పోటీపడి చూపడం, దేశ అస్థిరతకే కాని, అభివృద్ధికి కాదు. ఏ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 1993 నవంబర్ 1న యూరోపియన్ యూనియన్ 28 దేశాలతో ఏర్పడిందో ఆ అభివృద్ధి జరగకపోగా, ఆర్థికంగా చితికిపోయామని భావించిన బ్రిటన్ ప్రజలు ఆ యూనియన్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేయడంతో, కామరూన్ ప్రభుత్వం ఈనెల 23న రెఫరెండం జరపడం తెలిసిందే. ఇందులో ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడానికి అనుకూలంగా తమ ఓటు వేశారు. దేశ రక్షణ, ఉనికికి, వ్యక్తిగత ఆహారపు అలవాట్లకు సంబంధించిన అంశాల్లో విదేశీయులు చొరబడితే ఎలా ఉంటుందో మన పాలకులు ప్రభుత్వ అభిప్రాయాన్ని సేకరించలేక పోగా తాము చేపడుతున్న సంస్కరణలు విప్లవాత్మకమని భావించడం ప్రజావ్యతిరేక చర్యలే అవుతాయి.
స్విడ్జర్లాండ్ పర్యటన సందర్భంగా జెనివాలో మోదీ మాట్లాడుతూ భారత్‌లో 35 సంవత్సరాలలోపు వయస్సుగలవారు, 85 కోట్ల మంది ఉన్నారని, వీరు దేశంలో బలమైన శ్రామిక శక్తి అని, పెట్టుబడులు పెట్టి వీరి శ్రమను వినియోగించుకోవాలని కోరడాన్ని బట్టి, మన నాయకుల అంతరంగమేంటో తెలుస్తున్నది. పుష్కలమైన సహజ, అడవి, జల, ఖనిజ వనరులున్న ఈ దేశంలో ఈ యువశక్తిని, మేధాశక్తితో జో డించి ఉపయోగించుకునే ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి, ఇతర దేశాలకు అప్పజెప్పాలనుకోవడంలోనే మనవారి బానిస మనస్తత్వం బహిర్గతమై ఉన్నది. ఇప్పటికైనా మన కాళ్లమీద మనం నిలబడే ప్రయత్నం చేయకపోతే మరో వంద సంవత్సరాలకు కూడా మనం ఆర్థికంగా నిలదొక్కుకోమని గ్రహిస్తే మంచిది. కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, అభివృద్ధి సూచికలు కావని, ఉత్పత్తితో సంబంధముండే కోళ్ల పెంపకం మేలన్న బిల్‌గేట్ మాటలు మనవారి చెవికెక్కితే బాగుండేది.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162