మెయిన్ ఫీచర్

పవిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రతలేని భక్తి ఉండదు- ‘భక్తి’ లేక పవిత్రత సిద్ధించదు. ఈ రెండూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయమైన చర్యలు. వీటిలోని అంతర్భావన అంత సులభగ్రాహ్యం కాదు. అయినా సరే ఈ రెంటినీ గుర్తించి గౌరవించే మానవుల జీవితమే ధన్యవౌతుంది! పరమేశ్వరుడు మన మానవ శరీరాన్ని చాలా గొప్పగా నిర్మించాడు. సర్వజీవులూ సమానమే అని భావించినా- మానవ శరీర నిర్మాణంలో నున్నంత విలక్షణ లక్షణం మరే ఇతర ప్రాణికోటిలోనూ మనకు కన్పడదు. అదే మానవ జన్మలోని అత్యుత్తమ విశిష్టత! సుఖం- సంతోషం- బాధ- ఆనందం అనే అనుభవానుభూతులతో పాటుగా పరమోత్కృష్టమైన జ్ఞానేంద్రియాల- కర్మేంద్రియాలు మానవులకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చాడు ఆ ఈశ్వరుడు. వాటిని పవిత్రంగా భావించి అతి పవిత్రంగా కాపాడుకుంటూ అందుకు తగిన కృతజ్ఞతాభివందనాలను భగవంతునికి భక్తిగా సమర్పించుకోవడం మన అందరి కనీస బాధ్యత! మరి ఆ గురుతర బాధ్యతను మనలో ఎంతమంది సక్రమంగా స్వీకరించగలుగుతున్నారు? కాలం అందరికీ సరిసమానమే అయినా- దాని సద్వినియోగంలో కొరవడిన క్రమశిక్షణ కారణం- ఏవేవో వందారు కుంటిసాకులు చెప్పి- భగవంతునికి ప్రతిరోజూ కనీసం ఓ అరగంట కాలాన్ని భక్తిగా- శ్రద్ధగా కేటాయించే వారెంతమంది? మనసే మందిరమనుకొని అందులో సకారాత్మకంగా భగవంతుని ప్రతిష్టించుకుని ప్రార్థన చేయడం, ఆ విధంగా సృష్టి మొత్తంలో సమున్నతంగా మానవ జన్మ కలిగినందుకు కృతజ్ఞతలు తెలియచేయడం సదా, సర్వదా శ్రేయోదాయకం! పవిత్రమైన మనస్సుతో సామాజిక శ్రేయస్సు కోరే వ్యక్తిగా విరాజిల్లడం ఉత్తమోత్తముల లక్షణం! గీతాచార్యుడు కూడా ‘‘సత్కర్మలను ప్రోత్సహించే సత్పురుషుల వెంటనే తానుంటానని’’ బోధించాడు. నిజానికి సత్కర్మల నాచరించేవారికి, అనుసరించేవారికి అపజయమనే మాటే ఉండదు. లోకోపయుక్తుడైన అటువంటి మానవుడే విజేత కాగలడు. ఇదిలా వుండగా కొందరిలో ‘భక్తి’ కొంగ జపంలా పరిణమించడం, ఇంకొంతమంది మూఢాచారాల ముసుగులో మూఢభక్తులై మూర్ఖ శిఖామణులై ప్రవర్తించడం మన దైనందిన జీవితంలో సర్వత్రా కన్పిస్తుంటుంది. చిత్తశుద్ధి లేని అటువంటి దొంగ భక్తి వలన ప్రయోజనమేమీ ఉండదు. దానికన్న దేవుడు లేడనే నాస్తికవాదమే నయం. నిప్పున్నకర్ర తానే కాలి బూడిదయినట్టు ఎవరి నాస్తికత వారినే శాసిస్తుంది. ఎవరి మూర్ఖపుటాలోచన వారినే శిక్షిస్తుంది. భగవంతుని ప్రేరణ లేకుండా ఏదీ జరుగదు కనుక తద్వారా తన మహిమ మరింత ద్విగుణీకృతమై తేజరిల్లుతుంది. దేవుని విశ్వంభర సృష్టిలో సర్వులూ సమమే కాబట్టి- మాయలో పడే మనస్సును ఇంద్రియ ప్రలోభం నుండి పరిరక్షించుకుని ఈశ్వర భక్తిలో నిత్యం నిమగ్నం కావడం అత్యుత్తమం. ఈ కర్మాచరణలో మనకు మనసు ఎంత పవిత్ర వౌతుందో- అంతగా మనిషి తనలోని దైవాన్ని దర్శించగలుగుతాడు.
వాస్తవాన్ని గ్రహిస్తే ఈశ్వరుడు ప్రతి మనిషిలోనూ అపరిచితుడై చరిస్తున్నాడు. కర్త-కర్మ-క్రియ మూడింటికీ మూలమతడే. కానీ ఆ ఎఱుకలేకపోవడమే మానవుల దౌర్బల్య-దౌర్భాగ్యం. కనుక నిరంతరం ఆ ఎఱుక కలిగి వుంటే దుష్కర్మలకు తావే ఉండదు. దుశ్చర్యలతో మనశ్శాంతి లోపించదు. తరచి చూస్తే అంతకన్నా మానవాళికి మహద్భాగ్యమేముంది? నేరాలు లేని సమాజం పరమాత్ముని పవిత్ర దేవాలయమవుతుంది. ఆనందమయమైన అంతరాత్మ పవిత్రమైన భక్త్భివంతో పునీత వౌతుంది. ప్రకృతిని పరమాత్మగా భావించి ప్రవృత్తిని భగవంతుని పూజగా పరిగ్రహించి, జీవనశైలిని మలయమారుతంగా మార్చుకొనే వారికి జీవితమొక సుందరస్వప్నంగా సాక్షాత్కరిస్తుంది!

- మరువాడ భానుమూర్తి