ఎడిట్ పేజీ

మళ్లీ ‘మూడో కూటమి’ ముచ్చట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి కావాలని తపన పడే ఏ నేతకైనా దేశం మీద, సాంస్కృతిక పరంపర మీద పరిపూర్ణమైన ప్రేమ, భక్తి విశ్వాసాలు ఉండాలి. ఓటుహక్కు ఉన్న వారెవరైనా ఎన్నికల్లో పోటీచేసి గెలవవచ్చు. ఇలా గెలిచిన నేతలందరి వల్లా జాతి రక్షింపబడుతుందనే నమ్మకం లేదు. సు మారు ఆరు దశాబ్దాల పాటు నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని పాలించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘నేను హిందువును కాను’ అని చెప్పుకున్నారు. ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1975లో హిందూ సామాజిక సంస్థలపై నిషేధం విధించింది. రాజీవ్ గాంధీ పార్సీ మతస్థుని కుమారుడు. రాహుల్ గాంధీ ఇటాలియన్ క్రైస్తవురాలైన సోనియా కుమారుడు. వీరెవరికీ హిందూత్వం మీద గోరంత కూడా గౌరవం లేదు. అయినప్పటికీ హిందూ దేశాన్ని దశాబ్దాల పర్యంతం పరిపాలించారు, ప్రజలు భరించారు. మధ్యలో దేవెగౌడ, వాజపేయి, చంద్రశేఖర్, వీపీ సింగ్, గుజ్రాల్ వంటి వారు చాలా కొద్ది కాలం ప్రధానిగా ఉన్నారు. చౌదరి చరణ్‌సింగ్ కేవలం నలుబది రోజులు మాత్రమే ప్రధాని పదవిలో కొనసాగారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని అజిత్ సింగ్, నితీశ్ కుమార్, లల్లూప్రసాద్ యాదవ్, ఎన్టీఆర్, జ్యోతిబసు, ములాయం సింగ్ , మాయావతి వంటి వారు ఆశించారు. అనేక రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదు.
2014లో నరేంద్ర మోదీ ప్రధాని పదవిని అఖండ మెజారిటీతో చేపట్టారు. ప్రస్తుత అంచనాల మేరకు- 2019 ఎన్నికల తర్వాత కూడా ఆయన మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. ఈ దశలో కాంగ్రెస్, బిజెపిలు కాకుండా ‘తృతీయ ఫ్రంట్’ను ఏర్పాటు చేసి ప్రధాని పదవి అందుకోవాలని అప్పుడే కొందరు నేతలు వ్యూహరచన ప్రారంభించారు. ఈ ఫ్రంట్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, మజ్లిస్ వంటి మతతత్వ పార్టీలు భాగస్వాములుగా ఉండవచ్చు. ఐతే- తృతీయ ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది పెద్ద ప్రశ్న. యూపీలోని మీరట్ ప్రాంతానికే పరిమితమైన జాట్ నాయకుడు అజిత్‌సింగ్. ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైలులో ఉండగా అతని కుమారుడు రాజకీయంగా ఇంకా ఎదగలేదు. కర్నాటకలో జనతాదళ్- ఎస్‌కు చెందిన కుమార స్వామి, గుజరాత్‌కు చెందిన హార్దిక్ పటేల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడుకు చెందిన నటులు కమల్ హసన్, రజనీకాంత్‌లు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,దళిత నాయకురాలు మాయావతి.. ఇలా చాలామంది నేతలు రాజకీయ వైభోగం కోసం ఆశపడుతున్నారు. వీరిలో ఎవరైనా ప్రధాని కాగలరా?
మాయావతి ప్రధాని కావడానికి ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ చచ్చినా ఒప్పుకోరు. మమతా బెనర్జీ ప్రధాని కావటాన్ని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అంగీకరించవు. సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్, ప్రకాశ్ కారత్, ఏచూరి సీతారామ్ వంటివారు ప్రధాని కావడం అసంభవం. ఎందుకంటే ఇప్పుడు దేశ చరిత్రలో సీపీఎం ఓ ప్రాంతీయ పార్టీగా మిగిలింది. ఎన్నికల్లో చతికిలపడిన సీపీఐ రాబోయే రోజుల్లో తన ఎన్నికల గుర్తును కూడా కోల్పోవచ్చు. ‘నేను ప్రధానిని అవుతాను.. మీరంతా మద్దతునివ్వండి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ పార్టీలను కోరుతున్నాడు. ఇది సాధ్యమేనా?
ఈ దశలో తెరాస పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తాను మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇలా భావించడంలో తప్పులేదు. ఎన్నికల్లో గెలిచి ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుంటే కేసీఆర్ తప్పకుండా ప్రధాని కావచ్చు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, యాదాద్రి పునరుద్ధరణ వంటి కొన్ని పనులు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి కూడా. మూడో ఫ్రంట్ విషయమై కేసీఆర్ ప్రకటించగానే- మమతా బెనర్జీ, అసదుద్దీన్ ఓవైసీ, సినీనటుడు పవన్ కల్యాణ్ తదితరులు సానుకూలంగా స్పందించారు. మమతా బెనర్జీ బెంగాల్‌లో ముస్లిం వలసదారుల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇక మజ్లిస్ పార్టీ నేత ఒవైసీ ఓ మతస్థులకు అనుకూలంగా రాజకీయాలు నడుపుతున్నాడు. మజ్లిస్‌కు తెరాసతో ఎన్నికల పొత్తు ఉంది. ముస్లిం మతస్థుల ఆదరణ పొందేందుకు కేసీఆర్ అనేక పథకాలను ప్రారంభించారు. జాతీయ జెండాను ఎగురవేసే ఉత్సవాన్ని గోల్కొండ కోటకు మార్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. హజ్ యాత్రీకులకు సబ్సిడీ ప్రకటించారు. బిజెపి వ్యతిరేక కూటమి ఏదైనా సరే- దానికి మజ్లిస్ మద్దతునిస్తుంది. కేసీఆర్ ఏర్పాటు చేస్తానంటున్న థర్డ్ ఫ్రంట్‌కు అవకాశాలు ఎలా ఉంటాయన్న విషయమై ఇపుడు విశే్లషించాలి. గతంలో సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ భవిష్యత్ ఏమిటి? కాపు కులానికి చెందిన పవన్‌కు సీమాంధ్రలో కమ్మ, రెడ్డి వంటి బలమైన కులాల నుండి ఆదరణ లభిస్తుందా? సినీ గ్లామర్‌తో పవన్ కల్యాణ్ గెలిచే లోక్‌సభ స్థానాలు ఎన్ని?
ఏ నేత అయినా ప్రధాని కావాలంటే సుమారు 300 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇంతటి సామర్థ్యం కేసీఆర్,ఓవైసీ,మమత,శరద్ పవార్ వంటి నేతలకు ఉందా? తెలంగాణలో మొత్తం 16 పార్లమెంట్ సీట్లు కేసీఆర్ గెలుచుకున్నా ఇతర పార్టీల అండ అవసరం. 2014 నాటి ఉద్యమనేత కేసీఆర్ వేరు. గత నాలుగేళ్లుగా కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ వేరు. గత సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులు, భావోద్వేగాలు ఇప్పుడు తెలంగాణలో లేవు. ‘నిశ్శబ్ద ప్రజావిప్లవంలో కేసీఆర్‌ను పదవీభ్రష్టుణ్ణి చేస్తాం’ అంటూ తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చాణక్య శపథం చేశాడు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అయితే 2019లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ప్రజల నాడి తెలియడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసి, తాను కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారా? ఎన్నికల్లో ప్రజామోదం ఉంటే ఇది సాధ్యం కావచ్చు. మరోవైపు ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో నరేంద్ర మోదీ ముందుకు సాగిపోతున్నారు. అంటే 2019లో రాహుల్ గాంధీ రాజకీయ అస్తిత్వం ప్రశ్నార్థకం కావచ్చు.
త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడిన బేజేపీ ఇపుడు కేరళపై దృష్టి సారించింది. కేరళలో సీపీఎం ప్రభుత్వం పతనమైతే ‘కమ్యూనిస్టు ముక్త భారత్’ నినాదం సాకారం కాగలదు. అప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం పూర్తిగా తుడుచుకొని పోయినట్టే అవుతుంది. బిజెపిని ఓడించడానికి బెంగాల్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో జట్టు కట్టవచ్చు.
తెలంగాణలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మరో ప్రాంతీయ పార్టీతో వస్తున్నారు. టీ-జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా రాజకీయ పార్టీని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ సకల అస్త్రాలను ప్రయోగిస్తోంది. కేసీఆర్ ప్రధాని కావడాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. మరి మూడో కూటమికి 300 సీట్ల మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధాని పదవి కోసం కలలు కంటున్న బిఎస్పీ అధినేత్రి మాయావతి కేసీఆర్‌కు మద్దతు ఇస్తుందా? ప్రత్యేక తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని లోగడ కేసీఆర్ చెప్పినా అలా జరగలేదు. అలాంటప్పుడు దళితులు ఇపుడు కేసీఆర్‌ను నమ్ముతారా? బిజెపితో కొంత మేరకు విభేదాలు వచ్చినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు అండగా ఉంటారా? ‘పాతకక్షలు’ మరచిపోయి ఈ ఇద్దరు ‘చంద్రులు’ చేతులు కలుపుతారా?
కాగా, ప్రధాని మోదీపై కేసీఆర్ ఇటీవల ఏకవచన ప్రయోగం చేశారన్న వార్తలపై తెలంగాణ బిజెపి నేతలు గుర్రుగా ఉన్నారు. మోదీ పాలన పట్ల, విధానాల పట్ల ఇపుడు కేసీఆర్ బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు. బిజెపితో తెరాస కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. ‘నేను మావోయిస్టు సానుభూతిపరుణ్ణి’ అని మంత్రి కేటీఆర్ ఆమధ్య అన్నారు. ‘అన్న’లు కూడా తెలంగాణ బిడ్డలే- అని కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పి ఉద్యమానికి మద్దతును కూడ గట్టుకున్నారు. కానీ, ఇటీవలి ఎన్‌కౌంటర్ తర్వత మావోయిస్టులు కేసీఆర్‌ను నమ్మేందుకు సిద్ధంగా లేరు. ‘నిధులు-నీళ్లు-నియామకాలు.. సీమాంధ్ర పెత్తనం నశించాలి..’ వంటి నినాదాలతో, ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. మరి ఇపుడు- కేసీఆర్ ఏ నినాదంతో మోదీని ఢీకొట్టగలరు? ‘మతతత్వ బిజెపిని ఓడించండి’ అని ఉద్యమిస్తే- ‘ఒవైసీతో మీ పొత్తు మాటేమిటి?’ అని విపక్షాలు ఎండగడతాయి. నిధులు ఇవ్వకుండా కేంద్రం తెలంగాణను మోసం చేసిందనే నినాదంతో విజృంభిస్తే- ఇచ్చిన నిధులన్నీ ఎందుకు సద్వినియోగం కాలేదు?.. అని కాంగ్రెస్, బిజెపిలు నిలదీస్తాయి. మరి బిజెపిని ఎదుర్కోవడానికి కేసీఆర్ వద్ద ఉన్న ఆయుధం ఏమిటి? ఈ పరిస్థితిలో తృతీయ ఫ్రంట్‌ను జనం ఎంతవరకు ఆదరిస్తారు?
రాజకీయాల్లోనే కాదు, సామాజిక రంగంలోనూ విశ్వసనీయత ముఖ్యం. లోగడ ఐదారుసార్లు తృతీయ ఫ్రంట్ ప్రయోగం జరిగినా, అన్నిసార్లూ అది తుస్సుమంది. ఇప్పుడు మళ్లీ తెరమీదికి కెసిఆర్ అదే నినాదంతో వస్తున్నారు. ‘మా నిజాం చాలా మంచోడు’, ‘సారక్క సమ్మక్కల విగ్రహాల పక్కన సోనియమ్మ బంగారు విగ్రహం పెడతా’- వంటి మాటలను గతంలో చెప్పిన వారిని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియాను దేవత అని పొగిడిన కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా భావించారు. తెలంగాణలో మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గానికి తగినంత బలం ఉంది. వారు తెలంగాణలో రాజ్యాధికారం కేవలం 0.5 శాతం ఓటు శాతం ఉన్న వెలమ సామాజిక వర్గం చేతిలోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గనుక రాబోయే రోజులలో కాంగ్రెస్‌లోని రెడ్డి వర్గం నేతలు తమ దూకుడును పెంచవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిజంగా బలం పుంజుకుంటే- జాతీయ రాజకీయాల వరకూ తెరాస ఎదిగే అవకాశం ఉంటుందా? తృతీయ ఫ్రంట్ ప్రస్తుత భారత రాజకీయాల్లో అవసరమే అయినా- అది సాధ్యపడుతుందా? కాంగ్రెసేతర, బీజేపీ రహిత ‘తృతీయ ఫ్రంట్’ ఒక పగటి కల అని గత అనుభవాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెంచుకుంటున్న మోదీతో ప్రాంతీయ పార్టీల నేతలు ఢీకొనగలరా?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668