మెయన్ ఫీచర్

మనం ఎవరం? ఎందుకిలా అయ్యాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆర్యసమాజ్ పరోపకారిణి సభ వార్షిక ఋషి మేళాలో శనివారం (21 నవంబర్, 2015న) చేసిన ప్రసంగం
====================
పరమపూజ్య మహర్షి దయానంద సరస్వతిజీ సంస్థాపించిన సుప్రసిద్ధ పరోపకారిణి సభ వారి ప్రతిష్ఠాత్మక ఋషిమేళా వార్షిక కార్యక్రమంలో పాల్గొనగలగటం నా అదృష్టం. ఆ మహర్షి నడయాడిన ఈ పుణ్యస్థలిని దర్శించగలగటమేగాక వైదికధర్మ పునరుత్థానానికి నిబద్ధులైన ఇందరు ఆర్య సోదరీ సోదరులను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడగలగటం అరుదైన గౌరవం.
ఋషి దయానంద్ జీ నుంచి నేరుగా ప్రేరణ పొంది, ఆయన అడుగుజాడల్లో ఆర్య సమాజ్‌ని, హైందవ జాతిని, సంస్కరణ మార్గంలో నడిపించి, దేశమాత సేవలో పునీతం కావించిన మహాత్మా శ్రద్ధానంద్‌జీ జీవిత విశేషాలతో నేను తెలుగులో రచించిన ‘‘అసలు మహాత్ముడు’’ గ్రంథాన్ని ఇదే వేదికమీద ఆవిష్కరించినందుకు నాకు ఆనందంగా ఉంది.
‘మహాత్మా’ బిరుదును ఎవరూ ఇవ్వకపోయినా తగిలించుకున్న వారు ఆధునిక చరిత్రలో ఎంతో మంది ఉండవచ్చు. కానీ ఆ పేరుకు అన్ని విధాల తగినవాడు, అఖిల ఆర్యావర్తం గర్వించదగినవాడు, యావద్భారత జాతికి ప్రాతః స్మరణీయుడు స్వామి శ్రద్ధానంద. తాను దక్షిణాఫ్రికాలో ఉంటున్న కాలంలోనే గాంధీజీ శ్రద్దానంద్‌జీని ‘‘మహాత్మా’’ అని వినమ్రంగా సంబోధించారు. స్వాతంత్య్రమనబడేది వచ్చాక, భారత చరిత్రకు పథకం ప్రకారం జరిగిన వక్రీకరణలూ వెల్లవేతల మూలంగా అంతటి మహావ్యక్తి ఒకరు జాతీయ జీవిత రంగంలో మహా సంచలనంలా నడయాడాడన్న సంగతే నేటి తరానికి తెలియకుండా పోయింది. ఈనాడు మనలను చుట్టుముట్టి, ఆర్య జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న వివిధానేక సమస్యలను, సవాళ్లను అర్థం చేసుకోవడానికీ, సమర్థంగా ఎదుర్కోవడానికి స్వామీ శ్రద్ధానంద్‌జీ జీవిత సందేశం చాలా ఉపకరిస్తుంది. ఆ ఉద్దేశంతోనే మరుగున పడిన ఆ మహనీయుడి ఉజ్వల చరిత్రకు నాకున్న పరిమితుల్లో అక్షర రూపం ఇచ్చేందుకు నేను ప్రయత్నం చేశాను.
మన దేశ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? టీవీల్లో క్రికెట్ మ్యాచ్‌లనూ, పత్రికల్లో క్రైమ్ న్యూస్‌నూ ఆసక్తిగా చూస్తూ సినిమాలూ, ఫాషన్లూ, స్పెషల్ ఆఫర్ల గురించి మాట్లాడుకునే వారికి ఆందోళనపడవలసింది ఏమీ కనిపించకపోవచ్చు. వారు ఏ పార్టీని అభిమానించేవారు అన్నదానిని బట్టి కొందరికి దేశం అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్టూ, మరికొందరికి అన్ని రంగాల్లో అధ్వాన్నమైనట్టూ అనిపించవచ్చు. రాజకీయ రాగద్వేషాలను, వ్యక్తిగత ఇష్టానిష్టాలను పక్కనపెట్టి, విశాల దృష్టితో అవలోకిస్తే మాత్రం నేటి భారతదేశ స్థితిగతులు, సామాజిక పోకడలు, మనవారి ఆలోచనా ధోరణులు ప్రతి దేశభక్తుడికీ తీవ్ర వ్యాకులత కలిగిస్తున్నాయి.
ఉన్నమాట చెప్పాలంటే ఇవాళ మనమందరం భ్రమల్లో బతుకుతున్నాం. అనవసరపు విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. మన అధోగతికి కారణమైన అసలైన వికృతులవైపు తొంగి చూడటానికే భయపడుతున్నాం. మనమెవరం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎలాంటి సంస్కృతికి, ఎటువంటి విజ్ఞానానికి వారసులం? వాటికి దూరమై ఎందుకిలా తయారయ్యాం? అని ఆలోచించడానికే వెనకాడుతున్నాం. ఈ ప్రశ్నలకు జవాబులు తెలిసిన వాళ్లం కూడా నేటి దుస్థితిని దాటి, మన జాతి పునర్వైభవాన్ని ఎలా సాధించాలి అన్న విషయంలో గుంజాటన పడుతున్నాం. రకరకాల సందేహాలతో, సంకోచాలతో సతమతమవుతున్నాం. దృఢంగా, సమైక్యంగా, సంపూర్ణ విశ్వాసంతో ముందుకు అడుగు వేయలేకపోతున్నాం.
ఏమిటి కారణం? ఎక్కడుంది లోపం?
మొత్తం భారత జాతి ఇవాళ ఒక విమూఢ, అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీని వెనక చాలామంది గ్రహించని, లేక సరిగా పోల్చుకోలేని పెద్దకుట్ర ఉన్నది. ఇది ఈనాటిది కాదు. ఇంగ్లిషువాళ్లు ఏ దుర్ముహూర్తాన మన పుణ్యభూమిలో అడుగుపెట్టి, కుట్రలూ కూహకాలతో మెల్లిమెల్లిగా దేశాన్ని ఆక్రమించారో - అప్పటినుంచే మనమీద అబద్ధాల దండయాత్ర మొదలైంది.
ఒకప్పుడు యావత్ప్రపంచంలో జేగీయమానంగా వెలుగొందింది ఒకే ఒక ఆర్యజాతి. దేశదేశాల్లో ఖండఖండాంతరాల్లో విలసిల్లింది ఒకే ఒక ఆర్యనాగరికత. అలనాడు భూమండలం సమస్తం ఆర్యావర్తమే. ఇందుకు రుజువుల కోసం ఏ గ్రంథాలనూ తిరగేయనక్కర్లేదు. ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు. ఆసియా నుంచి యూరప్ దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా అనేక ఖండాల్లో... కాలక్రమాన క్రైస్తవానికో, ఇస్లాంకో, మరో మతానికో, ‘ఇజా’నికో లొంగిపోయిన మలేషియా, ఇండోనేసియా, కంబోడియా, వియత్నాం, లావోస్, చైనా, జపాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, రష్యా, ఇటలీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో తవ్వకాల్లో బయల్పడిన శిల్పాలను, కట్టడాలను ఒక్కసారి గమనిస్తే చాలు. అంతటా విలసిల్లినది ఆర్య నాగరికతే కాకపోతే ఆ నాగరికతకు ఆనవాళ్లయిన హవనకుండాలు, యజ్ఞశాలలు, వైదిక పూజా సామగ్రి అనేకానేక దేవతామూర్తులు, అసంఖ్యాక దేవాలయాలు, అతిప్రాచీన కట్టడాలు ఆయా దేశాల్లో ఇటీవలి దశాబ్దాల్లో ఎలా బయటపడ్డాయి?
విశ్వమంతటా విస్తరించిన ఆర్య నాగరికత క్రైస్తవ, మహమ్మదీయ మతాలు పుట్టుకొచ్చాక అనేక దేశాల్లో దారుణమైన దాడికి గురైంది. భయంకరమైన విధ్వంసాల మూలంగా, లక్షల కోట్ల సంఖ్యలో సామాన్య ప్రజల ఊచకోతల కారణంగా అనేక దేశాల్లో నిలవనీడ లేకుండా కనుమరుగైంది. దాని ఉనికి భారత ఉపఖండంలోనే మిగిలింది. ఆ స్థితిలో దేశాన్ని కబళించిన ఇంగ్లిషు వారు మనల్ని మన మూలాల నుంచి వేరు చేయడం కోసం పథకం ప్రకారం కుట్ర పన్నారు.
ఆర్యులు బయటివారని, ఇంగ్లీషువాళ్లలాగే వేరేదేశంనుంచి వచ్చి మన దేశంమీద దాడిచేసి, ఇక్కడి ఆదివాసి ద్రావిడ నాగరికతను నాశనంచేసి, దేశాన్ని ఆక్రమించారని ఆంగ్లేయులు తప్పుడు సిద్ధాంతం లేవదీశారు. మాక్స్‌ముల్లర్‌లాంటి మాయదారి క్రైస్తవ మిషనరీలు బ్రిటిషు సామ్రాజ్యవాద ప్రయోజనాలకు తగ్గట్టు తిమ్మిని బమ్మిగా చూపెట్టి కల్లబొల్లి చరిత్రలు సృష్టించారు. ఆ పచ్చి అబద్ధాలను పాఠ్యపుస్తకాలకెక్కించి మెకాలే విద్యావిధానంలో విద్యార్థుల బుర్రలు ఖరాబుచేసిన కారణంగా కొన్ని తరాలు గడిచేసరికి అవే అక్షరసత్యాలైనట్టు మన విద్యావంతుల మనసుల్లో ముద్రపడిపోయింది.
దానివల్ల ఎంత అనర్థం జరిగిందో నేను మీకు చెప్పక్కర్లేదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన, మొత్తం మానవాళికి విద్య, విజ్ఞానం ప్రసాదించిన వైదిక ఆర్య సంస్కృతికి వారసులమైనందుకు గర్వించవలసిందిపోయి సిగ్గుపడే దౌర్భాగ్య పరిస్థితిని మెకాలే మార్కు ఇంగ్లీషు చదువులు తెచ్చిపెట్టాయి. మనకు తెలిసిన పదివేల సంవత్సరాల భారత చరిత్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఆర్య వారసత్వబంధం ఇంగ్లిషువారి అబద్ధాల మాయాజాలం మూలంగా బలహీనపడింది. విజ్ఞానఖనులైన తమ పూర్వులను అనాగరికులుగా, మూర్ఖులుగా భావించి తెల్లవారు వచ్చాకే మనకు విద్య, వైజ్ఞానిక సంస్కారం అబ్బాయన్న బానిస మనస్తత్వం చదువుకున్న వారిలో గూడు కట్టింది.
పోనీ- ఇంగ్లిషువారు జండా పీక్కొనిపోయి, దేశానికి స్వాతంత్య్రమనబడేది వచ్చాకైనా ఈ దురవస్థ పోయిం దా?తమ చరిత్రను, సాంస్కృతిక మూలాలను, ప్రాచీన వారసత్వాన్ని వెతికి పట్టుకుని, నిజమైన జాతీయ పునరుజ్జీవనం సాధించేందుకు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాల్లోవలె హిందుస్తాన్‌లో కనీసం ప్రయత్నమైనా జరిగిందా? లేదు. ఇంగ్లిషు బడిలో బుద్ధిశుద్ధి జరిగిన మెకాలే మానసపుత్రులే స్వతంత్ర భారతానికీ భాగ్యవిధాతలయ్యారు. గతమంతా అంధకారబంధురమైనట్టూ, అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకు నెలవైనట్టూ, ఇంగ్లిషువారి దయవల్ల విద్యావంతులైన తమవంటివారు పాశ్చాత్య నాగరికత ప్రభావంతో నడిపిన జాతీయోద్యమంవల్లే స్వాతంత్య్రం వచ్చినట్టూ వారు నిజంగానే నమ్మారు. తమకు స్ఫూర్తినిచ్చిన ఆంగ్లేయులు వదిలివెళ్లిన వారసత్వానే్న వారు నిష్ఠగా కొనసాగించారు.
కఠోర వాస్తవం ఏమిటంటే మనకు అసలైన స్వాతంత్య్రం ఇప్పటికీ రాలేదు. 1947 ఆగస్టు 15న జరిగింది అధికారం మార్పిడి మాత్రమే. బ్రిటిషువారినుంచి వారి అభిమానుల చేతిలోకి రాజ్యాధికారం మారింది. తమ సామ్రాజ్య అవసరాల నిమిత్తం తెల్లవారు తెచ్చి రుద్దిన వంకర విద్యావిధానమే అష్టవంకరలతో ఈనాటికీ కొనసాగుతున్నది. బిటిషువారు మనలని అణగదొక్కడానికి పెట్టిన ఇండియన్ పీనల్‌కోడే, వారు తెచ్చిన పోలీసు చట్టమే, ఎవిడెన్సు యాక్టుల్లాంటి కాలం చెల్లిన శాసనాలే నేటికీ కొనసాగుతున్నాయి. భారతదేశ వైజ్ఞానిక ఘనతను, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మొత్తం ప్రపంచం గుర్తించినా బుద్ధిలేని మన బుద్ధిజీవులకు మాత్రం వాటిని అంగీకరించటానికి మనసొప్పటం లేదు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం (Aryan Invasion Theory) శుద్ధ తప్పు; ఆర్యులు ఎక్కడినుంచో ఇక్కడికి రావటం కాదు; ఇక్కడినుంచే ప్రపంచమంతటికీ విస్తరించారు; వైదిక సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు- అని ఇవాళ సమస్త భూమండలం గుర్తించినా మనం మాత్రం ఆర్యుల దండయాత్ర గురించే ఇంకా పాఠాల్లో బోధిస్తున్నాం.
కొంతకాలం కింద 2వేల సంవత్సరాల పూర్వపు చక్రవర్తి సమాధి చైనాలో బయటపడింది. 1400 ఏళ్ల కిందటి విష్ణు విగ్రహం రష్యాలో దొరికింది. తమ పూర్వచరిత్రకు సంబంధించి గొప్ప ఆధారాలు లభించాయని, ఆ రెండు దేశాల వారు మురిసిపోయారు.
మరి మన దేశంలోనో? శ్రీకృష్ణ భగవానుడి ద్వారకానగరం సరిగ్గా పురాణాలు వర్ణించిన రీతిలోనే సముద్రగర్భంలో బయటపడినా... శ్రీరామచంద్రుడు నిర్మించిన సేతువును యథాతధంగా అమెరికన్ ‘నాసా’ కనుగొన్నప్పటికీ జాతీయ వీరులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కనీసం చారిత్రక వ్యక్తులని అంగీకరించటానికే మన చరిత్ర విదాతలకు మనసొప్పదు. మన జాతికి గర్వించదగిన ఘనచరిత్ర ఉందని ఒప్పుకోడానికి మనవాళ్లే ససేమిరా ఇష్టపడరు.
సీతామాత రామచంద్రుడిని ‘ఆర్యపుత్రా’ అని పిలిచినట్టే రావణాసురుడిని మండోదరికూడా ‘ఆర్యపుత్రా’ అనే పిలిచింది. అయినా శ్రీరాముడు ఆర్యుడు; రావణుడు ద్రావిడుడు; ద్రావిడులకు ఆర్యులు శత్రువులు అని మొండిగా వాదించే మూర్ఖులే ఇవాళ మహామేధావులుగా చలామణి అవుతున్నారు. శత సహస్రాబ్దాల చరిత్రగల అఖండ వైదిక సంస్కృతి గురించి, ఆర్యావర్త చరిత్ర గురించి తమతమ మిడిమిడి జ్ఞానంతో తీర్పులు చెబుతున్నారు. చరిత్ర గ్రంథాలు రాసేది, పాఠాలు బోధించేది ఇలాంటి వారే కాబట్టి ఇలాంటి సాంస్కృతిక దుష్ప్రచార కాలుష్యాల మూలంగా తమ జాతి పూర్వ ఔన్నత్యం, దాని పూర్వీకుల గొప్పతనం, వేద వేదాంగాల వైశిష్ట్యం, గర్వించదగ్గ ఆర్యవారసత్వం ఈ కాలపు వారికి తెలియకుండా పోయాయి.
(మిగతా రేపు)

-ఎం.వి.ఆర్. శాస్త్రి