మెయిన్ ఫీచర్

గురువు ఆజ్ఞను ధిక్కరిస్తే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి పేరుతో కాక భక్తుని పేరుతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ‘పండరీ పురం’. పాండురంగ విఠలుని భక్తుడు పుండరీకుడు. ఈ క్షేత్రాన్ని పండరీపురమని పిలుస్తారు. పాండురంగ మహాత్యమును రామకృష్ణ కవి స్కాంద పురాణం నుండి గ్రహించి ప్రబంధంగా రచించాడు. పండరీపురం బైమీనది తీరాన ఉంది.
అయుతనియుతుల కథను శివుడు నారదునికి చెప్పడం జరిగింది. ఒకనాడు నారదుడు ఆకాశ మార్గాన పోతూ కైలాస పర్వతం నుండి జనం తండోపతండాలుగా రావడం చూసాడు. ప్రమథులు, ఋషులు, అగస్త్యుడు, కుమార స్వామి మొదలగు ప్రముఖులని నారదుడు గ్రహించి వీరంతా శివుని ద్వారా ఏదో మహా విషయాన్ని తెలుసుకున్నారని గ్రహించాడు. వెంటనే శివుని వద్దకు వెళ్లి స్వామీ వారందరికీ మీరేదో విషయం చెప్పారు. నాకూ చెప్పమని అడుగగా నిగమశర్మ కథ, రాధాదేవి కథ, పుండరీకుని కథ, సుశీల కథ చెప్పి అయుతనియుతల కథ వివరించాడు. పాండురంగ మహాత్మ్యునికి ఇంత ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలు రెండు కథలు మొదటిది నిగమశర్మోపాఖ్యానం. రెండవది అయుతనియుతుల కథ.
అగస్త్య మహర్షి కాశీ క్షేత్రంలో పర్ణశాల కట్టి నివసించసాగాడు. ఆయనకు ఇద్దరు ప్రియమైన శిష్యులు. అందులో ఒకరు అయుతుడు రెండవవాడు నియుతుడు. వీరి తండ్రి ప్రయుతుడు. ఈ శిష్యులు మెరికలు. వీరంటే అగస్త్య మహర్షికి మిక్కిలి ప్రేమ. నా శిష్యులందరిలో వీరిద్దరు జ్ఞానంలోను, రూప వర్చస్సుల్లోను గురుభక్తిలోను సాటిలేనివారు. వీరికి తగిన కన్యలను తెచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ శిష్యులిద్దరు తమ గురించి, ఆకలిదప్పుల గురించి ఏనాడూ ఆలోచించరు. తలలు మాసినా కూడా పట్టించుకోరు. శ్రమ అనేదే ఎరుగరు. రాత్రింబవళ్లు చదువుట, కూర్చున్నచోట నుండి కదలరు. చివరకు గుడ్డలు మాసిపోయినా లెక్కచేయరు. ఈ నా శిష్యులకు తగిన కన్యలు భువిపైన లేరని తలచి బ్రహ్మదేవునికి గల ఇద్దరు కూతుళ్లైన గాయత్రి, సావిత్రిలను తన శిష్యులకు ఇమ్మడి అడగడానికి బ్రహ్మ వద్దకు ప్రయాణమవుతాడు. ఈ అగస్త్యుడి మహాత్యాల గురించి తెలిసిన బ్రహ్మదేవుడు స్వయం గా అగస్త్యుడే తనవద్దకు రావడం చూసి ఉబ్బితబ్బిబ్బై పోతాడు. అగస్త్యుని గొప్పతనాన్ని మదిలో ఊహించుకుంటున్నాడు. ఇంద్రుని పొగరణచిన వాడు, వింధ్య పర్వతాన్ని చితకపొడిచినాడు, సముద్రాన్నంతా ఆపోశనం పట్టాడు. జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని జీర్ణం చేసుకున్నాడు. అంతటి గొప్పవాడైన అగస్త్యుడు తన వద్దకు రావడం బ్రహ్మ చాలా సంతోషం ఒకింత గర్వంగా కూడా ఉన్నది. బ్రహ్మ, అగస్త్యుని రాక గురించి అడిగి తెలుసుకొని ఎంతో సంతసించాడు. వెంటనే తన కూతుళ్ళైన గాయత్రి, సావిత్రిలను అగస్త్యుని వెంట పంపించాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్యుడు ఆ కన్యలను వివాహం చేసుకొమ్మని తన శిష్యులైన అయుత నియుతలను ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మచర్య నిష్ఠయందు తపమొనరించు దీక్షయందు లగ్న మనస్కుడైన అయుతుడు గురుదేవుని ఆజ్ఞను అంగీకరించలేదు. అందుకు అగస్త్యునికి అయుతునిపై విపరీతమైన కోపంతో ఆశ్రమం నుంచి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు.
తదుపరి ఇద్దరు కన్యలను నియతునికిచ్చి వివాహం జరిపించాడు. నియుతుడు గురువు ఆజ్ఞను పాటించి ఇద్దరు భార్యలను సమంగా ఏలుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించసాగాడు.
ఆయుతుడు దగ్గరలో ఉన్న హిమవత్పర్వత ప్రాంతానికి బయలుదేరి అక్కడ ఘోరమైన తపస్సు చేయడం జరుగుతుంది. తన మనస్సులో గృహస్థాశ్రమం ఎంతటిది అనుకుంటాడు. జడలను చుట్టలుగా చుట్టుకొని ఒంటిపై కాషాయ వస్త్రాన్ని కప్పుకొని అడవుల్లో తిరిగే తాపసికి, సంసార సుఖాన్ని కోరే సతికి కలయిక కుదురుతుందా? భోగభాగ్యాలు కర్మవశాన సంప్రాప్తిస్తాయి. అవి లేనిదే సంసారం కుదరదు. ఇలాంటి భార్య కంటే వేరే కీడున్నదా? గురువు కోసం ఆ ఉచ్చులో పడబోను! అనుకుంటూ బ్రహ్మచర్య దీక్ష వహించి కఠోర తపస్సు ప్రారంభిస్తాడు అయుతుడు. అయుతుని ఘోర తపస్సు వల్ల ముల్లోకాల్లో అగ్నిజ్వాలలు చెలరేగాయి. అది చూసి భయపడిన ఇంద్రుడు కామధేనువును ఒక మాయగోవుగా మార్చుకొని శిష్యుల రూపంలో దేవతలు అనుసరించి రాగా, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి అయుతుని తపస్సును భగ్నం చేయాలని అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. అన్ని ధర్మాలందు గృహస్థ ధర్మమే గొప్పది. ఆ నిష్ఠయందు నిలిచి ఓర్పుతో ఈ శరీరం ఉన్నంత వరకు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి తిరుగుతూ ఉంటా ను. ఇలా చేస్తూ కలువ పూవు వంటి దేహం కలవానిని కన్నియల కిష్టమైన విధంగా గచ్చకాయ లాడువాని అందమైన ముఖారవిందం గల వెన్నదొంగను, మన్మథుని కన్నతండ్రి అయిన పాండురంగ విఠలుని దర్శనం కోరి ఈ దారిన పోవుచు నిన్ను చూశాను. నీవు ఏమి ఆశించి ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? నీ చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించాడు మాయ వేషంలో ఉన్న ఇంద్రుడు. గతం లో జరిగిన వృత్తాంతాన్ని వృద్ధ బ్రాహ్మణునికి విన్నవించుకుంటాడు అయుతుడు. అయ్యో! అలాగా? నీ తండ్రి అయినటువంటి ప్రయుతుడు నాకు మంచి స్నేహితుడు. ఎంతో పవిత్రమైన గృహస్థాశ్రమాన్ని విడిచి ఇలా అడవుల పాలైనావా? అంటూ సంసారం గురించి ఎంతో గొప్పగా ఉపన్యసించి చివరికి అతని తపస్సు మాన్పించలేనని తెలుసుకుని తన వెంట తెచ్చిన మాయ గోవును అయుతుని ఆశ్రమ ప్రాంతంలో వదిలి మాయమై పోయాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు. అయుతుడు శుష్కించి తన ఆశ్రమ ప్రాంతంలో ఉన్న ఆ దొంగ గోవును చూసి చాలా జాలి పడి చేరదీశాడు. దాని పాదాలు పిసికి, ఈడ్చుకుపోయిన డొక్క నిమిరి, గంగడోలు దువ్వి, నెత్తురు కారుతున్న పుండ్లమీద మట్టిచల్లి, నోటికిమంచి పచ్చిక పరకలందించి దగ్గరుండి ఉపచారాలు చేయసాగాడు. కొంత కాలానికి దాని పాలనలో అయుతుని తపస్సు అడుగంటింది. కింద పడిపోయే ఆవును లేపడం దాని పక్కన కూర్చుని ఉపచారాలు చేయడంతో యోగాసనాలు మరచిపోయినాడు. దానికోసం లేత పచ్చిక చిగుళ్లేరుతూ పూలు, పత్రాలు, సమిథలు, దర్బలు సేకరించడం మానివేశాడు. దాని మెడకు కట్టిన పలుగు (తాడు) విప్పడం, మళ్లీ కట్టడం మెలిక పడితే తీయడంలో జపమాల తిప్పడం ఎగిరిపోయింది. ఆవును అటూ ఇటూ తిప్పుతూ హాయ్, హయ్.. అని అరవడంలో మంత్రం మాటు పడిపోయింది. ఇలా ఎంతో పవిత్రంగా ఉండే అయుతుని తపస్సు అంతా భంగం అయిపోయింది. కొంత కాలానికి బక్క చిక్కి ఉన్న ఆవుకాస్త అయుతుని సపర్యల వల్ల బాగా బలిసి కండ పట్టి నిగనిగలాడ సాగింది. పొద్దంతా చుట్టుపక్కల మునులు వేసుకున్న నివ్వరి ధాన్యం మళ్లు తొక్కి పాడుచేయడం కాళ్లతో కందమూలాలు ముట్టగించడం, చుట్టుపక్కనగల ఆశ్రమ ప్రాంతాలలో ఉన్న చూడి లేళ్లను కుమ్మి వేయడం చేయసాగింది. రోజూ అందరూ వచ్చి అయుతునితో ఆవు మీద ఫిర్యాదులు చేయడం వెంటనే అయుతుడు వాళ్లకు సర్దిచెప్పి పంపించడం జరుగుతూ ఉండేది.
ఈ విధంగా చేస్తూ ఒకనాడు తపస్సులో ఉన్న వాధుని మునిపై పెరిగిన పుట్టను తొక్కి వేసింది ఆవు. అందులకు ఆగ్రహోదగ్రుడై కళ్లు తెరచిన వాధూలమునికి ఆవు వెనుక ఉన్న అయుతుని చూసి కప్పవై పొమ్మని శపిస్తాడు. అందులకు అయుతుడు ఎంతో బాధపడి మునికాళ్లపై పడి జరిగిన వృత్తాంతాన్ని విన్నవించుకుంటాడు. దివ్యదృష్టితో విషయాన్ని గ్రహించిన వాధూలముని కరుణించి నాయనా నీ కర్మ ఫలితంగా ఇలా జరిగింది.
గురువు ఆజ్ఞను ధిక్కరించి సంసారాన్ని మానివేసిన నీకు కప్ప జన్మంలో సంసారం చేయక తప్పలేదు. పుండరీక క్షేత్రంలో నృసింహ స్వామి పాదాల చెంత కప్పవై నివసించి కప్ప భార్యలయందు సంతానం కని పితృఋణాన్ని తీర్చుకున్న తరువాత నీకు శాప విముక్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని వాధూల ముని శాప విముక్తి మార్గాన్ని ఉపదేశిస్తాడు.
ఈ విధంగా గురువు ఆజ్ఞను పాటించనందుకు అయుతుడు పడిన పాట్లు తెలిసి ఎప్పుడైన గురు ఆజ్ఞను మీర రాదని, గురువు భక్తి, శ్రద్ధలు కలిగి గురువు దీవెనలతో ఎంతో గొప్పవారు అవుతారని నిరూపించాడు రామకృష్ణ కవి (వికటకవి) పాండురంగ మహాత్మ్యం కథతో.

-ఉషశ్రీ తాల్క