ఉత్తరాయణం

సరైన పద్ధతి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశానికి వంద దేశాలు సభ్యత్వం ఇవ్వాలని తమ అభిప్రాయం తెలిపితే ఒక్క దేశం వ్యతిరేకించిందని సభ్యత్వాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదు. చట్టాన్ని అప్పుడు ఏ సందర్భంలో చేశారో దాన్ని పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు చైనా ధర్మ సూత్రాలు చెబుతున్నది. 1962లో భారత్‌పై ఏ ప్రాతిపదికపై యుద్ధం ప్రకటించిందో చెప్పాలి. దేశంలోని చాలా భాగం ఆక్రమించుకుంది. ఇది ఏ పద్ధతి? ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వాన్నివ్వడం తనను రెచ్చగొట్టే చర్యనేనని పాక్ ప్రకటించడం దుందుడుకు చర్య మాత్రమే. అణు లక్ష్యాలను సంపాదించుకోవాలన్న పట్టుదల విడనాడాలని భారత్‌కు సూచించడం దాని తెంపరితనానికి నిదర్శనం.
-అందా వెంకటసుబ్బన్న, మైదుకూరు
వసతులు లేని అలంపురం
సుప్రసిద్ధ శక్తిపీఠం, జోగులాంబ కొలువై ఉన్న మహిమాన్విత క్షేత్రం అలంపురం. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం సందర్శనార్థం నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. అయినా ఈ క్షేత్రంలో సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నుండి ఆలయానికి ఉన్న రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఆర్టీసీ బస్సులు ఒకటీ అరా వస్తుండటంతో ప్రధానంగా ప్రైవేటు జీపులను ఆశ్రయించక తప్పడంలేదు. అలంపురంలో భక్తులకు వసతి సదుపాయాలు అస్సలు లేవు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ పశువులు తిరుగుతూ భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. తాగునీరు, ఆరోగ్యకరమైన భోజనం, విడిది, వైద్య సదుపాయాలు లేవు. అమ్మవారి గుడితోపాటు సంగమేశ్వర క్షేత్రం, నవబ్రహ్మ ఆలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తుల పాట్లు చెప్పనలవి కాదు. అతిప్రాచీనమైన, అద్భుతమైన కళా సంపదను, స్వంతం చేసుకున్న ఈ ఆలయాలను తక్షణం పునరుద్ధరించడంతో పాటు వౌలిక సదుపాయాలను కూడా సత్వరం అభివృద్ధి చేస్తే పర్యాటక పరంగా మంచి అభివృద్ధి చెందుతుంది.
- సి.హెచ్. సాయిఋత్విక్, నల్గొండ
వసూలుకాని ఆదాయపు పన్ను
మహారాష్టక్రు చెందిన ఒక గుర్రపు పందేల నిర్వాహకుడు ముప్పయి రెండువేల కోట్ల ఆదాయపు పన్ను బాకీ పడినట్లు వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. దీనిపై విచారణ జరిగి చాలాకాలమైంది. కానీ ఈ మొత్తం వసూలైన దాఖలాలు లేవు. ఇంత అసాధారణమైన మొత్తం బాకీని వసూలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందో మరి. ఒకవేళ కోర్టు స్టే ఇచ్చిందని అనుకున్నా ఎంతోకొంత ముందస్తుగా చెల్లిస్తే తప్ప స్టే ఇచ్చే వీలు ఉండదు కదా. కాబట్టి ‘రాజకీయ మతశక్తులు అతడిని కాపాడుతున్నాయి’ అని చెప్పక తప్పదు.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్
అంత కోపం అవసరమా?
తనను ‘డియర్’ అని బిహార్ మంత్రి ఒకరు సంబోధించడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంత తీవ్రంగా స్పందించడం సముచితం కాదేమో. ఎందుకంటే సోదరి భావంతో సదరు మంత్రి అశోక్ సంబోధించి ఉండవచ్చు కదా. తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, సోదరిని ప్రేమిస్తాం, చివరకు భగవంతుడిని కూడా ప్రేమిస్తాం. కావున స్మృతి ఇరానీ పెద్దమనసుతో వ్యవహరించడం సముచితం.
- పెండెం శ్రీధర్, సిద్దిపేట
అక్షర యోధునికి అందిన సాయం
అక్షరయోధుని (కంచర్లవారు) అంతరంగ మధనాన్ని సంపాదకులు చక్రాయుధంతో(చక్రధర్ వ్యాసం) ‘్భమిక’ ద్వారా వెలుగులోకి తెచ్చిన కృషి శ్లాఘనీయం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సత్వరం స్పందించి కంచర్లవారికి ఆర్థిక సహాయం అందించడం నాడు రామలక్ష్మణులు, కంచర్ల గోపన్నను ఆదుకున్న సంఘటనను జ్ఞప్తికి తెచ్చింది. మరో యాదృచ్ఛికం, కంచర్ల వారిరువురూ కారాగార శిక్ష అనుభవించినవారే. మీరు చక్రధర్ వ్యాసాన్ని ప్రచురించిన వెంటనే కెసిఆర్ స్పందించి ఆదుకున్న తీరు హర్షణీయం. ప్రతిస్పందనగా గజేంద్ర మోక్షంలోని పద్యంతో మన ముఖ్యమంత్రిని శ్లాఘించడం అభినందనీయం.
- జీడిగుంట చలపతిరావు, హైదరాబాద్
ఇదెక్కడి న్యాయం?
ఇటీవల ఉడ్తా పంజాబ్ అనే హిందీ చిత్రానికి సెన్సారు వారు కోతలు విధించారు. ఇది కొంత అన్యాయంగానే ఉంది అన్న సంగతిని అలా ఉంచుదాం. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అన్యాయం జరిగిందనుకుంటే సరిదిద్దడానికి మార్గాలుంటాయి. అప్పిలేట్ వ్యవస్థో, కోర్టులో ఏవో ఒకటి న్యాయం అందిస్తాయి. పై సినిమా విషయంలో అప్పీలుకు గాని, కోర్టుకు గానీ వెళ్లక ముందే ఇంగ్లీషు వార్తా ఛానళ్లు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. మోదీని కూడా తిట్టారు. దేశంలో ఏ మూలనైనా ఒక పెన్సిల్ కిందపడితే దానికీ మోదీయే బాధ్యుడని అరిచే ప్రబుద్ధులు, దీనికీ మోదీయే కారణమని తిట్టారు. సినిమా నిర్మాత, మనదేశం ఉత్తర కొరియా అయిపోయిందంటూ గుండెలు బాదుకున్నాడు. కోర్టు తీర్పు వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ తన కర్తవ్యాన్ని నిర్వహించింది. ఇంత సజావుగా సాగిపోయే వ్యవస్థలున్న మనదేశంలో, ఈ పెద్దమనుషులు ఇంత అసహనంగా, దౌర్జన్యంగా, నీచంగా నోరు పారేసుకోవడం ఎంతవరకు న్యాయం?
- సి. మనస్విని, విజయవాడ